'ప్రధాని మోదీ ఆ ముగ్గురినీ నాపైకి ఎగదోస్తున్నారు'-చంద్రబాబు :ప్రెస్‌ రివ్యూ

  • 14 డిసెంబర్ 2018
చంద్రబాబు Image copyright NOAH SEELAM/Getty Images

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగ్గురినీ తనపైకి ఎగదోస్తున్నారని, బీజేపీ ఓటమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని చంద్రబాబు చెప్పినట్లు ఈనాడు ఒక వార్తా కథనం ప్రచురించింది.

కేసీఆర్‌, జగన్‌, పవన్‌కల్యాణ్‌లతో ప్రధాని మోదీ నాటకాలాడిస్తున్నారని, వారిని మనపైకి ఎగదోస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు.

గురువారం విశాఖ జిల్లా తగరపువలసలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సభలో చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

తాజా ఎన్నికల్లో బీజేపీకి కంచుకోటైన మూడు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంలో టీడీపీ కృషి ఎంతో ఉందని వివరించారు.

కొందరు నాయకులు కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారని ఈనాడు తెలిపింది.

ప్రజల సహకారం ఉన్నంతవరకు తమను ఎవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని, ఇందులో భాగంగానే బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నామని అన్నారని ఈనాడు కథనం పేర్కొంది.

Image copyright Twitter/Telangana CMO

రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీదీయాలి: కేసీఆర్

రాష్ట్ర సమస్యలపై నిర్లక్ష్యం చూపిస్తున్న కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు నమస్తే తెలంగాణ ఒక కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ కోటా సాధించేందుకు పార్లమెంటు వేదికగా పోరాటంచేయాలని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన పార్టీ ఎంపీలకు సూచించారు.

రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సి ఉందని అన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినా కేంద్రం నుంచి ఇంతవరకు సానుకూల స్పందన లేదని ఆయన ఎంపీలతో అన్నట్లు కథనం తెలిపింది.

రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటినీ సాధించడానికి పార్లమెంట్ వేదికగా పోరాడాలని ఎంపీలకు సూచించారు.

గురువారం సాయంత్రం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగింది.

ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

ప్రధానంగా కేంద్రంవద్ద పెండింగ్‌లో ఉన్న 52 అంశాలపై కేసీఆర్ ఎంపీలతో చర్చించినట్టు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

Image copyright Getty Images

ఫలితాలు రాగానే మళ్లీ పెట్రో ధరల పెంపు

ఎన్నికల ఫలితాలు వచ్చేయడంతో కేంద్రం మళ్లీ పెట్రోల్ ధరలు పెంచిందని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో, అలా పెట్రో ధరలు పెరిగాయి. దాదాపు రెండు నెలలపాటు పెట్రో ధరల పెంపు జోలికి వెళ్లని కేంద్రం ఎన్నికల ఫలితాలు వెల్లడైన రెండు రోజులకే బాదుడు షురూ చేసింది.

అక్టోబరు మధ్యలో దేశంలో పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో బాదుడు ఆపిన కేంద్రం చమురు ధరలను తగ్గిస్తూ వచ్చింది.

గత రెండు నెలల్లో 15 శాతం ధరలు తగ్గాయి అని కథనంలో చెప్పారు.

రెండు నెలలపాటు పెంపు జోలికి వెళ్లని కేంద్రం గురువారం పెట్రో ధరలను స్పల్పంగా పెంచింది.

ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.70.20 నుంచి రూ.70.29కి చేరుకుంది. ముంబైలో 11 పైసలు, చెన్నైలో 13 పైసలు పెరిగింది. ఫలితంగా ముంబైలో రూ.75.91, చెన్నైలో రూ.72.94కు చేరుకుంది. హైదరాబాద్‌లో కూడా 11 పైసలు పెరిగి 74.55 రూపాయలకు చేరుకుంది.

అయితే, విచిత్రంగా కోల్‌కతాలో మాత్రం 90 పైసలు తగ్గింది.

ఇక, నాలుగు మెట్రో సిటీల్లో మూడింటిలో డీజిల్ ధరల్లో మాత్రం రెండు రోజులుగా ఎటువంటి మార్పు లేదు.

ఢిల్లీ, ముంబై, చెన్నైలలో డిజిల్ ధరల్లో యథాతథంగా కొనసాగుతున్నాయి. కోల్‌కతాలో మాత్రం లీటర్ డీజిల్‌పై రూపాయి తగ్గి 66.40కు చేరుకుందని ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

Image copyright Getty Images

మరణశిక్ష పడిన ఖైదీల హక్కుల్ని కాపాడండి: సుప్రీంకోర్టు

మరణ శిక్ష పడిన ఖైదీలకు కూడా వారి కుటుంబాన్ని, న్యాయవాదులను, మానసిక వైద్యుల్ని కలిసే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

మరణ శిక్ష పడిన ఖైదీల హక్కుల్ని అన్ని దశల్లోనూ కాపాడాల్సిన అవసరముందని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

సాధారణ ఖైదీలకు జైళ్లలో కల్పించే హక్కులనే మరణ శిక్ష పడిన ఖైదీలకు కూడా వర్తింపచేయాలని దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్‌ మదన్‌ బి లాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

మరణశిక్ష పడ్డ ఖైదీలను ప్రత్యేక సెల్‌లోనూ, ఏకాంత చెరలోనూ ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని కూడా ఆ వ్యాజ్యంలో పేర్కొన్నట్టు పత్రిక తెలిపింది.

మరణ శిక్ష పడిన ఖైదీపై కనీస మానవత్వాన్ని చూపాలని జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్, దీపక్‌ గుప్తాల ధర్మాసనం అభిప్రాయపడింది.

మరణ శిక్ష పడిన ఖైదీల హక్కులను ప్రతి దశలోనూ పరిరక్షించాల్సిన అవసరముందని కోర్టు స్పష్టం చేసింది.

తాజా తీర్పు ప్రకారం దేశంలోని అన్ని జైళ్లల్లో ఉన్న నియమనిబంధనలకు ఈ మేరకు మార్చుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఇది అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జైళ్లు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించినట్లు సాక్షి కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)