మహాకూటమి ఓటమిలో చంద్రబాబు పాత్ర ఎంత :అభిప్రాయం

  • 13 డిసెంబర్ 2018
నారా చంద్రబాబునాయుడు Image copyright Facebook/Nara Chandrababu Naidu

తెలంగాణ ప్రజ ప్రభంజనంతో ప్రతిధ్వనించింది. కాంగ్రెస్-తెలుగుదేశం విచిత్ర ఒప్పందం సక్రమం కాదని ఢంకా బజాయించి చెప్పింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఈ కొత్త రాష్ట్రం ఆశించిన ప్రయోజనాలను నెరవేర్చుతుందని పూర్తిగా నమ్మింది. అందుకే, ఇంత పెద్ద ఆమోద తీర్పు. 119 స్థానాల్లో 88 గెలిచింది అధికార పార్టీ,

ప్రత్యేక రాష్ట్రం కోసం 58 సంవత్సరాలు పోరాడిన ప్రజలు ఆ పోరాట ఫలితాలను కాంగ్రెస్ - తెలుగుదేశం నాయకత్వంలోని పార్టీల పొత్తు రక్షిస్తుందని నమ్మలేకపోయారు. తెరాస సరైన దిక్కు అని నమ్మారు.

కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో తెలంగాణ ప్రభజనం లేదు. తెరాస కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నించి చేరలేకపోయింది. తెలంగాణ కోసం పోరాడింది తెరాస అయినా, ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కు దక్కింది. ఈ రెండు కలిస్తే వారికి సానుకూల పవనాలు వీస్తాయనుకున్నారు. కానీ, వారు ప్రత్యర్థులైపోయారు.

మరొక వైపు తెలుగుదేశం చాలా వ్యూహాత్మకంగా బీజేపీతో చేతులు కలిపి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి పెద్ద ఎత్తులే వేసింది. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన పార్టీగా బీజేపీకి ఉన్న సానుకూలతను ఓట్లు గా మార్చుకోవడానికి ఈ పొత్తు తెలుగుదేశానికి ఉపయోగపడుతుందని భావించారు. అంతేకాదు అప్పుడప్పుడే దేశమంతటా రాజుకుంటున్న మోదీ అనుకూల పవనాలను కూడా వాడుకుందామనుకున్నారు. అందుకే, బీజేపీ తెదేపా కూటమి తెరాసకు మరో పక్కనుంచి సవాలు విసిరింది.

Image copyright trspartyonline/facebook

ఎవరితో పొత్తు లేకుండా, అప్పుడే పుట్టిన రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి తెరాస ఒంటరిగా సాహసం చేసింది. పక్కాగా పనిచేసే కార్యకర్తల సైన్యం, బూత్ స్థాయిదాకా విస్తరించిన శాఖోపశాఖలు, పార్టీని జిల్లాజిల్లాలో నిలబెట్టగలిగిన బలీయమైన నాయకులున్న తెదేపా పార్టీకి బీజేపీ తోడైతే ఇంకేం కావాలి? గెలిచి తీరుతామని ఆశించారు. అందుకే 2014లో తెరాస గెలిచినా ఆ పార్టీ విజయాలు 63 దగ్గర ఆగిపోయాయి. అధికారాన్ని అందుకోలేకపోయినా కాంగ్రెస్, తెదేపా, బీజేపీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి.

2018లో పరిస్థితులు మారాయి. నాలుగేళ్లు పరిపాలించిన తెరాస, 2019 ఎన్నికలలో బీజేపీతో భవిష్యత్తును ముడిబెట్టుకోవడం తగదనుకున్నది. తెరాస నాయకుడు ఎన్నికలను ముందుకు జరిపించుకుని కాంగ్రెస్ కు సవాలు విసిరాడు. ప్రతిపక్షంగా తన ఉనికిని చాటుకుంటూ అధికారానికి జరిగే పోటీలో ప్రత్యర్థిగా నిలబడడానికి ఉవ్విళ్లూరినా తగిన తయారీలో లేని కాంగ్రెస్ ఉలిక్కిపడింది. అప్పడికి సగం ఏర్పాట్లు చేసుకుని, అభ్యర్థులను కూడా ప్రకటించి, ప్రచారాన్ని సైతం ప్రారంభించింది తెరాస.

మొదటి దశ ప్రచారమంతా సంక్షేమ పథకాలు, పింఛన్లు, రైతు బంధు, బలహీన వర్గాలకు సహాయ పథకాలు, సాగునీటి పారుదల, రెప్పపాటు కూడా కోతలేని విద్యుచ్ఛక్తి ప్రవాహం గురించి కెసిఆర్ విస్తారంగా వివరిస్తూ వెళ్లారు.

ఈలోగా కాంగ్రెస్‌కు అనుకోని మిత్రుడు దొరికాడు. ఆయనే చంద్రబాబు. తన తరువాత ఆంధ్రప్రదేశ్ ను దశాబ్దాల పాటు ఏలిన మరొక పార్టీ అయిన తెదేపా తన పొత్తు కోరుకోవడమే పెద్ద విజయంగా కాంగ్రెస్ భావించింది.

తెలంగాణ కోసం నిస్వార్థంగా పోరాడిన ప్రొఫెసర్ కోదండరాంకు మొదటినుంచి రాజకీయ లక్ష్యాలు లేకపోయిఉండవచ్చు. రాజకీయాల్లోకి రాక తప్పని పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టారు. కాంగ్రెస్ తో చేతులు కలిపారు. సిపిఐ కలిసింది. కూటమి ఏర్పడింది. ఇది ఎన్నికల సమయంలో గణనీయమైన పరిణామమే. అధికార పార్టీ కాస్త నిలబడి తీక్షణంగా వీక్షించవలసిన పరిస్థితి ఇది.

కాంగ్రెస్ చేతి కోసం తెలుగుదేశం చేతులు చాచి రాకముందు ఈ కూటమి బలీయంగా ఉన్నా, తెదేపాతో ఇంకా బలపడి మహాకూటమి అయినట్టు భావించారు. రాజకీయాలలో దశాబ్దాల అనుభవం ఉన్న పెద్దలు గణిత శాస్త్రం రాజకీయాలకు వర్తించదని ఊహించలేదు. ఓట్ల రాజకీయాల్లో ఒకటి తో మరొకటి కూడితే రెండు కావాలని లేదు. సున్నా కావచ్చు, లేదా వారి వారి గత చరిత్రను బట్టి మైనస్ రెండు కూడా కావచ్చు. అదే అయ్యింది.

Image copyright Twitter/N Chandrababu Naidu

తెలుగుదేశం గెలిచిన స్థానాలు నిజానికి ఆ పార్టీకి బలీయమైన కేంద్రాలుగా ఉండాలి. కాని తెరాస ఆ ఎంఎల్యేలను లాగేసింది. తెదేపా మరొక అభ్యర్థిని తయారుచేసుకునే లోగానే ఎన్నికలు ఎదురొచ్చాయి. కాంగ్రెస్ తెదేపాల మధ్య జరగవలసిన ఓట్ల మార్సిడి జరిపించుకునే శక్తి ఆ రెండు పార్టీలకు ఉందా? ఉంటే పనిచేసిందా? అంటే అనుమానమే.

''ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల తెలుగు వారందరి శ్రేయోభిలాషిని నేను'' అని చెప్పుకుంటూ ''కృష్ణా నదిలో నీళ్లు లేవు. గోదావరి పంచుకుందాం... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలం కలిసి ఉందాం'' అని చంద్రబాబు తెలంగాణ ప్రచారంలో నొక్కి వక్కాణించడం, ఇక్కడి జనులను భయభ్రాంతులను చేసింది.

దీని అర్థం ఏమిటి? కృష్ణా నదిలో తెలంగాణకు రావలసిన వాటా ఇవ్వరా? పైగా గోదావరిని కూడా పూర్తిగా తీసేసుకుంటారా? తెలంగాణలో పారే ఈ రెండు నదుల నీళ్లు ఈ బీళ్లకు అందవా? తెలంగాణ పోరాటానికి మూల కారణమైన సాగునీటి అన్యాయం సొంత రాష్ట్రం వచ్చినా తీరదా అని అనుమానపు రవ్వలు చెలరేగాయి.

చంద్రబాబును భుజాలమీద ఎక్కించుకుని వస్తే రాహుల్ ను రానిస్తామా అని కెసిఆర్ విసిరిన ప్రశ్నలు ఆ నిప్పు రవ్వలను మరింత రాజేసాయి. ''నేను రాష్ట్రం నుంచి తరిమేసిన చంద్రబాబు మళ్లీ వస్తున్నాడు. కానీ, ఈ సారి ఆయన్ని పంపించే బాధ్యత మీది'' అనే మాటలతో కెసిఆర్ రెండో దశ ప్రచారం సాగింది.

విలన్ లేని సినిమాగా మొదలైన ఎన్నికల రంగస్థలానికి ప్రతినాయకుడిని కాంగ్రెస్ సృష్టించింది. సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ఉద్వేగం తోడైంది. సెంటిమెంటు ఘాటు తగిలింది. ఆ తరువాత చంద్రబాబు తిరిగిన ప్రతిచోటా, ఆయన చెప్పిన ప్రతిమాటా తెలంగాణ జల ప్రయోజనాలకు తగిలే దెబ్బలనిపించాయి. తెరాస నేతలు తెలివిగా ఈ బూచిని పెంచి చూపాయి. తెలంగాణ శిశువును కూటమి పాలు చేయొద్దని ప్రచారం సాగించారు.

ఆ విధంగా మహాకూటమి ప్రచార సమరానికి చంద్రబాబు శల్యసారథ్యం నష్టదాయకంగా మారింది. మూడు ఉత్తరాది రాష్ట్రాలలో అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదిగిన కాంగ్రెస్ తెలంగాణలో కోలుకోలేని దెబ్బకు గురైంది. .

కుల విభజన

తెలంగాణలో వెనుకబడిన కులాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని నేరుగా డబ్బు ప్రయోజనాలను అందించింది తెరాస సర్కార్. యాదవ కులాలకు, బెస్తవారికి, బీడీ కార్మికులకు రకరకాల పథకాలు రచించారు. కులాల వారీగా లాభాలు చేకూర్చడంతో పాటు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ వంటి ప్రయోజనాలను - ఇళ్లకు, బ్యాంకు ఖాతాలకు చేర్చారు. దీనికి తోడు రైతు బంధు ద్వారా ప్రతి రైతుకు ఎనిమిది వేల రూపాయల సరఫరా జరిగింది. ఓట్లకోసం ప్రత్యేకంగా డబ్బు ఇవ్వాల్సిన అవసరం రాకుండా చూసుకున్నారు. అయితే డబ్బు పంపిణీ జరగలేదని కూడా చెప్పలేము.

వెలమ కులానికి వ్యతిరేకంగా రెండు అగ్రవర్ణాల వారు జతగట్టారని బాహాటంగానే అనుకున్నారు. దీని వల్ల వారి బలం పెరిగినా, వారి వ్యతిరేక సామాజిక వర్గాలను తెరాసవైపు తరలించింది. కులాలవారీ ఓటర్లలో అంతర్లీనంగా విభజనలు జరిగిపోయి ఉండవచ్చు.

Image copyright Asaduddinowaisi/facebook

మతాల ప్రభావం

మజ్లిస్ పాతబస్తీలో పెద్ద ఓటు బ్యాంకును పెంచుకుని ఓవైసీ అన్నదమ్ములకు అనుయాయులకు ఏడు పక్కా గెలుపు స్థానాలను తయారు చేసుకున్నాయి. ఆ ఏడింటితో కూడిన హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఒవైసీ పెద్దన్నకు ఎన్నాళ్లనుంచో అంకితం అని అందరికీ తెలిసిందే.

ఈ పార్టీకి మతం ఓట్లే పునాది, ఒవైసీ కుటుంబమే ఒక ఆశ్రయం. ఈ పార్టీ తెరాసకు పూర్తిగా సహకరించింది. ఏ విధంగా అంటే ఏడెనిమిది స్థానాల్లో తప్ప ఎక్కడా పోటీ చేయకుండా. దాంతో మిగిలిన అన్ని స్థానాల్లో ముస్లింలంతా మూకుమ్మడిగా తెరాసకు ఓట్లు వేయాలనేది వ్యూహం. ఫలితాలు చూస్తే అదే జరిగి ఉంటుందనిపిస్తుంది.

మజ్లిస్ అభ్యర్థులకు పోటీగా కొందరు హిందూ అభ్యర్థులను నిలబెట్టి తెరాస వారు జాగ్రత్తగా ముస్లిం వ్యతిరేక ఓటర్లను చీల్చి రుణం తీర్చుకుని ఉండవచ్చు.

ఇక ఎన్నడూ లేంది... భాజపా దాదాపు అన్ని స్థానాల్లో పోటీచేసి తాను జాతీయ పార్టీనని చాటుకుంది. కాని ఒంటరిగా ఒకటి రెండు స్థానాలు కూడా గెలిచే బలం ఉందా లేదా అనే అనుమానాస్పద స్థితికి జారిపోయింది. అన్ని స్థానాల్లో పోటీ చేయడం ద్వారా తెరాస వ్యతిరేక ఓటును చీల్చి తెరాసకు ఇతోధిక సాయం చేసింది భాజపా. ఇది బహిరంగ రహస్యం. దానికి రుజువు పోలింగ్ ముగియగానే తెరాసకు భాజపా తన మద్దతు ప్రకటించడమే.

మీడియా

మహాకూటమికి అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాయి. కూటమి ఏర్పడినప్పటి నుంచి దానికి అనుకూలంగా ఈ మీడియా సంస్థలు వ్యవహరించాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా మీడియా సంస్థలు ఇలాంటి పాత్రనే పోషించాయన్న విమర్శలు ఉన్నాయి.

చంద్రబాబు ''జాతీయ'' స్థాయి ప్రత్యామ్నాయ వ్యూహాల వల్ల ఆయన తెలంగాణ పర్యటనకు మీడియా ఊపు, జాతీయ స్థాయి ప్రచారం లభించింది. కానీ, అది బెడిసి కొట్టింది.

తెలంగాణ రాష్ట్ర సింహాసనం తెరాసకు మళ్లీ దక్కినా, నేర్చుకోవలసి పాఠాలు లేకుండా లేవు. సచివాలయంలో సింహానసం ఎక్కి అధికార ఉద్యోగి గణం చేత నిర్విరామంగా పనిచేయించగలడనే విశ్వాసాన్ని ప్రజలకు కలిగించలేదనే విమర్శలను గుర్తించాలి. ఉద్యోగాల నియామకాలను నిర్లక్ష్యం చేయకూడదు. నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తయి పొలాలను జలాలు తడపాలి. తెలంగాణ కోటి రతనాల వీణ కావడానికి ఈ ఘన విజయం పునాది కావాలి. ప్రజాస్వామ్యం నిలబడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)