సిక్కోలు మత్స్యకారులు బంగాళాఖాతాన్ని వదిలి పాక్ తీరం దాకా ఎందుకెళ్తున్నారు? అక్కడ అరెస్టయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది?

  • 6 డిసెంబర్ 2018
అరెస్టయిన వారి తల్లి

ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఆ ఊరంతా వలసలే. ఉపాధి కోసం బంగాళాఖాతం తీరం వదిలి, అరేబియా సముద్రం వైపు పయనం. అదే వారి జీవనాధారం. చేపల వేట కోసం అలా వలస వెళ్లిన 21మంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతిలో బందీ అయ్యారు. వీరంతా బంధువులే!

ఇది శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామం. ఆ గ్రామంలోని మత్స్యకారులు గత మూడు దశాబ్దాలుగా ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. అలా ఆగస్టు నెలలో గుజరాత్‌లోని వీరావల్‌కు వలస వెళ్లిన ఈ గ్రామ మత్స్యకారులు.. పాకిస్తాన్ జాలాల్లోకి ప్రవేశించినందుకు అరెస్టు చేశామని పాకిస్తాన్ అధికారులు తెలిపారు.

ఏం జరిగింది?

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionచేపల కోసం వెళ్లి.. దేశ సరిహద్దులు దాటి..

'26/11 ముంబై దాడుల'కు ఇటీవలే పదేళ్లు నిండాయి. ఆ సమయంలో పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇది సాధారణ మత్స్యకారులకు తెలీకపోవడంతో యధావిధిగా వేటకు వెళ్లారు.

''వేటకు వెళ్లినపుడు భారత్ సరిహద్దులు దాటారంటూ మావాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది'' అని ప్రస్తుతం పాక్ జైలులో ఉన్న తన భర్త, పిల్లల గురించి మగతమ్మ తెలిపారు.

మగతమ్మ భర్తతోపాటు తన 17 ఏళ్ల పెద్దకొడుకు కిషోర్, 16 ఏళ్ల చిన్న కొడుకు కిరణ్‌ ఇద్దరూ పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్‌కు పట్టుబడినట్లు ఆమె తెలిపారు.

వీరితోపాటు వెళ్లిన తన సోదరుడు, మరికొందరు బంధువులు కూడా అరెస్టు అయ్యారని చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు మగతమ్మ. తమ కుటుంబీకులు, బంధువులను వెంటనే విడిచిపెట్టాలని ఆమె వేడుకున్నారు.

మూడు దశాబ్దాలుగా ఇవే వలసలు

ఈ వలసలు ఇప్పటివి కావు. గత మూడు దశాబ్దాలుగా జరుగుతున్నాయి.

మూతి మీద మీసం కూడా మొలవక ముందే వలసల వలల్లో చిక్కుకుంటున్నారు. ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు వలసల ప్రయాణమే. సంవత్సరానికి తొమ్మిది మాసాలు బయటి ప్రాంతాల్లో, తెలియని భాష మాట్లాడే వారి మధ్యలో గడిచిపోతాయి.

ఒకసారి సముద్రంలో వేటకు వెళితే మళ్ళీ 20 రోజుల వరకూ పుడమి ముఖం చూడరు. సముద్రంలో సాగే వేట మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు వస్తుంది. అయిన వారికి ఆఖరి చూపు కూడా దొరకని మత్స్యకార జీవితాలెన్నో!

కుటుంబ పోషణ కోసం వలసలు వెళ్లిన వారు మళ్ళీ తిరిగివస్తారనే ధీమా ఎవరికీ ఉండదు. సరిహద్దు సమస్యల్లో చిక్కుకుని, జైలు పాలైన జీవితాలు కూడా చాలా ఉన్నాయి.

ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ సరిహద్దు జలాల వద్ద అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన వారు అనేక మంది, పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్‌కు చిక్కి, సుదీర్ఘ కాలం జైలులోనే మగ్గిపోతున్నారు.

ఇది ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరానికి చెందిన మత్స్యకారుల వలస జీవిత కథ. ఇటీవల పాకిస్తాన్ చెరలో చిక్కిన 20 మంది సామాన్య మత్స్యకారుల జీవితాలను గమనిస్తే వారి దుస్థితి అర్థమవుతుంది.

‌విస్తారమైన సముద్ర తీరం ఉండగా వలసలు ఎందుకు?

ఉత్తరాంధ్ర కరువు ప్రాంతాల నుంచి వలసలు చాలా కాలంగా వార్తల్లో వస్తున్నాయి. చివరకు చెన్నై లాంటి చోట నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిన ఘటనల్లో బాధితులంతా ఉత్తరాంధ్ర వారే కావడం వలసల కష్టాలను చాటింది.

అయితే మత్స్యకారుల వలసలు విస్మయం కలిగిస్తున్నాయి. విస్తారమైన సముద్ర తీరం ఉన్న ఈ జిల్లాల మత్స్యకారులు కేరళ నుంచి గుజరాత్ వరకు వివిధ అరేబియా సముద్ర తీర రాష్ట్రాలకు ఏటా వలసలు పోతున్నారు.

ఈ వలసలకు ప్రధాన కారణం మత్స్యకారుల వేటకు అనువుగా జెట్టీల నిర్మాణం లేకపోవడమేనని స్థానికులు చెబుతున్నారు.

ఎచ్చెర్ల మండలం మత్స్యలేశం గ్రామానికి చెందిన వెంకటరమణ గత నాలుగేళ్ళుగా గుజరాత్, కేరళ తీర ప్రాంతాలకు వలస వెళ్లి వచ్చారు.

వైజాగ్ నుంచి ఇచ్చాపురం వరకువున్న 260 కిలోమీటర్ల తీరప్రాంతంలో ఎక్కడా ఒక్క జెట్టీ కూడా లేదని అన్నారు. జెట్టీ లేకుండా సముద్రంలో వేట సాధ్యం కాదు.

నాటు పడవల మీద వేట సాగించిన కాలంలో తీరానికి చేరువలోనే పోషణకు అవసరమైన మత్స్య సంపద దొరికేదని, దానితో పొట్ట నింపుకునేవారమని వెంకటరమణ అన్నారు.

కానీ ఓవైపు కాలుష్యాలను వెలువరించే పరిశ్రమల వల్ల, మరోవైపు పెద్ద పెద్ద బోట్లలో వేట మొదలుపెట్టడం వల్ల, సామాన్యులకు చేపలు చిక్కడం లేదంటున్నారు. దాంతో అనివార్యంగా సముద్రం లోపలకు వెళ్లి వేటాడాల్సిన పరిస్థితి వచ్చిందని, అందుకే ఇంజిన్ బోటులను ఆశ్రయించామన్నారు వెంకటరమణ.

ఇంజిన్ బోటులలో వేటాడేందుకు అనువుగా జెట్టీ నిర్మించాలని చాలా కాలంగా కోరుతున్నట్లు శివాజిదిబ్బలు గ్రామానికి చెందిన లక్ష్యయ్య అన్నారు.

వారి కోరిక ఒక ఎన్నికల హామీగా మిగిలిందేతప్ప, ఇంతవరకూ ఒక్క జెట్టీని కూడా కట్టలేదన్నారు. దాంతో అనివార్యంగా జెట్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వలసలు పోవాల్సి వచ్చిందన్నారు.

గుజరాత్‌లోని వీరావల్ ప్రాంతంలో పదుల సంఖ్యలో జెట్టీలు అందుబాటులో ఉండడంతో అక్కడకు ఎక్కువగా వలస పోతున్నామన్నారు.

‌వలసలు ఉన్న గ్రామాల పరిస్థితి ఏమిటి?

‌సహజంగా ఆగస్టు నెల నుంచి వలసలు మొదలవుతాయి. ఆగస్టు నెల వేటకు అనుకూలం అని భావిస్తారు. ఏటా ఆగస్టు నుంచి ఏప్రిల్ వరకూ తమ కుటుంబాల్లోని మగవాళ్ళు వలస పోతారని మైలవరపు ఎర్రమ్మ తెలిపారు.

ఈ ఏడాది తన భర్తతోపాటు పద్నాలుగేళ్ల కొడుకు కూడా గుజరాత్ వెళ్లినట్లు ఆమె తెలిపారు. అక్కడకు వెళ్లిన తర్వాత, వారు పంపించే డబ్బుపైనే తమ జీవితాలు ఆధారపడ్డాయన్నారు.

తమ ప్రాంతంలో వేటకు వెళ్లే అవకాశాలు లేకపోవడంతో వలసలు తప్పడం లేదని, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలతో తాము సొంతూరులో గడుపుతున్నామన్నారు. వలస వెళ్లిన వాళ్ళు మళ్ళీ వస్తారనే ధీమా ఉండడం లేదని చెప్పారు.

చదువుకు దూరమై, సంద్రానికి చేరువై

పెద్దవాళ్లతోపాటు చాలామంది చిన్నపిల్లలు కూడా వలసపోతారు. తాను కూడా చదువు మధ్యలో ఆపేసి గుజరాత్ వెళ్లి పనిచేశానని అప్పారావు అనే న్యాయవాది తెలిపారు.

చదువుకు అవసరమైయ్యే ఫీజుల కోసమైనా వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వలస కాలంలో అక్కడ పడిన కష్టాలు చూసి, పట్టుదలతో చదువుకుని న్యాయవాది అయ్యానని ఆయన అన్నారు.

తమ పంచాయతీలోని 5 వేల జనాభాకుగాను న్యాయ విద్య చదివిన వారిలో తాను రెండో వాడినన్నారు. యువతకు ఉపాధి, స్థానికంగా వేటాడేందుకు సదుపాయాలు అత్యవసరమని అప్పారావు అన్నారు.

''12 ఏళ్ల వయసు నుంచి తండ్రులతో పాటు సముద్రంలోకి వెళతారు. అక్కడ వంటలో సహాయకులుగా, ఒంట్లో శక్తి ఉంటే కళాసిగా పనిచేస్తారు. కోస్ట్ గార్డ్స్ తనిఖీలకు వచ్చినపుడు ఈ పిల్లలు బోటులో చేపలను భద్రపరిచే కోల్డ్ స్టోరేజ్‌లో దాక్కుంటారు'' అని ఆయన వివరించారు.

వలస వెళ్లి చిక్కితే..

వలస వెళ్లిన వారికి మరో ముఖ్యమైన సమస్య భాష. తాము ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు తమకు ఎన్నో అవమానకర సందర్భాలు ఎదురవుతాయని వెంకట రమణ అన్నారు.

ఇక దేశాల మధ్య సరిహద్దులు తెలియకపోవడంతో కొన్ని సార్లు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్‌కు చిక్కుతారు. పదేళ్ల క్రితం మత్స్యలేశం గ్రామానికి చెందిన పుక్కోళ్ల లక్ష్మయ్య అలానే పట్టుబడ్డారు.

14 నెలలు పాకిస్తాన్ జైలులో గడిపారు. ఆ కాలం తనకు నరక ప్రాయం అని లక్ష్మయ్య అన్నారు.

''ఒకే హాలులో 300మందిని నిర్బంధించారు. చిత్రహింసలకు గురయ్యాను. తినడానికి తిండి లేదు. మళ్ళీ తిరిగి వస్తానని అస్సలు అనుకోలేదు'' అన్నారు. అప్పటి నుంచి తాను కర్నాటక ప్రాంతంలో వేట కోసం వెళుతున్నానని, పలుమార్లు కోస్ట్ గార్డ్స్ తీవ్రంగా వేధిస్తారని ఆయన వివరించారు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ప్రతీ ఏటా వలస వెళ్లే వేలాది కుటుంబాల పరిస్థితి ఇలానే ఉంది. కనీసం 10 వేల మంది మత్స్యకారులు ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచే వలస వెళుతున్నారని స్థానిక మత్స్యకార సంఘం ప్రతినిధి వెంకటేశ్వర రావు తెలిపారు.

స్థానికంగా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు జెట్టీల నిర్మాణం అత్యవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం: అధికారులు

గుజ‌రాత్ లో తెలుగు మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేయ‌డానికి ఓ బృందం నియ‌మించామ‌ని ఏపీ ప్ర‌భుత్వ మ‌త్స్య‌శాఖ క‌మిష‌నర్ రామ‌శంక‌ర్ నాయ‌క్ తెలిపారు.

ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో మ‌త్స్య‌కారుల‌కు స్థానికంగా ఉపాధి క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు.

అందులో భాగంగా శ్రీకాకుళంలో జెట్టీలు , హార్బ‌ర్ల నిర్మాణం చేప‌ట్ట‌బోతున్న‌ట్టు వివ‌రించారు. మ‌త్స్యకారుల‌కు స‌ముద్రంలో వేట‌కు అనువుగా ఆధునిక బోట్లు అందిస్తామ‌న్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)