పవన్ కళ్యాణ్: నా పెళ్లిళ్ల గురించి మాట్లాడితే రోడ్డుపై నిలబెడతా- ప్రెస్ రివ్యూ

  • 7 డిసెంబర్ 2018
పవన్ Image copyright JANASENAPARTY/FB

తాను చేసుకున్న పెళ్లిళ్ల గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, తన జోలికి వస్తే వారిని రోడ్డుపైకి తెచ్చి నిలబెడతానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారని ఆంధ్రజ్యోతి రాసింది.

అనంతపురం జిల్లాలో ఐదోరోజు పర్యటనలో భాగంగా ఆయన గురువారం సాయంత్రం గుంతకల్లులో మూతబడిన ఏసీఎస్‌ మిల్లు ఎదుట బహిరంగ సభను నిర్వహించారు. అంతకుముందు అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు.

‘‘జగన్‌పై కోడికత్తితో దాడి జరిగితే టీడీపీవారు ఆయన తల్లిపై అభాండాలు వేశారు. నేను తీవ్రంగా వ్యతిరేకించాను. జగన్‌ తల్లిని నేను గౌరవించాను. కానీ ఆయన నా వివాహాలను అడ్డుపెట్టుకుని తిడుతున్నారు. జగన్‌ జైలుకెళ్లడానికి నేనే కారణమా? రాష్ట్ర విభజనకు, అవినీతికి అన్నిటికీ నేనా కారణం.. ఏం పిచ్చిపిచ్చిగా ఉందా. నా జోలికి వస్తే నడిరోడ్డుపై నిలబెడతా జాగ్రత్త’’ అని పవన్ తేల్చిచెప్పారు. వైసీపీకి ఓటేయకుంటే ప్రజలనైనా తిడతారా అని నిలదీశారు.

‘‘ఎమ్మెల్యేలు అందరూ వెళ్లిపోయినా.. నాయకుడు ఒక్కడైనా ఒంటరి పోరాటం చేయాలి.. తన పార్టీ ఎమ్మెల్యేలంతా టీడీపీలోకి వెళ్లిపోయారని జగన్‌ పాదయాత్ర చేసుకుంటూ పోతుంటే అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రశ్నించేదెవరు’’ అని పవన్‌ అంతకుముందు అనంతపురంలో అన్నారు.

‘‘ఎమ్మెల్యేలను అధికారపార్టీ వారు కొన్నారని పంతానికి పోయి అసెంబ్లీకి వెళ్లబోమంటే ఎలా? పంతాలు పట్టింపులకు పోవడానికి ఇదేమీ సినిమా కాదు. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనడం నీచమైన పని. గతంలో వైఎస్‌ అధికారంలో ఉన్నపుడూ అదేపని చేశారు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.

తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయం వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు.

Image copyright Getty Images

నాలుగేళ్లలో 5జీ సేవలు: ట్రాయ్

ప్రపంచవ్యాప్తంగా 5జీ టెలికం సర్వీసులపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో 2022 నాటికల్లా దేశీయంగా కూడా ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నట్లు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ కార్యదర్శి ఎస్‌.కె.గుప్తా చెప్పారని సాక్షి తెలిపింది. ఆ పై ఐదేళ్లలో డిజిటల్‌ మాధ్యమం మరింతగా అందుబాటులోకి వస్తుందన్నారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటా అనలిటిక్స్‌ వంటివి వినియోగదారుల ధోరణుల్లో మార్పులు తేగలవని గుప్తా చెప్పారు. ''కొన్నాళ్లుగా మీడియా పరిశ్రమలో నాటకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆయా సంస్థలు నిలదొక్కుకోవడానికి కొత్త టెక్నాలజీని వినియోగించటమనేది కీలకంగా మారుతోంది'' అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో గుప్తా వ్యాఖ్యానించారు.

మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ సర్వీసులకు 5జీ సేవలు ఉపయోగపడతాయి. అలాగే, తయారీ, రిటైల్, విద్య, వైద్యం తదితర రంగాల వృద్ధికి గణనీయంగా తోడ్పడే అవకాశం ఉంది.

5జీతో జీడీపీ రెట్టింపు: అరుణ సుందరరాజన్‌

స్థూల దేశీయోత్పత్తిని రెట్టింపు చేయగలిగే సత్తా 5జీ సేవలకుదన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ టెలికం ఇన్‌ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ చెప్పారు.

అంతర్జాతీయంగా టెలికం రంగంపై పెట్టుబడులు 4 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనున్నాయని, ఒక్క చైనాయే డిజిటల్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ఫ్రా ఏర్పాటుపై ఏటా 188 బిలియన్‌ డాలర్లు వెచ్చిస్తోందని ఆమె తెలిపారు.

కేవలం 5జీకే చైనా బడ్జెట్‌ సుమారు 500 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉందన్నారు. బ్రాడ్‌ బ్యాండ్‌ ఇండియా ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అరుణ ఈ విషయాలు చెప్పారు.

తల్లి పేరుకూ పాన్‌లో అవకాశం

పాన్‌ (శాశ్వత ఖాతా సంఖ్య)కు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు వచ్చాయని, పాన్‌లో తల్లి పేరునూ పేర్కొనేందుకు అవకాశం కల్పించారని ఈనాడు తెలిపింది.

తండ్రి పేరు తప్పనిసరి కాదు: పాన్‌ కార్డులో వ్యక్తి పేరుతోపాటు అతని/ఆమె తండ్రి పేరు ఇక నుంచి తప్పనిసరి కాదు. తండ్రి పేరుకు బదులు తల్లి పేరును కూడా పేర్కొనవచ్చు. అంటే, పాన్‌ దరఖాస్తుదారు కార్డు మీద తండ్రి పేరు ఉండాలా? తల్లి పేరు ఉండాలా? అనేది నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ ఒంటరి తల్లి ఉన్న సందర్భాల్లో తండ్రి పేరు పేర్కొనకుండా 'సింగిల్‌ మదర్‌' ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చు. కొత్త దరఖాస్తు ఫారాలు ఆదాయపు పన్ను వెబ్‌సైటులో అందుబాటులోఉన్నాయి.

రూ.2,50,000 లావాదేవీ దాటితే: ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 139ఏకి చేసిన సవరణల ప్రకారం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు కాకుండా.. హిందూ అవిభాజ్య కుటుంబం, సంస్థ, ట్రస్టుల్లాంటివి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000 మించి లావాదేవీలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా పాన్‌ పేర్కొనాల్సిందే. గతంలోనే దీనికి సంబంధించిన నిబంధనలు వచ్చినప్పటికీ.. పాన్‌ సమర్పణకు చివరి తేదీ ఎప్పుడన్నది పేర్కొనలేదు. తాజాగా ఈ తేదీని వచ్చే ఆర్థిక సంవత్సరం మే 31గా ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. అంటే.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.రెండున్నర లక్షల లావాదేవీ నిర్వహిస్తే మే 31, 2019లోగా పాన్‌ సమర్పించాల్సి ఉంటుందన్నమాట.

వ్యక్తులుగా ఉన్నప్పటికీ.. సంస్థలకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌, భాగస్వామి, ట్రస్టీ, వ్యవస్థాపకుడు, కర్త, ముఖ్య కార్య నిర్వహణాధికారి, ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌ తదితర హోదాల్లో పనిచేస్తూ, వాటి తరఫున లావాదేవీలు నిర్వహించినప్పుడూ పాన్‌ పేర్కొనాలి. అయితే, లావాదేవీలు రూ.2,50,000 పైబడి ఉండాలి. ఇప్పటివరకూ పాన్‌ లేకపోతే పైన పేర్కొన్న నిబంధనలే వర్తిస్తాయి.

Image copyright Getty Images

తొలిసారి ఓటు వేయనున్న గద్దర్

ప్రజాయుద్ధ నౌకగా 'విప్లవాభిమానులు' పిల్చుకునే గద్దర్ తన జీవితంలో తొలిసారిగా శుక్రవారం ఓటుహక్కును వినియోగించుకోనున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

చాలా ఏళ్ల పాటు ఓటు కూడా నమోదు చేయించుకోని ఆయన ఇటీవలే తన ఓటును నమోదు చేయించుకున్నారు. ఓటరు జాబితా ప్రకారం మల్కాజిగిరి నియోజకవర్గంలో జి.విఠల్ పేరుతో ఆయన ఓటు నమోదైంది.

అంబేడ్కర్‌ ఇచ్చిన ఓటుహక్కును తాను తొలిసారి వినియోగించుకోనున్నట్లు ఆయన గురువారం తెలిపారు. ఓటుహక్కు కూడా ఒక పోరాట రూపమేనని, ఓట్లయుద్ధంలో పోరాడదామని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)