తెలంగాణ ఎన్నికలు: 'పెయిడ్ న్యూస్ ఖర్చు రూ. 100 కోట్లని అంచనా, అందులో న్యూస్ ఛానెళ్లదే సింహ భాగం'- అభిప్రాయం

  • 8 డిసెంబర్ 2018
టీవీ న్యూస్ ఛానెల్ Image copyright iStock

ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షులు, సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి సి.కె. ప్రసాద్ ఒక సందర్భంలో 'పెయిడ్ న్యూస్'(చెల్లింపు వార్తలు)ను 'కుట్రలో పుట్టి, మోసగించటానికి ప్రచురితం అయిన వార్తలు' అని విశ్లేషించారు. గత దశాబ్ద కాలంలో ఈ పెయిడ్ వార్తలు మహమ్మారి వెర్రితలలు వేసి ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను అపహాస్యం చేసే స్థాయికి చేరుకున్నాయి.

నిజానికి పెయిడ్ న్యూస్.. 2004 సాధారణ ఎన్నికల్లో బయటపడ్డాయి. ఎక్కడ పుట్టిందో చెప్పడం కష్టం కానీ, ఆ ఎన్నికల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో చిన్న పత్రికల యాజమాన్యాలు తమ పత్రికల్లో అభ్యర్థులను కీర్తిస్తూ కథనాలు ప్రచురించి, ఆ కాపీలను అభ్యర్థులకు అమ్మటంతో మొదలైంది. ఈ పత్రికల కాపీలను అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో పంపిణీ చేసేవారు.

2009 సాధారణ ఎన్నికలు వచ్చేనాటికి.. ఈ ప్రయోగంలో ఆదాయం ఉందని గమనించిన పెద్ద, మధ్యతరహా పత్రికలు తమ జిల్లా టాబ్లాయిడ్‌లలో ఇటువంటి వార్తలను ప్రచురించడం మొదలుపెట్టాయి.

ఇది గమనించిన 'ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్'(ఏపీయూడబ్ల్యూజే), 'ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్'(ఐజేయూ).. ఈ మోసపూరిత వార్తా కథనాలను ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) దృష్టికి తీసుకునివెళ్లాయి.

అప్పటికింకా ఈ 'మోసం' ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లకపోవడంతో వారు పెద్దగా పట్టించుకోలేదు.

Image copyright Getty Images

పెయిడ్ న్యూస్ ఎలా పెరిగిందంటే...

పెయిడ్ న్యూస్ జర్నలిజం.. ప్రసార సాధనాల నైతికతను దెబ్బతీస్తుందని భావించి అప్పటి ఐజేయూ సెక్రటరీ జనరల్, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు కె. శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షులు, న్యాయమూర్తి జి.ఎన్.రే దృష్టికి తీసుకువెళ్లడంతో ఇది దేశానికి తెలిసింది.

నిజానికి పెయిడ్ న్యూస్ అనే పదాన్ని ఐజేయూ మొదట ప్రయోగించింది. ప్రెస్ కౌన్సిల్ సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, పరంజయ్ గుహ తాకుర్తా సభ్యులుగా ఒక సబ్ కమిటీని నియమించింది. ఆ సబ్ కమిటీ తన నివేదికలో పెయిడ్ న్యూస్ పుట్టుపూర్వోత్తరాలు విశ్లేషించి, దేశ ప్రజల దృష్టికి ఈ అప్రజాస్వామిక పోకడను తీసుకువెళ్లింది.

ఎన్నికల సంఘం, ప్రెస్ కౌన్సిల్ చాలా చర్యలు తీసుకున్నప్పటికీ, ఈ వ్యవహారం కొత్త పుంతలు తొక్కి, 2014 సాధారణ ఎన్నికల్లో విశ్వరూపం దాల్చింది. ఈమధ్యకాలంలో పెయిడ్ న్యూస్ ఆరోపణలపై, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను పదవీచ్యుతులను చేసినప్పటికీ ఈ మహమ్మారికి కళ్లెం వేయడం కుదరలేదు.

ప్రస్తుతం తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పెయిడ్ న్యూస్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.

ఎలక్ట్రానిక్ మీడియాలో వినూత్న రీతిలో ప్రజలను మోసం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి డబ్బు చెల్లించినవారికి డబ్బా కొడుతూ, చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా కొన్ని టీవీ చానెళ్లు ప్రసారాలు చేశాయి.

అభ్యర్థి ఇంటర్వ్యూను ప్రసారం చేస్తే ఇంత, ప్రచారాన్ని లైవ్‌లో చూపిస్తే ఇంత.. అని రేటు నిర్ణయించి మరీ డబ్బులు వసూలు చేశాయి. పార్టీ ప్రచారానికి కూడా ప్యాకేజీలు రూపొందించి, చెల్లింపు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రసారం చేశాయి.

విచిత్రమేమిటంటే డబ్బు చెల్లించిన అభ్యర్థులకు మాత్రమే ప్రసారం లభిస్తుంది. డబ్బు చెల్లించలేని, లేదా చెల్లించడానికి ఇష్టపడని అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నప్పటికీ చానెళ్లలో వారి ఊసే ఉండదు.

Image copyright iStock

‘నచ్చిన ప్యాకేజీ ఎంచుకోండి...’

ఇది ఎంతవరకు వెళ్లిందంటే సభలు, సమావేశాలు, విలేఖరుల సమావేశాలు, టీవీ చానెళ్ల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని మొదలవుతున్నాయి.

ఈమధ్య ఒక జర్నలిస్టు సంస్థ ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి వచ్చిన ఒక ప్రముఖ నాయకుడికి, కార్యక్రమం మధ్యలో ఓ చానెల్ నుంచి ఫోన్ వచ్చింది. తమ ప్యాకేజీల సరళిని వివరించి, తనకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకోవాలని కోరింది. మనసులో ఏమున్నప్పటికీ అంతమంది జర్నలిస్టుల మధ్య ఏంమాట్లాడాలో తెలియక తనకు స్తోమత లేదని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

దినపత్రికల్లో అయితే జిల్లా టాబ్లాయిడ్స్‌లో చాలా వరకు పెయిడ్ న్యూసే.

ఒకోసారి ఒకే పేజిలో, లేదా వేరువేరు పేజీల్లో ఒక నియోజకవర్గంలో ఒక పార్టీ అభ్యర్థి ఇంటర్వ్యూ ప్రచురించి, ఆయనకు అనుకూలంగా వార్తా కథనాన్ని మలిస్తే, మరో పేజీలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని మరో పెయిడ్ న్యూస్ దర్శనమిస్తుంది.

అభ్యర్థి ఎంత బలంగా ఉన్నప్పటికీ, డబ్బు చెల్లించకపోతే అసలు ఆయన గురించి రాయనేరాయరు.

ప్రత్యర్థి డబ్బు చెల్లిస్తే, వ్యతిరేక వార్తలు రాయటానికి కూడా వెనుకాడటం లేదు.

రెండుమూడు రోజుల అన్నిపత్రికల టాబ్లాయిడ్‌లను పరిశీలిస్తే ఈవిషయం ఇట్టే తెలిసిపోతుంది.

ఆ పత్రికల్లో పని చేస్తున్న జర్నలిస్టులు మింగలేక, కక్కలేక అవస్థలు పడుతున్నారు. ఎన్నికల కవరేజ్‌కు సంబంధించి, ప్రజల్లో పత్రికలు పూర్తిగా విశ్వసనీయతను కోల్పోతున్నాయి.

Image copyright iStock

పెరుగుతున్న ‘చెల్లింపు వార్తల’ వ్యాపారం

2009లో ఏపీయూడబ్ల్యుజే తరపున పెయిడ్ న్యూస్‌పై తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాంపిల్ సర్వేలు నిర్వహించాం.

నర్సాపురం వంటి నియోజకవర్గాల్లో పెయిడ్ న్యూస్ ప్రభావం ఎలా ఉందని పరిశీలించగా.. ఒక పత్రికలో ముగ్గురు అభ్యర్థులూ గెలుస్తారని రాయటం మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా జిల్లా టాబ్లాయిడ్లలో ఈ పెయిడ్ న్యూస్ సంస్కృతి బాగా విస్తరిస్తున్నట్లు మేం గుర్తించాం.

ఆ సర్వే అనంతరం మొత్తంగా ఆంధ్రా ప్రాంతంలో పెయిడ్ న్యూస్ వ్యాపారం రూ.11 కోట్ల పైమాటేనని ఒక అంచనాకు వచ్చాం.

అయితే, కచ్చితంగా ఎంత మొత్తం అనేది శాస్త్రీయంగా నిరూపించటం కష్టమైనప్పటికీ, పెరుగుతున్న పెయిడ్ న్యూస్‌ను ఆ శాంపిల్ సర్వే ఎస్టాబ్లిష్ చేసింది.

తాజాగా జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పెయిడ్ న్యూస్ ఉదంతాలను తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి (సీఈఓ) రజత్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడానికి ఇద్దరు ప్రెస్ కౌన్సిల్ మాజీ సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి, కె.అమర్‌నాథ్, ప్రస్తుత సభ్యుడు దేవులపల్లి అమర్, నవంబర్ 27న ప్రయత్నించారు. తర్వాత ఎన్నికల సంఘానికి, ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షుడికి, న్యాయమూర్తి సి.కె.ప్రసాద్‌కు ఒక లేఖ రాశాము.

తెలంగాణ ఎన్నికల అధికారులు ఒక ఆంగ్ల పత్రిక విలేకరికి పెయిడ్ న్యూస్‌కు సంబంధించిన వివరాలు అందించారు.

ఆ వివరాల ప్రకారం .. డిసెంబర్ 1నాటికి ఎన్నికల అధికారులు 1308 పెయిడ్ న్యూస్ ఉదంతాలను గుర్తించారు. అందులో 323 ఉదంతాలు హైదరాబాద్‌కు చెందినవే. పట్టణంలో భాగమైన రంగారెడ్డి జిల్లాలో 110 కేసులు, మిగతావి ఇతర జిల్లాలకు చెందినవిగా తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినవని వారు తెలిపారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో రూ.80 నుంచి 100 కోట్ల దాకా పెయిడ్ న్యూస్ పేరిట చెల్లింపులు జరిగినట్లు ఒక అంచనా. దీనిలో సింహ భాగం టీవీ న్యూస్ ఛానెళ్లదే.

Image copyright telanganastateceo/facebook

ఆ మీడియా వార్తలన్నీ పెయిడ్ న్యూసే..

అధికార పార్టీకి చెందిన వార్తా చానెళ్లు, దినపత్రికలు అయితే.. 24 గంటలు అధికార పార్టీని పొగడడం, ప్రతిపక్షాలను తిట్టడానికే పరిమితమయ్యాయి. దీనికి ప్రతిగా ఇంకొన్ని మీడియా సంస్థలు ఇంకోవైపున అలాంటి వైఖరి తీసుకున్న దాఖలాలు ఉన్నాయి.

అటువంటి వార్తలు కూడా పెయిడ్ న్యూస్‌గా పరిగణించాలని ఎన్నికల సంఘం ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టుకు ఇచ్చిన ఒక అఫిడవిట్‌లో తెలిపింది.

అయితే, దీనిని తెలంగాణ ఎన్నికల అధికారులు పరిగణనలోకి తీసుకున్నట్లు కనబడటం లేదు.

ప్రజాస్వామ్య మనుగడను కాపాడాల్సింది వీళ్లే..

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పెయిడ్ న్యూస్ స్వైరవిహారం చేసి, స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియను, పత్రికా స్వేచ్ఛను, విలువల జర్నలిజాన్ని అపహాస్యం చేశాయి.

ఇప్పటికైనా చెల్లింపు వార్తలపై ఎన్నికల సంఘం, ప్రెస్ కౌన్సిల్, విలువలకు కట్టుబడే సీనియర్ జర్నలిస్టులు తమ దృష్టిని సారించి ప్రజాస్వామ్య మనుగడను కాపాడటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)