బాంబే బ్లడ్ గ్రూప్: ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్

  • కమలేష్
  • బీబీసీ ప్రతినిధి
బ్లడ్ గ్రూప్

ఫొటో సోర్స్, Getty Images

బాంబే బ్ల‌డ్ గ్రూప్‌... ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా త‌క్కువ మందికే తెలిసిన బ్ల‌డ్ గ్రూప్ మాత్ర‌మే కాదు, చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ఉండే బ్ల‌డ్ గ్రూప్ కూడా.

బెంగళూరులో ఉంటున్న మహబూబ్ పాషా 15 ఏళ్ల క్రితం వరకూ తన బ్లడ్ గ్రూప్ 'ఓ' నెగటివ్ అనే అనుకునేవారు. తనది ఆ రక్తమే అనుకుని ఆయన చాలాసార్లు రక్తదానం కూడా చేశారు.

కానీ, ఒక రోజు హఠాత్తుగా మహబూబ్ పాషాకు ఒక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే ఆయనకు తన బ్లడ్ గ్రూప్ 'ఓ' నెగటివ్ కాదని, ప్రపంచంలో చాలా కష్టంగా దొరికే బ్లడ్ గ్రూప్ అని తెలిసింది.

మహబూబ్ పాషా చాలా కాలం క్రితం సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో రక్తదానం చేశారు. డోనరుగా ఆయన పేరు, బ్లడ్ గ్రూప్ అక్కడ నమోదు చేశారు.

ఒక రోజు అదే ఆస్పత్రి నుంచి అరవింద్ అనే వ్యక్తి ఆయనకు ఫోన్ చేశారు. తన భార్య ప్రెగ్నెంట్ అని, ఆమెకు మీ 'బాంబే' బ్లడ్ గ్రూప్ రక్తం కావాలని చెప్పాడు. అప్పుడే, పాషాకు తన అసలు బ్లడ్ గ్రూప్ గురించి తెలిసింది.

అరవింద్ ఇంకొక విషయం కూడా పాషాకు చెప్పారు. రక్తదాన శిబిరాల్లో బ్లడ్ డొనేట్ చేయద్దని, మీ బ్లడ్ గ్రూప్ అవసరమైనవారికి మాత్రమే దానం చేయాలని చెప్పారు. ఎందుకంటే అది దొరకడం చాలా కష్టం అన్నారు.

వీడియో క్యాప్షన్,

బాంబే బ్లడ్ గ్రూప్: ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ కథ

భారత్ నుంచి మయన్మార్‌కు రక్తం

ఇటీవల బాంబే బ్లడ్ గ్రూప్ ప్రస్తావన వచ్చింది. మయన్మార్‌లో ఈ బ్లడ్ గ్రూప్ ఒక మహిళ గుండెకు సర్జరీ జరగడంతో, ఆమె కోసం రెండు యూనిట్ల బాంబే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని భారత్ నుంచి మయన్మార్ పంపించారు.

ఆ దేశంలో రక్తం దొరక్కపోవడంతో మయన్మార్‌లోని యాంగూన్ ఆస్పత్రి డాక్టర్లు భారత్‌లో ఉన్న సంకల్ప్ ఇండియా సంస్థను సంప్రదించారు.

ఈ ఫౌండేషన్ 'బాంబే' బ్లడ్ ఉన్న బ్లడ్ బ్యాంకులు, డోనర్స్‌ను రక్తం అవసరమైన వారు సంప్రదించేలా చేస్తుంది. BombayBloodGroup.Org వెబ్ సైట్ ద్వారా వారికి రక్తం అందేలా చూస్తుంది.

మయన్మార్ కేసులో ఫౌండేషన్ కర్నాటకలోని దావణగెరెలో ఉన్న బ్లడ్ బ్యాంకును సంప్రదించింది. దాంతో వారు తమ దగ్గర ఆ బ్లడ్ గ్రూప్‌ రక్తాన్ని కొరియర్ ద్వారా మయన్మార్‌కు పంపించారు.

సాధారణంగా రక్తం అవసరమైతే బ్లడ్ బ్యాంకులను సంప్రదిస్తారు, లేదా చుట్టుపక్కల ఎవరైనా డోనర్ లభిస్తాడు. కానీ 'బాంబే' బ్లడ్ గ్రూప్ విషయంలో ఇంత కష్టం ఎందుకు. ఈ బ్లడ్ గ్రూప్ డోనర్స్ అంత అరుదుగా ఎందుకు ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images

"ఇది చాలా కష్టంగా దొరికే బ్లడ్ గ్రూప్. భారతదేశంలో సుమారు 10 వేల మందిలో ఒకరికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది" అని సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ ఇంచార్జ్ అంకిత చెప్పారు.

"ఈ గ్రూప్ వాళ్లను వెతకడం చాలా కష్టం. సాధారణ పరీక్షల వల్ల 'బాంబే' బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకోలేం. 'ఓ' బ్లడ్ గ్రూప్‌కు సంబంధించినట్లు ఉండడంతో దీనిని 'ఓ' పాజిటివ్ లేదా నెగటివ్ అనుకుంటారు. అందుకే చాలా మందికి తమది 'బాంబే' బ్లడ్ గ్రూప్ అని తెలీదు. రక్తం ఎక్కిస్తున్న సమయంలో 'ఓ' బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడే వారికి తమ బ్లడ్ గ్రూప్ తెలుస్తుంది" అన్నారు అంకిత.

బాంబే బ్లడ్ గ్రూప్ అవసరమైనవారు, ఆ రక్తం ఉన్న డోనర్ మధ్య సంప్రదింపులు ఎలా జరుగుతాయి.

"మాకు ఒక నెట్ వర్క్ ఉంది. అందులో డోనర్లు, బ్లడ్ బ్యాంకుల జాబితా ఉంది. మా దగ్గర సుమారు 250 మంది డోనర్లు ఉన్నారు. వాళ్లు వాలంటీర్లలా పనిచేస్తారు. బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం దొరకనప్పుడు మేం డోనర్ సాయం తీసుకుంటాం అని అంకిత చెప్పారు.

మహబూబ్ పాషా కూడా సంకల్ప్ ఫౌండేషన్లో వాలంటీరుగా ఉన్నారు. "మీది అరుదైన బ్లడ్ గ్రూప్ అని, ఎవరైనా నాతో అన్నప్పుడు, గర్వంగా అనిపిస్తుంది" అని చెబుతారు.

"ఒకసారి రక్తదానం చేశాక డాక్టర్లు నన్ను ఒక సెలబ్రిటీలా చూశారు. మేం అదృష్టవంతులమని అన్నారు. మాకు ఆ రక్తం అందించే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు. అది చాలా బాగా అనిపించింది అన్నారు పాషా.

ఫొటో సోర్స్, Getty Images

మిగతా బ్లడ్ గ్రూపుల కంటే భిన్నం ఎందుకు

బాంబే బ్లడ్ గ్రూప్ మిగతా బ్లడ్ గ్రూపులకంటే భిన్నంగా ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది. ఆ బ్లడ్ గ్రూప్ పరీక్ష చేయించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అనుసరిస్తారు.

బాంబే బ్లడ్ గ్రూప్ గురించి గంగారామ్ ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంక్ ఇంచార్జ్ డాక్టర్ వివేక్ రంజన్ వివరించారు. "మన రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాల్లో కొన్ని షుగర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎవరి బ్లడ్ గ్రూప్ ఏదో అవే నిర్ధారిస్తాయి. ఈ మాలిక్యూల్స్ నుంచి 'కేపిటల్ హెచ్ ఎంటిజన్' తయారవుతుంది. దానివల్ల మిగతా ఎంటిజెన్ ఎ, బి తయారవుతాయి. బ్లడ్ గ్రూప్ ఏర్పడుతుంది.

బాంబే బ్లడ్ గ్రూప్ వారిలో షుగర్ మాలిక్యూల్స్ తయారు కాలేవు. అందుకే అందులో 'కేపిటల్ హెచ్ ఎంటిజెన్' ఉండదు. అవి ఎలాంటి బ్లడ్ గ్రూపులోకి రాదు. కానీ, ఆ రక్తం ఉన్న వారి ప్లాజ్మాలో యాంటీబాడీ ఎ, బి, మరియు హెచ్ ఉంటాయి. ఈ బ్లడ్ గ్రూపు ఉన్న వారి జీవితం పూర్తిగా మామూలుగా ఉంటుంది. వారికి శారీరకంగా ఎలాంటి సమస్యలూ ఉండవు.

ఫొటో సోర్స్, Getty Images

ఎలా గుర్తిస్తారు?

"ఎవరికైతే బాంబే బ్లడ్ గ్రూప్ ఉంటుందో, వారిలో ఎ, బి, హెచ్ ఎంటిజెన్ ఉండదు. అందుకే పరీక్షలో కూడా ఎ, బి, ఎబి బ్లడ్ గ్రూప్ రాదు. అందుకే తమది 'ఓ' బ్లడ్ గ్రూప్ అని చాలా మంది భ్రమలో ఉంటారు అని మ్యాక్స్ ఆస్పత్రి ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనుభవ్ కుమార్ చెప్పారు.

"కానీ దీనిని వివరంగా పరీక్షించాలంటే ఒక 'ఓ' సెల్ పరీక్ష కూడా చేయాలి. రక్తం 'ఓ' బ్లడ్ గ్రూప్‌కు సంబంధించినది అయితే, ఆ పరీక్షలో రియాక్షన్ రాదు. కానీ 'బాంబే' బ్లడ్ గ్రూప్‌లో యాంటీబాడీస్ ఉండడం వల్ల 'ఓ' సెల్‌తో కూడా రియాక్షన్ ఉంటుంది. దానితో అది 'బాంబే' గ్రూప్ అని తెలుస్తుంది.

దీని పరీక్షలో ఫార్వార్డ్, రివర్స్ టైపింగ్ రెండూ చేయాలి. ఆ రక్తం గురించి తెలుసుకోడానికి యాంటీ కేపిటెల్ 'ఎ' లాక్టిన్ టెస్ట్ కూడా చేయచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

'బాంబే' బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

దీనిపై డాక్టర్ అభినవ్ సమాధానం ఇచ్చారు.

  • ప్రతి వ్యక్తికి మొదట తన బ్లడ్ గ్రూప్ ఏదో కచ్చితంగా తెలిసుండాలి.
  • మీరు 'బాంబే' బ్లడ్ గ్రూపు వారు అయితే సెంట్రల్ బ్లడ్ రిజిస్ట్రీలో మీ పేరు నమోదు చేసుకోండి. అలా చేయడం వల్ల అవసరమైనప్పుడు మీకు సాయం లభిస్తుంది. మీరు కూడా వేరేవారికి సాయం చేయవచ్చు.
  • మీతోపాటు, మీ కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేయించండి. ఎందుకంటే ఇది వంశపారంపర్యం అయితే వారికి కూడా బాంబే బ్లడ్ గ్రూపు ఉండచ్చు.

'బాంబే' బ్లడ్ గ్రూప్ అరుదైనది. అందుకే దీనిని సుదీర్ఘ కాలంపాటు సురక్షితంగా ఉంచవచ్చా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. 'క్రయో ప్రిజర్వేషన్' అనే ఒక టెక్నిక్ ద్వారా ఆ రక్తాన్ని ఒక ఏడాదిపాటు సురక్షితంగా ఉంచవచ్చు డాక్టర్ అభినవ్ చెప్పారు..

"ఈ పద్ధతిలో రక్తాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచుతారు. కానీ, భారత్‌లో దీనిని చాలా తక్కువ ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. అయితే, ఎర్ర రక్త కణాలను సాధారణంగా 35 నుంచి 42 రోజుల వరకూ సంరక్షించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

దీనికి 'బాంబే' అనే పేరు ఎలా వచ్చింది.

అన్ని బ్లడ్ గ్రూపులు ఇంగ్లిష్ అల్ఫాబెట్స్ ఎ, బి, ఓ లాంటి పేర్లతో ఉంటాయి. కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఒక నగరం పేరుతో ఉంది.

దీని వెనుక ఒక కారణం ఉంది. మొట్టమొదట దీనిని మహారాష్ట్ర రాజధాని బాంబే(ప్రస్తుతం ముంబయి)లో గుర్తించారు. వైఎం భెండె 1952లో ఈ గ్రూప్ రక్తం కనుగొన్నారు.

ఇప్పుడు కూడా ఈ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తున్నారు. దానికి ఇది వంశపారంపర్యంగా రావడమే కారణం. ఈ రక్తం ఒక తరం నుంచి మరో తరానికి వస్తోంది. అయితే కొందరు ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో, ప్రస్తుతం 'బాంబే' బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)