కేసీఆర్: ''చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు.. నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా'' - తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్

  • 11 డిసెంబర్ 2018
చంద్రబాబు నాయుడు, కేసీఆర్ Image copyright Getty Images

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంతరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం 4:30 గంటలకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మీడియా ముందుకు వచ్చారు.

టీఆర్ఎస్ గెలుపు గురించి, జాతీయ రాజకీయాల్లో పోషించబోయే పాత్ర గురించి తనదైన శైలిలో మాట్లాడారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. ముఖ్యాంశాలివీ...

‘‘తెలంగాణలో ప్రతిపక్షం పేరుతో చికాకు పెట్టారు. ఆ చికాకుల నుంచి బయటపడాలనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాం. పాలమూరు తల్లి పచ్చపైట కప్పుకున్నది.. అందుకే ప్రజలు మాకు గులాబీ కండువా కప్పారు. నాపై ఆరోపణలు చేసిన వారు మట్టిలో కలిసిపోయారు.

తెలుగు ప్రజలందరూ బాగుండాలని 100 శాతం కోరుకుంటున్నాం. దేశ రాజకీయాలు బాగుచేసే క్రమంలో 100 శాతం తెలుగువారంతా రెండు రాష్ట్రాలూ కలిసి పనిచేయాలి.

ఆంధ్రప్రదేశ్ నుంచి మాకివ్వాళ లక్ష పైగా ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. ఫోన్లు పగిలిపోయే పరిస్థితి. ‘మీరు ఏపీ రాజకీయాల్లోకి రావాల’ని అక్కడి ప్రజలు అడుగుతున్నారు. చంద్రబాబు ఇక్కడికి వచ్చి పనిచేశారు. మేం వెళ్లి అక్కడ పనిచేయొద్దా?

చంద్రబాబు తెలంగాణలో నాకు ఇచ్చిన గిఫ్ట్‌కు.. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే తెలంగాణ వాళ్లకు సంస్కారం లేదంటారు. నేను ఇస్తాను. దాని ప్రభావం ఏమిటో చూస్తారు. చంద్రబాబుకు పైత్యం ఉంది. చంద్రబాబు గురించి విజయవాడకే వెళ్లి చెప్తా.’’

Image copyright Facebook/KCR

తెలంగాణలో కోటి ఎకరాలు పచ్చబడాలి....

‘‘సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయం. ప్రతి ఒక్కరికీ శిరసు వహించి నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తున్నా. ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వహించే దిశగా మనం పనిచేయాలి. వృధా చేసే అధికారం మనకు లేదు.’’

ఎప్పటిలాగే వినయవిధేయలతో పనిచేద్దాం. కొత్త రాష్ట్రాన్ని ఒక బాటలో పెట్టాం. ఆ బాట గమ్యం చేరాలి. కోటి ఎకరాలు పంట పండాలి తెలంగాణలో. ఎన్నికల్లో కాళేశ్వరమా.. శనీశ్వరమా అని అడిగాను.. కాళేశ్వరమే కావాలని ప్రజలు తీర్పునిచ్చారు. రైతులకు ఏ బాధా లేకుండా చేస్తాం.

అనుకున్నన్ని ఉద్యోగాలు రావటం లేదని యువత బాధపడుతోంది. ఖాళీగా ఉన్న వేల ఉద్యోగాలు వేగంగా భర్తీ చేస్తాం. ప్రైవేటు సెక్టార్‌లోనూ ఉపాధి కల్పిస్తాం.

దళిత గిరిజనులు ఇంకా పేదరికంలో ఉండటం రాచపుండు లాంటిది. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు వేగంగా చర్యలు చేపడతాం. గిరిజనులకు భూమి సమస్య లేకుండా చేస్తాం. మైనారిటీలను కడుపులో పెట్టకుని చూసుకుంటాం. కులవృత్తులు కుదుట పడాలి. ప్రజల సమస్యలే కేంద్రంగా పనిచేస్తాం.

కంటి వెలుగు రూపంలో, కేసీఆర్ కిట్ రూపంలో ప్రారంభించినం. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేస్తున్నాం. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేస్తాం. కంటివెలుగు డాక్టర్ల తర్వాత ఈఎన్‌టీ డాక్టర్ల బృందం, డెంటల్ డాక్టర్ల బృందం, పాథలాజికల్ డాక్టర్లు వెళతారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు.. తెలంగాణ ఆరోగ్య స్థితి రికార్డవుతుంది.’’

Image copyright NArendraModi/KCR/FACEBOOK

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం...

''దేశ రాజకీయాల్లో కూడా పాత్ర వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఒక దిక్సూచి తెలంగాణ.

జాతీయ రాజకీయ చిత్రానికి కొత్త నిర్వచనం ఇస్తాం. ఒక మూస ధోరణిలో ఉంది. అది మారాలి. ఈ దేశంలో 100 శాతం కాంగ్రెసేతర, బీజేపీయేతర పాలన రావాలి. నేడు తెలంగాణ ఆ మార్గాన్ని దేశానికి చూపింది. తెలంగాణ కాంగ్రెసేతర, బీజేపీయేతర రాష్ట్రం. మేం తెలంగాణ ఏజెంట్లుగా పనిచేస్తాం.

దేశానికి కొత్త వ్యవసాయ విధానం కావాలి. త్వరలో దిల్లీ వెళతాను. దేశంలో కోట్ల మంది రైతులు అన్నమో రామచంద్రా అంటున్నారు. దేశ రైతులకు, యువతకు పిలుపునిస్తున్నాం. నిరాశవద్దు. రాజకీయాలు మారతాయి.

నేడు కొందరు డర్టీ పాలిటిక్స్, సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారు. నాలుగు పార్టీలను కలిపి అదే రాజకీయమంటున్నారు. మేం పార్టీలను కాదు.. పాలిటీని.. దేశ రాజకీయాలను ఐక్యం చేస్తాం.. దేశ ప్రజలను ఐక్యం చేయబోతున్నాం.’’

Image copyright Telangana CMO/Facebook

దేశ ప్రజలను ఐక్యం చేసే రాజకీయం మాది...

‘‘రాజకీయ పార్టీల కూటమి కట్టటం పనికిరాదు.. అది ముగిసిపోయింది. ప్రజలను ఐక్యం చేసే రాజకీయం కావాలి. ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశం అదే. దేశంలో 136 కోట్ల మంది గుండె మీద చేయి వేసుకుని నిద్రపోవాలి.

దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లుంటే.. తాగటానికి నీళ్లు లేవు.. పంటలకు నీళ్లు లేవు. కానీ జబ్బలు చరుచుకుంటారు. ఈ సిల్లీ, సెన్స్‌లెస్ పాలిటిక్స్ పనికిరావు.

భారత రాజకీయ ముఖచిత్రంలో ఒక సమూల మార్పు తెస్తాం. మా దగ్గర విస్తృత అంశాలు ఉన్నాయి. త్వరలో చాలా మందిని కలుస్తాం. మాట్లాడుతాం. గ్రూపులు కాదు. బీజేపీ ముక్త్ భారత్.. కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలి.

కొత్త ఆర్థిక నమూనా కావాలి. మహా రత్నాల కింద 9.50 లక్షల కోట్లు ఉన్నాయి మురిగిపోతున్నాయి. రిజర్వు బ్యాంకు దగ్గర 8.50 లక్షల కోట్లు ఉన్నాయి. దానిదగ్గర అవసరానికి రెండు, రెండున్నర లక్షలు సరిపోతాయి.

ఒక 15, 16 లక్షల కోట్లు మురిగిపోతున్నాయి. వాటిని సద్వినియోగం చేసే సోషియో ఎకానమిక్ అజెండా కాకుండా.. మందిర్, మజిద్ అంటూ ప్రజలను ఎంగేజ్ చేస్తున్నారు. మందిర్ ఇప్పటివరకూ ఎక్కడికి పోయింది? ఎన్నికలు వచ్చాయి కాబట్టి మందిర్ అంటున్నారు, సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు.

ఇవన్నీ మారిపోవాలి. త్వరలో చాలా క్రియాశీలంగా పనిచేస్తా. నెల రోజుల్లో దేశ రాజకీయాల్లో అద్భుతమైన గుణాత్మక మార్పు తీసుకొస్తాం.’’

Image copyright INCTelangana/facebook

రిజర్వేషన్లు వద్దని చెప్పటానికి నీ అయ్య జాగీరా?

‘‘కేంద్రాన్ని పరిపాలించిన రెండు పార్టీలూ ఇన్నాళ్లూ చెత్తగా పరిపాలించాయని నేను ఆరోపిస్తున్నా. నక్సలిజం ఎందుకుంది? టెర్రరిజం ఎందుకుంది? వైద్యం, విద్య, వ్యవసాయం, పట్టణాభివృద్ది.. వీటన్నిటి మీద దిల్లీ పెత్తనం ఎందుకు?

రాజ్యాంగంలో ఎక్కడుంది రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని. సుప్రీంకోర్టు తప్పు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇర్రెస్పాన్సిబుల్ జడ్జిమెంట్ ఇచ్చింది. దానిని ఎవరు ఆపాలి. కేంద్ర ప్రభుత్వం ఆపాలి. ప్రధానమంత్రికి సవినయంగా చాలాసార్లు చెప్పాను.

నా దగ్గర బీసీలు 52 శాతం ఉన్నారు. ఇప్పుడు అడుగుతున్నారు రిజర్వేషన్లు కావాలని. షెడ్యూల్డు ట్రైబ్స్ సంఖ్య తెలంగాణ ఏర్పడిన తర్వాత పెరిగింది. వారికి రిజర్వేషన్లు పెంచాలి. మేం పెంచుతాం అంటే వద్దనటానికి నువ్వెవరు? నీ అయ్య జాగీరా?

ఉమ్మడి జాబితా అనేది ఉండకూడదు. దాన్ని రద్దు చేయాలి. ఇంత పెద్ద దేశానికి ఒక్క సుప్రీంకోర్టు పెడతారా? ఇవన్నీ ఎప్పుడు మారతాయి?’’

అతి త్వరలో కొత్త జాతీయ పార్టీ రాబోతోంది...

‘‘మనం మారాల్సిన అవసరముంది. భారతదేశం మారాల్సిన సమయం వచ్చింది. ఎడున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. ఇంకెంత కాలం వేచివుండాలి?

ఇప్పుడు ప్రత్యామ్నాయం లేకపోవటం వల్ల కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో గెలిచింది. దేశ రాజకీయ వ్యవస్థకు సర్జరీ అవసరం.

అతి త్వరలో ప్రాంతీయ పార్టీల కన్సార్షియంతో ఒక జాతీయ పార్టీ ఏర్పడబోతోంది. పార్లమెంటు ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో వస్తాయి. కొత్త పార్టీకి ఈ సమయం సరిపోతుంది.

అందరినీ ఏకం చేయాలని మేం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థికవేత్తలతో మాట్లాడుతున్నాం. ఈ ప్రయత్నం మార్పు తెస్తుంది. దీనంతటినీ దిల్లీ వేదికగా ఆరంభిస్తాం. అక్కడే ప్రకటిస్తాం.

అసదుద్దీన్ ఒవైసీ ఈ దేశంలో ఒక మంచి మేధావి. ఆయన మతవాది కాదు. ఆయన లౌకిక రాజకీయ నాయకుడు. దీనిపై మేం మూడు గంటలు చర్చించాం. మేమిద్దరం కలిసే పనిచేస్తాం.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎక్కడికి పోవాలి...'

నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది

"డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు

శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు