ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ

  • పరాగ్ పాఠక్
  • బీబీసీ ప్రతినిధి
విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌(2018)లో భారత జట్టు 2-1 ఆధిక్యంతో ముందుంది. మెల్‌బోర్న్ టెస్టు విజయంతో.. విదేశాల్లో అత్యధిక టెస్టుల్లో విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు.

పచ్చగా కళకళలాడే అడిలైడ్ ఒవల్ మైదానానికి విరాట్ కోహ్లీ జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. నాలుగేళ్ల క్రితం (2014లో) ఇదే మైదానంలో కోహ్లీ రెండు ఇన్నింగ్సుల్లో రెండు సెంచరీలు చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.

తర్వాత పరుగుల యంత్రంలా మారి కోహ్లీ యుగాన్నే సృష్టించాడు. ఈ రెండు సెంచరీల ముందు నుంచే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా ఫేమస్ అయ్యాడు.

కానీ, పైకి లేచిన ప్రతిసారీ కిందికి పడక తప్పదు. అలాగే, విరాట్ కెరీర్లో కూడా అలాంటి ఎత్తుపల్లాలు ఎన్నో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

విమర్శకులకు ప్రధాన లక్ష్యం

ఇంగ్లండ్‌లో మబ్బుపట్టిన వాతావరణంలో హెవీ స్వింగ్ అయ్యే పిచ్‌లపై జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఆడలేక విరాట్ తడబడిపోయాడు.

కోహ్లీ అభిమానులు కూడా అసలు తాము చూస్తోంది వన్డేలు, టెస్టుల్లో భారీగా పరుగులు చేస్తున్న విరాట్‌నేనా అని సందేహించారు.

భారత్‌తో జరిగిన ఆ టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లండ్ 3-1 తేడాతో గెలుచుకుంది. ఈ సిరీస్‌లో విరాట్ స్కోర్లు - 1, 8, 25, 0, 39, 28, 0, 76, 20.

సాదాసీదాగా ఉన్న ఈ గణాంకాలు విరాట్ కోహ్లీవే అంటే చాలా మంది అసలు నమ్మలేరు. అప్పట్లో అతడికి వ్యతిరేకంగా కొన్ని గొంతులు కూడా వినిపించాయి. తన ఈగోకు కోహ్లీ మూల్యం చెల్లించుకుంటున్నాడని కూడా కొంతమంది విమర్శకులు అన్నారు.

కొందరైతే అతడి దురుసు ప్రవర్తన గురించి ప్రశ్నించడం ప్రారంభించారు. ప్రస్తుత నియమాల ప్రకారం ఆటగాళ్లు విదేశీ పర్యటనకు వెళ్తుంటే, అతడితోపాటు తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్య, పిల్లలను మాత్రమే అనుమతిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2014 డిసెంబర్ 30వ తేదీన మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ లో 50 పరుగులు చేసిన కోహ్లీకి గ్యాలరీ నుంచి అభినందనలు తెలుపుతున్న అనుష్క శర్మ

పెళ్లికి ముందే అనుష్కతో అఫీషియల్ టూర్

కానీ, నాలుగేళ్ల క్రితం విరాట్ కోహ్లీ పెళ్లైనవాడుకాదు. అప్పుడు అతడు బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమలో ఉన్నాడు. వారి బంధం గురించి జోరుగా గాసిప్స్ కూడా వచ్చేవి. అలాంటి సమయంలో ఇంగ్లండ్ పర్యటనలో తనతోపాటు అనుష్కను కూడా అనుమతించాలని విరాట్ బీసీసీఐని కోరాడు.

పద్ధతి ప్రకారం ఆటగాళ్లు తమ ప్రియురాళ్లను విదేశీ పర్యటనలకు తీసుకెళ్లడానికి బోర్డు అనుమతించదు. కానీ బీసీసీఐ ఆ నిబంధనలు పక్కనపెట్టింది. ఇంగ్లండ్ పర్యటన కోసం అనుష్కను తీసుకువెళ్లడానికి విరాట్‌కు అనుమతి ఇచ్చింది.

తర్వాత అనుష్క వెంట ఉండడం వల్లే విరాట్ తన ఆటపై దృష్టి పెట్టలేకపోయాడని మీడియాలో వార్తలు వచ్చాయి. కోహ్లీ మిగతా విషయాల కంటే తన ఆటపై ఎక్కువ దృష్టి పెట్టాలని పరోక్షంగా సూచించాయి.

కోహ్లీ తర్వాత తనపై వచ్చిన విమర్శలన్నింటినీ కడుపులోనే దాచుకున్నాడు. తర్వాత శ్రీలంక, వెస్టిండీస్ సిరీసుల్లో బాగానే ఆడాడు.

తర్వాత వచ్చిన ఆస్ట్రేలియా పర్యటన కోహ్లీకి ఒక సవాలుగా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్ల పేస్ అటాక్‌ను కోహ్లీ తట్టుకోగలడా అని అంతా అనుకున్నారు. అసలు తుది జట్టులో అతడిని ఉంచాలా, వద్దా అనే విషయంలో కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ తలపై ముళ్ల కిరీటం

కానీ అంతా అనుకున్నది ఒకటైతే, అక్కడ జరిగింది వేరే. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గాయపడడంతో, అప్పటికి జట్టులో ప్రధాన బ్యాట్స్‌మెన్ అయిన కోహ్లీకి తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు.

అప్పటికే సరిగా ఆడలేదని విమర్శలు ఎదుర్కుంటున్న కోహ్లీకి అదనంగా కెప్టెన్సీ అనే ముళ్ల కిరీటాన్ని ధరించడం పెను సవాలుగా మారింది.

ఇటు, ఆస్ట్రేలియా మీడియా కూడా అతడిని టార్గెట్ చేసింది. తర్వాత అడిలైడ్ టెస్టు మ్యాచ్‌లో విరాట్ రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు చేశాడు.

ఇంగ్లండ్ పర్యటనలో తన ఆటతీరు చూపించలేకపోయినా, ఆస్ట్రేలియాతో ఆరంభంలోనే అద్భుతాలు చేశాడు. తనని విమర్శించిన వారు కూడా తెల్లముఖం వేసేలా చేశాడు.

ఆస్ట్రేలియా బౌలర్లను కోహ్లీ సులభంగా ఎదుర్కున్నాడు. అడిలైడ్ టెస్టులో భారత జట్టు ఓటమి పాలైనా, ఫాస్ట్ బౌలింగ్, బౌన్సీ పిచ్‌లపై ఆడలేడని, స్లెడ్జింగ్ జరుగుతుంటే ఆటపై ఫోకస్ పెట్టలేడని వచ్చిన విమర్శలన్నిటినీ విరాట్ ఒకే ఒక మ్యాచ్‌తో తుడిచిపెట్టేశాడు.

నాలుగు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ 692 పరుగులు చేశాడు. భారత్ సిరీస్ కోల్పోయినా, కోహ్లీ మాత్రం తనను తాను నిరూపించుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

అడిలైడ్‌లోనే మొదటి టెస్ట్ సెంచరీ

2011-12లో కోహ్లీ ఆస్ట్రేలియాలో ఆడిన ఈ సిరీస్ మరచిపోలేనిది. భారత జట్టు ఈ నాలుగు టెస్టుల సిరీస్ గెలుచుకోలేకపోయింది. కానీ కెరీర్లో మొదటి టెస్ట్ సెంచరీ సాధించిన విరాట్‌కు మాత్రం ఇది ఒక స్పెషల్ సిరీస్.

అవతల క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పడుతుంటే.. విరాట్ మాత్రం తన స్పెషల్ షాట్లతో సెంచరీ పూర్తి చేశాడు.

తెందుల్కర్, ద్రవిడ్, గంభీర్ లాంటి పెద్ద పెద్ద ఆటగాళ్లు ఈ మ్యాచ్‌పై తమదైన ముద్ర చూపలేకపోయినా.. విరాట్ మాత్రం సెంచరీతో తన ఆగమనాన్ని ఘనంగా ప్రపంచానికి చాటాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియా, విరాట్‌ మధ్య ఉన్న పోలిక- దూకుడు

స్లెడ్జింగ్ అనేది, ఆస్ట్రేలియా క్రికెటర్స్ తరచూ ఉపయోగించే ఒక ఆయుధం. ప్రత్యర్థులపై చెత్త కామెంట్లు చేస్తూ వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఆ జట్టు ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఈ స్లెడ్జింగ్‌లో తిట్టడం, వేళాకోళం చేయడం ఎక్కువ. దీని వెనుక ప్రధాన ఉద్దేశం ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీయడం. ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు కూడా వారి స్లెడ్జింగ్‌ వ్యూహానికి బలైపోయేవారు. ఆస్ట్రేలియాను వారి హోమ్ గ్రౌండ్‌లో ఓడించడం కష్టం చాలా అనుకోడానికి ఇది ఒక కారణం.

విరాట్ కోహ్లీ ఆ స్లెడ్జింగ్‌నే తన కవచంగా మలుచుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు తనపై కామెంట్లు చేసినపుడు అతడు వాటిని వారికే తిరిగి అప్పగించేవాడు. అదే సమయంలో అతడి బ్యాట్ కూడా వారికి గట్టిగానే సమాధానం చెబుతూ వచ్చేది.

ప్రత్యర్థి బౌలర్లను పూర్తిగా చదివేసిన కోహ్లీ, ఆస్ట్రేలియాలో తన ఆధిపత్యం చూపించాడు. అక్కడి మైదానాలు, పిచ్‌ల గురించి విరాట్‌కు చాలా బాగా తెలుసు.

వాటికి తగ్గట్టు, తన బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి మార్పులు తీసుకురావాలో కూడా అతడికి తెలుసు.

ఎప్పుడు ఏ షాట్ ఆడాలి, స్కోర్ బోర్డ్ పరుగులు తీసేలా భాగస్వామ్యాలు ఎంత అవసరం అతడికి ఇంకా బాగాతెలుసు.

అందుకే కోహ్లీ ఆస్ట్రేలియా స్లెడ్జింగ్ ఆస్వాదించాడు. వారి నోటి దుడుకు చూసి జంకడానికి బదులు దాన్నుంచే ప్రేరణ పొందాడు.

ఫొటో సోర్స్, Quinn Rooney

చెడిపోయిన పిల్లాడు కోహ్లీ

2014-15 టూర్ సమయంలో విరాట్ కోహ్లీకి 'చెడిపోయిన పిల్లాడు' అనే పేరొచ్చింది.

ఆ పర్యటనలో అందరూ గుర్తుంచుకోదగ్గ ఒక ఘటన జరిగింది. విరాట్ మిచెల్ జాన్సన్ వేసిన ఒక బాల్‌ను కోహ్లీ డిఫెన్స్ ఆడాడు. ఆ బాల్ జాన్సన్ పక్కకు వెళ్లింది. అతడు దాన్ని పరుగు తీసేందుకు ప్రయత్నించిన కోహ్లీ వైపు విసిరాడు. ఆ బాల్ తగలడంతో కోహ్లీ కింద పడిపోయాడు. అప్పుడు కోహ్లీ అతడివైపు చాలా కోపంగా చూశాడు. ఎంత కోపంగా అంటే ఆ దెబ్బకు జాన్సన్ వెంటనే సారీ చెప్పాల్సివచ్చింది.

కొన్ని నిమిషాల్లోనే బాల్ కోహ్లీ బ్యాట్ అంచును తాకి బౌండరీకి వెళ్లింది. అది కోహ్లీ, జాన్సన్ మధ్య మాటల యుద్ధాన్ని రగిల్చింది. తర్వాత వాట్సన్, హడిన్ కూడా కోహ్లీని పెవిలియన్‌కు పంపలేకపోయారు. తర్వాత కూడా కోహ్లీ, జాన్సన్ కత్తులు దూశారు. చివరికి.. అంపైర్ జోక్యంతో ఇద్దరూ కూల్ అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ చెప్పిన మర్యాద కథ (2014 డిసెంబర్ 28)

జాన్సన్ ప్రవర్తనకు విరాట్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

"మీరు రనౌట్ చేయాలని అనుకుంటే బాల్‌తో స్టంప్స్‌ను కొట్టండి. నా శరీరాన్ని కాదు. అలా చేసి మీ ముందు ఉన్న వ్యక్తికి మీ సందేశం చేర్చాలనుకోవడం అవసరమా. ఎవరైనా ఏదైనా అంటుంటే నేను వింటూ, నోర్మూసుకుని కూచోను. నేనిక్కడ క్రికెట్ ఆడ్డానికి వచ్చాను, అది చేస్తాను. నాపై గౌరవం చూపించనివారిని నేనెందుకు గౌరవించాలి" అని ఆరోజు విరాట్ అన్నాడు.

స్లెడ్జింగ్ ఎలా రివర్స్ అవుతుందో కూడా విరాట్ చెప్పాడు.

"మీరు నన్ను అసహ్యించుకుంటే, అది నాకిష్టమే. మైదానంలో మాటల యుద్ధానికి నేను వ్యతిరేకం కాదు. అది నాకు సాయం చేస్తుంది. నాకు ఆస్ట్రేలియాతో ఆడడం ఇష్టం. ఎందుకంటే వాళ్లు ప్రశాంతంగా తమ ఆట ఆడలేరు. నాకు మాటల యుద్ధం ఇష్టమే. అవి నాకు ఆడ్డానికి శక్తినిస్తాయి. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా నాలో ప్రేరణను నింపుతాయి. కానీ వాళ్లు మాత్రం దీన్నుంచి ఎలాంటి పాఠాలూ నేర్చుకోరు" అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియా ప్రేక్షకులతో యుద్ధం( 2012 జనవరి 5)

ఆస్ట్రేలియా ప్రేక్షకులు తమ జట్టును ఉత్సాహపరచడంలో ముందుంటారు. కానీ ప్రత్యర్థి ఆటగాళ్లను కూడా రెచ్చగొడుతూ అవతలి జట్టుకు చికాకు తెప్పించాలనుకుంటారు.

భారత జట్టు ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఆ టూర్‌లో ఘోరంగా ఓడింది. అదే పర్యటనలో కోహ్లీ ఒకసారి బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు.

అప్పుడే ఒక ఆస్ట్రేలియా అభిమాని అతడిని ఏదో కామెంట్ చేశాడు. అతడికి కోహ్లీ తన మధ్య వేలు చూపించాడు.

అప్పుడు, తన ప్రవర్తనను సమర్థించుకున్న కోహ్లీ.. "ఆటగాళ్లు ఇలా స్పందించకూడదు. కానీ, ప్రేక్షకులు, అభిమానులు అసభ్యకరమైన భాషలో ఏవైనా అంటుంటే, మేం ఏం చేయాలి. అతడు నేనిప్పటివరకూ విననంత ఘోరంగా కామెంట్ చేశాడు. అది చాలా విపరీత మనస్తత్వం" అన్నాడు.

ఆ దృశ్యం మెల్లగా మారుతూ వచ్చింది.

ఆస్ట్రేలియా అభిమానులు కూడా ఇప్పుడు కష్టపడి ఆడే విరాట్ కోహ్లీని ఇష్టపడుతున్నారు. అతడి ఆస్ట్రేలియా అభిమానుల సంఖ్య కూడా చాలా పెరిగింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫాల్కనర్-స్మిత్-వార్నర్‌తో వాదన

"నువ్వు నీ శక్తి వృథా చేసుకుంటున్నావ్. దానివల్ల నీకెలాంటి ప్రయోజనం లేదు. నేను నా జీవితానికి సరిపడా మిమ్మల్ని ఆడేసుకున్నా. పో.. వెళ్లి బౌలింగ్ చెయ్" ఇది ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫాల్కనర్‌తో కోహ్లీ అన్న మాటలు.

ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ డేవిడ్ వార్నర్‌, రన్ మెషిన్ స్టీవ్ స్మిత్‌ను కూడా విరాట్ వదిలి పెట్టలేదు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. అలాంటి ఘటనలు విరాట్‌ దృష్టిని మరల్చలేవు.

ఆస్ట్రేలియాలో 'చేజ్ మాస్టర్' ఇమేజ్

భారత్ ప్రత్యర్థి స్కోరును చేజ్ చేయాల్సిన ప్రతిసారీ విరాట్ ఎప్పుడూ మెరుగైన ప్రదర్శన చూపించాడు. చేజింగ్ మ్యాచుల్లో కోహ్లీ బ్యాటింగ్ గణాంకాలు ఎప్పుడూ అద్భుతంగానే నిలిచాయి.

ఫొటో సోర్స్, Getty Images

స్కోరును చేజ్ చేసేటపుడు కోహ్లీ మైదానంలో చెలరేగిపోవడం కూడా ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోనే జరిగింది. మూడు దేశాల టోర్నమెంటులో శ్రీలంకపై కోహ్లీ 113 పరుగులు చేశాడు.

దాన్ని వన్డే క్రికెట్ చరిత్రలో బెస్ట్ ఫినిషింగ్ బ్యాటింగ్‌లో ఒకటిగా చెబుతారు. ఆ మ్యాచ్‌లో విరాట్ లసిత్ మలింగ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.

మీడియా నిపుణులకు లక్ష్యం

ఆస్ట్రేలియాలో జరిగే ప్రతి సిరీస్‌కు ముందు ప్రత్యర్థి జట్టులోని ప్రధాన ఆటగాళ్లు చాలా రకాలుగా లక్ష్యం అవుతుంటారు. ఆస్ట్రేలియా మీడియా కూడా విరాట్ ప్రవర్తన గురించి చాలాసార్లు కథనాలు ప్రచురించింది.

విరాట్ కోహ్లీ గురించి ఎప్పుడూ ఎక్కువగా చర్చ జరిగినా, అతడి ప్రదర్శన కూడా ఆ స్థాయిలో మెరుగ్గా ఉంటుందనేది స్పష్టం అవుతూనే ఉంది.

ఇప్పుడు తాజా సిరీస్‌లో కూడా అందరి దృష్టీ విరాట్ కోహ్లీపైనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియా పిచ్‌లపై లోతైన అవగాహన

ఆస్ట్రేలియాలో బంతి తీవ్రంగా బౌన్స్ అవుతుంది. బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోకపోతే ఆ బౌన్సర్లు బ్యాట్స్‌మెన్‌ను తాకుతాయి. విరాట్ టెక్నిక్ అలాంటి పరిస్థితులకు తగ్గట్టే ఉంటుంది.

బౌలర్లకు దొరికిపోకుండా బ్యాట్స్‌మెన్లు బౌన్సర్లను పుల్, హుక్ షాట్లు కొట్టే నైపుణ్యం అతడిలో ఉంది.

కానీ, ఆస్ట్రేలియా బౌలర్ల ఫాస్ట్ బౌలింగును ఎదుర్కోడానికి విరాట్ కోహ్లీ దగ్గర ఇంకో టెక్నిక్ కూడా ఉంది.

మిగతా దేశాల్లో సులభంగా బౌండరీని తాకే భారీ షాట్లకు ఆస్ట్రేలియా మైదానాల్లో రెండు మూడు పరుగులు మాత్రమే వస్తాయి. అందుకే ఆ మెరుగైన టెక్నిక్‌ను 'వికెట్ల మధ్య పరిగెత్తడం'.

వికెట్ల మధ్య పరిగెత్తడంలో కోహ్లీ టాలెంట్ తిరుగులేనిది. కోహ్లీ ఆఫ్ స్టంప్‌కు దూరంగా నిలబడే ప్లేయింగ్ స్టైల్‌కు అలవాటు పడ్డాడు.

అంటే అలా అవుటయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అందుకే గత పదేళ్లలో ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్స్‌లో కోహ్లీ కూడా నిలిచాడు.

ఈ ఘనతను సాధించడానికి విరాట్ చాలా కష్టపడ్డాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)