తమిళనాడు: టాయిలెట్ కట్టించలేదని తండ్రి మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏడేళ్ల చిన్నారి

  • 13 డిసెంబర్ 2018
టాయిలెట్ కోసం ఫిర్యాదు
చిత్రం శీర్షిక టాయిలెట్ కోసం తండ్రిపైనే ఫిర్యాదు చేసిన హనీఫా జారా

ఇంట్లో టాయిలెట్ కట్టిస్తానని చెప్పిన తండ్రి మాట తప్పారని ఒక ఏడేళ్ల పాప పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమిళనాడుకు చెందిన హనీఫా జారా అనే చిన్నారి పోలీసులకు ఇచ్చిన లేఖలో మోసం చేసిన తండ్రిని అరెస్టు చేయాలని కోరింది. ఆరుబయట మలవిసర్జనకు వెళ్లడం సిగ్గుగా ఉందని తెలిపింది.

భారత్‌లో టాయిలెట్ల కొరత ఉండడంతో సుమారు 50 కోట్ల మంది ఆరుబయట మలవిసర్జనకు వెళ్తున్నారు.

ఇంట్లో టాయిలెట్లు ఉన్నా చాలామంది వాటిని ఉఫయోగించడం లేదు.

హనీపా అంబూర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. వారి ఇంట్లో టాయిలెట్ లేదు.

చుట్టుపక్కల ఉన్న కొంతమందికి మాత్రమే ఆ సౌకర్యం ఉందని హనీఫా బీబీసీ ప్రతినిధితో చెప్పింది. అందుకే నర్సరీ చదుతువున్నప్పటి నుంచీ తండ్రిని తమ ఇంట్లో కూడా టాయిలెట్ కట్టించాలని అడిగానంది.

"మలవిసర్జనకు బయటికి వెళ్తున్నప్పుడు అందరూ నావైపు చూస్తుంటే నాకు సిగ్గుగా అనిపించేది" అని హనీఫా చెప్పింది. ముఖ్యంగా బహిరంగ మలవిసర్జన వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి స్కూల్లో చెప్పడంతో పాప ఇంట్లో కూడా టాయిలెట్ కట్టించాలని తండ్రిని చాలాకాలం నుంచి కోరుతోంది.

చిత్రం శీర్షిక హనీఫా పోలీసులకు రాసిన లేఖ

మోసం చేసిన నాన్నను అరెస్ట్ చేయండి

పోలీసులకు ఇచ్చిన లేఖలో క్లాసులో ఫస్ట్ వస్తే ఇంట్లో టాయిలెట్ కట్టిస్తానని తండ్రి తనకు మాటిచ్చాడని హనీఫా తెలిపింది.

"నేను నర్సరీ నుంచి క్లాస్ టాపర్‌గా ఉన్నాను. ఇప్పుడు సెకండ్ క్లాస్ చదువుతున్నా. కానీ, ఇంకా కట్టిస్తాననే చెబుతున్నాడు, అది మోసం చేసినట్లే అవుతుంది. అందుకే దయచేసి మా నాన్నను అరెస్టు చేయండి" అని హనీఫా పోలీసులను కోరింది. ఒకవేళ అరెస్టు చేయకపోతే టాయిలెట్ ఎప్పుడు కట్టిస్తాడో చెబుతూ ఆయన సంతకంతో ఒక లేఖ ఇప్పించాలని కోరింది.

"టాయిలెట్ కట్టడం ప్రారంభించానని, కానీ దాన్ని పూర్తి చేయడానికి డబ్బు సరిపోలేదని" హనీఫా తండ్రి ఎహ్సానుల్లా బీబీసీకి చెప్పారు. ఆయన ప్రస్తుతం ఎలాంటి ఉపాధీ లేకుండా ఉన్నారు.

"నాకు కాస్త సమయం కావాలని నేను హనీఫాకు చెప్పాను. కానీ నేను మాట నిలబెట్టుకోలేదని, తను నాతో మాట్లాడ్డమే ఆపేసింది".

కానీ హనీఫాకు కూడా విసిగిపోయింది. "ఒకే దాని కోసం నేను నాన్నను ఇంకా ఎంత కాలం అడగాలి. ఎప్పుడడిగినా డబ్బులు లేవనే చెబుతూ వస్తున్నారు. అందుకే పోలీసుల దగ్గరికి వెళ్లాను" అంటోంది.

సోమవారం తల్లి మెహరీన్‌తో కలిసి హనీఫా స్కూల్ దగ్గరే ఉన్న ఒక పోలీస్ స్టేషనుకు వెళ్లింది. తండ్రిపై ఫిర్యాదు చేసింది.

"పాప స్కూల్ బ్యాగ్ నిండా తన ట్రోఫీలు, మెరిట్ సర్టిఫికెట్లు తీసుకువచ్చింది. వాటన్నింటినీ నా టేబుల్ పైన పెట్టింది. తర్వాత మీరు నాకు టాయిలెట్ కట్టించి ఇవ్వగలరా అని అడిగింది" అని స్టేషన్ పోలీసు అధికారి వాలమర్తి బీబీసీతో ఇన్నారు.

ఎహ్సానుల్లాను స్టేషనుకు పిలిపించగానే, పాపకు, భార్యకు ఏదైనా అయ్యిందేమో అని ఆయన కంగారుగా అక్కడికి వచ్చాడని ఆమె చెప్పారు. కూతురు తనపై ఫిర్యాదు చేసిందని తెలిసి ఆశ్చర్యపోయాడన్నారు.

చిత్రం శీర్షిక హనీఫా ఫిర్యాదు గురించి జిల్లా అధికారులకు చెప్పిన పోలీసులు

జిల్లా అధికారులను కదిలించిన లేఖ

పాప వివరంగా రాసిన ఆ లేఖ చదివిన తర్వాత, అధికారులకు లేఖలు ఎలా రాయాలో హనీఫా తనను చూసి నేర్చుకుందని ఆ తండ్రి చెప్పారు.

గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అధికారులకు, రాజకీయ నేతలకు తానే లేఖలు రాస్తుంటానని, అది చూసిన పాప ఇప్పుడు తనపైనే ఫిర్యాదు చేస్తూ లేఖ రాసిందని పోలీసులకు చెప్పాడు.

హనీఫా రాసిన లేఖతో ఆమెపై అందరికీ సానుభూతి పెరగడంతోపాటు, పోలీసులు కూడా చిన్నారికి అండగా నిలిచారు.

"ఆమె ఫిర్యాదులో నిజాయితీ ఉంది. అందుకే మేం దాన్ని పరిష్కరించాలని ప్రయత్నించాం" అని పోలీసులు చెప్పారు.

హనీఫా ఉంటున్న గ్రామంలో 500 టాయిలెట్లు కట్టడానికి నిధులు మంజూరు చేసేలా ఈ లేఖ జిల్లా అధికారులను కూడా అప్రమత్తం చేసింది.

"పాప ఫిర్యాదు చూసి సంతోషంగా ఉంది. స్కూళ్లలో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసిన టాయిలెట్ లేని వారు వాటిని తల్లిదండ్రులను గట్టిగా అడగాలని మేం విద్యార్థులను ప్రోత్సహించాం అని సిటీ కమిషనర్ పార్థసారథి బీబీసీకి చెప్పారు.

జాతీయ స్వచ్ఛ భారత్ కోసం పాపతో స్థానికంగా ప్రచారం చేయించాలని అనుకుంటున్నట్టు కూడా వారు చెప్పారు.

చిత్రం శీర్షిక టాయిలెట్ పూర్తి చేయడానికి డబ్బు లేదంటున్న హనీఫా తండ్రి

89 శాతం గ్రామీణులు వ్యతిరేకం

ప్రభుత్వం 2019లోపు ప్రతి కుటుంబానికి టాయిలెట్ అందించాలనే లక్ష్యం నిర్దేశించుకుంది. కానీ దానికి కాస్త ప్రతిఘటన ఎదురవుతోంది.

ఇటీవల జరిగిన ఒక సర్వేలో, టాయిలెట్లు శుభ్రం చేయడం, లేదా వాటికి దగ్గరగా ఉండడం ఇష్టం లేదని 89 శాతం గ్రామీణ ప్రాంతాల ప్రజలు చెప్పినట్లు తేలింది.

సమాజంలో కులం, అంటరానితనం పాతుకుపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఈ సర్వే చేసిన వారు అంటున్నారు.

శతాబ్దాలుగా మానవ వ్యర్థాలు శుభ్రం చేసే పనులను తక్కువ కులం వారే చేస్తూ వస్తున్నారు.

తన లేఖకు ఇంత స్పందన వచ్చినందుకు సంతోషంగా ఉన్నట్లు హనీఫా చెప్పింది.

గత పది రోజులుగా ఎహ్సానుల్లాతో మాట్లాడని హనీఫా పోలీసులు నచ్చజెప్పడంతో చివరికి తన తండ్రిపై కోపం వీడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు