హెర్పెస్ జోస్టర్ లేక షింగిల్స్: శరీరం మీద ఆ గుల్లలు ఎందుకు వస్తాయి? మంత్రాలు, పసర్లతో తగ్గుతాయా?

  • డాక్టర్ రొంపిచర్ల భార్గవి
  • బీబీసీ కోసం
హెర్పెస్ జోస్టర్ లేక షింగిల్స్:

ఫొటో సోర్స్, Getty Images

సురేష్‌కి సర్పి సోకి మూడురోజులయింది. మొహం మీద ఒక పక్కనే సన్నని గుల్లలు బయలు దేరేందుకు ఒకరోజు ముందు ఆ భాగమంతా మంటమంటగా అనిపించింది, వేడిచేసి వుంటుందిలే సగ్గుబియ్యం జావ తాగు తగ్గిపోతుంది అంది వాళ్లమ్మ.

రెండో రోజు వచ్చిన ఎర్రని దద్దుర్లు చూసి యేదో కుట్టి అలర్జీ వచ్చి వుంటుందనుకున్నారు.

మూడోరోజు చిన్న చిన్న కుప్పలుగా వచ్చిన నీటి గుల్లలు చూసి"అయ్యో ఇది సర్పి అయ్యా మంత్రం పెట్టించుకో తగ్గి పోతుందిలే" అంది పక్కింటి పార్వతమ్మ,ఎవరు పెడతారో కూడా ఆవిడే చెప్పి పుణ్యం కట్టుకుంది.వాళ్లింటికి రెండు వీధుల అవతల వున్న శారదమ్మ ఇందులో ఎక్స్‌పర్ట్ అట,మంత్రం పెట్టాక ఆవిడేదో ఆకుపసరు ఇస్తుందట పైపూతగా పూయడానికి.

అయిదు రోజులు మంత్రాలు అయ్యాయి అంటే సర్పి వచ్చి వారం దాటింది. ఆవిడ ఇచ్చిన ఆకు పసరుని ,హారతి కర్పూరం,కొబ్బరి నూనెతో రంగరించి ఆ గుల్లల మీద రాయమంది ,ఇక చూడాలి అసలు గుల్లల వల్ల వచ్చిన మంటకు ఈ కర్పూరం మంట తోడయి ఒళ్లంతా ఒకటే వెర్రిమంటలు.

రాత్రుళ్లు నిద్రలేదు.దానికి తోడు ముఖానికి ఒకపక్క వచ్చిన గుల్లలు అటుపక్క కంట్లో గూడా వచ్చాయి .ఆకు పసరు కంట్లో గూడా వేశారు.రెండో రోజుకి కంటి చూపు మందగించడంతో భయపడి కంటి డాక్టర్ దగ్గరకు వెళ్లారు.కన్ను పరీక్ష చేసిన ఆయన ముక్క చీవాట్లు పెట్టి,సర్పికి ఈ రోజుల్లో చాలా మంచి మందులు వచ్చాయనీ ఆకుపసరుల వలన ముఖమంతా సెప్టిక్ అయి కంట్లో పువ్వేసిందనీ,మంత్రాల వలన కాలయాపన జరిగిందనీ ముందే వచ్చివుంటే యేమైనా చెయ్యగలిగి వుండేవాడిననీ,ఇప్పుడు కంటిచూపు దెబ్బ తిన్నాక తానేం చేయలేననీ చెప్పడంతో అంతా గగ్గోలు పెట్టి ఏడ్చారు.

సత్యవతికి నడుము అర్థభాగాన్ని చుడుతూ వడ్డాణం లాగా వచ్చిన సర్పికి మంత్రం పెట్టించడంతో పాటు నల్లకోడి పెట్ట రెట్ట తీసుకొచ్చి రాయమంటే రాసింది పుళ్లమీద.నాలుగో రోజుకే నడుమంతా చీముపట్టి ,మూసిన కన్నెరగకుండా జ్వరం,హాస్పిటల్ కి తీసికెళితే ఒళ్లంతా సెప్టిక్ అయింది నాలుగురోజులు గడిస్తేకానీ నమ్మకం చెప్పలేమన్నారు.

ఫొటో సోర్స్, Spl

ఇంట్లో అందరికంటే పెద్దవాడయిన అరవయ్యేళ్ల చిరంజీవికి చెవిపక్కన "చల్ది "లేచింది.మంత్రాలు వేస్తూ చెవిలో ఆకుపసరు పోస్తూనే వున్నారు అయినాకూడా చెవి వినపడటం మానేసింది.చెవీ,ముక్కూ, గొంతూ డాక్టర్ దగ్గరకెళితే,చల్ది పొక్కుల వలన చెవి నరం దెబ్బతిని చెవుడొచ్చిందనీ,ముందుగా వస్తే ఏమయినా చెయ్యగలిగే వాడిననీ ఇప్పుడు తానేం చేయలేననీ చేతులెత్తేశాడు.

సర్పి వచ్చి తగ్గి మూడు నెలలు దాటినా మాధవరావుకి అది వచ్చి తగ్గిన చోట వెర్రి మంటలు తగ్గలేదు.డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ,దానినే "పోస్ట్ హెర్పటిక్ న్యూరాల్జియా "అంటారనీ,సర్పి వచ్చి తగ్గిన కొంతమందిలో ఇలా నెప్పి నిలబడి పోతుందనీ,అది వచ్చిన 72గంటల లోపే చికిత్స మొదలు పెడితే నొప్పి తీవ్రంగా వుండేది కాదనీ చెబుతూ ఉపశాంతికి ఏవో మందులిచ్చాడు.

లారీడ్రయివర్ గా పనిచేస్తున్న లోకేశ్వరరావుకి అతి తీవ్రంగా వచ్చిన సర్పికి మంత్రాలూ,ఆకుపసర్లూ కాదని డాక్టర్ దగ్గరికి వెళితే ,రక్త పరీక్షలలో ఎయిడ్స్ జబ్బుందని తేలింది.

ఆ జబ్బువలన రోగనిరోధక శక్తి తగ్గి సర్పి బయటేసిందని డాక్టర్ చెప్పాడు.

రొమ్ము కాన్సర్ కి మందులు వాడుతున్న రమామణికి ఒక్కసారిగా ఒంటిమీద కనపడిన సర్పికి కారణం,కేన్సర్ మందుల వలన ఆమెలో రోగనిరోధక శక్తి తగ్గడమే అని డాక్టర్లు చెప్పి దానికి తగిన మార్పులు చేశారు ట్రీట్మెంటులో.

అసలు సర్పి లేక చల్ది అని పిలవబడే ఈ వ్యాధికి కారణమేంటీ,ఎందువలన వస్తుందీ,చికిత్సా,నివారణోపాయాలూ ఒకసారి చూద్దామా

మనం సర్పి లేక చల్ది అని పిలిచే ఈ వ్యాధిని వైద్య పరిభాషలో "హెర్పెస్ జోస్టర్ లేక షింగిల్స్ "అంటారు.

ఫొటో సోర్స్, Spl

"హెర్పెస్ జోస్టర్ "అనే పదం గ్రీకు భాషనుండీ వచ్చింది,"హెర్పెస్ -అంటే ప్రాకు అనీ ,జోస్టర్ అంటే నడికట్టూ లేక వలయము "అని అర్థమట."షింగిల్స్ ""అనే మాట లాటిన్ నుండీ వచ్చిందట ,దీనికి కూడా "నడికట్టు" లేక "వలయము" అనే అర్థమట.ఇంతకీ అలాంటి పేరు పెట్టడానికి ఈ వ్యాధి సాధారణంగా నడుము భాగంలో అర్థచంద్రాకారంలో శరీరం సగభాగాన్ని చుడుతున్నట్టుగా వుండటమే కారణమయ్యుంటుంది.ఇది శరీరంలో సగభాగానికే పరిమితమయ్యుంటుంది అవతలి పక్కకు వ్యాపించదు.

మనదేశంలో సుమారు సంవత్సరానికి పది లక్షల మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతూ వుంటారు.

ప్రపంచ జనాభాలో మూడొంతులమంది ఏదో ఒక సందర్భంలో ఈ వ్యాధినెదుర్కొంటారని అంచనా.

సాధారణంగా నడివయసు దాటిన వారు అంటే 50 సంవత్సరాలు దాటిన వారు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతూ వుంటారు,అలా అని చిన్నపిల్లల్లో రాదని కాదు ,అక్కడక్కడా వాళ్లల్లో కూడా కనపడుతుంది.

ముఖ్యంగా శారీరకంగా,మానసికంగా విపరీతమైన ఒత్తిడికీ,శ్రమకూ గురయిన వారిలోనూ,

రోగనిరోధక శక్తి తక్కువగా వుండే వారిలోనూ ఉదా:షుగర్ పేషెంట్లూ,కేన్సర్ పేషెంట్లూ,కేన్సర్ మందులు వాడేవారూ,ఎయిడ్స్ పేషెంట్లూ,స్టిరాయిడ్స్ వాడే వారూ.

తొందరగా ఈ వ్యాధి బయట పడుతుంది.

ఈ వ్యాధిని కలగజేసే క్రిమి ఒక వైరస్ .దానిపేరు "వారిసెల్లా జోస్టర్ ",ఇది ఒక డబుల్ స్ట్రాండెడ్ డి.ఎన్ .ఏ. వైరస్

వ్యాధి పరిణామక్రమం

ఒక విచిత్రమైన విషయమేమంటే "షింగిల్స్ అంటే సర్పి "అనే వ్యాధినీ "చికెన్ పాక్స్ "అంటే మనం "ఆటలమ్మ "అంటామే ఆ వ్యాధినీ కలగ జేసేది ఒకే వైరస్ అదే "వారిసెల్లా జోస్టర్ "

"ఆటలమ్మ "చిన్నవయసు పిల్లలలో వస్తూవుంటుంది సాధారణంగా అక్కడక్కడా పెద్దవాళ్లల్లో కూడా వస్తుందనుకోండి.

అలా "ఆటలమ్మ (చికెన్ పాక్స్ )వచ్చి తగ్గి పోయాక దానికి సంబంధించిన వైరస్ కొంతమందిలో మాత్రం వెన్నుపూసలోని నరాలకు సంబంధించిన నాడీకణాలలో నిద్రాణంగా సంవత్సరాల తరబడి దాగి వుంటుంది.

అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు,శక్తి పుంజుకుని పునరుజ్జీవితమై తను దాక్కున్న నరం వెంట ప్రయాణించి ,ఆ దారిలో వున్న చర్మం మీద గుల్లలుగా బయట పడుతుంది.

ఆ నరం సప్లయి చేసే కణజాలాలలో వాపుని కలగజేసి అప్పుడప్పుడూ ఆ కణజాలాలని ధ్వంసం కూడా చేస్తుంది .అలా ఆ నెర్వ్ సప్లయిచేసే చర్మాన్నీ ,కణజాలాన్నీ "డెర్మటోమ్ "అంటారు.వెన్నుపూసనుండీ వచ్చే నాడులు ,ఆకులోని ఈనెలు లాగా శరీరానికి ఒక అర్థ భాగానికే పరిమితమయి వుంటాయి కాబట్టి "సర్పి "కూడా శరీరంలో అర్థ భాగానికే పరిమితమయి వుంటుంది.

ఫొటో సోర్స్, BBC/DAVID WELLER

వ్యాధి లక్షణాలు:

మొట్ట మొదట ఎక్కడయితే "సర్పి "రాబోతోందో ఆ భాగంలో విపరీతమైన మంట ,నొప్పి వుంటుంది.అన్ని నొప్పులలోకీ "సర్పి "వలన కలిగే నెప్పి తీవ్రమయినదీ , భరించలేనిదీ అని వైద్య గ్రంథాలలో చెప్పబడి వుంది.

అయితే నాడీవ్యవస్థ దెబ్బతిన్న వారిలో ఉదా:ఎయిడ్స్ ,నెప్పి తెలియక పోవచ్చు.

రెండు ,మూడు రోజులలో ఎర్రని దద్దుర్లు వస్తాయి ,ఆ తర్వాత ,గుత్తులు గుత్తులుగా నీటి గుల్లల్లాంటివి వచ్చి ,అవికూడా రెండు మూడు రోజుల తర్వాత చీము పొక్కులుగా మారతాయి .

ఆ పైన రెండు మూడురోజులలో నల్లగా మాడి పొక్కు గట్టి రాలిపోతాయి .

ఈ పరిణామ క్రమమంతా జరగడానికి 2----4వారాలు పడుతుంది.

వ్యాథికి గురయ్యే శరీర భాగాలు

*సాధారణంగా నడుంచుట్టూ,ఛాతీ చుట్టూ వస్తుంది,ఒకో సారి ఈ నెప్పి ఛాతీ లో ఎడమవేపు వస్తే గుండెనెప్పిగా పొరబడే అవకాశం కూడా వుంది.

*మొఖం మీద వచ్చినపుడు "ట్రయిజెమినల్ నర్వ్ " కి ఈ వ్యాధి సోకి,అది సప్లయి చేసే కంటి నరం కూడా దెబ్బతినే అవకాశ ముంది .వ్యాధిని మొదటి దశలోనే గుర్తించి ,తగిన చికిత్స చేస్తే కంటి చూపు పోకుండా నివారించ వచ్చు

*చెవి ప్రాంతంలో సర్పి వచ్చినపుడు "ఫేషియల్ నర్వ్ "కి వ్యాధి సోకి ,దాని బ్రాంచ్ అయిన "వెస్టిబ్యులో కోక్లియార్ నర్వ్ "దెబ్బతిని వినికిడి కోల్పోవడమూ,బాలెన్సు తప్పి కళ్లుతిరగడమూ జరగ వచ్చు.---దీనినే "రామ్ సే హంట్ సిండ్రోమ్ "అంటారు.

*గొంతూ ,అంగిలి,నాలుక భాగాలమీద కూడా "సర్పి "సోకి రుచి కోల్పోవడం,చిగుళ్ల వాపులూ,పుళ్లూ,పళ్ల వ్యాధులూ రావచ్చు.

*ఇంకా ఊపిరి తిత్తుల నెమ్మూ,లివర్ వాపూ ,మెదడు వాపూ లాంటి కాంప్లికేషన్స్ కూడా "సర్పి" వలన రావచ్చు.

*కాంప్లికేషన్స్ లో ముఖ్యంగా చెప్పుకోవలసింది ,సర్పి వచ్చి తగ్గిపోయాక కూడా వదలకుండా ఏడిపించే నెప్పి ,దీనినే "పోస్ట్ హెర్పెటిక్ న్యూరాల్జియా "అంటారు .ఇది వృధ్ధులలో కనపడినంత ఎక్కువగా యాభైయేళ్ల లోపు వారిలో కనిపించదు.

ఇది సాధారణంగా మూడు నుండీ ఆరు నెలలలో తగ్గుతుంది కొంతమందికి జీవితాంతం వుండవచ్చు .వ్యాథి వచ్చిన వెంటనే మందులు వాడిన వారిలో దీని తీవ్రత తక్కువగా వుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

వ్యాధి నిర్థరణ:

అనుభవజ్ఞుడయిన డాక్టర్ కంటితో చూసి వ్యాధిని నిర్థారించ గలడు.

రక్త పరీక్షలో ఐ.జి. యమ్ యాంటీబాడీని గుర్తించడం వలన వ్యాధిని నిర్థారించవచ్చు.

చికిత్స

చికిత్స ముఖ్యంగా నెప్పిని తగ్గించడం, తక్కువ సమయంలో వ్యాధి తగ్గేట్టు చూడటం, కాంప్లికేషన్లు రాకుండా నివారించడం మీద దృష్టి పెట్టి చెయ్యాలి.

ఒకప్పుడు ఈ వ్యాధికి సరైన మందులు లేని మాట నిజం కానీ నేడు చాలా చక్కటి ఏంటీ వైరల్ మందులు వచ్చాయి ఉదా:ఏసైక్లొవిర్ ,వాలా సైక్లోవిర్ ,ఫామీ సైక్లోవిర్ .

ఈ మందులని నోటి మాత్రలుగానూ,పై పూతలు గానూ,సూదిమందుల రూపంలోనూ ఇవ్వడం వలన వ్యాధిని చాలా తొందరగా కంట్రోలు చెయ్యగలుగుతున్నాం,

మంటలూ ,నొప్పీ తగ్గడానికి ,పైపూతలుగా కొన్ని ఆయింట్‌మెంట్‌లను వాడవచ్చు.

ఇంకా నొప్పి తగ్గించేందుకు కూడా పలు మందులను డాక్టర్ సలహాతో వాడవచ్చు.

*కన్నూ,చెవీ మొదలైన భాగాలకి వ్యాధి సోకినపుడు ఆయా స్పెషలిస్ట్ ల సలహాలతో కళ్లలోనూ,చెవిలోనూ చుక్కల మందులూ,నోటి మాత్రలూ వాడటం వలన దృష్టిని కోల్పోకుండా,వినికిడి కోల్పోకుండా నివారించవచ్చు.

మిగతా లక్షణాలను బట్టి చికిత్స చేయడం ద్వారా వ్యాధిని అదుపులోనికి తీసుకు రావచ్చు.

షింగిల్స్ లేక సర్పి అంటు వ్యాధేనా?:

అవుననే చెప్పాలి. వ్యాధి గుల్లల దశలో వున్నపుడు అందరికీ సోకక పోవచ్చు కానీ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా వుండే చిన్నపిల్లలకీ,రోగులకీ,గర్భిణీ స్త్రీలకీ ఈ సూక్ష్మజీవి వ్యాపించి వారిలో "చికెన్ పాక్స్ "రావడానికి కారణ మవుతుంది ,ఆ తర్వాత కొంతకాలానికి "సర్పి "వస్తే రావచ్చు ,డైరెక్ట్ గా "సర్పి "రాదు.

వ్యాధి రాకుండా టీకాలు వున్నాయా?

అవును వున్నాయి.షింగిల్స్ వాక్సిన్ ఒక లైవ్ వైరస్ వాక్సిన్ .వ్యాధి రాకుండా ఒక మూడుసంవత్సరాలు రక్షణ ఇస్తుంది. వ్యాధి తీవ్రతని కూడా తగ్గిస్తుంది.

వ్యాధికి తరచుగా గురయ్యే అవకాశమున్న యాభై యేళ్లు పైబడిన వృధ్ధులకు ఈ వాక్సిన్ ఇవ్వడం వలన వ్యాధి రాకుండా రక్షణ కల్పించవచ్చు

అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ----రోగ నిరోధిక శక్తి తక్కువగా వుండే వారికి ఈ వాక్సిన్ ఇవ్వరాదు.

చివరగా చెప్పొచ్చేదేమిటంటే మంత్రాలకు సర్పి తగ్గదు.

అందుకని సర్పి వస్తే మంత్రాలు పెట్టడం,హారతి కర్పూరం రాయడం లాంటివి చేసి విలువైన సమయాన్ని వృథా చేయకుండా వీలైనంత తొందరగా డాక్టర్ ని కలిసి యాంటీ వైరల్ మందులు వాడటం,మంచి ఆహారం ,విశ్రాంతి తీసుకోవడం,చేయాలి.

వ్యాధి వచ్చేప్రమాదముందనుకున్న వారికి టీకాలు ఇచ్చి రక్షణ కల్పించాలి. లేకపోతే ఆకుపసర్ల వలనా,నాటుమందుల వలనా పుండ్లమీద సూక్ష్మజీవులు చేరి సెప్టిక్ అవడమే కాక,కంటిచూపూ,వినికిడీ కూడా దెబ్బతినే ప్రమాదముందని గ్రహించాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)