'ఇజ్తెమా': ‘20 లక్షల మంది' ముస్లింలు కర్నూలుకు ఎందుకు వచ్చారు

  • 10 డిసెంబర్ 2018
ఇజ్తెమా

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు శివారులో జరుగుతున్నఅంతర్జాతీయ ఇస్లామిక్ సమ్మేళనం 'ఆలమీ తబ్లీగి ఇజ్తెమా'కు లక్షల మంది ముస్లింలు తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశ, విదేశాల నుంచి వీరు వస్తుండటంతో ఈ ప్రాంతం జనసంద్రాన్ని తలపిస్తోంది.

ఆధ్యాత్మిక చింతన, సన్మార్గ బోధన లక్ష్యంగా అనేక మంది ముస్లింలు ఒకచోట కలిసి సోదరభావంతో నిర్వహించుకునే సమ్మేళన కార్యక్రమమే 'ఇజ్తెమా' అని నిర్వాహకులు తెలిపారు.

Image copyright facebook

కర్నూలు శివారులోని తాండ్రపాడు గ్రామ సమీపంలో అఖిల భారత ఇజ్తెమా కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. డిసెంబరు 8న మొదలైన ఈ సమ్మేళనం ఈ రోజు(సోమవారం) ముగియనుంది.

మూడు రోజుల ఈ వేడుకలో అల్లా మార్గం, ఇస్లాం మూలసూత్రాలు, ఖురాన్ పఠనం, ప్రేమ, దయ, సోదరభావం లాంటి అంశాలను మతపెద్దలు బోధిస్తారు.

ఇజ్తెమాలో పాల్గొనటాన్ని ముస్లింలు అతి ముఖ్యమైన అంశంగా భావిస్తారు. తమ జీవనం సన్మార్గంలో సాగడంలో ఇది ముఖ్య భూమిక పోషిస్తుందన్నది వారి నమ్మకం.

దిల్లీ నుంచి వచ్చిన మతపెద్ద మౌలానా మహమ్మద్ సాద్ సాబ్‌తోపాటు పలువురు ఇస్లాం మత ప్రచారకులు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ఆధ్యాత్మిక ప్రబోధం చేస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇండొనేషియా, మలేషియా, ఇతర దేశాల ముస్లింలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు.

'దక్షిణాదిలోనే అతిపెద్ద సమ్మేళనం'

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం ఆధ్యాత్మిక సంస్థలు ఏటా ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తుంటాయి. 2014లో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఇజ్తెమా ప్రపంచంలోనే అత్యంత పెద్ద సమ్మేళనంగా గుర్తింపు పొందింది.

కర్నూలు ఇజ్తెమా దక్షిణాదిలోనే అతిపెద్ద ముస్లిం సమ్మేళనమని ఇజ్తెమా నిర్వాహక కమిటీ తెలిపింది. దాదాపు 20 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు అంచనా వేస్తున్నామని చెప్పింది.

ఇజ్తెమాలో పాల్గొనేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా 116 ఎకరాల్లో టెంట్లు ,600 ఎకరాల్లో పార్కింగ్ , 45 ఫుడ్ స్టాల్స్ , వైద్య కేంద్రం, మూడు వేల మంది వాలంటీర్లను ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ మెహమ్మద్ జవహరిన్ బాషా తెలిపారు.

ఏర్పాట్లకు రూ.10 కోట్లు మంజూరు చేసిన సీఎం

కర్నూలు జిల్లాకు చెందిన ముస్లిం మతపెద్దల విజ్ఞప్తి , మైనారిటీ, వైద్యవిద్యాశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అధికారికంగా ఏర్పాట్లు చేసింది. ఇజ్తెమా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేశారని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంతో ప్రజల మధ్య విద్వేషాలు సమసిపోయి ప్రేమ, సోదరభావం నెలకొంటాయని ఫరూక్ చెప్పారు.

ఈ రోజు రాత్రి విందు తర్వాత సమ్మేళనం ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు