భారత కరెన్సీ నోట్లను నేపాల్ ఎందుకు నిషేధించింది?

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్ ప్రభుత్వం వంద కంటే ఎక్కువ విలువ చేసే భారత నోట్లపై నిషేధం విధించింది.
అంటే నేపాల్‌లో వంద నోటు కంటే పెద్ద నోట్లు చెల్లవు. నిషేధం ముందు వరకూ నేపాల్‌లో స్థానిక కరెన్సీతోపాటు భారత నోట్లు కూడా చెలామణిలో ఉండేవి.
అయినా, నేపాల్ హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఇటీవల నేపాల్ మంత్రుల సమావేశం జరిగింది. అందులో 200, 500, 2000 విలువైన భారత నోట్లు నేపాల్‌లో చెలామణి చేయడం చట్టవిరుద్ధం అని నిర్ణయించారు. దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నేపాల్ దీనికి ఎలాంటి కారణం చెప్పలేదు. నేపాల్ తరఫున విడుదలైన అధికారిక ప్రకటనలో కూడా ఎలాంటి కారణాలూ పేర్కొనలేదు. అలాంటప్పుడు నేపాల్ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
నేపాల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇప్పటివరకూ స్పష్టంగా తెలీలేదని కాట్మండు సీనియర్ జర్నలిస్ట్ యువరాజ్ ఘిమ్రే చెప్పారు.
దీని ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉండే భారత వ్యాపారులకు సమస్యగా మారింది. దీనివల్ల భారత్‌కు ఏదైనా నష్టం ఉంటుందని నాకు అనిపించడం లేదు. రెండు దేశాల మధ్య పనులు, వ్యాపారం చేసుకునే ఇరు దేశాల ప్రజలపై ఈ ప్రభావం పడుతుంది అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
నిర్ణయంతో ప్రభావం పడుతుందా?
నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకూ ఆచరణీయం. ఈ నిర్ణయం వల్ల ప్రజలు వంద కంటే ఎక్కువ నోట్ల లావాదేవీలు ఆపేస్తారా? అన్న ప్రశ్నకు ఘిమ్రే స్పందిస్తూ.. "ప్రభుత్వం నిర్ణయం వల్ల ప్రభావం ఉంటుందా, అనే ప్రశ్న చాలా కీలకం. అది కూడా ఈ నోట్లు ఇచ్చేవాళ్లకు కాదు, తీసుకునేవారికే సమస్య ఉంటుంది" అన్నారు.
అయితే భారత్ నోట్లపై నేపాల్ నిషేధం విధించడానికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉందని ఘిమ్రే అంటున్నారు.
"1999లో భారత పర్యాటకుల విమానాన్ని తీవ్రవాదులు హైజాగ్ చేసినపుడు, భారత ప్రభుత్వం వినతితో నేపాల్ 500 నోట్లపై బ్యాన్ విధించింది. ఇక భారత్ నోట్లరద్దు తర్వాత నేపాల్‌లో కోట్ల విలువైన పాత 500, 1000 నోట్లు ఉండిపోయాయి. ఇప్పటివరకూ ఈ పాత నోట్లకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. భారత్ నోట్లరద్దు నిర్ణయం వల్ల నేపాల్‌కు నష్టం జరిగింది. కానీ నేపాల్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల దీనిపై ఎలాంటి ప్రభావం పడదు" అన్నారు.
"నోట్ల రద్దు వల్ల నేపాల్, భూటాన్‌కు చాలా నష్టం జరిగింది. భారత ఆర్థిక మంత్రిత్వశాఖ ఇప్పటివరకూ రెండు దేశాల్లో ఉన్న పాత నోట్ల గురించి గట్టిగా ఏదీ చెప్పడం లేదు".
నేపాల్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం గురించి అక్కడ అందరూ ముందే ఊహించారని చెబుతున్నారు. భారతీయ కరెన్సీ చెలామణి చట్టబద్ధమే అనేలా నేపాల్, భూటాన్‌తో భారత్ ఎలాంటి అధికారిక ఒప్పందం చేసుకోలేదు.
ఫొటో సోర్స్, Getty Images
మొదట్లో కూడా నిషేధం
నేపాల్ మార్కెట్లో ఎప్పటినుంచో భారత నోట్లు తీసుకోవడం జరుగుతోంది. భారత్‌లో కూడా నేపాల్ పౌరులు ఉద్యోగాలు, వ్యాపారం చేసుకోడానికి మినహాయింపులు ఉన్నాయి.
భారత్ ఫెమా చట్టం అంటే ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ ప్రకారం నేపాల్ వెళ్లే భారతీయులు తమతోపాటు 25 వేల వరకూ నగదు తీసుకుని వెళ్లచ్చు.
నేపాల్‌లో 2014 వరకూ 500, 1000 నోట్లపై నిషేధం ఉండేది. భారత ప్రభుత్వం అభ్యర్థనతోనే అలా చేశారు. 2015 ఆగస్టులో ఈ నిషేధం ఎత్తివేశారు.
2016 నవంబరులో భారత్ 500, 1000 పాత నోట్లపై నిషేధం విధించగానే, నేపాల్, భూటాన్ సెంట్రల్ బ్యాంకులు పాత నోట్లు మార్చుకోవాలని అడిగాయి. దానికోసం చాలా దశల్లో చర్చలు కూడా జరిగాయి.
కానీ అధికారిక నిర్ణయం ఏదీ తీసుకోలేకపోయారు.
సమస్య ఏంటంటే, రెండు దేశాల్లో ప్రస్తుతం ఉన్న పాత నోట్లను అక్రమం అని చెప్పలేం. అవి సక్రమమే అని చెప్పడానికి కూడా బలమైన ఆధారాలు కూడా లేవు.
ఎందుకంటే అక్కడ భారత నోట్ల చెలామణి గురించి ఎలాంటి అధికారిక ఒప్పందం లేదు.
ఫొటో సోర్స్, Reuters
రద్దైన పెద్ద నోట్లతో నేపాలీల కష్టాలు
1957 నుంచి భారత రూపాయి విలువ నేపాల్‌లో 1.6 రూపాయిలకి సమానం. ఈ విలువను నేపాల్ స్టేట్ బ్యాంక్, ఆర్బీఐ మధ్య జరిగిన ఒప్పందంలో నిర్ణయించారు.
ఇదే ఏడాది ఆగస్టు నెలలో ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్ ఆర్బీఐ నోట్లరద్దు గణాంకాల గురించి ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో భూటాన్, నేపాల్ నుంచి పాత నోట్లు మార్చుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు.
అయితే ఒక్కో నేపాల్ పౌరుడి నుంచి 4500 రూపాయల విలువైన పాత వెయ్యి, 500 నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తమకు నోటిమాటగా చెప్పిందని గత ఏడాది నేపాల్ అధికారులు చెప్పారు.
అయితే భారత్ దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక చర్చలూ జరపలేదు.
ఇదే ఏడాది జూన్‌లో ద రాయల్ మానెటరీ అథారిటీ(ఆర్ఎంఏ) ఆఫ్ భూటాన్ భారత కరెన్సీని దగ్గర ఉంచుకోవడం ప్రమాదం కావచ్చని తమ పౌరులను అప్రమత్తం చేసింది.
భవిష్యత్తులో భారత ప్రభుత్వం తీసుకునే ఏదైనా నిర్ణయం వల్ల నష్టం జరిగితే దానికి భూటాన్ ప్రభుత్వం బాధ్యత వహించదని చెప్పింది.
భారత నోట్లు బ్యాంకులో ఉంచుకోవాలని, నగదు రూపంలో తమ దగ్గర ఉంచుకోవద్దని ఆర్ఎంఏ సూచించింది.
ఫొటో సోర్స్, Getty Images
నోట్లరద్దుతో వ్యాపారంపై ప్రభావం
భారత్, భూటాన్ సరిహద్దు ప్రాంతాల్లో భారత రూపాయి లావాదేవీలు చట్టబద్ధమే.
నోట్లరద్దు తర్వాత రెండు దేశాల మధ్య వ్యాపారంపై ఘోరంగా ప్రభావం పడింది. పర్యాటక రంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.
2017 ఆగస్టులో భారత 500, 2000 నోట్లు భూటాన్‌లో చెల్లవని ఆర్ఎంఏ ఒక నోటీస్ జారీ చేసింది. అయితే తర్వాత ఈ నిషేధం ఎత్తివేసింది. కానీ ప్రజలు ఈ నోట్లు తమ దగ్గర ఉంచుకోవడంపై అప్రమత్తం చేసింది.
నేపాల్ తాజా నిర్ణయాన్ని ఆ దేశంతో భారత సంబంధాలు క్షీణించడానికి ఉదాహరణగా చూస్తున్నారు.
అంతకు ముందు పుణెలో నిర్వహించిన బిమ్స్టెక్ దేశాల సంయుక్త సైనిక విన్యాసాలలో పాల్గొనడానికి నేపాల్ నిరాకరించింది.
కానీ, సెప్టెంబర్ 17 నుంచి 28 వరకూ చైనాతో కలిసి 12 రోజుల సైనిక విన్యాసాలలో పాల్గొంది.
నేపాల్ సముద్ర తీరం లేని దేశం. అది ఇప్పుడు భారత్‌పై ఆధారపడడం తగ్గించుకోవాలని అనుకుంటోంది.
2015లో భారత్ ఆ దేశాన్ని అప్రకటిత దిగ్భందం చేసింది. దాంతో నేపాల్‌లో నిత్యావసరాల కొరత ఏర్పడింది. అప్పటి నుంచి ఇరు దేశాలకు తమ మధ్య సంబంధాలపై నమ్మకం లేకుండా పోయింది..
నేపాల్‌పై దశాబ్దాల నుంచీ భారత్ ప్రభావం ఉంది. రెండు దేశాల మధ్య బహిరంగ సరిహద్దు ఉంటుంది. ఆంక్షలు లేని వ్యాపారం, ఒకే మతం, ఆచార, సంప్రదాయాలు ఉంటాయి.
రెండు దేశాల మధ్య పతనం అవుతున్న సంబంధాలు ఎప్పుడు చర్చకు వచ్చినా చైనా ప్రస్తావన కూడా తప్పకుండా వస్తుంది.
ఇవి కూడా చదవండి
- మోదీ నేపాల్ పర్యటన: రద్దయిన భారతీయ నోట్లను మార్చుకునేందుకు ఒక్క ఛాన్స్ ఇస్తారా?
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బాలుడి కోసం.. రెండు ఊర్లు ఎందుకు ఘర్షణ పడుతున్నాయి?
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- ‘యానాం, తుని మధ్య తీరం దాటనున్న పెథాయ్ తుపాను’
- మధుమేహం అంటే ఏమిటి? రాకుండా జాగ్రత్తపడడం ఎలా?
- నెహ్రూ కాలర్ పట్టుకుని నిలదీసిన మహిళ
- జాతీయవాదం పేరిట వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)