ఫోనీ: తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?

  • 2 మే 2019
తుపాను Image copyright Getty Images

తుపాను వచ్చినపుడు ఏం చేయాలి? తుపాను నుంచి ఎలా తప్పించుకోవాలి? తుపాను రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భారత వాతావరణ శాఖ చెబుతున్న సూచనలు మీ కోసం.

  • తుపాను వస్తుందన్న సమాచారం అందిన వెంటనే ఇంటి నిర్మాణాన్ని తనిఖీ చేయాలి. పెంకులు, పైకప్పు, తలుపులు, కిటికీలు ఎలా ఉన్నాయో చూసి తగిన మరమ్మతులు చేయాలి.
  • ఇంటి పరిసరాలనూ పరిశీలించాలి. ఎండిన చెట్లు, కూలిపోయే అవకాశం ఉన్న చెట్లను తొలగించాలి. గాలికి ఎగిరి వచ్చి పడే అవకాశమున్న హోర్డింగ్‌లు, ఇతర భారీ వస్తువులను తొలగించాలి.
  • కిటికీల దగ్గర, గాజు పదార్థాలకు ముందు చెక్కలను అడ్డుగా పెట్టాలి. దీని వల్ల గాలికి కొట్టుకుని వచ్చి తగిలే వస్తువుల నుంచి వాటికి, ఇంటికి రక్షణ లభిస్తుంది.
  • ఒకవేళ చెక్క పదార్థాలు లేకుంటే.. కిటికీలకు, గాజు పదార్థాలకు కాగితాలను అంటించాలి.
  • కరెంటు పోయి నపుడు వెలుగు కోసం లాంథర్లు, కిరోసిన్ దీపాలు, ఇతర ఫ్లాష్ లైట్లు, బ్యాటరీలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
  • పాడైన, శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను వెంటనే తొలగించాలి.
  • కరెంటు పోయినపుడు టీవీలు పని చేయవు. మరి వాతావరణ సంబంధిత హెచ్చరికలు అందుకోవడం ఎలా? అందుకోసం మొబైల్ ఫోన్లను చార్జ్ చేసి పెట్టుకోవాలి. లేకుంటే రేడియోలను సిద్ధం చేసుకోవాలి. మీకు అందిన తుపాను సంబంధిత అధికారిక సమాచారాన్ని ఇతరులకూ చేరవేయాలి.
  • విపత్తు సమయాల్లో వదంతులు వ్యాపించే అవకాశం ఎక్కువ. అందువల్ల మీకు అధికారిక వెబ్ సైట్లు వార్తా సంస్థలు అందించిన సమాచారాన్నే ఇతరులకు చేరవేయండి. అనుమానాస్పద సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దు.
  • భారీ అలలు ఎగసి పడే అవకాశమున్న సముద్రతీరాల వద్ద తుపాను సమయంలో ఉండకూడదు.
  • వరద వచ్చే అవకాశం ఉన్న చోట ఉంటే.. వెంటనే ఖాళీ చేసి పునరావాస శిబిరాలు, లేకుంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. విలువైన వస్తువులను వీలైతే తీసుకెళ్లాలి. లేకుంటే ఎత్తైన చోట ఉంచాలి.
  • వండాల్సిన అవసరం లేకుండా వెంటనే తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని రెండు మూడు రోజులకు సరిపడా సిద్ధం చేసుకోవాలి. అలాగే సురక్షిత తాగునీరు, దుస్తులు కూడా.
  • గాలి బలంగా వీస్తున్నపుడు దానికి ఎదుటివైపు తలుపులను, కిటికీలను తెరవకూడదు. గాలి ప్రభావం లేని వైపు తలుపులు, కిటికీలు తెరవవచ్చు.
  • మీరున్న చోట నుంచి తుపాను తీరం దాటుతున్నా లేకుంటే తీరం దాటి వస్తున్నా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గంటల పాటు భారీ వర్షాలు, బలమైన గాలులకు సిద్ధంగా ఉంటూ సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలి. చిన్నారులను మరింత సురక్షిత ప్రదేశాలకు పంపాలి.
Image copyright Getty Images
  • వేలాడే విద్యుత్తు తీగలు కనిపిస్తే వాటిన తాక వద్దు. ఆ ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితి అదుపులోకి వచ్చాక రిపేర్లు చేయించుకోవచ్చు.
  • మీరు జాగ్రత్తగా ఉన్న సమాచారాన్ని మీ బంధువులకు చేరవేయాలి. వాహనాలను జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)