కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి: ‘కేసీఆర్ గెలుపు.. రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసెన్స్ కాదు’... కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ఓటమి

  • 11 డిసెంబర్ 2018
రేవంత్ రెడ్డి Image copyright revanthreddy.com

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారని చాలామంది భావించిన ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అనుముల రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు.

ఈ నియోజకవర్గం నుంచి ఇంతకుముందు వరుసగా రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా గెలిచిన రేవంత్‌రెడ్డి.. తాజా ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఆయన ఘోర పరాజయం చవిచూశారు.

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్నపుడు రేవంత్‌రెడ్డి 2015 తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో ఒక ఎంఎల్‌సీకి లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై అరెస్టై బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే.

అనంతరం 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. టీటీడీపీ శాసనసభా పక్ష నాయకుడిగా కూడా ఉన్న ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

Image copyright RevanthReddyFamily
చిత్రం శీర్షిక కొడంగల్‌లో రేవంత్ రెడ్డి అరెస్ట్ దృశ్యాలు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు లక్ష్యంగా తీవ్ర విమర్శలు సంధిస్తూ ‘ఫైర్ బ్రాండ్’గా పేరుపడ్డ రేవంత్.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఎన్నికల పొత్తులోనూ ఆయన ముఖ్య పాత్ర పోషించినట్లు చెప్తారు.

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు ముందు.. తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గంలో కేసీఆర్ ప్రచారాన్ని నిరసించాలంటూ పిలుపునివ్వటం, కేసీఆర్ ఎన్నికల సభకు ముందు రేవంత్‌రెడ్డిని నాటకీయంగా అరెస్ట్ చేయటం.. కలకలం రేపింది.

ఆది నుంచీ సంచలన రాజకీయాలకు పేరుపడ్డ రేవంత్‌రెడ్డి.. తన కంచుకోట వంటిదని భావించే కొడంగల్‌ నియోజకవర్గంలో ఓటమి పాలవటమూ సంచలనమైంది.

Image copyright Revanth Reddy Anumula/Facebook

రేవంత్‌రెడ్డి ప్రొఫైల్ ఇదీ...

జననం: 1969 నవంబర్ 8వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి

చదువు: ఎ.వి. కాలేజ్ నుంచి ఆర్ట్స్‌లో డిగ్రీ (బి.ఎ.)

వివాహం: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డి సోదరుడి కుమార్తెతో 1992లో వివాహం

విద్యార్థిగా: రేవంత్‌రెడ్డి విద్యార్థిగా ఉన్నపుడే.. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకుడిగా పనిచేశారు.

Image copyright fecebook/Revanth Reddy Anumula‎

రాజకీయ ప్రవేశం...

విద్యార్థిగా ఉన్నపుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగం ఏబీవీపీలో పనిచేశారు రేవంత్‌రెడ్డి. 2004లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు.

2006లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జెల్ మండలం నుంచి జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టిట్యుయెన్సీ (జడ్‌పీటీసీ) నుంచి పోటీ చేయటానికి టీడీపీ నామినేషన్ తిరస్కరించటంతో రేవంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. అలా సంచలన నాయకుడిగా వార్తల్లోకి వచ్చారు.

మళ్లీ 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంఎల్‌సీగా గెలిచారు. అనంతరం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిసి ఆ పార్టీలో చేరారు.

ఆ మరుసటి ఏడాది 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.

మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి మళ్లీ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, శాసనసభలో టీడీపీ సభాపక్ష నేతగా వ్యవహరించారు.

Image copyright Revanth Reddy Anumula

ఎంఎల్‌సీ ఎన్నికలు - అరెస్ట్...

2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ.. నామినేటెడ్ ఎంఎల్ఏ ఎల్విస్ స్టీఫెన్సన్‌కు రేవంత్‌రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఒక స్టింగ్‌-ఆపరేషన్ వీడియో సహా ఆరోపణలు రావటంతో యాంటీ-కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అదే నెల మే నెలాఖరులో రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసింది.

ఆయనతో పాటు.. బిషప్ సెబాస్టియర్ హ్యారీ, ఉదయ్ సింహా అనే మరో ఇద్దరి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో రేవంత్‌రెడ్డి 2015 జూలై ఒకటో తేదీన విడుదలయ్యారు.

Image copyright Facebook/Revanth Reddy Anumula

కాంగ్రెస్‌లో చేరిక.. ఎన్నికల్లో ఓటమి...

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలన్న యోచనలో ఉన్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో.. 2017 అక్టోబర్‌లో టీడీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అదే నెల చివరిలో రేవంత్‌రెడ్డి మరికొందరు టీడీపీ నాయకులతో సహా.. దిల్లీలో రాహుల్‌గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లలో రేవంత్‌రెడ్డి ఒకరుగా నియమితులయ్యారు. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలతో జట్టు కట్టిన కాంగ్రెస్ ప్రజా కూటమి పేరుతో ఎన్నికల్లో పోటీచేసింది.

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ప్రచారం చేశారు. ఎన్నికల్లో ప్రజా కూటమి పరాజయం పాలవటంతో పాటు.. రేవంత్‌రెడ్డి కూడా తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

అయితే.. ఎన్నికల ఫలితాల వెల్లడికి రెండు రోజుల ముందు.. కె.తారకరామారావును సవాల్‌ చేస్తూ కొడంగల్ నియోజకవర్గంలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని రేవంత్‌రెడ్డి పేర్కొనటం విశేషం.

Image copyright facebook/Revanth Reddy Anumula‎

‘‘కేసీఆర్ గెలుపు.. రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసెన్స్ కాదు’’

ఓటమి అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. కాంగ్రెస్, ప్రజాకూటమి ఓటమికి కారణాలు ఏమిటనేది కూలంకుషంగా సమీక్షించి, విశ్లేషించుకుంటామని చెప్పారు.

‘‘ఇందిరాగాంధీ, ఎన్.టి.రామారావు, చంద్రబాబునాయుడు, రాజశేఖరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పి.వి.నరసింహారావు వంటి వారు కూడా ఓడారు.. గెలిచారు. ఫలితాలు ఎట్లా ఉన్న ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాం. ప్రతిపక్షంలో మా బాధ్యత ఇంకా పెరుగుతుంది’’ అని పేర్కొన్నారు.

‘‘ఏదేమైనా.. చంద్రశేఖరరావు ఒక వేళ గెలిస్తే.. ఈ గెలుపును రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసెన్స్ ఇచ్చినట్లుగా భావించాల్సిన అవసరం లేదు. కుటుంబ పెత్తనానికి, కుటుంబ ఆధిపత్యానికి పట్టం కట్టినట్లుగా భావించాల్సిన అవసరం లేదు’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.

‘‘‘తక్షణమే అమరవీరుల కుటుంబాలను గుర్తించండి. మొట్టమొదటి శాసనసభలో మనం చేసిన తీర్మానాన్ని అమలు చేసే విధంగా, ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఎత్తివేసే విధంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులు చదువుకోవటానికి సముచితమైన అవకాశాలు కల్పించే విధంగా రైతుల ఆత్మహత్యలు ఆపేవిధంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిస్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నా. ఇప్పటికైనా ఫామ్‌హౌస్‌లో బందీ అయిన పరిపాలనను సచివాలయానికి తీసుకురావలసిందిగా సూచిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)