కేసీఆర్ వ్యక్తిత్వం : మాటే మంత్రంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
- పసునూరు శ్రీధర్‌బాబు
- బీబీసీ ప్రతినిధి
ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
"తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ వల్లే సాధ్యమైంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఆమె పట్టుదలతో ఉన్నారు కాబట్టే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమనే కల నిజమైంది. నేను మనస్ఫూర్తిగా ఆమెకు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను."
"స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇంకా ఎంతో మంది భారతీయులు పాల్గొన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నారు. అందుకని జనం ఎలిజబెత్ మహారాణి వద్దకు వెళ్ళి ఆమెకు దండ వేశారా?"
"తెలంగాణకు స్వీయ రాజకీయ ప్రకటన కావాలి. ఉద్యమ పార్టీని కాంగ్రెస్‌లో ఎలా కలిపేస్తారని నన్ను ప్రజలు అడుగుతున్నారు. ఉద్యమానికి నేను కాపలాగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కూడా నేనే నాయకత్వం వహిస్తాను."
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం -2014' బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించిన రెండు రోజులకు, అంటే ఫిబ్రవరి 20న రాజ్యసభ కూడా ఆమోద ముద్ర వేసింది. ఆ రోజు నుంచి కొన్ని వారాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన మూడు ప్రకటనలివి.
మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడంలో కేసీఆర్‌ది అనితరసాధ్యమైన శైలి. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రసంగకళకు ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, మాటకు కట్టుబడి ఉండకపోవడం ఇప్పటి రాజకీయాల్లో మామూలైపోయి ఉండవచ్చు. కానీ, ప్రజా జీవితంలో అది మరీ అంత మామూలైపోలేదు. 'ఇచ్చిన మాట'కు ఇంకా ఒక సామాజిక విలువ కొనసాగుతూనే ఉంది.
అయితే, రాజకీయాల్లో ప్రాసంగికతను (context) పిడికిట్లో పట్టి ఔపోసన పట్టడంలో ఆరితేరిన ఈ నాయకుడు విలువల వైరుధ్యాలను, నైతిక సంఘర్షణను రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా చూడడాన్ని నిర్ద్వంద్వంగా నిరాకరిస్తారనుకోవాలా?
ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
తెలంగాణ రాష్ట్రం వస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఆయన గతంలో అన్నారు. సోనియా గాంధీతో కలిసి కుటుంబ సమేతంగా ఫోటో దిగారు. దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని మాటిచ్చారు. వీటన్నింటికీ, ఆయన తెలంగాణ బిల్లు ఉభయ సభల్లో పాస్ అయిన తరువాత ఆ విధంగా బదులిచ్చారు. అంతేకాదు, తమది "పక్కా పొలిటికల్ పార్టీ" అని ప్రకటించి ఉద్యమ నేపథ్యం మీద ఎన్నికల అజెండాను ఎగరేశారు.
మేళతాళాలు, కళాకారుల విన్యాసాల నడుమ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కేసీఆర్, ఆ స్వాగత సందోహాన్నే కొన్ని నెలల్లో విజయోత్సవంగా మలచుకుని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
రాజకీయాల్లో కాకతాళీయంగా ఏదీ జరగదు, అన్నీ పథకం ప్రకారం అమలు చేస్తేనే జరుగుతాయని అంటారు. ఈ సంగతి బాగా తెలిసిన కేసీఆర్, యుద్ధం తనకు అనువుగా ఉన్నప్పుడే చేయాలని నిర్ణయించారు. ముందస్తు ఎన్నికల బరిలోకి ప్రత్యర్థులను లాగారు.
ఒక సుదీర్ఘ ఉద్యమం తరువాత ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంటుంది. అది ప్రపంచంలో మరో స్థలంలో, మరో కాలంలో ప్రజా చైతన్యానికి ప్రేరణ ఇస్తుంది. ఉద్యమ నాయకుడే పాలకుడైన చోట పాత విలువలకు పాతరేసి, కొత్త విలువలతో కూడిన సమాజ నిర్మాణం జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు ఎదురు చూస్తుంటారు.
ఉద్యమ ఫలంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన కేసీఆర్ పాలన చరిత్రాత్మకంగా సాగిందా? ఉద్యమ ఆకాంక్షలు, ఆదర్శాలకు దిశా నిర్దేశం చేసిందా? 'పక్కా రాజకీయ పార్టీ' అనే పద బంధానికి కేసీఆర్ రచించిన నిర్వచనంలో ఈ ఆదర్శాలున్నాయా?
ఏ నాయకుడినైనా అతడున్న రాజకీయ సామాజిక సందర్భంలోంచే చూడాలంటున్న సీనియర్ పాత్రికేయుడు టంకశాల అశోక్, "కేసీఆర్ గాలి రాజకీయాలు చేసే మనిషి కాదు. సీరియస్ మనిషి. పరిస్థితులను 'అందాజ్'' వేస్తారు. వ్యూహాలను నిర్ణయించిన తరువాత వాటిని నిష్కర్షగా అమలు చేస్తారు. ఇది బలమైన నాయకుడికి ఉండే లక్షణం" అని అన్నారు.
ఆయన దృష్టిలో "కేసీఆర్ వ్యూహాత్మక వైఖరిని నిర్దిష్టంగా నడిపే అంశాలు ఆయనలోని ప్రతిభ, పట్టుదల, పరిశ్రమ."
ఆయన బలమైన నాయకుడే. ప్రత్యర్థుల బలాన్ని కూడా తన బలంగా మార్చుకోగల యుక్తిపరుడు. భావజాలాన్ని వినిపించడం కాదు, ప్రజల గుండెల్లో నాటగల సమర్థుడు. "ఉద్యమకాలంలో ఆయన అద్భుతంగా తెలంగాణ వాదాన్ని జనంలోకి తీసుకువెళ్ళారు. తన వాక్పటిమతో ఆయన ప్రజలను గొప్పగా ప్రభావితం చేస్తారు. కానీ, ఆ శక్తియుక్తులు ఉద్యమ ఆకాంక్షలను నిజం చేయలేకపోవడమే విచారకరం. ఉద్యమనేత పాలకుడిగా మారడం గొప్ప విషయం. కానీ, ఆయన పాలకుడిగా నిరుత్సాహపరిచారు" అన్నారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన ఆలోచనాపరులలో ఒకరైన ప్రొఫెసర్ జి. హరగోపాల్.
నిర్ణయాలను నిష్కర్షగా అమలు చేయడం మంచిదే కానీ, "ఆ నిర్ణయాలు ఎలా తీసుకున్నారు. ఎంత ప్రజాస్వామికంగా తీసుకున్నారన్నది చాలా ముఖ్యం. ఆయన తనకు తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది నియంతృత్వ ధోరణి. మిషన్ కాకతీయ, భగీరథ వంటి కార్యక్రమాలు, రైతు బంధు వంటి పథకాలు ఏవి చేపట్టినా, చివరకు జిల్లాలు విభజించినా వాటి కోసం కమిషన్లు వేయడం, నిపుణులతో చర్చించడం వంటివేవీ చేయకపోవడం ప్రజాస్వామికం కాదు" అని హరగోపాల్ అన్నారు.
ప్రముఖ కవి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్, "రాజకీయ అనివార్యతల నుంచి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకున్న నాయకుడు కేసీఆర్. ఆయన ఇతరులతో ప్రభావితం కావడానికి ఇష్టపడరు. స్వతంత్రంగా ఆలోచిస్తారు. వ్యవస్థాగతమైన నిర్మాణాల్లో ఒదగడానికీ ఆయన తత్వం నిరాకరిస్తుందేమో అనిపిస్తుంది" అని అన్నారు.
ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
ఓటమితో మొదలైన ప్రయాణం... ఓటమి ఎరుగని ప్రయాణం
"ఏదీ చిన్నగా ఆలోచించకూడదు. పెద్దగా ఆలోచించాలి. అంతే భారీగా ప్రణాళికలు వేసి అమలు చేయాలి" అన్నదే కేసీఆర్ నమ్మిన సూత్రం అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
మానేరు ఎగువ ఆనకట్ట నిర్మాణంలో భూమిని కోల్పోయి అప్పటి మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడిన కల్వకుంట్ల రాఘవయ్య, వెంకటమ్మల కుమారుడు కేసీఆర్. వాళ్లది పెద్దగా ధనిక కుటుంబమేమీ కాదు. కానీ, కాలేజీ రోజుల నుంచే నాయకత్వ స్థానాల్లోకి వెళ్ళాలన్న కల కేసీఆర్‌ను వెంటాడేది. ఆ దిశగా ఆయన ప్రయాణం మొదట పరాజయాలతోనే మొదలైంది.
సిద్ధిపేట డిగ్రీ కాలేజిలో ఆయన హిస్టరీ, తెలుగు లిటరేచర్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులతో బిఏ పూర్తి చదివారు. ఆ సమయంలో ఆయన విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నేత అనంతుల మదన్ మోహన్ శిష్యుడిగా ఉంటూ రాజకీయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. "మదన్ మోహన్ ఒకసారి కేసీఆర్‌కు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని ఆఫర్ చేశారు. దానికి ఆయన, 'నేను ఉద్యోగం చేయను, రాజకీయాల్లోకి వస్తాను' అని చెప్పారు. భవిష్యత్తు పట్ల ఆయనకు అంత క్లారిటీ ఉండేది" అని 1970 నుంచి '75 వరకు ఇంటర్, డిగ్రీ కాలేజిలో కేసీఆర్ సహాధ్యాయిగా ఉన్న కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి చెప్పారు.
ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
డిగ్రీ పూర్తి కాగానే అసలు రాజకీయాలు రాష్ట్రంలో కాదు ఢిల్లీలోనే జరుగుతున్నాయని భావించిన కేసీఆర్ ఎమర్జెన్సీ విధించిన ఏడాదే ఢిల్లీకి వెళ్ళి సంజయ్ గాంధీ నాయకత్వంలోని యూత్ కాంగ్రెస్‌లో చేరారు. సంజయ్ గాంధీ ప్రమాదంలో చనిపోవడంతో 1980లో సిద్ధిపేటకు తిరిగి వచ్చారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డి సిద్ధిపేట సభలకు వచ్చినప్పుడు యువ కేసీఆర్ వేదికల మీద ఉపన్యాసాలు ఇచ్చేవారు. "ఈ కుర్రాడు బాగా మాట్లాడుతున్నాడు. స్టేజి మీద మాట్లాడనివ్వండి అని చెన్నారెడ్డి చెప్పేవారు. ఆయన కేసీఆర్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేవారు" అని దేశపతి శ్రీనివాస్ చెప్పారు.
"ఆయనకు ఎన్టీఆర్ సినిమాలంటే చాలా ఇష్టం. పౌరాణిక చిత్రాలను బాగా ఎంజాయ్ చేసేవారు. మేం ఎక్కువగా సినిమా టాకీసుల్లో కలిసేవాళ్ళం" అని సిధారెడ్డి గుర్తు చేసుకున్నారు.
నందమూరి తారక రామారావు 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కేసీఆర్ ఆ పార్టీలో చేరారు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి తన రాజకీయ తొలి గురువు మదన్ మోహన్ మీదే పోటీ చేసి కేవలం 877 వోట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 1985లో మళ్ళీ టీడీపీ తరఫున బరిలోకి దిగి తన రాజకీయ జీవితంలో తొలి కీలక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తరువాత కేసీఆర్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. వరసగా ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయిదుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 1987లో ఎన్టీఆర్ క్యాబినెట్లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1997లో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మళ్ళీ 1999 ఎన్నికల్లో గెలిచినప్పుడు చంద్రబాబు ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. తనకు క్యాబినెట్లో స్థానం కల్పించకపోవడం కేసీఆర్‌కు నచ్చలేదు.
ఫొటో సోర్స్, Getty Images
2004లో తీసిన చిత్రం: రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధినేత అజిత్ సింగ్‌తోపాటు పలు పార్టీల నేతలను కలిసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మద్దతు కూడగట్టారు.
తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన
పదిహేనేళ్ల వయసులో తెలంగాణ తొలి ఉద్యమాన్ని చూసిన కేసీఆర్‌కు అది మళ్ళీ రెక్క విప్పే సందర్భం వచ్చిందని గుర్తించారు. అప్పటికే మూడేళ్ల కిందట 1996లో అప్పటి ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఉత్తరాఖండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించే అవకాశం గురించి ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఐటి, రియల్ ఎస్టేట్ రంగాలు జోరందుకున్న సందర్భంలో పెరిగిన సీమాంధ్రుల వలసలతో తెలంగాణలో మళ్ళీ చలనం మొదలైంది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌తో పాటు మరికొందరు అదే ఏడాది నవంబర్ 1న వరంగల్‌లోని ఒక చిన్న హాలులో సమావేశమైనప్పుడు, అనూహ్యంగా అయిదువేల మంది ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశాల పరంపర అలా మొదలై విస్తరిస్తూ వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం 2000 సంవత్సరంలో విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు వెల్లువెత్తిన నిరసనలో భాగంగా కేసీఆర్ తన పార్టీ నేతకు బహిరంగ లేఖ రాశారు. అదే ఏడాది నవంబర్ నెలలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అసాధ్యమేమీ కాదనే నమ్మకం వేళ్ళూనుకున్న ఆ దశలో మాజీ నక్సల్ నేత గాదె ఇన్నయ్య, జయశంకర్ వంటి తెలంగాణవాదులతో చర్చలు విస్తృతంగా చర్చలు జరిపిన కేసీఆర్ 2001 ఏప్రిల్ 7న తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు.
"కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడం ఆయన తన రాజకీయ మనుగడ కోసం తీసుకున్న నిర్ణయం. కానీ, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ నినాదం ఎత్తుకోవడం ఆయన రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్" అని అన్నారు టంకశాల అశోక్.
ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
తెలంగాణ ఉద్యమానికి కొత్త నేత
ఒక నిర్ణయం తీసుకునే ముందే దాని గురించి లోతుగా ఆలోచించడం కేసీఆర్ నైజం. "మొదటిసారి మంత్రి అయినప్పుడే ఆయన తన శాఖలో ప్రతి దశలో ఉండే అధికారులతో విస్తృతంగా చర్చించి, దాని స్వరూప స్వభావాలను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చే ముందు సిద్ధిపేట నియోజకవర్గంలో తనకిక ఎప్పటికీ తిరుగుండదని నిర్థారించుకున్నారు. టీఆర్ఎస్ స్థాపనకు ముందు ఏడాది కాలానికి పైగా తెలంగాణకు సంబంధించిన సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. దూకుడుగా వెళ్తున్నట్లు కనిపించినా ఆయన అలా ప్రతి అడుగు శాస్త్రీయంగా ముందుకు వేస్తారు" అని సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవిందర్ వివరించారు.
పార్టీ స్థాపించిన ఇరవై రోజులకే 2001 మే, 17న కేసీఆర్ కరీంనగర్లో సింహగర్జన సభ ఏర్పాటు చేశారు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందించకుండా తెలంగాణ సాధిస్తామని ఆయన ఆ సభలోనే ప్రకటించారు. రాజకీయ ఉద్యమంతోనే తెలంగాణ సాధిస్తామన్నారు. "వేదిక మీద ఉన్నవారిలో ఎవరైనా ఈ లక్ష్యం నుంచి పక్కకు తప్పుకుంటే రాళ్ళతో కొట్టి చంపండి" అని ఆవేశంతో ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం వాడిగా వేడిగా అప్పుడు మొదలైన కేసీఆర్ వాగ్ధాటి రాను రాను రాటుదేలిపోయింది. తెలంగాణ అస్తిత్వాన్ని ఆవిష్కరించే యాస, భాషలతో సాగే కేసీఆర్ ప్రసంగాలకు తెలంగాణ ప్రజలు ముగ్ధులయ్యారు. రాజీనామాలు చేసి వచ్చిన ప్రతిసారీ ఆయనకు నీరాజనాలు పలికారు.
కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, "తెలంగాణ ఉద్యమం తయారు చేసుకున్న నాయకుడు కేసీఆర్. ఉద్యమ నాయకత్వం కోసం చాలా మంది ప్రయత్నించారు. కానీ, ఆ స్పేస్ కోసం ఆయన తీవ్రంగా శ్రమించి, దాన్ని తన సొంతం చేసుకున్నారు. గతంలో చెన్నారెడ్డి చేయలేకపోయిన పనిని ఆయన చేసి చూపించారు" అని అన్నారు.
ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
మాస్ లీడర్
"ప్రజల సమస్యలను నిశితంగా అర్థం చేసుకుని మళ్ళీ వాటిని వారికే సులువైన మాటల్లో వినిపించడం కేసీఆర్ ప్రత్యేకత. అప్పుడు ప్రజలు 'తమ సమస్యలను బాగా అర్థం చేసుకున్న నాయకుడే వాటిని తీర్చగలుగుతాడు' అనే నమ్మకంతో ఆయన వెన్నంటి నడుస్తారు" అని విశ్లేషించారు మనస్తత్వ విశ్లేషకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ సి. వీరేంద్ర.
అంతేకాదు, ఎంతో సంక్లిష్టమైన సమస్యలను మామూలు మాటల్లో చెప్పడం కేసీఆర్ లాగా మరెవరికీ సాధ్యం కాదంటారాయన. "తెలంగాణ బతుకులు.... బొగ్గుబాయి, బొంబాయి.. దుబాయి అన్నట్లు తయారైనయ్ అంటారు. వంద వాక్యాలు చూపించలేని ప్రభావాన్ని ఆయన అలా మూడు మాటల్లో తేల్చేస్తారు. తెలంగాణలో కప్పుల్లా ఉన్న చెరువులు ఇప్పుడు సాసర్లలా మారినయ్ అంటారు. ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్‌లో ఆయన మాస్టర్" అని వీరేంద్ర అంటారు.
ఉద్యమకాలంలోనే కాదు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన వాక్చాతుర్యం ప్రజల్నీ, ప్రత్యర్థుల్నీ, మీడియానూ మురిపిస్తూనే ఉంది. భాషను ప్రేమించడమే కాదు, సంప్రదాయంలోని ఐడెంటిటీని ఆయన బాగా ఇష్టపడతారని చెప్పిన దేశపతి శ్రీనివాస్, "ఏ పని చేసినా 'రసించి' చేయాలన్నది కేసీఆర్ అభిమతం" అన్నారు.
"ప్రజలే నా దేవుళ్ళు' అని చెబుతూ తనను తాను వారి భక్తుడిగా అభివర్ణించుకున్న ఎన్టీఆర్ ఒక మాస్ లీడర్ గా చరిత్రలో నిలిచిపోతే, కేసీఆర్ దానికి కాస్త భిన్నంగా, తెలంగాణ సమాజమే తన తల్లి అని అంటారు. ఆ తల్లి బిడ్డగా వచ్చానని ప్రజల మనసులకు చేరువయ్యారు" అని వీరేంద్ర విశ్లేషిస్తారు.
ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
నాలుగున్నరేళ్ళ పాలన...
కేసీఆర్ అధికారంలోకి రాగానే అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించిన సమస్య విద్యుత్ కొరత. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారితే అంధకారమే మిగులుతుందంటూ వచ్చిన విమర్శలను ఆయన సవాలుగా తీసుకుని 24 గంటల విద్యుత్‌ను అధికారంలోకి వచ్చిన తరువాత రెండో పంట నుంచే ఇచ్చారు. ఇంకా, శరవేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతుండడం, సంక్షేమ పథకాలను స్ట్రీమ్ లైన్ చేయడం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కంటి వెలుగు, రైతు బంధు వంటి పథకాలను కొందరు మెచ్చుకుంటున్నా, వాటిని విమర్శిస్తున్నవారు సామాన్య జనంలోనూ కనిపిస్తున్నారు.
"పేదల పక్షాన నిలిచే పార్టీల నేతలుగా గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్సార్ వంటి నేతలకు గుర్తింపు లభించింది. ఇప్పుడు కేసీఆర్ ఆ జాబితాలో చేరారు. కుటుంబాలు ఒక్క గదిలో బతకడం ఏమిటి, కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలన్న ఆయన ఆలోచన చాలా ఉదాత్తమైనదే. కానీ, ఆయనే వాటి నిర్మాణానికి గడువులు విధించుకోవడంతో అదొక వైఫల్యంగా మారింది. దళితులకు మూడెకరాల భూమి కూడా ఒక మేజర్ ఫెయిల్యూర్" అన్నారు అశోక్. ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతూ, రైతు బంధు వంటి పథకాలు అమలు చేస్తూ, వాటి ఫలితంగా భూముల ధరలు నాలుగైదు రెట్లు పెరుగుతుంటే... ఈ పథకం ఎలా ఆచరణ సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
ఎన్టీఆర్, వైఎస్సార్‌లే కాదు చంద్రబాబు నుంచి కూడా కేసీఆర్ ఎంతో నేర్చుకున్నారని అంటారు హరగోపాల్, "ఎన్టీఆర్లోని ఇంపల్సివ్ డెసిషన్ మేకింగ్ స్టయిల్, వైఎస్సార్‌లోని నిష్కర్షగా వ్యవహరించే లక్షణం, చంద్రబాబులోని మానిప్యులేషన్... ఇవన్నీ కలిస్తే కేసీఅర్" అని నిర్వచించారాయన.
ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
దాదాపు రూ.4 వేల కోట్ల ఖర్చుతో గొల్ల కురుమలకు కేసీఆర్ ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసింది.
సంకేతాలు... సందేహాలు
నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో విద్యార్థి లోకం ఉద్యమంతో మమేకమైంది. కానీ, హామీ ఇచ్చిన లక్షకు పైగా ఉద్యోగాల నియమాకాలు జరగకపోవడం యువతరాన్ని నిరాశకు గురిచేసింది. ఉద్యమానికి ఉద్విగ్న కేంద్రంగా మారుమోగిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వందేళ్ళ పండగ వస్తే... ప్రభుత్వం కావాలనే పట్టించుకోలేదని విద్యార్థులు అంటున్నారు. "విద్యార్థుల పట్ల కేసీఆర్ ప్రతీకార వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇలా సంకుచితంగా ఉండడం న్యాయం కాదని" ఓయూ విద్యార్థులు అంటున్నారు.
ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కు రాకుండా ప్రగతి భవన్‌కే పరిమితం కావడం ఏ వ్యవస్థకు సంకేతమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఉద్యమంలో తనతో కలిసి నడిసిన కోదండరామ్ ఇంటి మీదకు అర్థరాత్రి పోలీసులను పంపించడం, ధర్నా చౌక్‌ను ఎత్తేయడం వంటి చర్యల ద్వారా ఆయన అప్రజాస్వామికంగా వ్యవహరించారనే అప్రతిష్ఠను మూటగట్టుకోవడం కాకుండా ఇంకేం సాధించారని ఆయనకు చాలా దగ్గరగా ఉన్నవారే వాపోతున్నారు.
మంత్రులు కూడా తమకు కేసీఆర్ ఆపాయింట్మెంట్ దొరకడం గగనమైపోయిందని దాదాపు బాహాటంగానే అంటున్న సంగతి కూడా కేసీఆర్‌కు వినిపించకుండా ఉంటుందా? "ఆయన పోలీసులు, ఇంటలిజెన్స్ వర్గాల మాట తప్ప మరెవరి మాటా వింటున్నట్లు లేదు. ఆయన తన పాలనలో, ప్రవర్తనలో తెలంగాణ సంస్కృతిని ప్రతిఫలించకుండా, తెలంగాణ సమాజం నిర్ద్వంద్వంగా నిరాకరించిన ఫ్యూడల్ సంస్కతిని ప్రతిబింబిస్తున్నారు" అని హరగోపాల్ వ్యాఖ్యానించారు.
"రైతు జన పక్షపాతిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్ ఈ విషయంలో కొంచెం భిన్నంగా ఉండేవారు. ఆయన తన మంత్రులకు, పార్టీ నేతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. అంతేకాదు, ఆయన ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనిచ్చారు. కానీ, కేసీఆర్ అలా చేయ లేదు. అంతా తానే అయినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారిగా కనిపించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి" అని నల్లగొండకు చెందిన హెచ్.సి.యూ ప్రొఫెసర్ పి. రాములు అన్నారు.
ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
ముందస్తు ఎన్నికలు... సరికొత్త వాగ్బాణాలు
కొంగర కలాన్‌లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్‌లో మునుపటి ఉత్సాహం కనిపించకపోవడానికి కారణాలేమైనప్పటికీ, అసెంబ్లీ రద్దు తరువాత ఆయన ప్రచార సరళిలో క్రమక్రమంగా మునుపటి వేడి రాజుకుంది.
ప్రత్యర్థుల మీద వీలైనంత తీవ్ర పదజాలంతో తనదైన శైలిలో దాడి చేయడం కొనసాగిస్తున్న కేసీఆర్ మీద ఇప్పుడు ప్రజలకు తాను ఏం చేశానో చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అందుకే, ఆయన మాటల్లో ఇప్పుడు ఆత్మరక్షణ ధోరణి కనిపిస్తోంది. బంగారు తెలంగాణ, విశ్వనగరం అనే మాటలు గతంలో మాదిరిగా ఇప్పుడు ఆయన ప్రసంగాల్లో అంత గంభీరంగా వినిపించడం లేదు.
"ఒక కులానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే ఆ కులంలో దరిద్రం అంతా పోతుందా?" అని ఒక చోట, "టీఆర్ఎస్ ఓడిపోయిందనుకో నాకొచ్చే నష్టం పెద్దగ లేదు. ఏముంటది? గెలిపిస్తే పని చేస్తం గట్టిగ. లేకుంటే ఇంట్లో పడుకుని రెస్ట్ తీసుకుంట" అని మరో చోట అనడం ద్వారా ప్రతికూల చర్చలకు ఆస్కారమివ్వడం కేసీఆర్ నైజం కాదని, ఆయన ఒత్తిడికి గురవుతున్నారడానికి సంకేతమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
"ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మళ్ళీ ఎన్నికల్లో గెలవకపోతే రెస్ట్ తీసుకుంటా అంటారా? ప్రజా నాయకుడికి గెలిచినప్పుడే బాధ్యత ఉంటుందా?" అని ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదువుతున్న ఒక విద్యార్థిని ప్రశ్నించారు.
ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
'కేసీఆర్ కిట్' అందజేస్తున్న కేసీఆర్
"ఉద్యమం తరువాత ఒక కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యే గొప్ప అవకాశం కేసీఆర్‌కు లభించింది. కానీ, ఆయన ఆ అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకోలేకపోయారు" అని రాములు అభిప్రాయపడ్డారు.
అయితే, ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో స్టేట్స్‌మన్‌షిప్ ఆశించలేమని టంకశాల అశోక్ అన్నారు. "తెలంగాణ గురించి ఇప్పటికీ కేసీఆర్‌కు ఉన్నంత అవగాహన, ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఆయన చూపించగల తెగువ ఉన్న నాయకులు మరెవరూ కనిపించడం లేదు" అని ఆయన అన్నారు.
"ఉద్యమం జరుగుతున్నప్పుడు తమ నాయకుడిలోని కొన్ని బలహీనతలను జనం పట్టించుకోరు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు అన్నీ పట్టించుకుంటారు. నిర్ణయాలలో తమ భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తారు" అని హరగోపాల్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం వోటు వేయడంతో ముగిసిపోదు, దానితో మొదలవుతుంది.
అయితే, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చూపించిన కమిట్మెంట్ విషయంలో ఇప్పటికీ ఎవరికీ సందేహం లేదని చెప్పిన సిధారెడ్డి, "చరిత్రలో ఉద్యమనేతగా ఉంటానని ఆయనకు తెలుసు. మంచి పాలకుడిగా నిలిచిపోవాలని కూడా ఆయన కోరుకుంటున్నారు" అని తన సహాధ్యాయి గురించి చెప్పారు.
కానీ, కేసీఆర్ సరిగ్గా ప్రజలకు ఆ సంకేతాలనే పంపించగలుగుతున్నారా?
ఇవి కూడా చదవండి:
- ప్రచార హోరులో హెలికాప్టర్ల జోరు.. ఏ పార్టీ ఎన్ని ఉపయోగిస్తోందంటే...
- అగస్టా వెస్ట్‌ల్యాండ్: సీబీఐ అరెస్ట్ చేసిన క్రిస్టియన్ మైకేల్ ఎవరు? అసలు హెలికాప్టర్ల కుంభకోణం ఏమిటి?
- భారతీయులకు పొంచి ఉన్న వాతావరణ ముప్పు
- ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?
- పిల్లలకు తల్లిపాలు ఎలా పట్టించాలి
- బులంద్‌షహర్‌లో ఎస్ఐ హత్య: ఎప్పుడు ఏం జరిగింది? ఎలా జరిగింది?
- అగస్టా వెస్ట్‌ల్యాండ్: సీబీఐ అరెస్ట్ చేసిన క్రిస్టియన్ మైకేల్ ఎవరు? అసలు హెలికాప్టర్ల కుంభకోణం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)