తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? జాతీయ రాజకీయ సమీకరణాలు మారతాయా?

  • పృథ్వీరాజ్
  • బీబీసీ ప్రతినిధి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. హోరాహోరీగా జరిగిన పోరులో ఎవరు గెలుస్తారు? ఈ ఫలితాలు.. మరో నాలుగైదు నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తాయి? అన్నది చాలా ఆసక్తి కలిగిస్తున్న అంశం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఏక కాలంలో ఎన్నికలు జరిగాయి. అయితే.. ఇప్పుడు తెలంగాణలో ఐదు నెలలు ముందుగానే ఎన్నికలు జరిగాయి. అందులోనూ ఏపీలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ.. తన చిరకాల శత్రువు కాంగ్రెస్‌తో జట్టుకట్టి పోటీ చేస్తుండటంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఎన్నికలను ఉత్కంఠగా గమనిస్తున్నారు.

గత ఎన్నికల్లో తెలంగాణలో బలాబలాలేమిటి?

2014 ఎన్నికల్లో తెలంగాణలో.. 'ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీ'గా తెలంగాణ రాష్ట్ర సమితి ఒంటరిగా పోటీ చేసి 63 స్థానాలు గెలుచుకుంది. కేంద్రంలో యూపీఏ సర్కారు సారథిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తామేనంటూ నాడు ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ 21 సీట్లలో గెలిచింది.

టీడీపీ - బీజేపీ కలిసి పోటీచేయగా.. టీడీపీకి 15 సీట్లు, బీజేపీకి 5 సీట్లు లభించాయి. ఏఐఎంఐఎం 7 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు గెలుచుకున్నాయి. మిగతా చోట్ల బీఎస్‌పీ (2), సీపీఐ (1), సీపీఎం (1), ఇండిపెండెంట్ (1) అభ్యర్థులు గెలిచారు.

అయితే.. ఎన్నికల అనంతర పరిణామాల్లో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది టీఆర్ఎస్ గూటికి చేరారు. కాంగ్రెస్ నుంచి కూడా కొందరు ఎంఎల్‌ఏలు టీఆర్ఎస్‌లో చేరారు.

ఇక టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి సహా మరి కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో.. ప్రధానంగా 'ఆంధ్రా పార్టీలు'గా తెలంగాణ వాదులు పరిగణించే టీడీపీ, వైసీపీల బలం తెలంగాణలో గణనీయంగా క్షీణించిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఫొటో క్యాప్షన్,

2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీల పాత్ర ఏమిటి?

తెలంగాణలో తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ 'గెలుపు గుర్రం' ముద్రతో బరిలోకి దిగింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలతో పాటు.. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ప్రజా సమితి పార్టీ కలిసి మహాకూటమిగా పోటీ చేశాయి. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 13 స్థానాలకు మాత్రమే పోటీ చేసింది. కానీ.. ఈ ఎన్నికల్లో టీడీపీయే ప్రధాన రాజకీయాంశంగా మారింది.

మరోవైపు.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలంగాణలో చెప్పుకోదగ్గ ఉనికి ఉంది. కానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయరాదని నిర్ణయించుకుంది. అలాగని తాము ఎవరికీ మద్దతివ్వట్లేదని పేర్కొంది. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని బహిరంగంగా పిలుపునిచ్చిన వైసీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్‌ను ఆ పార్టీ శాశ్వతంగా బహిష్కరించింది.

ఇక సినీ నటుడు పవన్‌కల్యాణ్ కొత్తగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీకి కూడా తెలంగాణలో అభిమానులున్నారు. కానీ.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. సమయం తక్కువగా ఉన్నందునే పోటీ చేయటం లేదని పవన్ పేర్కొన్నారు.

అయితే.. తెలంగాణలో వైసీపీకి కానీ, జనసేన పార్టీకి కానీ రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపగల శక్తి లేదన్నది తెలిసిందేనని వైసీపీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో పోటీ చేసి ఓడిపోయినట్లయితే.. అది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ ఫలితాల మీద ప్రతికూల ప్రభావం చూపవచ్చుననే ఆలోచనతోనే జగన్, పవన్‌లు తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు వ్యూహం ఏమిటి?

''రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలలో ఎదురీదాల్సిన పరిస్థితి ఉందన్న వాస్తవం తెలియని రాజకీయ నాయకుడు కాదు చంద్రబాబునాయుడు. తెలంగాణలో ప్రజాకూటమిని గెలిపించుకోగలిగితే ఆ విజయం తాలూకు సానుకూల ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఓటర్లపై పడుతుందని.. తద్వారా తమ పార్టీ విజయావకాశాలు మెరుగుపడతాయని ఆయన నమ్మకం'' అని సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు బీబీసీతో పేర్కొన్నారు.

2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - వైసీపీల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకూ గెలుపు ఎవరిదన్నది ఊహించనంత తీవ్రంగా ఆ పోటీ నెలకొంది. ఆ ఎన్నికల్లో.. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలకు వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసం 2 శాతం కన్నా తక్కువే.

ఏపీలో మొత్తం 175 శాసనసభ స్థానాలకు గాను 102 సీట్లలో గెలుపొందిన తెలుగుదేశం పార్టీకి మొత్తంగా 46.30 శాతం ఓట్లు వచ్చాయి. ఇక 67 సీట్లలో గెలిచిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44.47 శాతం ఓట్లు లభించాయి. అంటే 1.83 శాతం ఓట్ల తేడాతో.. 35 సీట్లు తారుమారయ్యాయి.

మరోవైపు.. అప్పటికి వరుసగా రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ చీలిక, తెలంగాణ ఏర్పాటు పరిణామాలతో.. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి కోల్పోయింది. అయినప్పటికీ ఆ పార్టీకి ఏపీలో దాదాపు మూడు శాతం ఓట్లు పోలయ్యాయి.

మరో ఐదు నెలల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు, మూడు శాతం ఓట్లే అత్యంత కీలకమవుతాయని చెబుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

‘‘ఏపీలో చంద్రబాబుకు కాంగ్రెస్ మద్దతు అవసరం’’

ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తదితర విభజన హామీల అమలు అంశాన్ని బలమైన రాజకీయాంశాలుగా మలచటంలో.. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఉన్న టీడీపీ మీద ఒత్తిడి తేవటంలో వైసీపీ సఫలమైందని పరిశీలకులు అంటారు.

మరోవైపు ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ తన పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాజకీయంగా ఒత్తిడి తీవ్రమవటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి, ఎన్‌డీఏ నుంచి వైదొలగిన టీడీపీ.. బీజేపీకి దూరంగా జరిగింది.

కానీ.. విభజన హామీలు అమలుకాకపోవటానికి కారణం కేంద్రంలోని బీజేపీ సర్కారేనంటూ ప్రచారం చేయటంలో కృతకృత్యమైందని నిపుణుల భావన.

అయినప్పటికీ.. ''చంద్రబాబుకు ఎన్నికల్లో ఎవరో ఒకరి పొత్తు అవసరం. ఆయన ప్రతిసారీ వామపక్షాలతోనో, బీజేపీతోనో పొత్తుతోనే వెళ్లారు. బీజేపీతో పొత్తు ఉన్నా కూడా రెండుసార్లు ఓడిపోయారు. మొన్న ఎన్నికల్లో బీజేపీతో పాటు పవన్‌కల్యాణ్ కూడా టీడీపీతో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి కాంగ్రెస్ మద్దతు అవసరం. ఏపీలో కాంగ్రెస్‌తో కలవటానికి తెలంగాణలో ఆ పార్టీతో కలిసి పనిచేయటం ఒక పునాది అవుతుంది'' అని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి పేర్కొన్నారు.

ఏపీ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు?

''తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీల మహాకూటమి గెలిచినా ఓడినా చంద్రబాబు చాలా శక్తిమంతమైన పాత్ర పోషించారన్న సందేశం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోకి వెళుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో నరేంద్రమోదీతోనూ, పొరుగున కేసీఆర్‌తో హోరాహోరీగా పోరాడారన్న అభిప్రాయం కలిగిస్తుంది ఆ పార్టీ'' అని రవి అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా టీడీపీకి మాత్రం అది కలిసివచ్చే అంశమేనని కొందరు పరిశీలకులు అంటున్నారు. ''చంద్రబాబు ఓడిపోయినా చాలా ప్రచారం చేస్తారు. శాయశక్తులా ప్రయత్నం చేశానని.. మిగతావాళ్లు కలిసి రాలేదని.. తననే ఓడించాలని ప్రయత్నం చేశారని చెప్తారు'' అని ఆయన విశ్లేషించారు.

మహాకూటమి గెలిస్తే ఫరవాలేదు కానీ.. ఓడిపోతే చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలూ ఉన్నాయనేది మరికొందరి వాదన. తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి కారణం చంద్రబాబు జోక్యమేనని కాంగ్రెస్ నుంచే విమర్శలు రావచ్చునని.. అది కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ విచ్ఛిన్నానికి దారి తీయగలదని వారు అంటున్నారు.

అయితే.. తెలంగాణ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మధ్య ఐదారు నెలల సమయం ఉందని.. అప్పటికి తెలంగాణ ఎన్నికల వేడి చల్లారుతుందని.. ఏపీ ఎన్నికలపై అనుకున్నంత ప్రభావం చూపకపోవచ్చునని ఇంకొందరు భావిస్తున్నారు.

జాతీయ రాజకీయాలూ మారతాయా?

అయితే.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కన్నా.. జాతీయ రాజకీయాల మీద చూపే ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని రాజకీయ నిపుణుల అభిప్రాయం.

''బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి వ్యతిరేకంగా యూపీఏను బలమైన ప్రత్యామ్నాయంగా రూపొందించడానికి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికలను ఒక ప్రయోగశాలగా ఎంపిక చేసుకున్నట్టు కనిపిస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఫలించిన వ్యూహాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడం కోసమే చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కట్టారు'' అని భండారు శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.

మరో ఆరు నెలల లోపే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు కూడా జరుగనున్న విషయం తెలిసిందే. తెలంగాణకు ముందస్తు ఎన్నికలు జరగడం కూడా చంద్రబాబుకు కలిసి వచ్చిందని.. లేని పక్షంలో తెలంగాణ ప్రాంతంలో ఇంత ఉధృతంగా, రోజుల తరబడి ప్రచారం చేయగలిగే సావకాశం ఆయనకు దొరికేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.

''తెలంగాణలో సానుకూల ఫలితాలు వస్తే.. మహాకూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు జాతీయ స్థాయిలో కూడా తన పాత్ర పెంచుకోవటానికి, జాతీయ పార్టీలను సమన్వయం చేయటంలో చొరవ పెంచుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. 'బీజేపీని ఓడించటం చంద్రబాబు నాయకత్వంలో సాధ్యమవుతుంది' అనే ప్రచారం లాభిస్తుంది'' అని తెలకపల్లి రవి పేర్కొన్నారు.

టీడీపీతో పొత్తుతో కాంగ్రెస్‌ ఏం ఆశిస్తోంది?

తెలంగాణ ఎన్నికల ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తప్పనిసరిగా ఉంటుందనే నమ్మకంతోనే చంద్రబాబు, జాతీయ స్థాయిలో కలిసిరాగలదని రాహుల్ ఇంత విస్తృత స్థాయిలో ప్రచారంలో పాల్గొనడానికి కారణమని అనుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

''కాంగ్రెస్ పార్టీ దృష్టి సహజంగా జాతీయ రాజకీయాలపై ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి కూడా తెలంగాణలో ప్రజా కూటమి గెలుపు ఆవశ్యకం. ఈ ప్రయోగం విజయవంతం అయితే దాని ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికల మీద ఉంటుందని.. మోదీని గద్దె దించాలనే తమ లక్ష్య సాధనకు ఉపకరిస్తుందని ఆయన యోచనగా అనుకోవచ్చు'' అని భండారు శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఏది ఏమైనా.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, అటు పార్లమెంటు ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణలపై గణనీయమైన ప్రభావం చూపుతాయనేది నిర్వివాదాంశం.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)