గద్దర్ ఇంటర్వ్యూ: 'యంగ్ ఇండియాలో ఒకవైపు తిరుగుబాటు, మరో వైపు ఓటు... రెండూ ఉండాలి'

  • 9 డిసెంబర్ 2018
గద్దర్ Image copyright ugc

ప్రజా యుద్ధనౌకగా అభిమానులు పిలుచుకునే గద్దర్ 2018 తెలంగాణ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేశారు.

తుపాకి గొట్టం ద్వారానే విప్లవం వస్తుందనే సిద్ధాంతంతో పార్లమెంటరీ రాజకీయాలను వ్యతిరేకించే నక్సలైట్ పార్టీ నుంచి వచ్చిన గద్దర్ 70 ఏళ్ళ జీవితంలో ఇంతకు ముందెన్నడూ వోటు వేయలేదు.

ఆయన తన భార్య విమలతో కలిసి ఆల్వాల్‌లోని వెంకటాపురం పోలింగ్ బూత్‌లో తొలిసారి తన వోటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బీబీసీ తెలుగు ప్రతినిధి బళ్ళ సతీశ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు గద్దర్‌. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

బీబీసీ: బుల్లెట్ విప్లవం నుంచి బ్యాలెట్ పోరు వైపు మీ ప్రయాణం ఎలా సాగింది?

గద్దర్: నాది అంబేడ్కర్ భావాలున్న కుటుంబం. ఇంజనీరింగ్‌ కాలేజీలో దళిత్ పాంథర్ ఉద్యమం నుంచి, ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమం ప్రభావంతో విప్లవోద్యమంలోకి వెళ్లాను. నాకు రాజకీయ తల్లి నక్సల్ ఉద్యమం.

సాయుధ పోరాటం ఒక ఉద్యమ రూపం మాత్రమే. అందుకే, నేను ప్రజల్లో భావ విప్లవం తీసుకురావడానికి నేను సాంస్కృతిక ఉద్యమం వైపు వెళ్లాను.

దళిత ఉద్యమం, స్త్రీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం.. ఇలా దేశంలో నేను పాల్గొనని ఉద్యమం అంటూ లేదు. ఏ ఉద్యమంలో ఉన్నా 'తిరగబడకపోతే... జరుగుబడి లేదు' అనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చాను.

నేను రాజకీయాల్లోకి వచ్చానంటే దానర్థం... అది యూ టర్నో, అబౌట్ టర్నో, చేతులెత్తేయటమో కాదు. అలా అయితే, ఏదో ఒక బూర్జువా రాజకీయ పార్టీలో చేరేవాడిని.

కార్ల్ మార్క్స్ జ్ఞాన సిద్ధాంతంతోపాటు పూలే, అంబేడ్కర్‌ల భావాలను కూడా తీసుకుపోవాలన్నది నా అభిప్రాయం. ఆ చరిత్రాత్మక దశ వచ్చింది. నా మాతృ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత.. నేనిది ప్రచారం చేస్తున్నా.

బీబీసీ: నాలుగైదు దశాబ్దాల ప్రస్థానంలో మీ ఆలోచనా ధోరణిలో ఈ మార్పు ఎప్పటినుంచి ప్రారంభమైంది?

గద్దర్: ఓటును డబ్బు, కార్పొరేట్ మీడియా, స్టేట్ స్పాన్సర్డ్ మాఫియా ఇలా ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఎప్పుడైతే ఓటు పూర్తిగా కార్పొరేట్‌పరం అయిపోయిందో.. అపుడు ఓటును కూడా ఒక విప్లవ పోరాటరూపంగా తీసుకోవాలి అన్నది నా వాదన.

ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ.. భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు. ఓటును కూడా ఒక పోరాట రూపమేనన్నది నా వాదన. మార్పును కోరేది. ఓట్ల ద్వారా వచ్చే మార్పు పూర్తిగా సరైన మార్పు కాదు. అందుకే ఎర్ర జెండా ఉంది. నీలి జెండా ఉంది.

మొత్తం ప్రపంచాన్ని మార్చాలంటే మార్క్సిస్టు అవగాహన కావాలి. కానీ, కులవ్యవస్థ ఉన్న భారతదేశంలో మధ్యేమార్గంలో ఒక సామాజిక విప్లవం రావాల్సిన అవసరం ఉంది. ఆ సామాజిక విప్లవానికి ఓటు చాలా అవసరం. మార్క్స్, అంబేడ్కర్ సిద్ధాంతాల పునాది మీద దీనిని నిర్మించటానికి నేను ప్రయత్నిస్తున్నా.

బీబీసీ: ప్రధాన స్రవంతి మార్క్స్ సిద్ధాంతంలో ఉన్నవారికి అంబేడ్కర్ సిద్ధాంతాన్ని తీసుకోమని గతంలో ఎపుడైనా చెప్పారా?

గద్దర్: నాకంటే ముందు చాలా జరిగినయి. భారత కుల వ్యవస్థపై కమ్యూనిస్టు పార్టీలకు ఒక స్పష్టమైన అవగాహన చాలాకాలంగా రాలేదు. కులం ఒక ఉపరితలం మాత్రమే అనుకున్నారు. ఆర్థిక పునాది మారిపోతే, అన్నీ మారిపోతాయనుకున్నారు. భారతదేశంలో కుల వ్యవస్థ పోవాలని భక్తి యుగం నుంచి పోరాటాలు జరిగాయి.

కులం అన్నది క్లాస్ అండ్ కాస్ట్ రెండూ కలగలసినది అని అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు. కులం అన్నది ఉపరితలంలో మాత్రమే కాదు. దేశ పునాదిలోకూడా ఉందని కమ్యూనిస్టులు అర్థం చేసుకున్నపుడు ఎవరి సిద్ధాంతాలను తీసుకోవాలి? ఆర్థిక పునాదిగా ఉన్న ఒక్క మార్క్స్ మాత్రమే దేశానికి సరిపోతాడా?

కులం, వర్గం రెండూ పోవాలని జమిలి ఉద్యమాలు జరగాలని అనేకమంది ఉద్యమాలు చేశారు. అంబేడ్కర్‌తో పాటు మార్క్స్‌ను తీసుకెళ్లాలన్నది నా ఉద్దేశం. యాబై సంవత్సరాల ప్రయాణం, 32 కేసులు, 6 తుపాకీ గుండ్లు, అజ్ఞాతవాస జీవితం, జైలు జీవితం, సర్వస్వం త్యాగం చేయటం. ఇలా ఎన్నో మలుపుల తర్వాత నా తండ్రి అంబేడ్కర్ దగ్గరకు వచ్చాను. ఈ యంగ్ ఇండియాలో ఒకవైపు తిరుగుబాటు, రెండో వైపు ఓటు కూడా ఉండాలి.

Image copyright Rahulgandhi/fb

బీబీసీ: మీ ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని వెనక్కి చూసుకుంటే.. అది ఏమేరకైనా ఫలించిందని అనుకుంటున్నారా? లేక నిష్ఫలమైందని భావిస్తున్నారా?

గద్దర్: ఆ ఫలితాల కొనసాగింపే ప్రస్తుత నా ప్రయాణమని నేను అనుకుంటున్నా. సాయుధ పోరాటం ఒకటే కాదు, సంధి కాలంలో,యుద్ధంలో డిఫెన్స్‌లో ఉన్నపుడు, విప్లవం కూడా ఆ మార్పు కోసమే పని చేస్తుంది. ఓటింగ్ విధానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్న నా వాదనను పార్టీకి చెప్పాను. అందుకు వారు అంగీకరించలేదు. 'మార్క్స్, లెనిన్ అండ్ మావో సిద్ధాంతం' (ఎం.ఎల్.ఎ.ఎం) మీదనే పని చేస్తాం అన్నారు. అందుకే, ఆ పార్టీకి నమస్కారం పెట్టి బయటకు వచ్చాను. మళ్లీ ఒకటి రెండేళ్ల నుంచి ప్రజల దగ్గరకు వెళ్లటం ప్రారంభించాను.

బీబీసీ: గత ప్రస్థానం మీ వ్యక్తిగత జీవితంపై ఎలా ప్రభావం చూపింది? బ్యాలెట్ విప్లవాన్ని కాస్త ముందే ప్రారంభించి ఉంటే బాగుండేదని మీకు అనిపించిందా?

గద్దర్: పార్టీలో కులం గురించి చాలా చర్చలు జరిపాం. నేనే మొదటి వాడిని కాదు. చాలా చర్చలు జరిగినయి. కానీ, ఆ పార్టీకి కొన్ని క్రమశిక్షణ పరమైన నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ చట్రంలోనుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు నేను ఏ పార్టీకీ చెందినవాడిని కాదు.

తెలంగాణ ఉద్యమం వచ్చినపుడు ఒక రాజకీయ పార్టీగా కాకుండా, రాజకీయ శక్తిగా ఎదగాలనుకున్నాం. ప్రస్తుతం నేను చేస్తోందీ అదే. నాది పొలిటికల్ పార్టీ కాదు. కానీ నేను ఒక పొలిటికల్ ఫోర్స్‌! నేను విత్తనమై, ప్రజల్లో పడి, ప్రజల ఓట్లను తీసుకువచ్చా.

ఒక్కోసారి సాయుధ పోరాటం చాలా ఈజీ. కానీ ఎన్నికల పోరాటం చాలా కష్టం. ఎన్నికల పోరాటంలో ప్రజల్లో భావ విప్లవం తీసుకురావాలి. వేమన, పోతన, అన్నమాచార్య, సంత్ రవి దాస్, కబీర్ దాస్‌లాగ అనేకమంది భక్తి కవులు, విప్లవ కళాకారుల పాత్రను నేను పోషించాను.

బీబీసీ: పార్టీ రహిత ఓటు రాజకీయం అన్నది ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యేది కాదు కదా. మీరు భావ విప్లవం గురించి చెబుతున్నా, ఏదో ఒక దశలో ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ వైపు వెళ్లవలసిందేకదా?

గద్దర్: అది చాలా కరెక్ట్. 'సేవ్ కాన్స్టిట్యూషన్ - సేవ్ ఇండియా - సేవ్ సెక్యులరిజం' అనే నినాదంతో గత రెండేళ్లుగా నేను ప్రచారం చేస్తున్నా. ఈ నినాదాన్ని రాహుల్ గాంధీ కూడా చెబుతున్నారు. చంద్రబాబు కూడా ఈమధ్య సేవ్ డెమోక్రసీ అంటున్నారు. అందుకే నేను వారికి మద్దతు తెలిపాను.

మేం ఇప్పటికే ఒక మ్యానిఫెస్టోను రూపొందించాం. విద్యార్థి సంఘాలతో శ్వేత పత్రంతో ఒక పార్టీ పెట్టాలని ప్రయత్నించాం. ఈలోపలే మనకు ఎన్నికలు వచ్చాయి. మేం రూపొందించిన మ్యానిఫెస్టోతో 'ది ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్'ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం.

సామ్రాజ్యవాద ఫాసిజం, బ్రాహ్మణికల్ హిందూ ఫాసిజం రెండూ దేశాన్ని పాలిస్తున్నాయి. వీటితో కేసీఆర్‌కు అలయెన్స్ ఉంది. సీక్రెట్ అలయెన్స్ కూడా ఉంది. ఈ ప్రజాస్వామిక శక్తుల ద్వారా ఓటును, ఉద్యమాన్ని కలపాలని అనుకుంటున్నాం.

ఈ నేపథ్యంలో ఒక కొత్త ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఇందుకోసం హిందీ, మలయాళీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో చాలా పాటలు రాస్తున్నాం. 'వెయ్యి డప్పులు, లక్ష గొంతులు' అన్నది నా పాట. 'సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్'ను కూడా ప్రారంభించాలనుకున్నాం.

అందుకోసం పవన్ కల్యాణ్, రజినీ కాంత్, కమల్‌హసన్ అందర్నీ కలుద్దామని అనుకున్నాం. కానీ, ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో నేను ఒక పాటలా ఈ సెక్యులర్ ఫోర్స్‌కు మద్దతు తెలిపాం.

'సేవ్ కాన్స్టిట్యూషన్ - సేవ్ ఇండియా' అనే ఒక జాతీయస్థాయి ఉద్యమాన్ని నిర్మించాలి. ఇది నా ఒక్కడితో అయ్యే పని కాదు. ఈ ఉద్యమ నిర్మాణంలో భాగంగా పార్టీ నిర్మాణం కూడా చేయాలి. లేదంటే భావసారూప్యత కలిగిన పార్టీల మధ్య, ఉద్యమాల మధ్య ఒక వారధిని అవుతాను.

నేను 22 భాషల్లో పాటలు పాడగలను. 2019 పార్లమెంటు ఎన్నికలు లక్ష్యంగా దక్షిణ భారతదేశంలోని పార్లమెంట్ హెడ్‌క్వార్టర్లలో పాటల ద్వారా సాంస్కృతిక, భావవిప్లవం తీసుకురావాలని అనుకుంటున్నాను.

ఇప్పుడు నా వయసు 70. నేను ఓ గాయపడ్డ సైనికుడిని. దేశంలోని యువత కోసం నా ప్రయత్నం అంతా. 'రేపటి కాలం మీది.. నా భుజాల మీద ఎక్కి ఈ ప్రపంచాన్ని చూడండి.. మీ సమాజాన్ని మీరే నిర్మించుకోండి అన్నది' నా పిలుపు.

Image copyright Madhu yaskhi/fb

బీబీసీ: కమ్యూనిస్టు పార్టీలు ఇంతకుముందు ఇలా 'వారధి'లా పనిచేశాయి కదా? మీరు పెట్టబోయే ఫ్రంట్ కూడా అలా చేస్తుందా?

గద్దర్: సీపీఎం పార్టీలో ఇంకా నీల్ జెండాను అంగీకరించలేదు. నేను టీమాస్ సభ్యుడ్ని. 1.25 లక్షల కిలోమీటర్లు తిరిగా. బీఎల్ఎఫ్‌లో మిత్ర వైరుధ్యం ఉంది. ఇంపీరియలిజం.. దోపిడీ నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయాలంటే మార్క్స్ ఒక్కడే సరిపోడు. అంబేడ్కర్ కూడా అవసరం. ఈ ఇద్దరి జ్ఞాన సిద్ధాంతం, భావ సిద్ధాంతాన్ని తీసుకెళ్లాలి. ఓట్ల విప్లవం రావాలి. ఓటు కూడా ఒక పోరాట రూపం.

ముఖ్యంగా రాజ్యాంగం ఒక పవిత్రమైన లీగల్ డాక్యుమెంట్.. చట్టపరమైన గ్రంథం. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే దేశం నడవాలి. అలా నడవట్లేదు. అలా నడిచేలా చేయాలి.

బీబీసీ: ఎంతో మంది యువతీ యువకులను విప్లవం వైపు నడిపించి మీరు ఇప్పుడు అకస్మాత్తుగా మారిపోయారని విమర్శలున్నాయి?

బాధతో అలా విమర్శించవచ్చు. నేను 20 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్ వదిలిపెట్టి, 25 ఏళ్ల వయసులో చిన్న చిన్న బిడ్డల్ని వదిలిపెట్టి విప్లవోద్యమంలోకి వెళ్లాను. రాజునూ రాజ్యాన్ని ప్రశ్నించాను. ఎదిరించాను. పోరాడాను. ఈ ఆచరణ నుంచి చూడాలి. ఈ కుటుంబం చేసిన త్యాగం.. డాక్టర్ చదివిన నా కొడుకు శత్రువుల హింసకు అమరుడైపోయాడు. త్యాగాల గురించి తెలియని వాళ్లు విమర్శలు చేస్తారు. త్యాగం తల్లికి తెలుస్తుంది. సద్విమర్శను స్వీకరిస్తాను. మిగతా వాటిని తప్పుపట్టను.

విప్లవోద్యమంలో స్ఫూర్తినిచ్చిన వారి త్యాగం వృథా పోలేదు. వారు చరిత్రలో స్థిరంగా ఉన్నారు. ఆ మార్గంలో పడుతూ లేస్తూ పోతూ ఉన్నా.

Image copyright Inc/fb

మీ కుమారుడి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?

గద్దర్: ఇది కొత్త తరం. ఏదీ ఇంపోజ్ చేయలేం. నా మనవడికి 'సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో అని పాడితే.. స్పీడ్ పాట కావాలంటాడు.

నా అబ్బాయికి చాలా జీవితం తెలుసు. చెట్టు మీద రాయి విసిరితే పక్షులు చెల్లాచెదురైనట్లు చెదిరిపోయారు. ది డిసర్టెడ్ ఫ్యామిలీ పేరుతో మా కథనే ఒక పుస్తకంగా రాయాలనుకుంటున్నా.

ఎమర్జెన్సీలో మా అబ్బాయి తల్లి కడుపులో ఉన్నపుడు నన్ను పట్టుకుపోయారు. పిల్లలు హాస్టల్లో బతికారు. నా కొడుకు 750 రూపాయల కోసం రోజు కూలీకి వెళ్లాడు. అతడు చాలా బ్రిలియంట్. చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు. నన్ను చాలా విషయాల్లో గైడ్ చేశాడు.

ఈ దేశంలో తన తండ్రి చెప్పినటువంటి మార్క్స్, అంబేడ్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అతడికి రూ. 70, 80 వేల జీతమొస్తది. హాయిగా ఉండొచ్చు. అయినా ప్రజల గురించి ఆలోచిస్తాడు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలకు పనికొచ్చేది చేస్తాడన్న ఆశ నాకుంది. మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నా.

బీబీసీ: చంద్రబాబును కౌగలించుకుంటే మీ శరీరంలోని బుల్లెట్లు కరిగిపోయాయా అని అడుతున్నారు?

గద్దర్: చంద్రబాబును కౌగలించుకోవటం చూసి బాధపడొద్దు. ఒక యుద్ధంలో జరుగుతున్నపుడు, యుద్ధంలో, జరిగిన తర్వాత.. ఒకరినొకరు కలిగించుకోవటం మానవీయ విలువ.

చంద్రబాబు తాను సెంటర్ మీద ఫైట్ చేస్తున్నా అన్నాడు. దానితో ఏకీభవించాను. ఐక్యతా పోరాటంలో చన్నీళ్లు, వేన్నీళ్లు ఉంటాయి. ఒక వేదిక మీద ఒక మిత్రుడు లేచి ఉన్నపుడు కౌగలించుకోవటం మానవీయ విలువ. చంద్రబాబు కేంద్రంతో కొట్లాడుతున్నా అన్నప్పుడు.. నా మిత్రుడు.

బీబీసీ: మీరు ఇప్పుడు నక్సలిజాన్ని సమర్థిస్తారా అని అడుగుతున్నారు?

గద్దర్: నక్సలిజం అంటే ఎవరి కష్ట ఫలితం వారికి దక్కాల. కమ్యూనిజం కూడా అదే. అది జరిగే వరకూ పోరాటం చేస్తూనే ఉంటాం. ఎలాంటి పోరాట రూపాలైనా తీసుకుంటాం. ప్రతి పోరాటానికి మద్దతిస్తున్నా.

బీబీసీ: మీరు రాజకీయాల్లోకి రావటం పులి సర్కస్ కంపెనీలో చేరినట్లు లేదా అంటున్నారు?

గద్దర్: పులి ఎక్కడున్నా పులే. సర్కస్ కంపెనీలో చేరిందని దానిని వదిలిపెట్ట లేరు కదా. దేనినైనా పైపైన చూడొద్దు. లోతుకెళ్లి చూడాలి. శాస్త్రీయంగా ఆలోచించాలి.

నేను చెప్పిందే నిజమని నేనను. నేను ఏది చేసినా ప్రజల కోసం అనుకుంటా. పీడితుల పాటననుకుంటా. డెబ్బై ఏళ్లు నిండిన తర్వాత ఈ కొత్త జీవితం. మీ పాటనై వస్తున్నా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)