లబ్‌ డబ్బు: నోట్లు ముద్రించటంతో పాటు ఆర్‌బీఐ ఇంకా ఏం చేస్తుంది?

  • 15 డిసెంబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionనోట్లు ముద్రించటంతో పాటు ఆర్‌బీఐ చేసే పనులేంటి?

ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు వార్తల్లో నిలిచింది. ఆర్‌బీఐని బ్యాంకులకు బ్యాంకు అని కూడా అంటారు. అసలు, రిజర్వ్ బ్యాంకు పోషించే పాత్రేంటి? దాని బాధ్యతలేంటి? అనే విషయాలను ఈ వారం లబ్ డబ్బులో చర్చిద్దాం.

బ్యాంకులకే బ్యాంకు

1934 నాటి భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం ప్రకారం 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంకు ఏర్పాటైంది. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. గవర్నర్ అక్కడే ఉంటారు.

విధానాల రూపకల్పన కూడా అక్కడే జరుగుతుంది. ఆర్‌బీఐ భారత ప్రభుత్వానికి బ్యాంకర్‌గా ఉంటుంది. అట్లాగే అన్ని బ్యాంకుల ఖాతాలు కూడా ఆర్‌బీఐ వద్ద ఉంటాయి. అందుకే దీన్ని బ్యాంకులకే బ్యాంకు అని పిలుస్తారు.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ 1935లో ఏర్పాటైంది. ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయం 1937 నుంచి ముంబయిలో ఉంది. 1949లో జాతీయీకరణ తర్వాత నుంచి ఇది కూడా ఒక ప్రభుత్వ సంస్థగా ఉంది.

Image copyright బీబీసీ
చిత్రం శీర్షిక ప్రభుత్వం నోట్ల రద్దులాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆర్‌బీఐ రంగంలోకి దిగుతుంది.

నోట్ల రద్దు గురించి మీ అందరికీ బాగా తెలిసిందే కదా. ఏటీఎంలు, బ్యాంకుల ముందు పొడవాటి క్యూలు, రోజురోజుకూ మారిపోయే డెడ్‌లైన్లు, కొత్త కరెన్సీ రావడం, వెంటనే అయిపోవడం... అన్నీ గుర్తున్నాయి కదా. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆర్‌బీఐ వెంటనే రంగంలోకి దిగుతుంది.

ముద్రణ, నియంత్రణ

ఆర్‌బీఐ కరెన్సీ నోట్లను విడుదల చేస్తుంది. నగదు ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. పాతబడిన, చినిగిపోయిన నోట్లను రద్దు చేసే అధికారం కూడా ఆర్‌బీఐకే ఉంటుంది.

ఆర్‌బీఐ ముద్రించే ప్రతి నోటుకు బదులుగా దాంతో సమాన విలువ కలిగిన బంగారాన్ని లేదా ఆస్తిని ప్రభుత్వం ఆర్‌బీఐలో జమ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆర్‌బీఐ దాని విలువకు సమానమైన నోట్లను ముద్రిస్తుంది. ప్రతి నోటుపై ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది.

ముద్రణాలయం నుంచి కొత్త నోట్లు మొదట ఆర్‌బీఐ కార్యాలయానికీ, అక్కడి నుంచి కరెన్సీ చెస్ట్‌లోకి, ఆ తర్వాత బ్యాంకులకు చేరుతుంటాయి.

Image copyright Getty Images

వడ్డీ రేట్ల నియంత్రణ

ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది. గవర్నర్ అధ్యక్షతలో ఆరుగురు సభ్యుల కమిటీ రెపో రేట్‌ను నిర్ణయిస్తుంది. బ్యాంకులు ఇచ్చే రుణాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి. ఆ తర్వాతే బ్యాంకులు తమ వినియోగదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. అంటే మనమంతా బ్యాంకుల నుంచి తీసుకునే గృహ రుణాలు, వాహన రుణాల వడ్డీ రేట్లు ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయన్నమాట.

Image copyright Getty Images

ఆర్‌బీఐ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బ్యాంకర్‌గా పని చేస్తుంది. అంటే, వాటి కోసం ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఎంత నగదు ఉంచాలనేది కూడా నిర్ణయించేది ఆర్‌బీఐనే. మార్కెట్లో నగదు తగ్గిపోయినప్పుడు ఆర్‌బీఐ కరెన్సీ సరఫరాను కూడా పెంచుతుంది.

Image copyright Reuters

విదేశీ మారకం రేటును స్థిరంగా ఉంచడం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ విదేశీ కరెన్సీల కొనుగోలు, అమ్మకాలు చేస్తుంది. దేశంలోని విదేశీ మారక నిల్వలను కాపాడుతుంది. అంటే దేశంలో డాలర్ల నిల్వలు తగ్గిపోకుండా చూసే బాధ్యత కూడా ఆర్‌బీఐ పైనే ఉంటుందన్న మాట.

బ్యాంకుల్లో, బ్యాంకింగ్ వ్యవస్థలో ఎలాంటి మోసాలు జరక్కుండా, ప్రజల డబ్బు సురక్షితంగా ఉండేలా చూసేందుకు అవసరమైన నిబంధనల్ని కూడా రూపొందించేది ఆర్‌బీఐనే.

Image copyright Getty Images

ఇటీవల వేర్వేరు కారణాల వల్ల ఆర్‌బీఐ వార్తల్లో నిలిచింది. రఘురామ్ రాజన్ నుంచి గవర్నర్ పదవి నుంచి నిష్క్రమణ నుంచీ, ఉర్జిత్ పటేల్ రాజీనామా వరకూ అన్నీ చర్చనీయాంశాలుగానే మారాయి.

గత నలభై ఏళ్లలో గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి ఉర్జిత్ పటేల్. ఆయన తన పదవీ కాలం పూర్తి కావడానికి ముందుగానే బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)