రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రజా సంక్షేమ పథకాలు బీజేపీని గెలిపిస్తాయా? ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌కు లాభిస్తుందా?

  • 7 డిసెంబర్ 2018
వసుంధర రాజె Image copyright ANI

ఇవాళ తెలంగాణతో పాటు రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఉదయం 11.00 గంటల వరకు తెలంగాణలో 23 శాతం, రాజస్థాన్‌లో 21 శాతం పోలింగ్ నమోదైంది.

కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 6న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నవంబర్ 12, 20న రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలలో పోలింగ్ నవంబర్ 28న జరిగింది.

చివరగా ఈరోజు అంటే డిసెంబర్ 7న రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలలో పోలింగ్ జరుగుతోంది. ఈ అయిదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11న జరుగుతుంది.

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో 2013లో కన్నా కాస్త ఎక్కువగా ఈసారి 74.61 శాతం పోలింగ్ నమోదైంది. మిజోరం విషయానికి వస్తే, అక్కడ 2013 ఎన్నికలతో పోల్చినప్పుడు పోలింగ్ శాతం 83.4 శాతం నుంచి 80 శాతానికి తగ్గింది.

రాజస్థాన్‌లోని మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే, అల్వార్ నియోజకవర్గానికి చెందిన బీఎస్‌పీ అభ్యర్థి మరణించడంతో ప్రస్తుతం 199 శాసనసభ స్థానాలలో పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో 2,274 మంది అభ్యర్థులు (187 మంది మహిళలు) బరిలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ 52,000 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసింది.

ప్రజా సంక్షేమ పథకాలే తమను మళ్ళీ గెలిపిస్తాయని ముఖ్యమంత్రి వసుంధర రాజె భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి.

Image copyright ANI

శరద్ యాదవ్ వ్యాఖ్యలతో వివాదం

చెదురు ముదురు సంఘటనలు మినహా రాజస్థాన్‌లో కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, బీహార్ నేత శరద్ యాదవ్ తనను వ్యక్తిగతంగా దూషించడం చూసి విస్మయానికి గురయ్యానని వసుంధర రాజె అన్నారు. ఆయన వ్యాఖ్యలు లింగ వివక్షతో కూడుకున్నాయని, మహిళలను అవమానించే విధంగా ఉన్నాయని, దీనిపై ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

అల్వార్‌లో ఇటీవల నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ శరద్ యాదవ్, "వసుంధరకు విశ్రాంతినివ్వండి. ఆమె చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. బరువు కూడా బాగా పెరిగారు. గతంలో ఆమె నాజూగ్గా ఉండేది. ఆమె మన మధ్యప్రదేశ్ బిడ్డ" అని వ్యాఖ్యానించారు.

ఆకట్టుకుంటున్న పింక్ పోలింగ్ బూత్‌లు

గులాబి, తెలుపు రంగులతో అలంకరించిన మహిళల ప్రత్యేక పోలింగ్ బూత్‌లో ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలింగ్‌లలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు రాజస్థాన్‌లో ఎన్నికల కమిషన్ గులాబి రంగు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది.

"ఒక మహిళా ముఖ్యమంత్రిగా, పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్న పింక్ పోలింగ్ బూత్‌లో వోటు వేయడం నాకు ఎంతో గర్వంగా ఉంది" అని వసుంధర అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)