గౌతం గంభీర్: క్రికెట్ నుంచి గర్వంగా తప్పుకుంటున్నాడు: అభిప్రాయం

  • 5 డిసెంబర్ 2018
గౌతం గంభీర్ రిటైర్డ్ Image copyright Getty Images

చివరికి అతడు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గర్వంగా, గుండెనిబ్బరంతో తన జట్టు కోసం, దేశం కోసం క్రికెట్ ఆడిన గంభీర్ ఇక దానికి ముగింపు చెప్పాలని ధైర్యంగా నిర్ణయించుకున్నాడు.

పరుగులు తీసే కాలం ఎవరినీ వదలదని తనకు తెలుసు. అందుకే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు అతడు ప్రకటించాడు

జట్టు కోసం తను ఎంత చేశాడో తనిప్పుడు వెనుదిరిగి గర్వంగా చూసుకోగలడు.

ఆఫ్ స్టంప్ ఎక్కడుందో తెలుసుకుని ఆచితూచి ఆడే అతడి బ్యాటింగ్ నైపుణ్యం, ఎవరూ అడగకుండానే తనంతట తనే అంగీకరించే అతడి పోటీతత్వం, బలమైన బ్యాటింగ్ లైనప్‌లో తను కూడా ఉండాలనే ఆ తపన..అన్నీ కలగలసి అతడిని ఒక గంభీరమైన, గర్వించదగ్గ ఆటగాడిగా నిలిపాయి.

డాషింగ్ వీరేంద్ర సెహ్వాగ్‌తో అతడి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందరూ వీరూ-గౌతీ షో అనేవారు. దానిని స్థిరమైన పరుగుల ప్రవాహంగా భావించేవారు.

సెహ్వాగ్‌తో కలిసి గంభీర్ తన పాత్రను పోషించిన తీరు ప్రశంసనీయం. తనలోని దూకుడును ఎక్కువసేపు అదుపులో పెట్టుకోవడం అంత సులభం కాదు. కానీ కనురెప్ప వేయకుండా బ్యాటింగ్ చేసి తను దాన్ని సాధించాడు.

Image copyright Hindustan Times

వరల్డ్ కప్ ఫైనల్స్ బిగ్ ప్లేయర్

2007లో ముంబయిలో ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 ఫైనల్, 2011లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ ఫైనల్ టాప్ స్కోరర్‌గా నిలిచాక గంభీర్ ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

జోహనెస్‌బర్గ్‌లో పాకిస్తాన్‌పై 75, ముంబైలో శ్రీలంకపై 97 పరుగులు చేసినపుడు, స్ట్రోక్ ప్లేయర్లను స్వేచ్ఛగా ఆడనిస్తూనే గంభీర్ తన పరుగుల దాహాన్ని ఎలా తీర్చుకున్నాడనేది గుర్తుచేస్తుంది.

లిమిటెడ్ ఓవర్లలోనే కాదు, టెస్టుల్లో కూడా 2008-2012 మధ్య గంభీర్ భారత బ్యాటింగ్‌కు ఒక స్తంభంలా నిలిచాడు.

2006లో, దాదాపు 2007 పూర్తిగా టెస్టుల్లో చోటు లభించకపోయినా, 2008లో ఆస్ట్రేలియా సీబీ సిరీస్‌లో పవర్‌ఫుల్ బ్యాటింగ్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఆ లిమిటెడ్ ఓవర్ సిరీస్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియాపై చెరో సెంచరీ కూడా చేశాడు. ఆ సిరీస్ అంతటా గంభీర్ బ్యాటింగ్‌లో కనిపించిన ఆ కాన్ఫిడెన్స్ సెలక్టర్లు తిరిగి అతడిని జట్టులోకి పిలిపించేలా చేసింది.

Image copyright Getty Images

జట్టులో చోటు కోసం పోరాటం

బెస్టాఫ్ త్రీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను 2-0తో ఓడించిన తర్వాత జట్టు తిరిగి స్వదేశానికి వెళ్తున్నప్పుడు మెల్‌బోర్న్ విమానాశ్రయంలో నేను అతడితో మాట్లాడింది నాకు గుర్తుంది.

"టెస్టు జట్టులో మిమ్మల్ని ఆడించే అవకాశాలేవైనా ఉండచ్చని మీరు అనుకుంటున్నారా? అని అడిగాను, దానికి అతడు నావైపు చూసి ..మీరు అనుకుంటున్నారా"? అన్నాడు.

నిజం చెప్పాలంటే, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో సెలక్టర్లు తనను పట్టించుకోకపోయినప్పుడు అతడు నన్నేమీ అనలేదు. బదులుగా ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఓపెనరుగా బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాడు.

తనలో బ్యాటింగ్ సత్తా పుష్కలంగా ఉందని సెలక్టర్లకు మరోసారి చూపించాడు. చివరికి అదే అతడికి ఆస్ట్రేలియాతో ఒక అవకాశాన్ని ఇచ్చింది.

మొహాలీ టెస్టులో రెండో ఇన్నింగ్స్ 104 పరుగులు చేసిన గౌతమ్, వెంటనే ఫిరోజ్ షా కోట్ల మైదానంలో 206 పరుగులు చేసి భారత్ ఆ టెస్ట్ సిరీస్ గెలవడానికి కీలకం అయ్యాడు.

బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్, షేన్ వాట్సన్, పీటర్ సిడిల్ లాంటి బౌలింగ్ అటాక్‌ను ఎదుర్కుని చాలా కొద్దిమంది మాత్రమే బ్యాక్ టు బ్యాక్ టెస్టుల్లో సెంచరీలు చేశారు. ఈ స్కోర్లు ఒక టెస్ట్ క్రికెటరుగా గంభీర్ సత్తాను, సంకల్పాన్ని నిరూపిస్తాయి.

Image copyright Getty Images

రెండు రోజులు సుదీర్ఘ ఇన్నింగ్స్

అయినా, 2009లో న్యూజీలాండ్‌తో నేపియర్ టెస్ట్ డ్రా చేయడానికి చివరి రెండు రోజులు పోరాడాల్సిన దశలో గౌతమ్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 12 గంటలా 45 నిమిషాలు క్రీజులో ఉన్న గంభీర్ 137 పరుగులు చేశాడు.

రాహుల్ ద్రవిడ్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి చివరకు ఆ టెస్ట్ డ్రా అయ్యేందుకు కారణమయ్యాడు.

నాకు బాగా నచ్చిన గౌతం గంభీర్ ఆన్ ఫీల్డ్ మూమెంట్ మాత్రం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో అతడు చేసిన డబుల్ సెంచరీనే.

Image copyright Getty Images

వాట్సన్‌కు గంభీర్ చుక్కలు

గంభీర్ 90ల్లో ఉన్నప్పుడు షేన్ వాట్సన్ ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. బౌన్సర్లు వేస్తూ ఎడమచేతి బ్యాట్స్ మెన్ అయిన గంబీర్‌ను ముప్పుతిప్పలు పెట్టాలనుకున్నాడు.

అవుట్ సైడ్ ఎడ్జ్ ఇచ్చి థర్డ్ మ్యాన్‌ చేతికి చిక్కేలా గంభీర్‌ను మాయ చేయాలనుకున్నాడు.

కానీ అతడి తర్వాత ఓవర్లోనే గౌతం గంభీర్ తన ఉద్దేశం ఏంటో చెప్పాడు.

99లో బ్యాటింగ్ చేస్తున్న గంభీర్ ఒక అడుగు ముందుకేసి స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు. అతడు సెంచరీ పూర్తి చేసిన ఆ స్టైల్ చూసి సెహ్వాగ్ కూడా ఆశ్చర్యపోయాడు.

ఆ అద్భుతమైన షాట్‌తో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పొటింగ్‌ తర్వాత రోజు వరకూ వాట్సన్‌ను బౌలింగ్ నుంచే తప్పించాల్సివచ్చింది.

Image copyright Getty Images

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాక గౌతం గంభీర్ రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఐపీఎల్ లాంటి డొమెస్టిక్ క్రికెట్‌లోనే ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా సక్సెస్ కూడా అయ్యాడు.

2008 రంజీట్రోఫీలో ఫైనల్లో సెంచరీ చేయడంతోపాటు, అతడు ఢిల్లీ జట్టును ముందుకు నడిపించిన తీరు కూడా గుర్తుండిపోతుంది. టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి గంభీర్‌కు ఆ జర్నీ చాలా కీలకంగా నిలిచింది.

ఇంకో విషయానికి వస్తే, 1999-2000లో శ్రీలంకలో జరిగిన ఐసీసీ యూత్ వరల్డ్ కప్‌ కోసం తనను సెలక్ట్ చేయనపుడే అతడు అన్ని క్రికెట్ ఫార్మాట్లకు దూరం కావాలనుకున్నాడు. కానీ అది నిజం కాలేదు.

Image copyright Getty Images

వ్యాపారంపై ఫోకస్ పెట్టాలనుకున్నాడు

ఆ సీజన్లో చాలా పరుగులు చేసినప్పటికీ, తనను నిర్లక్ష్యం చేయడంపై గంభీర్ చాలా ఆవేదన చెందాడు. క్రికెట్‌ కంటే తన చదువు, వ్యాపారాలపై దృష్టి పెట్టడమే మంచిదని అనుకున్నాడు.

జట్టు సెలక్షన్‌కు వ్యతిరేకంగా ఒక వార్తాపత్రికలో వ్యాసం రాయిస్తే, ఏదైనా మార్పు వస్తుందని అప్పట్లో అతడి కుటుంబ సభ్యులు కూడా అనుకున్నారు. ఒక జర్నలిస్టుతో కూడా మాట్లాడారు.

కానీ గౌతం గంభీర్ కెరీర్ ముగిసిందనే వార్త రాయడం కంటే వేరే ఏం చేస్తే మంచిదో ఆ జర్నలిస్టుకు బాగా తెలుసు. అందుకే అతడు గౌతం గంభీర్‌తో మాట్లాడాడు. మీ ఫోకస్ అంతా టెస్టులు, వన్డేలు ఆడాలనే లక్ష్యం మీదే ఉంచమని చెప్పాడు.

ఇప్పుడు, మూడు క్రికెట్ ఫార్మాట్లలో భారత తరఫున 10324 పరుగులు స్కోర్ చేసిన గౌతం గంభీర్ తన కెరీర్ సంతృప్తికరంగా పూర్తి చేశాడు. ఇక జట్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించాడు.

గంభీర్ భారత క్రికెట్‌కు ఒక విశ్వసనీయ సేవకుడుగా నిలిచాడు. ముందున్న లక్ష్యంపై దృష్టి పెడుతున్నప్పుడు అతడు తన అభిరుచిని, దేశభక్తిని భుజాలపై మోయడానికి భయపడలేదు.

అందుకే గంభీర్ ఇప్పుడు వెనుదిరిగి తన కెరీర్‌ను సంతృప్తిగా, సగర్వంగా చూసుకోగలడు.

మరోవైపు గంభీర్ ఆఖరు మ్యాచ్ రంజీ ట్రోఫీలో భాగంగా గురువారం దిల్లీలో జరుగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)