భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ

వీడియో క్యాప్షన్,

భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ

భారత్ లో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ డేటా ఇప్పుడు చాలా చౌకగా లభిస్తుండటంతో యువకులు ఆన్ లైన్‌లో పోర్న్ చూడటం పెరిగిపోయింది.

పోర్న్ చూడటం ఒక్కటే కాదు, బలాత్కారాలు, లైంగిక దాడులకు సంబంధించిన వీడియోలు చిత్రీకరించడం, వాటిని ఆన్ లైన్‌లో షేర్ చేయటం కూడా పెరిగింది.

దేశంలో పెరుగుతున్న పెడధోరణిపై బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఫొటో సోర్స్, Getty Images

భారత యువత మునుపెన్నడూ లేనిస్థాయిలో ఆన్‌లైన్‌లో పోర్న్ చూస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పోర్న్ సైట్‌గా చెప్పే ‘పోర్న్ హబ్‌’కు అమెరికా, బ్రిటన్‌ల తర్వాత మూడో అతి పెద్ద వినియోగదారు భారతదేశమే. భారత్‌లో తమ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని ఆ సైట్ చెబుతోంది.

పోర్న్ వీక్షణ భారతీయ యువకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కనుగొనే ప్రయత్నం చేశారు ఆదిత్య గౌతమ్ అనే రచయిత. తన సొంత అనుభవాన్నీ జోడిస్తూ ఆయన దీనిపై ఓ పుస్తకం రాశారు.

మూడేళ్ల కిందట తానో అందమైన అమ్మాయితో డేటింగ్ చేసేవాడినని... కొన్నాళ్ల తరువాత ఆమెను చూసినా తనకు ఎలాంటి స్పందనలు కలిగేవి కావని, కానీ, పోర్న్ చూస్తే మాత్రం వెంటనే ఉత్తేజితుణ్నయ్యేవాణ్నని ఆయన చెప్పారు.

ఆదిత్య తన పుస్తక రచన కోసం సాగించిన పరిశోధనలో ఇలాంటివే ఎన్నో దిగ్భ్రాంతికరమైన అంశాలు బయటపడ్డాయి.

ఆన్‌లైన్‌లో ఇండియన్ పోర్న్ అని వెతికితే ఫోన్లలో లేదా వెబ్‌క్యామ్‌లలో చిత్రీకరించిన రియల్ లైఫ్ ఫోర్న్ వీడియోలే ఎక్కువగా కనిపిస్తాయి. వీటిలో చాలా వరకు ఆ మహిళల అంగీకారం లేకుండా తీసినవే.

రేప్ వీడియోలు, రేప్ పోర్నోగ్రఫీ కూడా ఆన్‌లైన్‌లో విపరీతంగా అందుబాటులో ఉన్నాయి.

కొద్ది నెలల క్రితం ఓ పదహారేళ్ల యువతిని దాదాపు పది మంది యువకులు లైంగికంగా వేధిస్తుండగా, వారిలో ఒక వ్యక్తి వీడియో తీయగా సోషల్ మెసేజింగ్ యాప్స్‌లో ఆ వీడియో పదుల లక్షల మందికి చేరింది. ఆ దారుణం జరిగిన బీహార్‌లోని ప్రాంతానికి ఈ వ్యాస రచయిత దివ్య ఆర్య వెళ్లారు.

దేశంలోని మిగతా అన్ని సంప్రదాయ గ్రామీణ ప్రాంతాలలాగే, ఇక్కడ కూడా తక్కువ ధరకు లభించే స్మార్ట్‌ఫోన్లు, చౌక ఇంటర్నెట్ డేటాతో పోర్న్ కంటెంట్‌ కుప్పలుతెప్పలుగా అందుబాటులోకి వచ్చిందని.. ఫలితమే ఈ పోర్న్ వీక్షణ, ఇలాంటి బరితెగింపు ఘటనలు అని ఆమె అభిప్రాయపడ్డారు.

‘‘గత రెండేళ్లలో స్మార్ట్‌ఫోన్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. మా ప్రాంతంలోని పిల్లవాళ్లపై ఇంటర్నెట్‌తో చాలా చెడు ప్రభావం పడింది. కేవలం 10 శాతం మంది మాత్రమే ఫోన్లను సమాచారం కోసం వాడుకుంటున్నారు. మిగిలిన వాళ్లంతా వీడియోలు చూడడానికే వాటిని వాడుతున్నారు’’ అని అక్కడి దుకాణదారు సుజయ్ ప్రసాద్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

కాగా కొన్ని పోర్న్ సైట్లను నిషేధించాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటిలోని కంటెంట్ లైంగిక దాడులను ప్రేరేపించేలా ఉందని ప్రభుత్వం చెబుతోంది.

అయితే, ద ఈక్వల్ కమ్యూనిటీ ఫౌండేషన్ వంటి కొందరి అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. యువకులతో సెక్స్ గురించీ, అంగీకారం గురించీ చర్చించడం ద్వారానే మార్పు సాధ్యమని అంటున్నారు వారు.

దూరం నుంచి అమ్మాయిల వైపు చూసి వెకిలి నవ్వు నవ్వడం, వారిపై లైంగికపరమైన వ్యాఖ్యలు చేయడం కూడా వేధింపుల కిందకే వస్తుంది.

భారత్‌లో లైంగిక విద్యకు సంబంధించిన కార్యక్రమాలు రూపొందుతున్నప్పటికీ వాటి అమలు తీరు ఏ మాత్రం సరిగా లేదు. కాబట్టి మహిళల పట్ల పురుషుల వైఖరుల్లో మార్పు రావాలంటే ఇంకా చాలా కాలమే పడుతుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)