ఎగ్జిట్ పోల్స్: ఎలా నిర్వహిస్తారు.. కచ్చితత్వం ఎంత

  • రవిశంకర్ లింగుట్ల
  • బీబీసీ ప్రతినిధి
వేలిపై సిరా చుక్క

ఫొటో సోర్స్, INCTelangana/facebook

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలతోపాటు తెలంగాణ, రాజస్థాన్‌లలోనూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలపైకి మళ్లింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సరే, మరి వీటిని ఎలా నిర్వహిస్తారు? వీటిలో కచ్చితత్వం ఎంత? ఈ అంశాలపై కొందరు నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

ఎన్నికల సర్వేలకు అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్వాహకులు మొబైల్ ఫోన్, ఇతర సాధనాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. భారత్‌లో ఓటర్లను చాలా వరకు నేరుగా, క్షేత్రస్థాయిలో కలుస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

ఎగ్జిట్ పోల్ నిర్వహించే తీరుపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ భాస్కరరావు మాట్లాడుతూ- ''ఇదివరకు డమ్మీ బ్యాలట్ పేపర్ విధానాన్ని అనుసరించేవారు. మీరు ఎవరికి ఓటేశారో డమ్మీ బ్యాలట్ పేపర్‌పై టిక్ చేసి, దాన్ని బాక్సులో వేయండని ఓటర్లను నిర్వాహకులు కోరేవారు. ఇప్పుడు దాదాపు ఎవ్వరూ ఈ విధానాన్ని అనుసరించడం లేదు'' అన్నారు.

ఎగ్జిట్ పోల్ ఎలా సాగుతుంది?

  • పోలింగ్ బూత్‌లో ఓటు వేసి వచ్చాక ఓటర్లకు నిర్వాహకులు నిర్దిష్టమైన ప్రశ్నలు వేస్తారు. ఇది ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లోనే జరుగుతుంది.
  • ఓటర్లు ఇచ్చే సమాధానాన్ని బట్టి ఎక్కువ మంది ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేశారో లెక్కగడతారు.
  • వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి ఇదే విధంగా సమాచారం సేకరిస్తారు.
  • ఈ సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్యను అంచనా వేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

సర్వేల మెథడాలజీపై సీవోటర్ సంస్థలో అడ్వాన్స్డ్ అనలిటిక్స్ విభాగం ఎడిటర్ మను శర్మ స్పందిస్తూ- దాదాపు అన్నిసంస్థలూ 'రాండమ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్' విధానాన్నే అనుసరిస్తున్నాయన్నారు. ఈ విధానం ప్రకారం- నిర్దిష్ట నియోజకవర్గం లేదా ప్రాంతంలోని జనాభాను వివిధ అంశాల ప్రాతిపదికగా చిన్న చిన్న గ్రూపులుగా వర్గీకరించుకుని, అందరి ఆలోచనలను ప్రతిబింబించేలా సర్వే నిర్వహిస్తారు.

ప్రిపోల్, ఎగ్జిట్ పోల్: వ్యత్యాసం ఎంత?

ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ మధ్య చాలా వ్యత్యాసం ఉందని దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) డైరెక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. తాము ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ రెండూ నిర్వహిస్తున్నామని ఆయన లోగడ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చాలా సంస్థలు ఈ సర్వేలు నిర్వహిస్తున్నాయని, వీటి సంఖ్య ఎంతనేది నిర్దిష్టంగా చెప్పలేనని తెలిపారు.

ఫొటో సోర్స్, FACEBOOK/CEO TELANGANA

ఫొటో క్యాప్షన్,

ఏ సమయంలో ప్రశ్నించారు, ప్రశ్నించేటప్పుడు ఓటరు ఒంటరిగా ఉన్నారా, సమూహంలో ఉన్నారా లాంటి అంశాలు ఎగ్జిట్ పోల్‌లో కీలకమైనవి

ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ప్రిపోల్ సర్వేలు ఏ దశలోనైనా జరగొచ్చు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం పోలింగ్ రోజే చేపడతారు.

చట్టసభ గడువు ముగియక ముందే, ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే, పొత్తులు ఉంటాయో లేదో తేలక ముందే, పొత్తులు ఉంటే ఎవరు ఎవరితో జట్టు కడుతున్నారో, సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందో స్పష్టం కాకముందే, పార్టీలు/కూటములు అభ్యర్థులను ప్రకటించక ముందే, పోలింగ్ తేదీకి చాలా ముందే లేదా పోలింగ్ తేదీ సమీపించినప్పుడు- ఇలా వివిధ దశల్లో ప్రిపోల్ సర్వేలు నిర్వహించొచ్చు.

కొన్ని సందర్భాల్లో ప్రిపోల్ సర్వేలో పాల్గొన్న ఓటర్లు సర్వే సమయానికి ఇంకా నిర్ణయం తీసుకొని ఉండకపోవచ్చు, సందిగ్ధంలో ఉండొచ్చు లేదా వారిలో కొందరు ఓటింగ్‌లో పాల్గొనకపోవచ్చు కూడా.

ఎగ్జిట్ పోల్‌లో ఓటింగ్‌లో పాల్గొన్నవారినే నిర్వాహకులు ప్రశ్నిస్తారు. ఏ సమయంలో ప్రశ్నించారు, ఎలా ప్రశ్నించారు, ప్రశ్నించేటప్పుడు ఓటరు ఒంటరిగా ఉన్నారా, సమూహంలో ఉన్నారా లాంటి అంశాలు ఎగ్జిట్ పోల్‌లో కీలకమైనవి.

ప్రిపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు చాలా వరకు ముందే నిర్ణయించుకుంటారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొంటారు. సాధారణంగా జనాభాలో ఆయా వర్గాల నిష్పత్తికి అనుగుణంగా వారిని ఎంచుకొంటారు.

ఎగ్జిట్ పోల్‌లో ఇలాంటి వెసులుబాటు తక్కువని భాస్కరరావు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, UGC

కచ్చితత్వం ఎంత?

ప్రిపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్‌లో కచ్చితత్వానికి అవకాశం ఎక్కువ. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు తుది ఫలితాలకు కనీసం 95 శాతం దగ్గరగా ఉంటే అంచనాల్లో కచ్చితత్వం ఉన్నట్లు భావించవచ్చని, కానీ చాలా సంస్థలు తుది ఫలితాలకు 60 శాతం దగ్గరగా ఉన్నా తమ అంచనాలే నిజమయ్యాయని చెప్పుకొంటున్నాయని భాస్కరరావు వ్యాఖ్యానించారు.

పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుందని, ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకోవాల్సి ఉంటుందని భాస్కరరావు తెలిపారు. కానీ ఈ ప్రక్రియను ఎంత మంది పకడ్బందీగా, విస్తృతంగా చేస్తున్నారన్నది ప్రశ్నార్థకమేనని వ్యాఖ్యానించారు.

ఈ అంశంపై గతంలో బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సామాజికవేత్త, సెఫాలజిస్టు యోగేంద్ర యాదవ్ స్పందిస్తూ- సర్వే నిర్వహించిన సమయం, ప్రాంతం, ఓటరు మూడ్‌, శాంపిల్, శాంపిల్ పరిమాణం, ఇతర అంశాలను బట్టి ప్రిపోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పారు.

'మార్జిన్ ఆఫ్ ఎర్రర్' ఎంత?

ఎగ్జిట్ పోల్స్‌లో 'మార్జిన్ ఆఫ్ ఎర్రర్‌'పై సీవోటర్‌కు చెందిన మను శర్మ మాట్లాడుతూ- ఇది సాధారణంగా ఐదు శాతం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో కేవలం మూడు శాతమే ఉంటుందని తెలిపారు.

అత్యధిక సందర్భాల్లో దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో- పార్టీల ఓటింగ్ శాతాలు, సీట్ల సంఖ్యలు వేర్వేరుగా ఉన్నా, అన్నీ ఒకే దిశలో ఉంటాయని ఆయన చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవీ

దేశంలో 2014-18 మధ్య వెలువడిన వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే చాలాసార్లు ఇవి ఎన్నికల్లో విజేతను సరిగ్గానే అంచనా వేశాయి. పార్టీలు సాధించే సీట్ల సంఖ్యను అంచనా వేయడంలో మాత్రం తడబడ్డాయి.

వేర్వేరుగా ఎందుకుంటాయి?

అరుదైన సందర్భాల్లోనే వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకే దిశలో కాకుండా, భిన్నంగా ఉంటాయని మను శర్మ తెలిపారు. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితికి స్థానిక అంశాలు ప్రధాన కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు.

రెండు ప్రధాన పోటీదారుల మధ్య ఓటింగ్ శాతంలో తేడా స్వల్పంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం సంక్లిష్టంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఓటింగ్ శాతంలో వ్యత్యాసం అధికంగా ఉన్నప్పుడు సీట్ల సంఖ్యను అంచనా వేయడం అంత కష్టం కాదన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)