రాయలసీమ కరవు: అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కథ

  • హృదయ విహారి బండి
  • బీబీసీ ప్రతినిధి
మల్లప్ప భార్య మారెక్క
ఫొటో క్యాప్షన్,

ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లప్ప భార్య మారెక్క

''సరకులు తెస్తానని టౌనుకు పోయినాడు. పూలహారం, మా అమ్మకు గాజులు, శవానికి చుట్టే తెల్లగుడ్డ, పసుపూ కుంకుమ, అన్నీ తన పింఛను డబ్బులతో కొన్నాడు. చీకటి పడినంక తోటలో ఆత్మహత్య చేసుకున్నాడు సార్'' అని మాధవయ్య అన్నాడు.

మాధవయ్య తండ్రి తన అంత్యక్రియలకు అవసరమయ్యే సరకులను వృద్ధాప్య పింఛనుతో కొని, ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్య చేసుకున్నాక, తన అంత్యక్రియల ఖర్చు కూడా కుటుంబానికి భారం కాకూడదని భావించిన ఆ రైతు జేబులోని పింఛను డబ్బులతో టౌను బస్సు ఎక్కాడు.

టౌనులోని బట్టల షాపుకు వెళ్లి, తన కొలతలకు సరిపోయే తెల్లటి గుడ్డను కొన్నాడు - అది తను చనిపోయిన తరువాత శవానికి చుట్టడానికి!

పూలదండ కొన్నాడు. అది.. తాను శవమయ్యాక మెడలో వేయడానికి.

తర్వాత, తన ఫోటోను ల్యామినేషన్ చేయించాడు - అది తన కుటుంబ సభ్యులకు గుర్తుగా ఇవ్వడానికి.

సంత ముగిసింది, చీకటి పడింది. బస్సెక్కి ఊరు దగ్గర దిగాడు.

ఊర్లోకి వెళ్లాలంటే అర కిలోమీటరు నడవాలి. కానీ బస్టాండు పక్కనే తన పొలం. అతని అడుగులు పొలం వైపు పడ్డాయి. చేసంచిలో తన అంత్యక్రియల కోసం కొన్న వస్తువులు నిశ్శబ్దంగా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్,

వీడియో: ‘వృద్ధాప్య పింఛనుతో తన అంత్యక్రియలకు అవసరమైనవన్నీ కొన్నాడు’

తోట మొదట్లోనే అతడి తండ్రి సమాధి ఉంటుంది. అక్కడకు వెళ్లి, సంచిలోని వస్తువులన్నీ తండ్రి సమాధి మీద పెట్టాడు. ఓ చీటీని కూడా ఆ సరకుల్లో ఉంచాడు.

ఆ చీటీలో తాను ఎవరెవరి దగ్గర అప్పు తీసుకున్నాడు, ఎంత మొత్తం తీసుకున్నాడు లాంటి వివరాలు రాసున్నాయి. తనకు వడ్డీ ఇచ్చినవారి జాబితా కింద 'రైతులకు నా నమస్కారాలు' అని కూడా రాసుంది. మల్లప్పకు చదవడం, రాయడం రాదు. ఆత్మహత్య లేఖను వేరొకరితో రాయించాడు.

ఆ తర్వాత ఎదురుగా ఉన్న పాక దగ్గరకు వెళ్లి, అప్పుడపుడూ తాను సేద తీరే మంచంపై కూర్చుని, గటగటా పురుగుల మందు తాగేశాడు.

మరుసటి ఉదయం మల్లప్ప కొడుకు మాధవయ్య పశువులను తోటకి తీసుకువచ్చాడు. తోటలోకి వచ్చే దారిలో కుడివైపుగా తన తాత సమాధి ఉంది.

తన తాత సమాధిపై ఒక పూల దండ, తన తండ్రి మల్లప్ప ఫోటో, తక్కినవి మాధవయ్యకు కనిపించాయి. ఇవన్నీ ఎవరు ఉంచారా అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తే, దూరంగా ఉన్న మంచంపై ఓ వ్యక్తి పడి ఉండటం చూశాడు.

‘‘విషయం కొంచెం కొంచెం అర్థమైంది సార్. భయపడుతూ కొట్టం దగ్గరకు పరిగెత్తినాను. తీరా చూస్తే, అప్పటికే మా నాయిన...’’ అన్నాడు మాధవయ్య.

ఫొటో సోర్స్, Umesh

ఇది ఒక రైతు కథ. రాయలసీమ కరవు రైతు కథ. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, స్థానిక మీడియా బీబీసీకి అందించిన సమాచారం ఇది.

అనంతపురం జిల్లాలో 4 నెలల క్రితం ఈ ఘటన జరిగింది. ఆ రైతు పేరు మల్లప్ప. అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాంపురం గ్రామవాసి.

ఈ వార్త తెలిశాక బీబీసీ తరపున మేం మల్లప్ప స్వగ్రామం రాంపురం వెళ్లాము.

మల్లప్ప గురించి ఆయన కూతురు లక్ష్మి జ్ఞాపకాలను వీడియో రూపంలో ఇక్కడ చూడండి...

వీడియో క్యాప్షన్,

‘అప్పా.. ఆ రాత్రి నువ్వొక్కడివే విషం ఎట్లా తాగినావ్’

మొదటగా మల్లప్ప కొడుకు మాధవయ్యకు ఫోన్ చేసి రాంపురం వద్దకు చేరుకున్నాం. ప్రధాన రహదారికి ఆనుకునే మల్లప్ప పొలం ఉంది. అక్కడి నుంచి రాంపురం గ్రామానికి వెళ్లాలంటే అరకిలోమీటరు వెళ్లాలి. ఆ గ్రామానికి బస్సు సర్వీసు లేదు. మల్లప్ప కొడుకు మాధవయ్య మమ్మల్ని కలిసి, తమ పొలానికి తీసుకు వెళ్లాడు.

పొలంలో వేరుశెనగ పంట వర్షాలు లేక పూర్తిగా దెబ్బతింది. ఇక చేసేది లేక, ఆ పంటను పశువులకు వదిలేశారు. ఆవులు, ఎద్దులు ఆ పంటను మేస్తున్నాయి.

మల్లప్ప సమాధికి కొత్తగా రంగు వేశారు. తోటలోని పాక దగ్గరికి తీసుకుపోయి, అక్కడున్న మంచాన్ని మాకోసం వాల్చారు. మేం కూర్చున్న ఆ మంచంపైనే మల్లప్ప ఆత్మహత్య చేసుకున్నది.

మల్లప్ప వయసు సుమారు 60 ఏళ్ళు ఉండొచ్చని మాధవయ్య చెప్పాడు. మల్లప్పకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు తనపాటే సేద్యం చేస్తున్నాడు. చిన్న కొడుకు బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.

6 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం కోసం బ్యాంకుల్లో 1.12లక్షలు, తోటి రైతులతో 1.73లక్షలు రుణం ఉన్నట్లు మాధవయ్య చెప్పాడు.

''మాకు 6 ఎకరాల పొలం ఉంది. అందులో 4 బోర్లు వేస్తే, 3 బోర్లు ఫెయిలై పోయినాయి. వర్షాలు లేక నాలుగో బోరులో కూడా నీళ్లు శానా తగ్గినాయి. ఆ కొన్ని నీళ్లతోనే సేద్యం చేసినాడు మా నాయిన. మూడెకరాల్లో శెనక్కాయ, మూడెకరాల్లో టమేటా పంట పెట్టినాం. టమేటా పంటతో బాకీ తీర్చచ్చన్న ఆశతో నీళ్లొచ్చే బోరును టమేటాకు తిప్పినాం. వర్షాలు లేక శెనక్కాయ పూర్తిగా ఎండిపోయింది. టమేటా పంటకేమో రేటు రాలేదు'' అని మాధవయ్య బీబీసీతో అన్నాడు.

మార్కెట్లో టమోటా రేటు పడిపోవడంతో మల్లప్ప మరింత కుంగిపోయాడు. లోలోపల్నే బాధను దిగమింగుకున్నాడు కానీ, పైకి తెలియనీయలేదని మాధవయ్య అన్నాడు.

ఆగస్టు 9 ఉదయం బంగారుకు వడ్డీ కట్టాలని, టమోటాకు మందులు తేవడానికి కల్యాణదుర్గం వెళ్తున్నానని చెప్పి, మల్లప్ప మళ్లీ తిరిగిరాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

''అంత్యక్రియలకు కావాల్సిన వస్తువులు... శవానికి చుట్టే బట్ట, పూలదండ, పసుపూకుంకుమ, పూలు అన్నీ తన సొంత పించనీతోనే కొన్నాడు. తన ఫోటోను కూడా ల్యామినేషన్ చేయించుకున్నాడు. ఒక వారంనుంటీ ఈ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇంట్లోవాళ్లకు మర్మం తెలీదు. అంతా తనే వివరించుకున్నాడు'' అని చెబుతున్నపుడు మాధవయ్య కళ్లు బాధతో ఎర్రబడ్డాయి.

మల్లప్పకు ఆగస్టు ఒకటి రెండు తారీఖుల్లోనే వృద్ధాప్య పింఛను తీసుకున్నట్లు మాధవయ్య చెప్పాడు. టమోటా అమ్మగా వచ్చిన డబ్బులో 1000-1500 రూపాయలను తన దగ్గరే ఉంచుకుని, ఇంటికి కావలసిన సరకులన్నీ తెచ్చి, ఎవరికీ ఏ అనుమానం రాకుండా చేశాడని మాధవయ్య అన్నాడు.

'కూతుళ్ల బంగారు తాకట్టు పెట్టి..'

మల్లప్ప పొలం నుంచి కారులో రాంపురం గ్రామానికి వెళ్లాం. ఇరుకు సందుల గుండా ఊరికి ఓ వైపున ఉన్న ఎస్సీ కాలనీలోని మల్లప్ప ఇంటికి చేరాం. ఆ ఇంట్లో ఒక్క గది మాత్రమే ఉంది.

మల్లప్ప భార్య మారెక్కకు ఆరోగ్యం బాగోలేదు. సరిగా వినిపించదు.

''మల్లప్ప పెండ్లానికి ఖాయిలా సార్. ఈయమ్మే ముందుగా పోతాదని అనుకుంటిమి. కానీ మల్లప్ప అట్ల చేసుకుంటాడని అనుకోలేదు'' అని ఓ సందర్భంలో పక్క గ్రామస్థుడు మాతో అన్నాడు.

మల్లప్పకు ముగ్గురు ఆడపిల్లలు. వారికి ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే సంబంధాలు చూసి పెళ్లి చేశాడు.

చనిపోవడానికి 3 నెలల ముందు వేరుశెనగ పంట వేయాలని మల్లప్ప భావించాడు. కానీ చేతిలో డబ్బుల్లేవు. చేసేదిలేక కూతుళ్ల దగ్గరకు వెళ్లి, 4 తులాల బంగారాన్ని అప్పుగా తీసుకుని, దాన్ని తాకట్టుపెట్టగా వచ్చిన డబ్బుతో పంట పెట్టినట్లు మల్లప్ప భార్య మారెక్క వివరించింది.

''ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి పంట పెడతాండె, మందులు తెస్తాండె కానీ వర్షాల్లేక ప్రతిసారీ పంట ఫెయిల్ అయిపోతాండె. డబ్బుల్లేక మొన్నసారి ఆడపిల్లలది బంగారు తెచ్చినాడు. ఆ బంగారు తాకట్టు పెట్టి, చేనులో శెనక్కాయ ఏసినాడు. ఇదన్నా పండితే అప్పులు తీరుద్దామనుకున్నాడు. అదంతా ఎండిపాయె'' అని మారెక్క నీరస స్వరం బలహీనంగా ఏడ్చింది.

ఫొటో సోర్స్, Niyas Ahmed

ఆరోజు ఏం జరిగింది?

తోటి రైతులతో మల్లప్ప 1.73 లక్షలు అప్పు చేసినట్లు ఆయన కొడుకు చెబుతున్నాడు. వారిలో కొందరు తమ అప్పు తీర్చాల్సిందిగా తరచూ మల్లప్పను అడుగుతుండేవాళ్లని అన్నారు.

అప్పు ఇచ్చినవాళ్లలో ఒకరు, తన అప్పు తీర్చకపోతే మద్దూరి (కమీషన్ కోసం డబ్బులు వసూలు చేసిపెట్టే వ్యక్తి) మనిషిని పంపిస్తానని హెచ్చరించినట్లు మాధవయ్య బీబీసీకి చెప్పాడు.

ఆ వ్యక్తికి మల్లప్ప చెల్లించాల్సిన మొత్తం 10 వేలు అని, ఇదే విషయం సూసైడ్ నోట్‌లో కూడా ఉందన్నాడు. పదిమందిలో మంచి పేరు సంపాదించుకున్న మల్లప్ప, ఈ వ్యక్తి చేసిన హెచ్చరికతో మర్యాద పోతుందని భయపడినట్లుగా తెలుస్తోంది.

''ఆరోజు పొద్దున్నే పశువులను మేపుకు తీసుకుపోతాంటే ఎవరో వచ్చి, అప్పు కట్టమని అడిగినారు. వాళ్లకు ఏందో చెప్పి పంపించి, టౌనుకు పోతానని పోయినాడు. ఇంగంతే సార్.. మళ్లీ రాలేదు'' అని మారెక్క అంది.

ఫొటో సోర్స్, Umesh

‘నాకు టైం లేదన్నాడు’

మేం రాంపురం గ్రామం నుంచి కల్యాణదుర్గం మీదుగా అనంతపురం బయలుదేరాం. దారి మధ్యలో, మల్లప్ప తన ఫొటోను ల్యామినేషన్ చేయించుకున్న ఫొటో స్టుడియో వ్యక్తిని కలవాలని అనిపించింది.

అతని గురించి విచారిస్తే, అతను కూడా ఓ న్యూస్ చానెల్లో రిపోర్టర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. ఆయన్ను ఫోన్ ద్వారా సంప్రదిస్తే, స్టుడియోకు రమ్మని చెప్పారు.

‘‘మల్లప్ప అనే మనిషి నా దగ్గరకు వచ్చి ఒక ఫొటోను ల్యామినేషన్ చేసి ఇవ్వాలంటని చెప్పి అడిగినాడు. అడ్వాన్స్ తీసుకుని, రెండు రోజులైనంక రమ్మన్నాను. రెండురోజులకు ఆయన మళ్లీ వచ్చినాడు కానీ కొన్ని కారణాలతో ఆ ఫొటోను ల్యామినేషన్ చేయలేకపోయినా’’ అని స్టుడియో యజమాని గోవిందు అన్నారు.

‘‘మళ్లీ రెండు రోజులకు వస్తే ఫొటో ఇస్తానని మల్లప్పకు చెప్పినా. ఆయన ఎళ్తూ ఎళ్తూ, అన్నా నాకీ ఫొటో చాలా అర్జంటు. ఆ ఫొటోను తొందరగా ఇమ్మన్నాడు. ఇది పాత ఫొటో కదా.. కొత్తగా ఒకటి తీసుకుంటే బాగుంటుందంటే, నాకు టైం లేదన్నా. ఇదే చేసియ్యి అన్నాడు. నా పనంతా పక్కనపెట్టి ల్యామినేషన్ చేసినా. అదేరోజు 11:30-12 మధ్యలో వచ్చి తన ఫొటోను తీసుకుపోయినాడు.’’

‘‘మరుసటిరోజు పొద్దున్నే.. రైతు ఆత్మహత్య అని ఒక ఫోటో నాకు వాట్సప్‌లో వచ్చింది. నేను ఎవరో అనుకున్నాను. కానీ ఆ తర్వాతి రోజు ఉదయం పేపర్లో వార్త వచ్చింది. అందులో నేను ల్యామినేషన్ చేసిన ఫొటో కనిపించింది. వివరాలు కనుక్కుంటే అసలు విషయం అర్థమైంది.’’

‘‘పేపర్లో ఫొటో చూసినంక, మల్లప్పకు సమయానికి ల్యామినేషన్ చేసివ్వకుండా ఆయన మరణాన్ని రెండు రోజులు ఆపినానేమో అనిపించింది.’’ అని మల్లప్ప ఆత్మహత్య చేసుకునే రోజు ఆయనతో రెండు మాటలు, కొన్ని క్షణాలను పంచుకున్న ఫొటో స్టూడియో యజమాని గోవిందు బీబీసీతో అన్నారు.

'రుణమాఫీ జరిగుంటే బతికుండునేమో!'

ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకంలో భాగంగా మల్లప్పకు రెండు విడతల్లో దాదాపు 40వేల రుణం మాఫీ అయ్యిందని, మూడో విడత రుణమాఫీ కూడా ఇప్పటికే జరగాల్సివుందని మాధవయ్య అన్నారు.

''మల్లప్పకు మూడో విడత రుణమాఫీ జరగాల్సి ఉంది. ఆ మూడో విడత రుణమాఫీ కూడా జరిగివుంటే బహుశా ఆయన బతికేవాడేమో! ఎందుకంటే, మధ్యవర్తిని పంపుతానంటూ హెచ్చరించిన వ్యక్తికి మల్లప్ప చెల్లించాల్సింది కేవలం 10వేల రూపాయలు మాత్రమే'' అని ఓ పత్రికా విలేఖరి షఫీవుల్లా బీబీసీతో అన్నారు.

టమోటా మార్కెట్ ఎలా ఉంది?

టమోటా సాగుకు ఎకరానికి దాదాపు 30వేల వరకూ ఖర్చు అవుతుంది. ఒకసారి పంట వేస్తే మొత్తం 7 కోతలు వస్తాయి. పంట బాగుంటే ఎకరాకు దాదాపు 4,500 కిలోల దిగుబడి వస్తుంది.

అంటే 15కిలోల క్రేట్ బాక్సులు 300వరకు మార్కెట్‌కు వెళతాయి. ఒక ఎకరా పంటను కోయటానికి 15మంది కూలీలు అవసరం. ప్రస్తుతం కూలి ఒకరికి 150 ఉంది.

అంటే, ఎకరా పంటను కోయడానికి 15 మంది కూలి ఖర్చు 2,250 అవుతుంది. ఇక రవాణా విషయానికి వస్తే, అనంతపురం మార్కెట్‌కు తరలించడానికి బాక్సుకు 16 రూపాయల చొప్పున ఖర్చవుతుంది.

ఫొటో సోర్స్, Anji

300 బాక్సులకుగాను 4,800 రవాణా ఖర్చు. మార్కెట్లో దళారులకు 10% కమిషన్ ఇవ్వాలి. కానీ, మల్లప్ప చనిపోయేముందు మార్కెట్లో 15 కిలోల టమోటా బాక్సు ధర కేవలం 40 రూపాయలే ఉండింది.

ఇలా అన్ని ఖర్చులు పోను, రైతులకు ఎకరాకు వెయ్యి రూపాయల నష్టం వస్తోందని టమోటా రైతులు బీబీసీకి చెప్పారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో మార్కెట్‌కు తీసుకుపోయిన టమోటాలను రైతులు రోడ్డుపై పారబోస్తున్నారు.

‘గత 54ఏళ్లలో ఇలాంటి కరవు లేదు’

‘‘గత 54 ఏళ్లలో ఇలాంటి కరవు లేదు. ఇలాంటి కరవును ఎన్నడూ చూడలేదు. అసలు వర్షాలే లేవు. ఎక్కడ తుపాన్లు వచ్చినా, అనంతపురంలో మాత్రం వర్షాలు లేవు. హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలు రావడంతో కొంతలోకొంత మేలు. ఇంత ‘లాంగెస్ట్ డ్రై స్పెల్’ ఎప్పుడూ లేదు. నల్లరేగడి భూముల్లో కూడా పంటలు ఎండిపోవడం నేనెప్పుడూ చూడలేదు’’ అని జిల్లాలోని కరవు తీవ్రత గురించి అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Niyas Ahmed

'రైతుల గురించి ఆలోచించాలంటే భయపడుతున్నా'

''మల్లప్ప ఆత్మహత్య కరవుకు ఒక ఉదాహరణ. భూమి లేదా వ్యవసాయం అన్నది రైతుల పట్ల యమపాశంగా తయారయ్యింది. పంట చేతికివచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోతే రైతు పరిస్థితి ఏమవుతుంది?'' అని 'మానవహక్కుల వేదిక'కు చెందిన ఎస్.ఎం.బాషా బీబీసీతో అన్నారు.

''గత 30-40 సంవత్సరాలుగా కరవు గురించి అధ్యయనం చేస్తున్నా. కానీ, రైతుల ఆత్మహత్యల గురించి ఆలోచించడానికి ఇప్పుడు నాకు ధైర్యం చాలడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు దిగజారిపోయినాయి. రానురానూ కరవు తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే చాలా గ్రామాలు ఖాళీ అయ్యాయి. ముసలివాళ్లు మాత్రమే గ్రామాల్లో ఉంటున్నారు. జనవరికి ముందే చాలా గ్రామాల్లో తాగునీరు కరవయ్యింది'' అని బాషా అన్నారు.

ప్రతి జిల్లాకు ఒక వైవిధ్యం ఉంటుందని, దానికి అనుగుణంగా ప్రభుత్వాలకు ఒక ప్లానింగ్ ఉండాలి. కానీ, అది జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

''మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదు. కేవలం రైతులు, నిరుద్యోగుల ఆగ్రహమే కారణం. ఇలా ప్రభుత్వాలు మారుతుంటాయి తప్ప, పరిస్థితులు మారడం లేదు. రాజకీయ పార్టీలను మార్చడం కాకుండా, గుణాత్మకమైన మార్పు కోసం ప్రజా ఉద్యమాలు మొదలైనపుడే మార్పు సాధ్యం'' అని బాషా అభిప్రాయపడ్డారు.

ఏ పంట అయితే తన తండ్రి మరణానికి కారణం అయ్యిందో అదే టమోటా పంటను మాధవయ్య మళ్లీ సాగు చేస్తున్నాడు. ఈసారైనా వర్షాలు రాకపోవా, గిట్టుబాటు ధర దొరక్కపోదా అన్న ఆశనే ఆయన్ను నడిపిస్తోంది. ఒకవేళ ఈసారి కూడా మంచి ధర రాక, నష్టపోతే ఎలా? అని ఆయన్ను ప్రశ్నిస్తే..

''ఏమో తెలీదు సార్.. కట్టాల్సిన వడ్డీలు 40 వేల వరకున్నాయి. ఎలా కట్టాలో తెలీదు. కానీ పంట వస్తుందన్న ఆశతో సేద్యం చేస్తున్నా. ఈసారి కూడా వర్షాలు పడక, టమేటాకి మంచి రేటు రాకపోతే భూమి, పశువులను అమ్ముకుని, యాడికైనా వలస పోవాల్సిందే!'' అన్నాడు.

మల్లప్ప గురించి ఆయన కూతురు లక్ష్మి జ్ఞాపకాలను వర్చువల్ రియాలిటీ వీడియో రూపంలో ఇక్కడ చూడండి...

'పరిహారం త్వరలోనే అందుతుంది'

''ఆత్మహత్య చేసుకున్న హరిజన మల్లప్ప కుటుంబానికి త్వరలోనే పరిహారం అందుతుంది. ఆయన ఫైలును కలెక్టరేట్‌కు పంపినాం'' అని కల్యాణదుర్గం ఇన్ఛార్జి ఆర్డీఓ శ్రీనివాసులు బీబీసీతో అన్నారు.

''పరిహారం కింద మల్లప్ప కుటుంబానికి అయిదు లక్షల రూపాయల పరిహారం వస్తుంది. మల్లప్ప అప్పుల్లో 1.5 లక్షల రూపాయలను సింగిల్‌ టైం సెటిల్‌మెంట్ కింద ఇస్తాం. ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకున్న రుణాన్ని దాంతో చెల్లించవచ్చు. ఆ మండల ఎమ్మార్వో పేరుతో పాటు మల్లప్ప భార్య లేదా కొడుకు పేరుతో బ్యాంకులో జాయింట్ అకౌంట్ తెరిచి, విడతలవారీగా తక్కిన 3.5 లక్షల రూపాయలను అందిస్తాం'' అని శ్రీనివాసులు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)