కోడి పందేలు: వ్యాపారంగా.. ఉపాధి మార్గంగా కోడి పుంజుల పెంపకం
- శంకర్
- బీబీసీ కోసం

కోడి కొక్కొరొకో అనగానే నిద్ర లేచేవారు కొందరు. మరికొందరేమో.. కోళ్లను, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కోడి పుంజులను పెంచడానికే నిద్ర లేస్తుంటారు. కోస్తా జిల్లాల్లోని చాలా గ్రామాల్లో ఇప్పుడు జరుగుతోంది ఇదే.
తమ కోడి బరిలో నిలిస్తే కనకవర్షం కురిసినట్టే అనుకుంటారు అక్కడి జనాలు. సంక్రాంతి పండుగ రాగానే పెద్దఎత్తున సంబరాలు జరపుకునే ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందేలకు ఏర్పాట్లు చాలా కోలాహలంగా జరుగుతున్నాయి.
చాలామంది అభ్యంతరాలు చెబుతున్నా, కోర్టులు ఆంక్షలు విధిస్తున్నా, పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఈ పందేలు మాత్రం ఆగడం లేదు. సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజులపాటు అనేక ప్రాంతాల్లో కోడిపందాల జోరు కొనసాగుతుంది.
తమిళనాడులో జరిగే జల్లికట్టు మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందేలకు చాలా ఖ్యాతి ఉంది. అయితే రానురాను అది మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
కొన్నేళ్ల క్రితం కోనసీమ ప్రాంతంలో, ఉభయగోదావరి జిల్లాల పరిధిలో మాత్రమే కోడిపందేల సందడి కనిపించేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పందేలు జరుగుతున్నాయి.
‘బెట్టింగ్ హబ్’
సంక్రాంతి సందర్భంగా ఈ పందేలు పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ, ఏడాది పొడవునా కోడిపందేలు ఆడేవారికి కొదవ ఉండడం లేదు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతాన్ని కోడిపందేల బెట్టింగ్ హబ్‌గా అభివర్ణిస్తుంటారు.
భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగే కోడిపందేలు వందల కోట్ల రూపాయల్లో జరుగుతాయి. ఏటా సంక్రాంతి సమయంలో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే కోడిపందేల్లో చేతులు మారే సొమ్ము 150 కోట్లు దాటుతుందని కాళ్ల గ్రామానికి చెందిన సత్యన్నారాయణ రాజు అభిప్రాయపడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి సుమారు 250 కోట్ల రూపాయల మొత్తంలో పందేలు సాగుతాయన్నది ఆయన అంచనా.
ఈ కోడిపందేల నిర్వహణలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. పందేలు నిర్వహించే ప్రాంతాన్ని బరి అంటారు. ఈ బరులు గోదావరి జిల్లాల్లోనే సుమారుగా 400 వరకూ ఏర్పాటవుతాయి.
అయితే వాటిలో వీఐపీలు పాల్గొనే బరులకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. మీడియా సందడి కనిపిస్తుంటుంది. కోట్ల రూపాయలు చేతులు మారేది అక్కడే.
అందుకు తగ్గట్లుగానే ఫ్లడ్ లైట్లు, వీఐపీ గ్యాలరీలు, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయి. ఇక మధ్యతరగతి ప్రజలు పాల్గొనేందుకు కూడా బరులు ఉంటాయి.
సామాన్యులు నిర్వహించుకునే చిన్నాచితక బరులు కూడా ఉంటాయి. పోలీసులు.. ప్రతి ఏటా ఇలాంటి సాధారణ బరుల మీద దాడులు చేసి చేతులు దులుపుకుంటారని అల్లవరం మండలం ఓడలరేవుకు చెందిన కాజ వెంకటరమణ అభిప్రాయ పడ్డారు.
‘కోళ్లకు స్పెషల్ డైట్, ఎక్సర్సైజులు’
పందేలలో పాల్గొనడానికి కోళ్లను సిద్ధం చేసే ప్రక్రియ కూడా ఓ పెద్ద వ్యాపారంగా మారింది. చాలా మందికి ఇదొక ఉపాధి మార్గంలా కనిపిస్తోంది. చిన్న పిల్లగా ఉన్నప్పుడే కోళ్లను పరిశీలించి, ఎంపిక చేసిన వాటిని ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. ఇక జనవరిలో జరిగే పందేల కోసం సెప్టెంబర్ నుంచే సన్నాహాలు షురూ అవుతాయి.
కోడిపుంజులకు నాణ్యమైన ఆహారం అందిస్తారు. అందులో జీడిపప్పు, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. రోజూ కోడిగుడ్డు కూడా ఇస్తారు.
కొన్నిటికి బోన్‌లెస్ చికెన్ కూడా ఆహారంగా ఇస్తారు. పౌష్టికాహారంతో పాటుగా రోజూ ఎక్సర్సైజులు చేయిస్తారు. స్విమ్మింగ్, రన్నింగ్ చేసేందుకు ఏర్పాట్లుంటాయి. ఇలాంటి పందేలకు పుంజులను సిద్ధం చేయడానికి కొందరు నిపుణులు కూడా తయారయ్యారు.
ఇలాంటి వారు గోదావరి జిల్లాల్లో ప్రతీ మండలంలోనూ ఒకరిద్దరు కనిపిస్తుంటారు. కొన్ని రకాల కోడిపుంజులను బిహార్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని, వాటిని పందేలకు సన్నద్ధం చేస్తుండటం విశేషం.
కోడిపుంజుల ఎంపిక దగ్గర నుంచి వాటిని పందేలకు సిద్ధం చేయడం ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన అంశమని రావులపాలెంకు చెందిన గౌతమ్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.
కోడిపందెంలో దిగి, ప్రత్యర్థి కోడితో పోరు సాగించాలంటే తమ కోడికి అన్ని రకాల తర్ఫీదులు అందిస్తామంటున్నారు.
కోడిపుంజుల్లో కూడా పలు రకాలున్నాయి. కనీసంగా 25 రకాల కోడిపుంజులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో సాగే పందేల్లో పాల్గొంటున్నాయి.
అందులో ప్రధానంగా కాకి, నెమలి, సవళ, రసంగి, డేగ వంటి రకాలు ప్రధానంగా పోటీలో కనిపిస్తుంటాయి. రంగులను బట్టి కోళ్ల రకాలుగా విభజించారు. అంతేకాకుండా ఏ రకం కోడి ఏ కోడితో, ఏ సమయంలో పందేలకు దిగితే ఫలితాలొస్తాయన్నది కూడా శాస్త్రబద్ధమేనని స్థానికులు చెబుతుంటారు.
రాజు, లొల్ల గ్రామవాసి
నక్షత్రాల ఆధారంగా పందెం కోళ్ల ఎంపిక
కుక్కుటశాస్త్రం తమ తాతల కాలం నుంచి కూడా ఉందని ఆత్రేయపురం మండలానికి చెందిన రాజు బీబీసీకి వివరించారు. నక్షత్రాల ఆధారంగా పందెంకోళ్లను పోటికి ఎంపిక చేస్తామంటున్నారు.
పల్నాడులో నాగమ్మ, బ్రహ్మదేవుడు వంటి వారి కాలం నుంచి సంప్రదాయంగా కోడిపందేలు సాగుతున్నాయంటున్నారు.
ఇక కోడిపందాలు రెండు రకాలుగా నిర్వహిస్తామని లొల్ల గ్రామానికి చెందిన రాజు చెబుతున్నారు. డిక్కీ పందేల్లో కోళ్లకు కత్తులు కట్టకుండా బరిలో దింపుతామని, అవి ఎక్కువ సమయం తీసుకుంటాయని అంటున్నారు.
ఇక కోడికి కత్తులు కట్టి బరిలో దింపే పందేల వల్ల ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తవని, అలాంటప్పుడు అనుమతులు లేవంటూ అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కోడిపందేలు తమ సంప్రదాయంలో భాగమని, అడ్డంకులు లేకుండా చూడాలని ఆయన కోరుతున్నారు.
‘కోడి పందేల వల్లే సంక్రాంతికి బంధువులొస్తున్నారు’
కోడి కత్తులు కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినవి. కోళ్లకు కత్తులు కట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. లేకుంటే చేతులు, కాళ్ల నరాలు కూడా చాలామందికి తెగిపోయాయని గౌతమ్ రెడ్డి బీబీసీకి వివరించారు.
ప్రత్యేకంగా తయారు చేసిన కత్తిని కోడి కాళ్లకు కట్టడంపై గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయన్నారు. అందుకే కోడికత్తి కట్టే వాళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఆయన అంటున్నారు.
కోడిపందేలలో పాల్గొనడం కోసమే దూర ప్రాంతాల నుంచి కూడా తమ బంధుమిత్రులు సంక్రాంతి పండుగనాడు గ్రామాలకు తరలివస్తుంటారని గోదావరి వాసుల అభిప్రాయం.
మెర్లపాలెం ఉప సర్పంచ్ మెర్ల రాము కూడా బీబీసీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. సంక్రాంతికి కోడిపందేల వల్లే ప్రత్యేక శోభ వస్తుందన్నది ఆయన వాదన. కోడిపందేల మూలంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతాయని చెబుతున్నారు.
యువతను పక్కదారి పట్టించే సంస్కృతి
ఈ కోడిపందేల నిర్వహణ మీద పలు అభ్యంతరాలున్నాయి. యువతను పక్కదారి పట్టించే సంస్కృతిలో భాగంగానే కోడిపందేలను ప్రోత్సహిస్తున్నారని యువజన సంఘం ప్రతినిధి కె.సూర్యారావు అభిప్రాయపడ్డారు.
చెడుగుడు, వాలీబాల్ వంటి వివిధ రకాల శారీరక , మానసిక ఉల్లాసానికి తోడ్పడే క్రీడలను ప్రోత్సహించకుండా కోడిపందేలకు ప్రాధాన్యతనివ్వడం తగదంటున్నారు.
ఇప్పటికే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టులను కూడా ఆశ్రయించారు. సుప్రీం కోర్టు వరకూ కోడిపందేల కేసు వెళ్లింది. కోడిపందేల సందర్భంగా గుండాట, ఇతర జూదాలు, మద్యం అమ్మకాలు పెద్దస్థాయిలో సాగుతుంటాయి. మూగజీవాలను హింసిస్తూ, ఆనందించడాన్ని కూడా కొందరు తప్పుబడుతున్నారు.
కోడిపందేలు చట్టవిరుద్ధంగా సాగుతున్నాయంటూ కోర్టుల్లో వాదనలు సాగాయి. వాటిని వ్యతిరేకిస్తూ ప్రస్తుతం టీడీపీ నేతగా ఉన్న కనుమూరి రఘురామ కృష్ణ రాజు వంటి వారు కూడా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
కోడిపందేలకు అడ్డుకట్ట వేయకూడదని, కత్తులు కట్టకుండా పందేలకు అనుమతినివ్వాలని కోరడంతో వారికి కొంత ఉపశమనం దక్కింది.
ఎన్నికల ఏడాది.. ఎటువంటి ఆటంకాలు రావనే ధీమా
రానున్న సంక్రాంతి సమయంలో పందేల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. కోళ్లను సిద్ధం చేయడం, బరులు తయారుచేయడంలో పలువురు ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈసారి ఎన్నికల సంవత్సరం కావడంతో కోడిపందేలకు ఎటువంటి ఆటంకాలు రావనే ధీమాతో భారీ స్థాయిలో నిర్వహణకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇప్పటికే గోదావరి జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలను తాకిన ఈ పందేల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది.
అయితే కోడిపందేల పేరుతో ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేపడితే సహించేది లేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. శాంతిభద్రతల సమస్యలు రాకుండా, చట్ట పరిధిలో అన్ని రకాల చర్యలు చేపడతామని అమలాపురం డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు.
పల్నాడులో కోడిపందేలు ప్రారంభమయినట్లు చెబుతుంటారు. ఆ తర్వాత గత మూడు దశాబ్దాలుగా గోదావరి జిల్లాల్లో ఈ పందేల తీవ్రత పెరుగుతోంది.
కోళ్లకూ డ్రగ్స్!
కొన్నేళ్ల క్రితం ఇళ్లల్లో పెంచుకున్న కోళ్లతో పందేలకు దిగేవారు. రానురాను అది ఓ కుటీర పరిశ్రమగా మారుతోంది. కోడి పుంజుల పెంపకం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ప్రక్రియలో కొందరు నైపుణ్యం కూడా సంపాదిస్తున్నారు. అయితే గత దశాబ్దకాలంగా కోడిపందేలకు క్రేజ్ బాగా పెరిగిందన్నది అమలాపురం పట్టణానికి చెందిన యర్రంశెట్టి శ్రీను అభిప్రాయం.
ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా కవరేజ్ పెరిగిన తర్వాత అనేక మందికి ఈ కోడిపందేల పట్ల ఆసక్తి పెరిగిందన్నది ఆయన వాదన. హైదరాబాద్‌కు చెందిన సినీ, రాజకీయ సెలబ్రిటీలు కొందరు కోడిపందేలకు క్యూ కట్టడానికి ఇటీవల పెరిగిన ప్రచారమే కారణమని చెబుతున్నారు.
దాంతో ఆసక్తి పెరుగుతున్నకొద్దీ కోడిపందేల కోసం పుంజులను సన్నద్ధం చేసే ప్రక్రియలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల కోడిపుంజులకు బరిలో దింపే ముందు ఉత్ప్రేరకాలు కూడా వాడుతుంటారని శ్రీను చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
- ..అయినా కోళ్లు కత్తులు దూశాయ్! 2018 సంక్రాంతికి కోడి పందేలు ఇలా జరిగాయి
- విక్రాంత్: రక్షణ కోసం భారత్ సిద్ధం చేస్తున్న బ్రహ్మాస్త్రం
- ఒక భార్య, ఇద్దరు భర్తలు... ఆమె జీవితమే ఒక సినిమా
- ‘ఆ స్వామీజీ చెప్పాడని ప్రసాదంలో అరలీటరు పురుగుల మందు కలిపా’
- రాయలసీమకు ఆ పేరు ఎలా.. ఎప్పుడు వచ్చింది? ఎవరు పెట్టారు?
- ఏదైనా సరే... 20 గంటల్లోనే నేర్చుకోవడం ఎలా
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- బాంబే బ్లడ్ గ్రూప్: ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్
- బ్రిటన్, అమెరికా క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది
- క్యాథలిక్ చర్చిలో పవిత్ర కన్యలు: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)