పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎన్డీయేను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రతిపక్షాల వ్యూహం : అభిప్రాయం

  • 10 డిసెంబర్ 2018
ప్రతిపక్షాల వ్యూహం Image copyright Getty Images

డిసెంబర్ 11న తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. +

అదే రోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

దానికి ముందు సోమవారం ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక సమావేశం ఏర్పాటు చేశాయి. దీనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు.

ప్రతిపక్షంలో చాలా పార్టీలు ఈ సమావేశానికి హాజరు కావడానికి అంగీకరించాయి. కానీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం ఇప్పటివరకూ దీనిపై తన వైఖరి ఏంటో స్పష్టం చేయలేదు.

బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈ సమావేశంలో పాల్గొంటారా, లేదా అనేది ఇంకా తెలీడం లేదు.

విపక్షాలన్నీ ఈ సమావేశం ఏర్పాటు చేయడం వెనుక లక్ష్యం ఏమిటి? మాయావతి హాజరు, గైర్హాజరీ వల్ల దీనిపై ఏదైనా ప్రభావం పడుతుందా? తెలుసుకోడానికి బీబీసీ ప్రతినిధి ఆదర్శ్ రాఠోర్ సీనియర్ విలేఖరి రాధికా రామశేషన్‌తో మాట్లాడారు. ఆమె అభిప్రాయం ఆమె మాట్లలోనే:

Image copyright AFP

కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలనే వ్యూహం

11న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. అది ఒక విధంగా బడ్జెట్ సెషన్ అవుతుంది. కానీ, దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఉందంటే, ఈ సమావేశాల్లో కేంద్రం చాలా ముఖ్యమైన బిల్లులను పాస్ చేయించాలని భావిస్తోంది. అందుకే ఎన్డీయే ప్రభుత్వాన్ని పార్లమెంటులో ఉక్కిరిబిక్కిరి చేయడానికి విపక్షాలకు ఇది ఒక మంచి అవకాశం అవుతుంది.

విపక్షాలు ఇంతకు ముందు కూడా ఇలాంటి ఎన్నో అవకాశాలను చేజార్చుకున్నాయి. ఎందుకంటే పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పుడు మనం దేనిపైనా ముందుకు వెళ్లలేం. అందుకే ఈ సమావేశంలో బీజేపీని ఏయే అంశాలపై ఇరుకునపెట్టచ్చు అనే విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒక వ్యూహం ప్రకారం సన్నద్ధం కావాలి.

రఫేల్ ఒప్పందం ఇప్పుడు ప్రతిపక్షాల చేతిలో ప్రధాన అస్త్రంగా ఉంది. అది చాలా పెద్ద అంశం. ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతిభద్రతల వైఫల్యంపై కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అంతే కాదు వ్యవసాయానికి సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తవచ్చు. గ్రామాల్లో రైతుల కష్టాల గురించి సభలో ప్రస్తావించవచ్చు.

ప్రతిపక్షాలన్నీ కలుస్తున్న ఈ సమావేశంలో ఏయే పార్టీలు పాల్గొంటున్నాయి అనేది కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు ఈ సమావేశాలకు బహుజన్ సమాజ్ పార్టీ హాజరైతే, దానివల్ల ప్రతిపక్షాలు మరింత బలోపేతం కావచ్చు. ఆ పార్టీ రాకపోతే వారికి అది ఒక పెద్ద షాక్ అవుతుంది.

చిత్రం శీర్షిక ఫైల్ ఫొటో

బీఎస్పీ: ఒక కీలకమైన లింకు

ఆమ్ ఆద్మీ పార్టీకి పార్లమెంటులో పెద్దగా బలం లేదు. కానీ సమావేశానికి హాజరవుతామని ఆ పార్టీ స్పష్టం చేసింది. కానీ ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై ఉండడానికి బీఎస్పీ వాటితో కలవడం చాలా ముఖ్యం. దళిత పార్టీ కావడం, మాయావతి లాంటి ఒక బలమైన నేత ఆ పార్టీ చీఫ్‌గా ఉండడంతో దాని ప్రభావం ఉత్తర్ ప్రదేశ్‌లోనే కాదు, మొత్తం దేశమంతా ఉంటుంది.

అలాంటప్పుడు ఈ సమావేశంలో ఆమె హాజరు కాకపోవడం అనేది, విపక్షాల ఐక్యతకు, ముఖ్యంగా 2019 ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు చాలా పెద్ద పరీక్ష లాంటిది.

ఇప్పటివరకూ మాయావతి వైఖరి సమదూరం పాటిస్తున్నట్టే ఉంది. ప్రతిపక్షాలకు ఆమె యస్ గానీ, నో గానీ చెప్పడం లేదు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం మాటలనే మాయావతి మళ్లీ మళ్లీ చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ పాములతో వర్ణిస్తున్నారు.

అంటే మాయావతి ప్రస్తుతానికి బీజేపీ, కాంగ్రెస్‌ను ఒకే త్రాసులో తూస్తున్నారు. అంటే ఆమె ఇప్పుడు విపక్షాలతో కలిసి వెళ్లడానికి సిద్ధంగా లేరు. ఆమె ఏదో అవకాశం కోసం వేచిచూస్తున్నారు.

బహుశా లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలనే మాయావతి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆమె మూడ్ గుర్తించడం చాలా కష్టం.

అందుకే ఈ సమావేశానికి సంబంధించినంత వరకూ, బీఎస్పీ హాజరవుతుందా, లేదా? అనేది చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. ఆ పార్టీ రాలేదంటే అది ప్రతిపక్షాల ఐక్యతకు, ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీని కలపాలనే ప్రయత్నాలకు విఘాతం కలుగుతుంది.

ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలనే ప్రయోగాల్లో సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ భాగం అయ్యాయి. కానీ బీఎస్పీ అందులోకి రాకుంటే విపక్షాల్లో గోరఖ్ పూర్, ఫూల్పూర్ లేదా మిగతా ఉప ఎన్నికల్లో కనిపించిన ఆ ఐక్యత కనిపించదు.

Image copyright TWITTER/UPENDRARLSP

అంతుపట్టని కుష్వాహా వైఖరి

రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ, బీఎస్పీలా అంత పెద్ద పార్టీ ఏం కాదు. కానీ కుష్వాహా ఓట్ల విషయానికి వస్తే ఈ పార్టీ చాలా కీలకం.

కానీ దీని చీఫ్ ఉపేంద్ర కుష్వాహా ముందు ముందు ఎన్డీయేతో కొనసాగాలని అనుకుంటున్నారా, లేదా? అనేది గత కొన్ని నెలలుగా స్పష్టం కావడం లేదు.

ప్రతిపక్షాల సమావేశానికి హాజరు కావాలని కుష్వాహాకు కూడా ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు ఆయన దీనికి వస్తే, కుష్వాహా ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించినట్టే అవుతుంది.

కానీ బీజేపీ ఆయన్ను ఎలాగోలా ఎన్డీయేలోనే ఉంచే ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో పెను సవాలు ఎదురవబోతోందని వారికి తెలుసు.

ఈసారీ అక్కడ పరిస్థితి 2014 కంటే భిన్నంగా ఉంది. ఎందుకంటే బిహార్లో తేజశ్వి యాదవ్ నేతృత్వంలో రాష్ట్రీయ జనతాదళ్ మరింత బలం పుంజుకుంది.

ఈ మొత్తం పరిధిలో కుష్వాహా ఓటు బ్యాంకు ఉంది. అలాంటప్పుడు బీఎస్పీతోపాటు కుష్వాహాలకు చెందిన ఈ చిన్న పార్టీ కూడా చాలా ప్రధానం అవుతుంది.

అధికార పక్షం, ప్రతిపక్షంలో రెండూ ఆ పార్టీని తమ వైపు లాగడానికి కచ్చితంగా ప్రయత్నిస్తాయి.

Image copyright dipr
చిత్రం శీర్షిక అన్నాడీఎంకే నేత పళనిస్వామి

'అమ్మ' తర్వాత అన్నాడీఎంకే ఎటువైపు?

దక్షిణాది విషయానికి వస్తే అన్నాడీఎంకే తీరు కూడా ఆసక్తికరంగా ఉండబోతోంది. వాళ్లు ఎన్డీయేతో ఉండాలని అనుకుంటున్నారా, లేక న్యూట్రల్‌గా ఉండాలని భావిస్తున్నారా స్పష్టంగా తెలీడం లేదు.

బీజేపీ ప్రభావం తమిళనాడులో పెద్దగా లేదు. అలాంటప్పుడు అన్నాడీఎంకే ఏం చేస్తుందో ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. కుష్వాహా పార్టీలాగే అన్నాడీఎంకే కూడా ఒకసారి యస్, ఒకసారి నో అంటోంది. చివరికి వాళ్లు ఏవైపు ఉంటారనేది ఇప్పటికీ తేలలేదు.

డీఎంకే మాత్రం కాంగ్రెస్ వెంటే ఉంది. అలాంటప్పుడు విపక్షాల ఐక్యత విషయానికి వస్తే వారు ఇటీవల రెండు మూడు కోణాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఒక కన్నేయాల్సి ఉంటుంది.

శీతాకాల సమావేశాలు ఎలా ఉంటాయనేది ఈ ఫలితాలే నిర్ణయిస్తాయి. తెలంగాణ, మిజోరాంలో బీజేపీ ప్రభావం లేదు. అలాంటప్పుడు మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో గెలిచినా, దానిని ఆ పార్టీ విజయంగానే భావించవచ్చు.

రెండురాష్ట్రాల్లో ఓటమి వల్ల బీజేపీకి పెద్దగా కాకపోయినా షాక్ అయితే తగులుతుంది. ఇటు ప్రతిపక్షాల మనోధైర్యం పెరుగుతుంది.

Image copyright @INCINDIA/TWITTER

అలాంటప్పుడు బీఎస్పీ కలిసి వచ్చినా, రాకపోయినా ప్రతిపక్షాలు పార్లమెంటులో కేంద్రంపై ఎదురుదాడికి దిగుతాయి. ప్రతిపక్షాలన్నీ ఒక్కటై పైన లెక్కపెట్టిన అంశాలపై అధికార పార్టీని ముట్టడిస్తాయి.

ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒకటే, ఆ పరిస్థితికి వచ్చినపుడు ఎన్డీయేలో కలకలం రేగుతుందా? అప్పుడు కూడా అది ఒక్కటిగా కలిసి ఉండగలుగుతుందా?

జనతాదళ్ యునైటెడ్ లాంటి పార్టీలు బీజేపీని ఇబ్బందుల్లో పెట్టే పరిస్థితి ఎదురవుతుందా? అయినా, నితీష్, బీజేపీ మధ్య బంధం అంతంత మాత్రంగానే ఉంది. దానిలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి.

అలాంటప్పుడు ఒకవేళ మూడింటిలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందే అనుకుందాం, దానివల్ల ఎన్డీయేలో కూడా సవాళ్లు ఎదురవుతాయి.

ఇక బయటి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి విపక్షాలు ఎలాగూ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)