ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు? - తెలంగాణ ఎన్నికలు 2018

  • 8 డిసెంబర్ 2018
కల్వకుంట్ల చంద్రశేఖరరావు Image copyright KalvakuntlaChandrashekarRao/facebook

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వివిధ సంస్థలు విడుదల చేశాయి. తెలంగాణలో టైమ్స్ నౌ, ఇండియా టుడే, రిపబ్లికన్ టీవీ లాంటి సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటే, లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలు మాత్రం కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉన్నాయి.

నిజానికి ఏ ఎగ్జిట్ పోల్ అయినా ఎన్నికల ఫలితాలపై స్పష్టత ఇవ్వాలే కానీ మరింత సందిగ్ధం సృష్టించకూడదు. కానీ, ఇప్పటిదాకా చాలా ఎగ్జిట్ పోల్స్ గందరగోళాన్నే సృష్టించాయి.

ఒకసారి 2014-18 మధ్య జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను గమనిస్తే... చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్నికల్లో విజేతను సరిగ్గానే అంచనా వేశాయి. కానీ పార్టీలు గెలుచుకునే సీట్ల సంఖ్యను అంచనా వేయడంలో మాత్రం తడబడ్డాయి.

2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ గెలుస్తాయనే చెప్పాయి. బీజేపీకి 111 సీట్లు, కాంగ్రెస్‌కు 71 సీట్లు వస్తాయని సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తే, చాణక్య ఎగ్జిట్ పోల్ బీజేపీకి 135, కాంగ్రెస్‌కు 47 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ అసలైన ఫలితాల్లో మాత్రం బీజేపీకి వచ్చిన సీట్ల సంఖ్య 10శాతం తగ్గింది. మొత్తంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 108-142 సీట్ల మధ్య వస్తాయని అంచనా వేశాయి. కానీ, తుది ఫలితాల్లో మాత్రం బీజేపీకి 99 సీట్లు మాత్రమే వచ్చాయి.

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అంచనా వేయడానికి చాలా కష్టమైన ఎన్నికలు అవేనని చాలామంది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. బీజేపీకి 110, కాంగ్రెస్‌కు 88 సీట్లు వస్తాయని ఏబీపీ సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తే, బీజేపీకి 85, కాంగ్రెస్‌కు 111 వస్తాయని ఇండియా టుడే-యాక్సిస్ సర్వే అంచనా వేసింది. తుది ఫలితాల్లో బీజేపీకి అంతకుముందు ఎన్నికలతో పోలిస్తే సీట్లు పెరిగాయి. బీజేపీకి 100కి పైగా సీట్లు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసి మెజారిటీని నిరూపించుకోవడంతో బీజేపీ చివరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎగ్జిట్‌పోల్స్ దాదాపుగా విజయవంతమైన కొద్ది సందర్భాల్లో కర్ణాటక ఎన్నికలు కూడా ఒకటి.

ప్రతి ఎన్నికల తరవాత ఎగ్జిట్ పోల్స్ ఎంత కచ్చితంగా ఉంటాయనేది అంచనా వేయడం కష్టం. అంచనా ప్రకారమే సీట్లు వచ్చినా, ఆ పార్టీలే అధికారంలో వస్తాయని కూడా చెప్పలేమని కర్ణాటక ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిసారీ పొరబాట్లకు ఆస్కారం ఉంటుంది.

బిహార్‌లో ఫలితం

2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్నే తీసుకుంటే బీజేపీకి ఏకంగా 155 సీట్లు వస్తాయని, ‘మహా ఘట్‌బంధన్’ 83 సీట్లు గెలుస్తుందని చాణక్య సర్వే చెప్పింది. బీజేపీకి 100కు పైగా సీట్లు వస్తాయని, నీల్సన్ అండ్ సిసిరో అంచనా వేసింది. కానీ, తుది ఫలితాలు మాత్రం పూర్తి వ్యతిరేకంగా వచ్చాయి. నితీష్ కుమార్ జేడీ(యు), లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కలిసి ఏర్పడిన మహా ఘట్‌బంధన్ 243 సీట్లకు గానూ ఏకంగా 178 సీట్లు గెలిచింది. అంటే, మొత్తం సీట్లలో 73 శాతం సీట్లు ఆ కూటమికి వచ్చాయి. ఈ సందర్భంలో విజేతలతో పాటు పరాజితులను అంచనా వేయడంలో కూడా ఎగ్జిట్‌పోల్స్ భారీగా తడబడ్డాయి.

పశ్చిమ బెంగాల్‌లో సక్సెస్

2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను అంచనా వేయడంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ బాగా సక్సెస్ అయ్యాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 210 సీట్లు గెలుస్తుందని చాణక్య అంచనా వేస్తే, టీఎంసీ 243 సీట్లు గెలుస్తుందని ఇండియా టూడే-యాక్సిస్ సర్వే తెలిపింది. ఇక్కడ ఈ రెండు సంస్థలూ అంచనా వేసిన సీట్లు, మెజారిటీకి కావల్సిన సీట్ల సంఖ్య కంటే ఎక్కువే.

ఈ అంచనాలు కూడా తుది ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 211 సీట్లను గెలుచుకుంది. కానీ రెండో స్థానంలో నిలిచే పార్టీ సీట్లను అంచనా వేయడంలో మాత్రం అన్ని సర్వేలు విఫలమయ్యాయి. ఇండియా టుడే - యాక్సిస్ తప్పించి మిగితా అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వామపక్షాలు-కాంగ్రెస్ కూటమికి 100కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కానీ, చివరికి ఆ కూటమికి 44 సీట్లే వచ్చాయి.

మరోపక్క 2017 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం దక్కుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీకి 285 సీట్లు వస్తాయని చాణక్య ఎగ్జిట్‌పోల్ అంచనా వేసింది. కానీ, చివరికి బీజేపీకి 312 సీట్లు దక్కాయి. సమాజ్‌వాదీ పార్టీకి 88-112 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ చివరికి 47 సీట్లే వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ విజయాన్ని సరిగ్గా అంచనా వేయగలిగాయి కానీ, సీట్ల సంఖ్యను సరిగా అంచనా వేయలేదనడానికి ఇదొక ఉదాహరణ.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో అనేక ఎగ్జిట్ పోల్స్ వివిధ రకాలుగా అంచనా వేశాయి. తెలంగాణలో అన్ని సర్వేలు ఒకవైపు, లగడపాటి సర్వే మరో వైపు ఉంటే, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌లో పోటీ హోరాహోరీగా ఉన్నట్లు పోల్స్ చెబుతున్నాయి. మరి ఈ అంచనాలు ఎంతవరకు పలిస్తాయో చూడాలంటే డిసెంబర్ 11 దాకా ఆగాల్సిందే.

మరిన్ని కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)