తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌: లగడపాటి రాజగోపాల్ పోల్‌లో కాంగ్రెస్ కూటమి, మిగిలిన పోల్స్‌లో టీఆర్ఎస్

  • 7 డిసెంబర్ 2018
తెలంగాణ ఎగ్జిట్ పోల్స్

తెలంగాణలో పోలింగ్ ముగియడంతో.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థల్లో అత్యధికం టీఆర్ఎస్ ఆధిక్యాన్ని సూచించగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం ప్రజాకూటమి ఆధిక్యంలో ఉంటుందని చెప్పారు.

రాష్ట్ర ఏర్పాటు తరువాత తొలి ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ఏర్పాటు చేయగా కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. నాలుగేళ్ల మూడు నెలల పాలన తరువాత ఆయన శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

పోలింగ్ ముగిసిన వెంటనే.. ఏ పార్టీకెన్ని సీట్లు రాబోతున్నాయి.. ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అనే అంచనాలతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఏ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో మరొక్కసారి..

క్రమ సంఖ్య సంస్థ టీఆర్ఎస్ కాంగ్రెస్+ ఇతరులు(బీజేపీతో కలిపి)
1 లగడపాటి సర్వే 35(+/-10) 65(+/-10) 10 నుంచి 18(ఎంఐఎం 6-7)
2 రిపబ్లిక్ టీవీ జన్‌కీ బాత్ సర్వే 50-65 38-52 12 నుంచి 21
3 టైమ్స్ నౌ-సీఎన్‌ఎక్స్ 66 37 16
4 ఆరా సర్వే 75-85 25-35 9-11
5 ఇండియా టుడే 79-91 21-33 5-10
6 న్యూస్ ఎక్స్-ఐటీవీ-నేతా 57 46 16
7 రిపబ్లిక్ టీవీ- సీఓటర్ 48-60 47-59 6-13

తెలంగాణ రాష్ర్టంలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 60 సీట్లు అవసరం.

"లగడపాటి అంచనాలే వాస్తవానికి దగ్గర"

జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తోందని సామాజిక, రాజకీయ విశ్లేషకులు తుంగ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేత‌ృత్వంలో కూటమి ఏర్పాటు కాకముందు ఉన్న అంచనాలను జాతీయ మీడియా పరిగణనలోకి తీసుకున్నట్లు అనిపిస్తోందన్నారు.

"విపక్షాలు బలహీనంగా ఉన్నాయని, వాటిని ఇప్పుడైతేనే దెబ్బకొట్టే వీలుంటుందని కేసీఆర్ భావించారు. అందుకే, ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కాంగ్రెస్, టీడీపీ కలుస్తాయని ఆయన ఊహించి ఉండరు. కానీ, తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న శక్తులన్నీ ఏకమయ్యాయి. ఆ కూటమి అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చింది. దాంతో అంచనాలు మారిపోయాయి. జాతీయ మీడియా ఈ అంచనాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన అంచనాలే వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. అలా అని కేసీఆర్ అధికారం కోల్పోతారని కూడా చెప్పలేం" అని లక్ష్మీనారాయణ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)