తెలంగాణ ఎన్నికలు: పోలింగ్ నుంచి ఎగ్జిట్ పోల్స్ వరకు

  • 7 డిసెంబర్ 2018
మహేశ్ బాబు Image copyright Twitter
చిత్రం శీర్షిక ఓటేయడానికి వస్తున్న మహేశ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించారు.

క్రమ సంఖ్య సంస్థ టీఆర్ఎస్ కాంగ్రెస్+ ఇతరులు(బీజేపీతో కలిపి)
1 లగడపాటి సర్వే 35(+/-10) 65(+/-10) 10 నుంచి 18(ఎంఐఎం 6-7)
2 రిపబ్లిక్ టీవీ జన్‌కీ బాత్ సర్వే 50-65 38-52 12 నుంచి 21
3 టైమ్స్ నౌ-సీఎన్‌ఎక్స్ 66 37 16
4 ఆరా సర్వే 75-85 25-35 9-11
5 ఇండియా టుడే 79-91 21-33 5-10
6 న్యూస్ ఎక్స్-ఐటీవీ-నేతా 57 46 16
7 రిపబ్లిక్ టీవీ- సీఓటర్ 48-60 47-59 6-13

మరోవైపు మధ్యప్రదేశ్‌లో 104 నుంచి 122 సీట్లు కాంగ్రెస్‌కి, 102 - 120 సీట్లు బీజేపీకి వస్తాయని యాక్సిస్ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.

టైమ్స్ నౌ సీఎన్ ఎక్స్ ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి 126 సీట్లు వస్తాయని కాంగ్రెస్‌కి 89 సీట్లు వస్తాయని తెలిపింది.

ఈ నెల 11న ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. ఆరోజే తుది ఫలితాలు వెల్లడి అవుతాయి.

మరోవైపు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నిలుచుని ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.

కేసీఆర్ చింతమడకలో ఓటేశారు. గద్దర్ తొలిసారి ఓటేశారు. సినీ ప్రముఖుల్లో చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 56.17 శాతం పోలింగ్ నమోదైంది. బెల్లంపల్లిలో అత్యధికంగా 69.54 శాతం నమోదైంది.

పోలింగ్ ముగిశాఖ సీఈవో రజత్‌ కుమార్ విలేఖర్లతో మాట్లాడారు. అయిదింటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 67 శాతం పోలింగ్ నమోదైందని గతేడాది ఈ శాతం 69.05 అని వివరించారు.

ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?

మొత్తం 32,574 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 119 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన 1,821 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

అయితే, ఓటింగ్ శాతం పెరుగుతుండడంతో ఇది ఎలాంటి ఫలితాలను ఇవ్వనుందనే చర్చ ప్రజల్లో జరుగుతోంది.

Image copyright UGC
చిత్రం శీర్షిక కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

4.30:నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Image copyright facebook/CEOTelangana
చిత్రం శీర్షిక వనపర్తి కలెక్టర్ శ్వేతా మొహంతి

03.40:

వనపర్తి కలెక్టర్ శ్వేతా మొహంతి ఆ జిల్లాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

03.15:

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగంచుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని నవీపేట మండలం పొతంగల్ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో కవిత ఓటు వేశారు.

03.10:

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

03.00:

మధ్యాహ్నం 3 గంటలకు 56.17 శాతం ఓటింగ్ నమోదైంది.

02.20:

తన నియోజకవర్గంలో చాలా ఓట్లను అక్రమంగా తొలగించారని గోషా మహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

02.00:

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో ఓటేసిన సానియా మీర్జా

Image copyright UGC

01.40:

సిద్ధిపేట జిల్లా చింతమడకలో కేసీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన ఆయన ఓటు వేసిన అనంతరం స్థానికులతో మాట్లాడారు.

Image copyright UGC

1.25:

సూర్యాపేట జిల్లా రంగాపురం తండా ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు.

మధ్యాహ్నం 1.00 గంట:

47.8 శాతం పోలింగ్ పూర్తయింది.

మధ్యాహ్నం 1.00 గంట:

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

12.40

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

12.35:

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఓటేయడానికి వచ్చిన వృద్ధుడు ఒకరు క్యూలోనే మృతిచెందారు.

12.20:

టీఆర్ఎస్ నేత కేటీఆర్ ఓటేశారు. ‘నేను ఓటేశాను. మీరు వేశారా?’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా ఆయన ఓటేయడానికి వెళ్లినప్పుడు అక్కడ పోలింగ్ సిబ్బంది కోరిక మేరకు వారి ఫోన్‌తో సెల్ఫీ దిగారు.

11.50

సంతృప్తికరంగా ఓటింగ్ ప్రక్రియ: సీఈఓ రజత్‌కుమార్

తెలంగాణలో ఓటింగ్ ప్రక్రియ సంతృప్తికరంగా కొనసాగుతోందని.. శాంతిభద్రతలు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ చెప్పారు. ఓటర్లను భయపెట్టే సంఘటనలేవీ లేవన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 310 బ్యాలట్ యూనిట్లు, 281 ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, 469 వీవీపీటీలు పనిచేయకపోవటంతో వాటిని మార్చినట్లు చెప్పారు.

11.35:

ప్రజాస్వామ్యాన్ని సుసంపన్నం చేయడం కోసం తెలంగాణ ప్రజలంతా ఓటేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.

11.25:

ఓటరు ఐడీ ఉంది.. జాబితాలో నా పేరు లేదు.. ఎలక్షన్ కమిషన్‌కు థాంక్స్: ఐపీఎస్ అధికారి టి.కృష్ణప్రసాద్

రైల్వేలు, రోడ్డు భద్రత అదనపు డీజీపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కొద్దిసేపటి కిందట ట్విటర్ వేదికగా తెలంగాణ ఎన్నికల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆగ్రహించారు. తనకు ఓటరు గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ తన పేరు జాబితాలో లేదన్న కారణంతో అధికారులు తనను ఓటేయకుండా అడ్డుకున్నారని ఆయన ట్విటర్‌లో తన ఓటర్ ఐడీ సహా పోస్ట్ చేశారు.

11.20

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తన పేరు ఓటరు జాబితాలో గల్లంతైందని.. ఆన్‌లైన్‌లో తాను చెక్ చేసుకుంటే కనిపించలేదని ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు.

Image copyright facebook/GuttaJwala

11.20:

వరంగల్ జిల్లా పైడిపల్లిలో ఓటేయడానికి వచ్చిన 60 ఏళ్ల వృద్ధుడు క్యూలో ఉండగా మృతిచెందాడు.

11.15:

కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌పై దాడి. బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని వంశీచంద్ ఆరోపించారు. అయితే, ఈ దాడికి, తమ పార్టీకీ సంబంధం లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం వంశీచంద్ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

11.05:

11 గంటల సమయానికి తెలంగాణలో ఓటింగ్ శాతం 23.16

11.00

ఓటేసిన ప్రజాగాయకుడు గద్దర్. జీవితంలో అత్యధిక సమయం ఉద్యమాల్లో నడిచిన గద్దర్ తొలిసారి ఓటేశారు.

వ్యవస్థపై పోరాటానికి ఓటు కూడా ఆయుధమేనని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

చిత్రం శీర్షిక గద్దర్

10.55:

జాయింట్ సీఈవో తెలంగాణ అమ్రపాలితో బీబీసీ తెలుగు ఫేస్‌బుక్ లైవ్‌ను ఇక్కడ చూడండి.

10.40:

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ యూరో కిడ్స్ స్కూల్‌లో ఓటేసిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, సినీ నటి విజయశాంతి, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్

10.35:

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో బారులు తీరిన ఓటర్లు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి నాగూరావు నామాజీ బరిలో ఉన్నారు.

చిత్రం శీర్షిక కొడంగల్‌లో బారులుతీరిన ఓటర్లు

10.25:

సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీ హిల్స్‌లోని 148వ నంబర్ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Image copyright facebook/MegastarChiranjeevi

ఉదయం 10.00:

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతన్గల్ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేయడానికి వచ్చిన టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత.

Image copyright Twitter/KavithaKalvakuntla

ఉదయం 09:50

హైదరాబాద్‌ శాస్త్రినగర్‌లోని మైలర్‌దేవ్‌పల్లిలో ఓటు వేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

ఓటరు జాబితాలో మీ పేరు చూసుకోవటం ఎలా?

ఓటరు గుర్తింపు కార్డులను మీసేవా కేంద్రాల నుంచి పొందవచ్చు.

ఇంటర్నెట్‌లో జాతీయ ఓటరు సర్వీసుల పోర్టల్ https://electoralsearch.in/ లో ఓటును చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైటును ఓపెన్ చేసి, అందులో పేరు, తండ్రి / భర్త పేరు, వయసు / పుట్టిన తేదీ, స్త్రీ/పురుష/ఇతరులు లింగ వివరాలను సంబంధిత కాలమ్‌లలో ఎంటర్ చేయాలి.

తర్వాత రాష్ట్రం, జిల్లా, శాసనసభ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన బాక్సులో అక్కడ చూపిన కోడ్ ఎంటర్ చేసి వివరాలు పొందవచ్చు.

తెలంగాణ సీఈవో ఓటరు జాబితా వెబ్‌సైట్‌ http://ceoaperms.ap.gov.in/ts_search/search.aspx లో కూడా మీ ఓటు వివరాలను చూసుకోవచ్చు.

ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో మీ జిల్లాను, అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి.

ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబరు కానీ, పేరు కానీ సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసి సెర్చ్ చేయవచ్చు.

మొబైల్‌లో 'నా ఓటు(Naa Vote) ' యాప్ ద్వారా ఓటర్లు తమ ఓట్లు ఎక్కడ ఉన్నాయి, నియోజకవర్గం వివరాలను మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవటానికి ఎన్నికల సంఘం 'నా ఓటు' అనే యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా.. ఓటర్లు తమ ఓటు వివరాలు, నియోజకవర్గం సమాచారం, పోటీచేస్తున్న అభ్యర్థుల జాబితా, వాలంటీర్ల సమాచారం, తెలుసుకోవచ్చు. వికలాంగులు, వృద్ధులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడానికి అవసరమైన సాయమూ కోరవచ్చు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి సులవైన మార్గం కూడా తెలుసుకోవచ్చు.

9223166166 నంబరుకు ఎస్‌ఎంఎస్ పంపించటం ద్వారా కూడా పోలింగ్ బూత్ వివరాలు తెలుసుకోవచ్చు. TS <స్పేస్> VOTE <స్పేస్> ఓటరు నంబరు టైప్ చేసి మెసేజ్ పంపించాలి.

51969 నంబరుకు కూడా TS <స్పేస్> VOTE <స్పేస్> ఓటరు నంబరు టైప్ చేసి మెసేజ్ పంపటం ద్వారా కూడా వివరాలు పొందవచ్చు.

ఓటర్లు ఫిర్యాదు చేయాలనుకుంటే.. భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. హైదరాబాద్ ఓటర్లు 1800-599-2999 లేదా 1800-11-1950 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

Image copyright Facebook/Chief Electoral Officer Telangana

ఓటరు జాబితాలో పేరు ఉన్నా.. ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ఏం చేయాలి?

తెలంగాణ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకుని, ఓటరు జాబితాలో పేరు ఉండి.. ఓటరు గుర్తింపు లేకపోతే.. ఈ కింది పత్రాల్లో వేటినైనా ఉపయోగించుకుని ఓటు వేయవచ్చని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) రజత్ కుమార్ తెలిపారు.

• ఆధార్ కార్డు

• పాస్‌పోర్ట్

• పాన్ కార్డు

• డ్రైవింగ్ లెసెన్స్

• బ్యాంక్ పాస్‌బుక్

• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు

• ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు

• మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ) జాబ్ కార్డు

• జాతీయ జనాభా రిజిస్ట్రేషన్ కింద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు

• కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు

• ఎన్నికల యంత్రాంగం జారీచేసిన అధీకృత ఫొటో ఓటరు స్లిప్

ఓటరు జాబితాలో పేరు ఉండి.. పై గుర్తింపు పత్రాలు ఉన్న వారు.. తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కానీ రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు వంటి పత్రాలను ఓటు వేయటానికి గుర్తింపు పత్రాలుగా అంగీకరించరు.

Image copyright Twitter/Nagarjuna Akkineni
చిత్రం శీర్షిక ఓటు హక్కును వినియోగించుకొన్న ప్రముఖ సినీ నటుడు నాగార్జున

ఉదయం 9:10

ప్రముఖ సినీ నటుడు నాగార్జున హైదరాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ''స్నేహితులారా, ఇది ఓటు వేయాల్సిన సమయం'' అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

చిత్రం శీర్షిక చిక్కడపల్లిలో ఓటు వేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్

ఉదయం 8:40

హైదరాబాద్ చిక్కడపల్లిలోని శాంతినికేతన్ మైదానంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్

ఉదయం 8:30

హైదరాబాద్ కాచిగూడలోని పోలింగ్ బూత్ నంబరు 7లో ఓటు వేసిన బీజేపీ సీనియర్ నేత జి.కిషన్‌రెడ్డి

ఉదయం 8:15

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ బూత్ నంబరు 152 వద్ద ఓటు వేసేందుకు వరుసలో నిల్చున్న ప్రముఖ నటుడు అల్లు అర్జున్

చిత్రం శీర్షిక కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని నాగార్జున మోడల్ హై‌స్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన మహిళలు

ఉదయం 7:40

కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాల కాన్ఫిగరేషన్‌తో కుస్తీ పడుతున్న ఎన్నికల సిబ్బంది

మిగతా కేంద్రాల్లో సాఫీగా ప్రక్రియ

ఉదయం 7:25

సిద్దిపేటలో ఓటుహక్కును వినియోగించుకున్న టీఆర్‌ఎస్ నేత హరీష్ రావు దంపతులు

Image copyright Office of HarishRao
చిత్రం శీర్షిక సిద్దిపేటలో ఓటు వేసిన హరీశ్‌రావు దంపతులు

ఉదయం 7 గంటలు..

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.

హైదరాబాద్‌లోని కార్వాన్ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 7 గంటలకు ముందే పోలింగ్ బూత్‌కు చేరుకున్నారని బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ తెలిపారు.

ఈ పోలింగ్ బూత్ వద్ద చిత్రాలు ఇవి..

తొలిసారి.. ఓటు ఎవరికి పడిందో చూసుకోవచ్చు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి వీవీప్యాట్‌లను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. ఈవీఎంలకు అనుసంధానమై ఉండే వీవీప్యాట్‌లతో ఓటర్లు తాము ఎవరికి ఓటు వేశామనేది చూసుకోవచ్చు. ఓటేసిన వెంటనే తమ ఓటు ఎవరికి నమోదైందో ఓటరు వీవీప్యాట్‌లో చూసుకోవచ్చు.

వీటిపై నిషేధం

పోలింగ్‌బూత్‌లలో సెల్‌ఫోన్‌లను నిషేధించారు. అలాగే పోలింగ్ కేంద్రంలో సెల్ఫీలపై కూడా ఆంక్షలు విధించారు. మద్యం తాగి పోలింగ్ కేంద్రాలకు వస్తే అరెస్టు చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.ఓటర్లను ఎవరైనా ప్రలోభపెడితే డయల్ 100‌కు కాల్ చేయాలని ఎన్నికల సంఘం సూచించింది.

ఉర్దూ, మరాఠీలో ఓటర్ల జాబితా

హైదరాబాద్‌ జిల్లాలో ముస్లింలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి 15 నియోజకవర్గాలతో పాటు, నిజామాబాద్‌ జిల్లాలోని నిజామాబాద్‌ (అర్బన్‌) నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను ఉర్దూలో కూడా ఎన్నికల సంగం ప్రచురించింది. అలాగే, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌, నిర్మల్‌ జిల్లా ముథోల్‌, నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ నియోజకవర్గాల్లో మరాఠీ భాషలో ఓటర్ల జాబితాను వెలువరించింది.

రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలు 119
మొత్తం ఓటర్లు 2,80,64,684
పోటీ చేస్తున్న అభ్యర్థులు 1821
మొత్తం ఈవీఎంలు 55, 329
మొత్తం వీవీప్యాట్లు 42, 751
పోలింగ్ నిర్వహణ కేంద్రాలు 32,574
పోలింగ్ సిబ్బంది 1,50,023
పోలీసు బలగాలు 48,860

ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో...

టీఆర్ఎస్ 119 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ కలిసి ప్రజాఫ్రంట్‌గా ఏర్పడి పోటీకి దిగాయి. బీజేపీ 118 స్థానాల్లో పోటీలో ఉంది.

భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో యువతెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి మద్దతిచ్చిన బీజేపీ అక్కడ తన అభ్యర్థిని నిలబెట్టలేదు.

ప్రజాఫ్రంట్ తరఫున కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో పోటీ చేస్తుండగా, టీడీపీ 13 స్థానాల నుంచి టీజేఎస్ 8 స్థానాల నుంచి, సీపీఐ 3 స్థానాల నుంచి బరిలోకి దిగాయి.

బహుజన్ లెఫ్ట్ర్ ఫ్రంట్ 119 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంఐఎం 8 స్థానాల్లో బరిలోకి దిగింది.

భారీ భద్రత

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నేడు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

30 వేల రాష్ట్ర పోలీసులు, 279 కంపెనీల పారా మిలటరీ బలగాలు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నాయి.

తెలంగాణ ఎన్నికలపై కొన్ని ఆసక్తికర గణాంకాలు ఈ వీడియోలో చూడండి.

2018 తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన మరిన్ని కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)