తెలుగు రాష్ట్రాల్లో ప్రాణాలు తీస్తున్న గాలి: ‘గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో 45,525 మంది, తెలంగాణలో 26 వేల మంది మృతి’ - లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయనం

  • 7 డిసెంబర్ 2018
కాలు Image copyright Getty Images

మనం పీల్చే గాలిలో కంటికి కనిపించని మృత్యువు దాగుంది. దాని వల్ల దేశంలో ఏటా దాదాపు 12.4 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ సంఖ్య 71వేల పైమాటే. ఆ మృత్యువు పేరే వాయు కాలుష్యం.

ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే గాలి నాణ్యత విషయంలో తెలుగు రాష్ట్రాలు మెరుగ్గానే ఉన్నా, వాయు కాలుష్యం సంబంధిత మరణాల సంఖ్య మాత్రం ఆందోళనకరంగానే ఉంది.

దేశంలో ప్రజల మరణాలు, ఆరోగ్యం, ఆయుర్థాయంపై వాయు కాలుష్యం ప్రభావం గురించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్), పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ), ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూష్ (ఐహెచ్ఎంఈ)లు సమగ్ర అధ్యయనం నిర్వహించాయి.

ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా గాలి కాలుష్యం కారణంగా ప్రజలు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని ఆ అధ్యయన నివేదిక చర్చించింది.

ఆ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం కారణంగా 2017లో ఆంధ్రప్రదేశ్‌లో 45,525 మంది ప్రాణాలు కోల్పోగా, తెలంగాణలో 26 వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే గతేడాది ఆంధ్ర ప్రదేశ్‌లో చనిపోయిన 70ఏళ్ల లోపు వ్యక్తుల్లో 48.7శాతం మరణాలకు ఏదో ఒక రూపంలో గాలి కాలుష్యమే కారణమైంది. తెలంగాణలో ఆ సంఖ్య 50.4శాతంగా ఉంది.

నగరాల్లో పరిశ్రమలు, వాహనాలు తదితర కారణాల వల్ల విడుదలయ్యే కాలుష్యం స్థాయిలోనే గ్రామాల్లో వంట చెరకు వల్ల వ్యాపించే కాలుష్యం కూడా ఉంటోంది. గతేడాది అలా ఇంట్లో నుంచి విడుదలయ్యే (ప్రధానంగా కట్టెల పొయ్యి) కాలుష్యం కారణంగా ఆంధ్ర ప్రదేశ్‌లో 19,345మంది చనిపోతే, తెలంగాణలో 8,789 మంది చనిపోయారు.

Image copyright Getty Images

వంటింటి కాలుష్యం ఉత్తరాది కంటే తక్కువే

ఉత్తరాధి రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కట్టెల పొయ్యి వినియోగం చాలా తక్కువ. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఒడిశా, బిహార్‌ లాంటి రాష్ట్రాల్లో 68 శాతానికి పైగా ప్రజలు ఇప్పటికీ కట్టెల పొయ్యిపైనే ఆధారపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ సంఖ్య 20-32 శాతం మధ్యలోనే ఉంది.

మొత్తంగా వాతావరణంలో హానికరమైన పీఎం 2.5 రేణువులు ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే ఎక్కువున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక క్యూబిక్ మీటర్లో 20-39 మైక్రోగ్రాముల మధ్య పీఎం 2.5 రేణువులుంటే, తెలంగాణలో ఆ సంఖ్య 40-59.9 మీటర్ల మధ్య ఉంది.

ఈ వాయు కాలుష్యం ప్రభావం మనిషి ఆయుర్థాయంపైనా తీవ్రంగా పడుతోంది. 2017లో ఆంధ్రప్రదేశ్‌లో సగటు ఆయుర్థాయం 71ఏళ్లుంటే, గాలి కాలుష్యం ఈ స్థాయిలో లేకపోయుంటే ఆ సగటు మరో 1.4ఏళ్లు ఎక్కువగా ఉండేదని, తెలంగాణలో 71.5ఏళ్లుగా ఉన్న సగటు ఆయుర్థాయం కూడా 1.3 ఏళ్ల మేర పెరిగి ఉండేదని లాన్సెట్ అధ్యయనం చెబుతోంది.

మొత్తంగా కలుషితమైన గాలి ఏటా తెలుగు రాష్ట్రాల్లో వేలాది ప్రాణాలు తీస్తోందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

Image copyright Getty Images

దేశ వ్యాప్తంగా పరిస్థితి ఏంటి?

  • దేశంలో గతేడాది సంభవించిన ప్రతి 8 మరణాల్లో ఒక మరణానికి గాలి కాలుష్యమే కారణం. మొత్తంగా 12.4లక్షల మందికి పైగా భారతీయులు గతేడాది వాయు కాలుష్యం సంబంధిత పరిణామాల వల్ల చనిపోతే, అందులో అత్యధిక భాగం 70ఏళ్ల లోపు వారే ఉన్నారు.
  • గాల్లో కాలుష్యం సాధారణ స్థాయిలో ఉండుంటే దేశంలో ప్రజల ఆయుర్థాయం మరో 1.7ఏళ్ల మేర పెరిగుండేది.
  • పొగాకు కంటే ఇప్పుడు వాయు కాలుష్యమే దేశంలో ఎక్కువ వ్యాధులకు కారణమవుతోంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె పోటు, మధుమేహం లాంటి సమస్యలకు అది దారితీస్తోంది.
  • దేశంలో 77శాతం మంది ప్రజలు సాధారణ స్థాయికంటే ఎక్కువ కాలుష్యం బారిన పడుతున్నారు. ఉత్తర భారతంలో ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది.
  • ప్రపంచ వ్యాప్తంగా సంభవించే మొత్తం ప్రిమెచ్యుర్ మరణాల్లో 26శాతం భారత్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 18 శాతమే.
  • గతేడాది దేశంలో 56 శాతం ప్రజలు కట్టెల పొయ్యిపై ఆధారపడే వంట చేశారు. అయితే భారత్‌లో క్రమంగా కట్టెల పొయ్యి వినియోగం తగ్గుతోంది. గాలి నాణ్యత మెరుగవ్వాలంటే ఈ పరిస్థితి ఇలానే కొనసాగాలని అధ్యయనకర్తలు సూచిస్తున్నారు.
  • వాహనాలు, నిర్మాణాలు, పరిశ్రమలు, విద్యుత్ కేంద్రాలు, వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం, డీజిల్ జనరేటర్లు లాంటి వాటిని నియంత్రించగలిగితే క్రమంగా వాయు కాలుష్యానికి పరిష్కారం కనుగొనొచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)