టీజేఎస్ భవిష్యత్తు ఏంటి? కోదండరాం బీబీసీతో ఏమన్నారంటే..

  • 12 డిసెంబర్ 2018
ప్రొఫెసర్ కోదండరాం Image copyright Facebook/Telangana Jana Samithi Party

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) కన్వీనర్‌ కోదండరాం సారథ్యంలో స్థాపించిన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఈ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేదు.

కాంగ్రెస్, టీడీపీ, సీపీఐతో కలిసి ప్రజాకూటమిలో భాగంగా టీజేఎస్ 8 స్థానాల్లో పోటీ చేసింది.

కోరిన సీటు లభించని కారణంగా కోదండరాం ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మెదక్‌ (ఉపేందర్‌రెడ్డి), మల్కాజిగిరి (కపిలవాయి దిలీప్‌కుమార్‌), వర్ధన్నపేట (పగిడిపాటి దేవయ్య), వరంగల్‌-ఈస్ట్‌ (గాదె ఇన్నయ్య), సిద్ధిపేట (భవానీరెడ్డి) నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు.

ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోదండరాం టీజేఏసీలో క్రియాశీలమయ్యారు. ఉద్యమ సంఘం రాజకీయాల్లోకి రావటంపై అనేక తర్జనభర్జనల అనంతరం గత మే నెలలో వివిధ ప్రజా సంఘాలతో టీజేఎస్‌ ఏర్పడింది.

Image copyright Facebook/Telangana Jana Samithi Party

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాలతో ఏర్పడిన ఈ పార్టీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

మొదట అన్ని అసెంబ్లీ సీట్లలోనూ టీజేఎస్ ఒంటరిగా పోటీ చేస్తుందని పార్టీ నాయకులు చెప్పారు. కానీ కాంగ్రెస్‌తో కలిసి ప్రజాకూటమిగా ఎన్నికలకు వెళ్లారు. కేవలం 8 సీట్లలో మాత్రమే పోటీచేశారు. కూటమి తరఫున కోదండరాం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ,ఒక్క నియోజకవర్గంలోనూ గెలుపు దక్కలేదు. ఆ పార్టీకి మొత్తంగా కలిపి 95,364 ఓట్లు మాత్రమే వచ్చాయి.

Image copyright Facebook/Telangana Jana Samithi Party

‘‘మా అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాం...’’

''మేం ప్రజలకు సామాజిక, రాజకీయ జీవితాన్ని ఇవ్వగల ఒక అజెండాను తయారు చేసుకున్నాం. ఆ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినంత విస్తృతంగా తీసుకెళ్లలేకపోయామని అనుకుంటున్నా. మిగతా అంశాలన్నీ మేం సమీక్షించుకుంటాం'' అని ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కోదండరాం పేర్కొన్నారు.

''మా పార్టీ మే నెలలోనే ఏర్పాటైంది. ఎన్నికల నాటికి పార్టీని విస్తృతంగా నిర్మించుకోలేకపోయాం. మా ఉద్యమం ఆగిపోలేదు. టీజేఎస్ యథావిధిగా కొనసాగుతుంది. మా బాధ్యత ఇంకా పెరిగిందని భావిస్తున్నాం'' అని భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్పారు.

''ఈ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన.. మేం ఆశించిన విలువలు ఓడినవని మేం అనుకోవటం లేదు. ఏ ఆశయాల కోసం తెలంగాణ కోసం కొట్లాడామో.. ఆ ఆశయాల కోసం ప్రయత్నం కొనసాగిస్తాం'' అని పేర్కొన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)