ఆంధ్రప్రదేశ్‌: టీడీపీకి కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా, ఉండదా

  • 12 డిసెంబర్ 2018
నారా చంద్రబాబునాయుడు Image copyright Nara Chandrababu Naidu/Facebook

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ఘోర పరాజయం నేపథ్యంలో కూటమి భాగస్వామ్యపక్షమైన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌తో బీబీసీ తెలుగు మంగళవారం సాయంత్రం ఫేక్‌బుక్ లైవ్‌ నిర్వహించింది. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు...

''నందమూరి హరికృష్ణ కుటుంబంపై టీడీపీ నాయకత్వానికి అంత ప్రేమ ఉంటే హరికృష్ణ కుమార్తె, కూకట్‌పల్లి అభ్యర్థి సుహాసినికి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు కదా, ఓడిపోయే స్థానంలో ఆమెను ఎందుకు నిలబెట్టారు'' అంటూ తెలంగాణ మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్య రాజకీయ ప్రయోజనాలను ఆశించి, కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని అపోహలు సృష్టించేందుకు చేసినదని రవీంద్ర కుమార్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు.

తెలంగాణలో ప్రజాకూటమి ఏర్పాటు వెనక ఉన్న ఉద్దేశం గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ మాట్లాడారని, రాజకీయ ప్రత్యర్థిగా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం సహజమేనని ఆయన చెప్పారు.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడే 'సేవ్ డెమోక్రసీ', 'సేవ్ నేషన్' అనే నినాదాలు వినిపిస్తారనే విమర్శలపై ప్రశ్నించగా, ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవని, రాష్ట్రానికే ఉన్నాయని ఆయన బదులిచ్చారు.

Image copyright Facebook

'ఓటమిలో చంద్రబాబు ప్రచారం పాత్ర లేదు'

ప్రజాకూటమి పరాజయంలో చంద్రబాబునాయుడి ప్రచారం పాత్ర లేదని రవీంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్‌తో పొత్తును సమీక్షించుకుందామనిగాని, వైసీపీ, జనసేన మాదిరి పోటీకి దూరంగా ఉండుంటే బాగుండేదనిగాని టీడీపీకి అనిపించిందా అని అడగ్గా- అలాంటి పరిణామంగాని, పరిస్థితిగాని ఉత్పన్నం కాదని ఆయన బదులిచ్చారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు తెలంగాణ ఎన్నికల కోసం పెట్టుకున్నది కాదని, తెలంగాణ ఎన్నికలతో విడిపోయేది కాదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పొత్తు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పెట్టుకున్నదని, కేవలం ఎన్నికలకు పరిమితమైనది కాదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా అని ప్రశ్నించగా- ఆయా ప్రాంతాల్లో ఆయా పార్టీల ఉనికిని బట్టి పొత్తులు అవసరమా, లేదా అనేది అప్పుడున్న పరిస్థితులను బట్టి టీడీపీ నిర్ణయించుకొంటుందని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు అంశం ఇంకా చర్చకు రాలేదని తెలిపారు.

బీజేపీని నిలువరించడానికి తాము కాంగ్రెస్‌తో కలిసి చేస్తున్న సమష్టి కార్యాచరణకు కట్టుబడి ఉంటామని రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు. ఇంటర్వ్యూ వీడియోను ఇక్కడ చూడొచ్చు:

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)