తెలంగాణ ఎన్నికలు 2018: ఉద్యోగాల నియామకాలలో తేలని లెక్కలు

  • 5 డిసెంబర్ 2018
గతేడాది ఉద్యోగాల ప్రకటన కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి ఫొటో Image copyright Getty Images
చిత్రం శీర్షిక గతేడాది ఉద్యోగాల ప్రకటన కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి ఫొటో.

తెలంగాణ ఉద్యమాన్ని ఉరకెలెత్తించి, రాష్ట్రం వచ్చిన తరువాత అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం ఉద్యోగాలు. తెలంగాణ విద్యార్థుల్లో చాలా మంది ప్రత్యేక రాష్ట్రం వస్తే చాలా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశ పడ్డారు. ఆ 'చాలా' అనే సంఖ్య ఎంత అనేది కూడా ఒక వివాదమే.

  • ఇంటికో ఉద్యోగం, పది లక్షల ఉద్యోగాలు అని కేసీఆర్ చెప్పారంటూ ప్రతిపక్షాలు అంటున్నాయి.
  • తాము అలా ఎప్పుడూ చెప్పలేదని టిఆర్ఎస్ వివరణ ఇచ్చింది. అసలు ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో చెప్పారు.
  • తాము లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నాం, అంతకంటే ఎక్కువే ఇస్తున్నాం అని మంత్రి కేటీఆర్ తన ప్రకటనల్లో తెలిపారు.

నిరుద్యోగుల అంశంపై కేస్ స్టడీగా ఓయూలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంఎ చదువుకున్న జగిత్యాలకు చెందిన బీసీ వర్గానికి చెందిన ఆకుల మల్లేశం అనే విద్యార్థితో మాట్లాడింది బీబీసీ బృందం.

''ఉద్యమంలో మా ప్రొఫెసర్లు కానీ, ఉద్యమకారులు కానీ, ఉద్యమ పార్టీలు కానీ... ఆంధ్రా వాళ్లు రెండు నుంచి రెండున్నర లక్షలకు పైగా ఉద్యోగాలు అక్రమంగా తీసుకున్నారని అనుకున్నాం. వాటిల్లో రిటైర్మెంట్లుతో పాటూ, తెలంగాణ వస్తే మరో లక్ష ఉద్యోగాలు కలుస్తాయి. అన్నీ కలుపుకుని సుమారు 3 లక్షల ఉద్యోగాలు వస్తాయని భావించాం. దీంతో ఉద్యోగాల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడాం'' అని వివరించారు మల్లేశం.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ 1 లక్షా 9 వేల ఉద్యోగాలకు అనుమతులు ఇచ్చింది. 87,346 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాగా, నాలుగేళ్లలో 32,681 ఉద్యోగాలు భర్తీ చేసింది. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీకి సమాధానం ఇస్తూ కేటీఆర్ ఈ లెక్కలు విడుదల చేశారు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో పదివేల ఉద్యోగులను కూడా తెలంగాణలో నియమించలేదని విమర్శించారు కేటీఆర్. మేం లక్ష ఉద్యోగాలన్నాం, అంతకంటే ఎక్కువే ఇస్తున్నాం అని పలు వేదికలపై మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

నియామకాల్లో ఆలస్యం

సమస్య కేవలం ఉద్యోగాల సంఖ్యతో మాత్రమే కాదు. నియామక ప్రక్రియ, అందులో జరుగుతోన్న ఆలస్యం అంతకంటే తీవ్రంగా విద్యార్థులను కలిచి వేస్తోంది. నియామక ప్రక్రియ సక్రమంగా నిర్వహించడంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యం చెందిందని ఆరోపించారు విద్యార్థులు.

''వేసిన నోటిఫికేషన్లే తక్కువ. అందులో ఒక్కోటి రెండుమూడేళ్లు అవుతోంది. ప్రభుత్వ, టీఎస్పీఎస్సీ వైఫల్యం వల్లే ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నాయి. నోటిఫికేషన్ వేసేప్పుడు పాలనా పరంగా అన్నీ చూసుకోవాలి. జీవోలు చూసుకోవాలి. ఆ కనీస పరిజ్ఞానం లేకుండా పాలనలో ఉంటారని కాదుగా. నోటిఫికేషన్లు న్యాయంగా లేవనేవారు కోర్టుకు వెళ్తున్నారు. అన్నీ లీగల్‌గా వేస్తే కోర్టుకు ఎందుకు వెళతారు? గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆంధ్రా వాళ్లు షెడ్యూల్ ప్రకారం వేసి పక్కాగా పూర్తి చేశారు. కానీ, తెలంగాణలో మాత్రం రీషెడ్యూల్ వేశారు. తప్పులు జరిగాయి. ఇలా ప్రతీ దానిలో సర్వీస్ కమిషన్ వైఫల్యం చెందింది'' అన్నారు మల్లేశం.

Image copyright facebook

గవర్నమెంటు ఉద్యోగమే ఎందుకు?

తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే చాలా మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలే గురి. వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువు పూర్తయ్యాక కూడా క్యాంపస్‌లలో ఉంటూ సిద్ధం అవుతారు. ''మాకు ప్రభుత్వ ఉద్యోగం ప్యాషన్. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటూ ఇంట్లో వాళ్లకు నచ్చచెప్పి ఉద్యమంలోకి దిగాం. ఉద్యమం కోసం కెరీర్ పక్కన పెట్టడంతో ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్లలేకపోయాం. ప్రైవేటుకు వెళ్తే ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా అయింది మా బతుకు. మాతో పాటూ చదువుకున్న వారు కెరీర్ పరంగా సెటిలయి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఉద్యమమే ఊపిరిగా బతికిన వాళ్లం నిరుద్యోగులుగా మిగిలిపోయాం. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఇంట్లో ఇబ్బందులు ఉన్నా అప్పులు చేసి పోషిస్తున్నారు'' అన్నారు మల్లేశం.

''పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లంతా ఉద్యమం నుంచి వచ్చిన వారే. మా స్థితిగతులు వారికి తెలుసు. ఉద్యోగాల నోటిఫికేషన్ వేసినప్పుడు విద్యార్థుల పరంగా ఆలోచించకుండా వేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ఉద్యోగ కేలండర్ లేదు. ఇన్ని ఉద్యోగాలు వస్తాయన్న లెక్క లేదు'' అన్నారాయన.

Image copyright Getty Images

నిరాశలో విద్యార్థులు, ఆశావహులు

తెలంగాణలో పలు ప్రాంతాల్లో విద్యార్థులతో, యువతతో బీబీసీ మాట్లాడింది. ఉద్యోగాల నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియపై పలువురు విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకటనలు, భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని పదుల సంఖ్యలో విద్యార్థులు బీబీసీ వేదికపై అభిప్రాయపడ్డారు.

"తెలంగాణ ఉద్యమంలో చావుకు భయపడలేదు. కానీ తెలంగాణ వచ్చాక ఇప్పుడు దినదిన గండంగా ఉంది. ఉద్యమంలోనూ ఇంత టెన్షన్, నిరాశ పడలేదు. అప్పుడు త్యాగాలకు వెనుకాడని వాళ్లం, ఇప్పుడు జాబ్ కోసం త్యాగాలు చేస్తున్నాం" అన్నారు మల్లేశం.

టీఎస్పీఎస్సీలో ఉద్యోగుల కొరత

ఉద్యోగులను రిక్రూట్ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా తీవ్రమైన ఉద్యోగుల కొరతతో ఇబ్బంది పడుతోందని చెప్పుకొచ్చారు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ ఉద్యోగి. రాష్ట్ర విభజనలో ఉమ్మడి సర్వీస్ కమిషన్ నుంచి ఆంధ్ర కమిషన్‌కు ఎక్కువ మంది సిబ్బంది వెళ్లిపోయారు. తెలంగాణకు ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు ఎక్కువ వచ్చారు. టీఎస్పీఎస్సీకి కొత్త ఉద్యోగులు కావాలంటూ ఎన్నో సార్లు ప్రభుత్వానికి లేఖలు వెళ్లినట్టు ఆయన చెప్పారు. ''మీరు ఎప్పుడైనా కమిషన్ ఆఫీస్ చూడండి. ఏ గవర్నమెంటు ఆఫీసులోనూ ఎవరూ ఉండనంత సేపు మేం ఉంటున్నాం. రాత్రయ్యే వరకూ పనిచేస్తున్నాం. నోటిఫికేషన్లలో ఎవరికో ఏదో నచ్చకపోతే కోర్టుకు వెళతారు. కోర్టులు స్టేలు ఇస్తాయి. దానికి మా చేతుల్లో ఏముంది? మేం గతం కంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు ఎంతో మెరుగుపరిచాం'' అంటూ తమ వాదన వినిపించారాయన.

నిరుద్యోగులకు భృతి

నిరుద్యోగులకు నెలనెలా కొంత మొత్తం ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను మొదట్లో కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. తరువాత తాము కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.

నిరుద్యోగులకు 3 వేల రూపాయల భృతి ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తరువాత బీజేపీ కూడా అదే హామీ ఇచ్చింది. అప్పట్లో దీన్ని కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఆచరణ సాధ్యం కాదన్నారు. "నిరుద్యోగులకు భృతి ఇస్తారా.. నిరుద్యోగులంటే ఎవరూ.. వాళ్లు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? కాంగ్రెసోళ్లకు నిజాయతీ ఉంటే చెప్పాలి. పాలిటెక్నిక్ చదవినవాడు నిరుద్యోగా? ఐటీఐ చదివినవాడు నిరుద్యోగా? పీజీ చదివినవాడు నిరుద్యోగా? మీ దృష్టిలో నిరుద్యోగి అంటే ఎవరో నిర్వచనం చెప్పండి. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్ని లక్షల మంది ఉన్నారు. వారందరికీ భృతి ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది. అంత మొత్తం ఎక్కడ నుంచి సమీకరిస్తారో చెప్పాలి'' అని వ్యాఖ్యానించారు కేసీఆర్.

ఈ మాటలు అన్న రెండు నెలల్లో ఆయన మరో మాట చెప్పారు.

నిరుద్యోగులకు మూడు వేల పదహారు రూపాయల భృతి ఇస్తామని ప్రకటించారు. ''బాధ్యత లేకుండా ఏది బడితే అది చెప్పలేం. మాకు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కొంత సమాచారం వచ్చింది. కానీ అది స్థిరంగా ఉండదు. తరువాత రోజే ఉద్యోగమో, ఉపాధో దొరకొచ్చు. సమాచారం మారుతుంది. మేం సమగ్ర సర్వే తరువాత ఎక్కువ చర్చించింది ఇళ్లు, ఉద్యోగాల అంశాలే. నిరుద్యోగులు 11 నుంచి 12 లక్షల మంది ఉంటారని అంచనా. ఇంత మందికే భృతి అనే విషయంపై మేం లిమిట్ పెట్టడం లేదు. ఎంత మంది ఉన్నా ఇస్తాం. మళ్లీ ప్రభుత్వంలోకి రాగానే గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తాం. ఒకవేళ ఉద్యోగం వస్తే ప్రభుత్వానికి ఎలా తెలియాలి వంటివన్నీ చూస్తాం. ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్న మార్గదర్శకాలు పరిశీలిస్తాం. గరిష్ట పరిమితి లేకుండా నిరుద్యోగులందరికీ 3016 రూపాయల భృతి ఇస్తాం. అదేం బిగ్ మనీ కాదు. ఐదేళ్ల ఎకానమీ చూసుకునే చెబుతున్నాం. అడ్డగోలుగా, బాధ్యత లేకుండా, ఇష్టం వచ్చినట్టు చెప్పడం లేదు'' అన్నారు కేసీఆర్.

అయితే ఓటమి భయంతోనే కేసీఆర్ నిరుద్యోగ భృతి గురించి మాట్లాడారనీ, తమ హామీ కాపీ కొట్టారనీ విమర్శించారు కాంగ్రెస్ నాయకురాలు డికె అరుణ. తాము చెప్పిన సంఖ్యకు పైన 16 రూపాయలు కలిపి చెప్పారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నియామక ప్రకియ వేగవంతం చేస్తామనీ, వంద రోజుల్లోనే నోటిఫికేషన్లు వేస్తామనీ తెలిపారు అరుణ.

(నియామక ప్రక్రియలో ఆలస్యంపై వివరణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్ష కార్యాలయాన్ని బీబీసీ తెలుగు సంప్రదించింది. స్పందన కోసం ఎదురు చూస్తోంది.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు