కమల్‌నాథ్, నవీన్ పట్నాయక్: ఒకప్పటి క్లాస్‌మేట్స్.. నేడు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు

  • 14 డిసెంబర్ 2018
నవీన్ పట్నాయక్, కమల్ నాథ్ Image copyright Getty Images

తొమ్మిది సార్లు ఎంపీగా పనిచేసి, 72 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి సిద్ధమవుతున్నదొకరు.. పద్దెనిమిదేళ్లుగా ముఖ్యమంత్రి పీఠంలోనే కొనసాగుతున్నది మరొకరు.

రెండు వేర్వేరు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరూ 54 ఏళ్ల కిందట ఒకే బడిలో, ఒకే తరగతిలో కలిసి చదువుకున్నారు.

వారు ఇంకెవరో కాదు... పదిహేనేళ్ల బీజేపీ పాలనకు ముగింపు పలికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న కాంగ్రెస్ నేత కమల్‌నాథ్.. ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్‌లు.

అవును... మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కమల్‌నాథ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయిక్‌లు ఇద్దరూ క్లాస్ మేట్స్.

డూన్ స్కూల్‌ నేస్తాలు

కమల్ నాథ్, నవీన్ ఇద్దరూ ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత డూన్ స్కూల్‌లో కలిసి చదువుకున్నారు.

వీరిద్దరూ 1964లో అక్కడ ఒకే తరగతిలో చదువుకున్నారు.

ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ కూడా వీరి సహాధ్యాయే.

కాగా 2009లో తుపాను ధాటికి ఒడిశా తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో కేంద్రంలో రవాణా మంత్రిగా కమల్ నాథ్ ఉన్నారు.

ఆ సమయంలో ఒడిశాలో జాతీయ రహదారుల పునర్నిర్మాణానికి రూ.20,500 కోట్ల నిధులు సాధించడంలో నవీన్ తమ బాల్య స్నేహాన్ని చక్కగా వాడుకున్నారని చెబుతారు.

Image copyright FACEBOOK/KAMALNATH

తొమ్మిది సార్లు ఎంపీ.. ఇక సీఎం

కాగా కమల్ నాథ్ 1980లో లోక్‌సభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టి ఇప్పటివరకు 9 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

పర్యావరణ, రవాణా, జౌళి, పట్టణాభివృద్ది, పార్లమెంటరీ వ్యవహారాలు, వాణిజ్య శాఖలకు మంత్రిగానూ పనిచేశారు.

మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ఆయన్నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది కాంగ్రెస్ పార్టీ. డిసెంబరు 17న ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Image copyright FB/KAMALNATH

ఆలస్యంగా వచ్చినా పాతుకుపోయారు

కమల్ నాథ్‌ కంటే బాగా ఆలస్యంగా నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి వచ్చారు.

జనతాదళ్ నేత, ఒడిశా మాజీ సీఎం బిజూ పట్నాయక్ కుమారుడైన నవీన్ పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినా 1997 వరకు రాజకీయాలను ఏమాత్రం దగ్గరకి రానివ్వలేదు.

అయితే, రాజకీయాల్లోకి ఆలస్యంగా వచ్చినా కొద్దికాలంలోనే సొంత పార్టీ పెట్టి సీఎం అయిపోయారు.

1997లో తండ్రి బిజూ పట్నాయక్ మరణంతో రాజకీయ ప్రవేశం చేసిన నవీన్ తండ్రి మరణంతో ఖాళీ అయిన అస్కా స్థానం నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. తొలిసారే వాజపేయి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు.

అయితే, ఏడాది కాలంలోనే జనతాదళ్ నుంచి బయటకొచ్చి బిజూ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. 1998, 1999ల్లో వరుసగా వచ్చిన ఎన్నికల్లో అస్కా నుంచే 12, 13వ లోక్‌సభలకు ఎన్నికయ్యారు.

అనంతరం 2000లో ఒడిశా రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పొత్తుతో పోటీ చేసి ఆ రాష్ట్రానికి సీఎం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారాయన.

ఒకప్పుడు ఇరుగుపొరుగు రాష్ట్రాలే..

మధ్యప్రదేశ్, ఒడిశాలు ప్రస్తుతం ఇరుగుపొరుగు రాష్ట్రాలు కానప్పటికీ 2000 సంవత్సరానికి మునుపు ఈ రెండు పక్కపక్క రాష్ట్రాలే.

2000లో మధ్య ప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో భౌగోళికంగా మధ్యప్రదేశ్, ఒడిశాల మధ్య దూరం పెరిగింది.

ముగ్గురు ముఖ్యమంత్రులది ఒకే స్కూల్

కాగా త్వరలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమల్ నాథ్‌తో కలుపుకొంటే ప్రస్తుతం దేశంలోని ముగ్గురు ముఖ్యమంత్రులు డూన్ స్కూల్‌లో చదివినవారే.

కమల్ నాథ్, నవీన్‌లు ఇద్దరూ క్లాస్ మేట్స్ కాగా.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వీరి కంటే నాలుగేళ్ల ముందు అంటే, 1960 బ్యాచ్ డూన్ స్కూల్ విద్యార్థి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)