తెలంగాణ ఎన్నికలు: హైదరాబాద్‌లో పోలింగ్ ఎందుకు పడిపోతోంది? నగరవాసుల నిర్లిప్తతే కారణమా?

  • 10 డిసెంబర్ 2018
చార్మినార్ Image copyright Getty Images

హైదరాబాద్‌లో ఓటింగ్ తగ్గడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చదువుకున్న వాళ్లు ఓటెయ్యడం లేదంటూ సోషల్ మీడియా సెటైర్లతో మార్మోగింది. ఇంతకీ హైదరాబాద్‌లో ఓటింగ్ తగ్గడానికి కారణం ఏంటి?

గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువ ఉండడం చాలా కాలం నుంచి జరిగేదే. కానీ హైదరాబాద్ నగరంలో ఓటింగ్ మరీ దారుణంగా పడిపోతూ వస్తోంది. మొన్నటి వరకూ చదువుకున్న వారు ఓటెయ్యరన్న అపవాదు ఉండేది. కానీ కారణం అదొక్కటే కాదు.. ఓటర్ల జాబితాలో లోపాలు, సొంతూరులో ఓటు వేయాలన్న ఉద్దేశాలు, కొన్ని ప్రాంతాల్లో నాయకత్వంపై నిర్లిప్తత, చివరగా ఓటరు నిర్లక్ష్యం.

ఓటరు జాబితాలో లోపాలు...

ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ప్రచురించే తుది ఓటర్ల జాబితా చాలాసార్లు తప్పులతో ఉంటోంది. కానీ ఈసారి ఆ తప్పులు చాలా ఎక్కువ జరిగాయి. ఈసారి ఓట్ల తొలగింపు విషయంలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగనంత రచ్చ జరిగింది. హైకోర్టు జోక్యం చేసుకుంది.

బూత్ లెవెల్ అధికారుల నిర్లక్ష్యమో, లేకపోతే సాంకేతిక తప్పిదమో కానీ వేల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. ఓటరు నమోదుకు హైకోర్టు అసాధారణంగా గడువు పెంచింది. మీపేరు జాబితాలో చెక్ చేసుకోండంటూ ఎన్నికల అధికారులు ప్రచారంతో ఊదరగొట్టారు. అయినా చివరి నిమిషంలో భారీగా ఓట్ల గల్లంతు చర్చ సాగింది.

Image copyright Facebook/Chief Electoral Officer Telangana

గల్లంతుతో పాటూ జాబితాలో మరో పెద్ద లోపం, చనిపోయిన వారు, వలస వెళ్లిన వారి ఓట్లు తీయకపోవడం. ఇటువంటి ఓట్లు ఎక్కువగా జాబితాలో ఉన్నప్పుడు కచ్చితంగా ఆ ఓట్లు పడవు కాబట్టి శాతం తగ్గుతుంది. ఓటరు వెరిఫికేషన్ పక్కాగా జరిగినప్పుడు ఈ సమస్య రాదు.

సొంతూరిలో ఓటింగ్...

హైదరాబాద్‌లో ఉంటున్న చాలా మంది నగరంలో ఒక ఓటు, తమ సొంతూళ్లలో ఒక ఓటు ఉంచుకుంటారు. హైదరాబాద్‌లో ఉన్న ఓటును ఐడీ ప్రూఫుగా వాడుతూ.. ఊరిలో ఓటు వేసే వారు చాలా మంది ఉన్నారు.

పల్లెల్లో ఎవరు ఓటు వేశారు? ఎవరు వేయలేదు? అన్న లెక్క సులువుగా తేలిపోతుంది. కులం, గ్రూపు, వర్గం, వీధి, కుటుంబం - ఇలా చాలా అంశాల ఆధారంగా రాజకీయం జరుగుతుంది కాబట్టి, స్థానిక నాయకులకు చాలా మంది గుర్తుంటారు కాబట్టి అక్కడ ఓటు వేయడానికి ఇష్టపడతారు ఓటర్లు.

హైదరాబాద్ లో ఓటు వేసినా వేయకపోయినా అడిగేవారు ఉండరన్న భావన కొందరిలో ఉంటుంది.

చిత్రం శీర్షిక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేరుతోనే సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు ఓట్లు ఉండటాన్ని బట్టి.. ఓటర్ల జాబితా తీరు ఎలా ఉందో అర్థమవుతోంది

ఓటరు నిర్లిప్తత...

హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా పాత నగరంలో ఓటింగ్ శాతం సగం కంటే తక్కువగా ఉంటోంది. చార్మినార్‌లో 40.18, యాకుత్ పురలో 41.24, మలక్ పేటలో 42.74, నాంపల్లిలో 44.02, జుబిలీహిల్స్‌లో 45.61, చాంద్రాయణగుట్టలో 46.11, సికింద్రాబాద్ కంటోన్మెంటులో 49.05 పోలింగ్ జరిగింది.

ఈ విషయంలో పాత నగరానికి, మిగిలిన హైదరాబాద్‌కీ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అతి తక్కువ ఓటింగ్ ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఐదు ఓల్డ్ సిటీకి సంబంధించినవే. అందులో నాలుగు నియోజవకర్గాల్లో అయితే 45 శాతం కూడా దాటలేదు.

వాస్తవానికి 80ల తరువాత నుంచీ క్రమంగా హైదరాబాద్‌లో ఓటింగ్ తగ్గిపోతుందంటున్నారు విశ్లేషకులు.

"1980 లలో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటింగ్ 90 శాతం ఉండేది. ఇప్పుడు 40 నుంచి 50 శాతానికి పడిపోయింది. ఎంఐఎంపై విరక్తితోనే జనం ఓటింగుకు రావడం లేదు" అన్నారు సియాసత్ పత్రిక ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ ఆమిర్ అలీ ఖాన్.

Image copyright Facebook/Chief Electoral Officer Telangana

ఓటరు నిర్లక్ష్యం...

ఇది ఎక్కువ మంది చెప్పే కారణం. పోలింగ్ రోజును సెలవు రోజుగా పరిగణించి ఊళ్లకు వెళ్లే వాళ్లు, వేర్వేరు కార్యక్రమాలు పెట్టుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు.

ఎంత మంది జాబితాలో సమస్యల వల్ల ఓటు వేయలేకపోయారో.. ఎంత మంది నిర్లిప్తత, నిర్లక్ష్యం వల్ల ఓటు వేయలకపోయారో స్పష్టంగా చెప్పటం కష్టం. కానీ గత ఎన్నికలతో పోలిస్తే నిర్లక్ష్యంతో ఓటు వేయని వారి సంఖ్య తగ్గుతోందనే వాదన వినిపిస్తోంది.

సోషల్ మీడియా సహా అనేక వేదికలపై ఓటు హక్కు గురించి ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అది కాస్త ఫలితం ఇచ్చింది.

ఓటరు జాబితా తప్పుల్లేకుండా చేయలేమా?

ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ దీనికి చట్టపరమైన సమస్యలెన్నో ఉన్నాయి. ఒకే వ్యక్తి పేరును వేర్వేరు స్పెల్లింగులతో నమోదు చేసుకుంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంది ఎన్నికల సంఘం.

దేవుడు, హీరోల ఫోటోలతో ఉన్న ఓటర్ కార్డుల వార్తలెన్నో చూశాం. ఓటరు జాబితాలో ఉన్న ఏ అంశాన్ని ప్రాతిపదకగా చేసుకునీ డూప్లికేషన్లు తీసేయలేం. ఎందుకంటే ఇంటి పేర్లతో సహా ఒకే పేర్లున్న వారు చాలా మందే ఉంటారు.

పోనీ బూత్ లెవెల్ అధికారులు ఇల్లిల్లూ తిరిగి స్పష్టమైన, తప్పుల్లేని సమాచారం సేకరిస్తారా అంటే.. ఇప్పటి వరకూ ఈ పద్ధతి కచ్చితంగా జరిగిన దాఖలాల్లేవు. ప్రతీసారీ బూత్ లెవెల్ అధికారుల నిర్లక్ష్యమో, లేక పనిభారమో లేక పక్షపాతమో ఓటర్ల జాబితాను ప్రభావితం చేస్తూనే ఉంది.

Image copyright Facebook/Chief Electoral Officer Telangana

మరి ఓటరు జాబితాను సమగ్రంగా తీర్చి దిద్దడానికి అందుబాటులో ఉన్న చవకైన ఏకైక మార్గం ఆధార్ అంటున్నారు కొందరు నిపుణులు.

ఆధార్‌లో ప్రతి ఓటరుకూ ఒక అంకె ఉంటుంది కాబట్టి ఒకరు రెండు ఓట్లు నమోదు చేసుకునే అవకాశం ఉండదు. కానీ చట్టపరంగా చూస్తే, ఆధార్ లేని కారణంగా ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును నిరాకరించజాలరు.

దీని కోసం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయాలి. పార్లమెంటులో బిల్లు పెట్టాలి. గతంలో ఎన్నికల సంఘం ఓటర్ కార్డ్ ఆధార్‌తో అనుసంధానం చేయడం ప్రారంభించి, సుప్రీంకోర్టు జోక్యంతో వెనక్కు తగ్గింది.

ప్రాథమిక హక్కులకు భంగం అంటూ దీన్ని ఆపారు కానీ, అంతకంటే మంచి వ్యవస్థను ఎవరూ చూపించలేకపోయారు.

ఓటరు జాబితాకీ, ఓటరు కార్డుకీ తేడా...

ఓటు గల్లంతయిన చాలా మంది ఫిర్యాదు, తమకు ఓటరు కార్డుందని చెప్పడం. కానీ చట్టపరంగా ఓటరు కార్డుకు ఎటువంటి విలువా లేదు. ఓటర్ జాబితాలో పేరుంటే చాలు.. ఓటరు కార్డు లేకపోయినా ఓటేయవచ్చు.

కానీ ఓటరు కార్డు ఉండీ.. జాబితాలో పేరు లేకపోతే చేయగలిగిందేమీ లేదు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న అవకాశాల ప్రకారం ఓటరు చేయగలిగింది ఒక్కటే.. ఎన్నికల ముందు ఓటరు జాబితాలో తన పేరు ఉందీ లేనిదీ చూసుకోవాలి.

మాకు కార్డు ఉంది కదా, గత ఎన్నికల్లో ఓటేశాం కదా అనుకుంటే ఏమైనా జరగొచ్చు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

ఆరు గంటలు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.. అయినా ఆమె ప్రాణం పోలేదు

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'