తెలంగాణలో కమ్యూనిస్టులు: శాసించే స్థాయి నుంచి శూన్యానికి..

  • 12 డిసెంబర్ 2018
కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు Image copyright Getty Images

తెలంగాణ చరిత్రలో కమ్యూనిస్టులకు ప్రత్యేక స్థానం ఉంది. రైతాంగ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఎర్రజెండా ఇక్కడ రెపరెపలాడింది.

అయితే, నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలకు నేటి తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.

తెలంగాణలో తొలిసారి కమ్యూనిస్టులు లేని శాసన సభ ఏర్పాటుకాబోతోంది.

ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పార్టీ ప్రజాకూటమిలో భాగస్వామిగా చేరింది. మూడు స్థానాల్లో పోటీ చేసింది.

సీపీఎం పార్టీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్‌) పేరుతో కూటమిగా ఏర్పడి 26 స్థానాల్లో బరిలోకి దిగింది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆ పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉన్న హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు.

ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఒడితల సతీశ్ కుమార్‌ 1,17,083 ఓట్లు సాధించి విజయం సాధించారు. 46,553 ఓట్లతో చాడ వెంకట్ రెడ్డి ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు.

ఇక బెల్లంపల్లిలో ఈ పార్టీ తరఫున పోటీ చేసిన గుండా మల్లేశ్ మూడో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన దుర్గం చిన్నయ్య 55,026 ఓట్లుతో తొలిసారి విజయం సాధించారు. ఆయన తర్వాత స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసిన గడ్డం వినోద్ (43750 ఓట్లు), స్వతంత్ర అభ్యర్థి కె వేదప్రకాశ్ (10684ఓట్లు) నిలిచారు. సీపీఐ నుంచి పోటీ చేసిన మల్లేశ్ 3905 ఓట్లు సాధించి నాల్గో స్థానంలో నిలిచారు.

వైరా నుంచి ప్రజాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన బానోతు విజయ మూడో స్థానంలో నిలిచారు. ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎల్ రాములు విజయం సాధించారు. ఆయనకు 52,650 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బానోతు మదన్ లాల్ రెండోస్థానంలో నిలిచారు.

సీపీఎంది అదే పరిస్థితి

బహుజన్ లెఫ్ట్ కూటమిగా ఏర్పడి 26 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం కూడా ఈ సారి ఎన్నికల్లో ఖాతా తెరవలేదు.

ఒక్క భద్రాచలం నియోజకవర్గంలోనే ఆ పార్టీ అభ్యర్థి మిడియం బాబురావు 14,228 ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచారు.

మిగిలిన 25 స్థానాల్లో ఆ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

సీపీఎం ప్రధాన భాగస్వామిగా ఉన్న బీఎల్‌ఎఫ్ కూటమి కూడా 119 నియోజకవర్గాల్లో కలిపి కేవలం 0.7 శాతం ఓట్లను సాధించింది.

Image copyright Getty Images

గతమెంతో ఘనం

నాటి హైదారాబాద్ రాష్ట్రంలో 1952లో తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్‌గా ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీలు 175 స్థానాలకుగాను 77 స్థానాల్లో పోటీ చేసింది. 42 చోట్ల విజయం సాధించి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.

కానీ, ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీలు తమ బలాన్ని కోల్పోతూ వస్తున్నాయి.

2014లో తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల నుంచి కేవలం ఇద్దరే గెలుపొందారు.

సీపీఐ 7 స్థానాల్లో పోటీ చేసి దేవరకొండలో గెలుపొందింది. అక్కడి అభ్యర్థి రవీంద్రకుమార్‌ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. సీపీఎం మొత్తం 37 స్థానాల్లో పోటీ చేసి కేవలం భద్రాచలంలో విజయం సాధించింది.

'ధన రాజకీయాల వల్లే ఓటమి'

ఎన్నికలు కార్పొరేట్‌మయం అయ్యాయని, డబ్బుంటేనే పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుందని, అందువల్లే కమ్యూనిస్టు పార్టీలు ఎన్నికల్లో గెలవలేకపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి బీబీసీతో అన్నారు.

ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని నిరోధించడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని అన్నారు.

''తాత్కాలిక భ్రమల్లో ప్రజలు ఉంటున్నారు. జాతి ప్రయోజనాలు కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిస్థితి మారాలి'' అని పేర్కొన్నారు.

తెలంగాణలో ప్రజాకూటమే ప్రధాన ప్రతిపక్షంగా ఉందని, భవిష్యత్తులోనూ కూటమి పార్టీలన్నీ కలసిపోటీ చేస్తాయని అన్నారు.

Image copyright Getty Images

'తెలంగాణ ప్రజలతో మమేకమయితేనే'

కమ్యూనిస్టు సిద్ధాంతాల మూలాల్లోకి వెళ్లి మళ్లీ జనాలకు దగ్గరైతేనే వామపక్ష పార్టీలకు మనుగడ ఉంటుందని సీపీఐ సీనియర్ నేత బీపీఆర్ విఠల్ అన్నారు.

'తెలంగాణలోనే కాదు కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో కూడా కమ్యూనిస్టు పార్టీలు అధికారం కోల్పోయాయి. తెలంగాణ ప్రజలతో మమేకం కావడంలో వారు విఫలమయ్యారు. అందుకే ఒక్క సీటు కూడా తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది' అని ఆయన విశ్లేషించారు.

ఇతర పార్టీలతో పొత్తులు ముఖ్యమేనని అయితే వాటికోసం ప్రయత్నం చేయకుండా ప్రజాపోరాటాల్లో భాగం అయితేనే కమ్యూనిస్టు పార్టీలకు భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు.

'తెలంగాణ రాష్ట్రాన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకించింది. అందుకే ఆ పార్టీ ఇక్కడ ప్రజల నుంచి దూరమైంది. ఇక సీపీఐ తెలంగాణకు మద్దతిచ్చినా పెద్దగా పోరాడలేదు. దాంతో ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదు' అని విఠల్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)