ఎన్జీ రంగా యూనివర్శిటీలో 3000 మంది వ్యవసాయ విద్యార్థుల ఆందోళన.. ప్రైవేటు వ్యవసాయ కళాశాలలపై స్పందించిన మంత్రి సోమిరెడ్డి

  • బళ్ల సతీశ్
  • బీబీసీ ప్రతినిధి
బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో విద్యార్థుల నిరసన

ఫొటో సోర్స్, UGC

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ విద్యార్థుల ఆందోళన తీవ్రమవుతోంది. యన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ఐదు ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల విద్యార్థులు 9 రోజులుగా ఆందోళన చేస్తున్నారు.

ప్రైవేటు రంగంలో వ్యవసాయ కళాశాలలకు అనుమతులు ఇవ్వొద్దన్న ప్రధాన డిమాండుతో వారు పోరాడుతున్నారు. దీంతో పాటు వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే వ్యవసాయ కోర్సులు చదివిన వందలాది మంది ఖాళీగా ఉంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ రంగంలో ప్రైవేటు కాలేజీలను అనుమతించడం నిరుద్యోగాన్ని పెంచడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడదు అని విమర్శించారు బాపట్ల కాలేజీ విద్యార్థులు.

ఏపీలో వ్యవసాయ కాలేజీలు ఎన్ని?

ఆంధ్రప్రదేశ్‌లోని యన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో శ్రీకాకుళం జిల్లా నైరా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, గుంటూరు జిల్లా బాపట్ల, చిత్తూరు జిల్లా తిరుపతి, కర్నూలు జిల్లా మహానందిలో ఐదు ప్రభుత్వ వ్యవసాయ కాలేజీలు ఉన్నాయి.

2016లో రాష్ట్ర వ్యాప్తంగా 6 ప్రైవేటు కాలేజీలకు అనుమతులు వచ్చాయి.

ఫొటో సోర్స్, angrau.ac.in

విద్యార్థుల ఆందోళన తీవ్రత ఎంత?

వారం రోజులు నుంచి కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన 8వ రోజున తీవ్రతరం అయింది. తిరుపతిలో విద్యార్థులు అగ్రికల్చర్ యూనివర్శిటీ వీసీని అడ్డుకోవడం, బాపట్ల కళాశాలలో విద్యార్థులను హాస్టళ్లల్లోకి అనుమతించకపోవడం దీనికి కారణాలు.

19వ తేదీ రాత్రి విద్యార్థులను హాస్టళ్లలోకి అనుమతించకపోవడంతో వారు కాలేజీ ఆవరణలో కూర్చున్నారు. చివరకు రాత్రి పదకొండున్నరకు వారిని హాస్టళ్లలోకి అనుమతించారు.

అగ్రికల్చర్ బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలు చదువుతోన్న దాదాపు 3000 మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి విద్యార్థులను హాస్టళ్లలోకి అనుమతిస్తున్నారు. విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.

భర్తీ కాని అగ్రికల్చర్ పోస్టులు ఎన్ని?

2016లో 30 బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేశారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం 145 ఏవో, 380 ఏఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

తాజాగా 400 అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం, అగ్రికల్చర్ పోస్టులను మాత్రం పూరించకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యూనివర్శిటీ ఏమంటోంది?

అయితే తమ పరిధిలో ఉన్న సమస్యలను తాము పరిష్కరిస్తామనీ, కానీ క్యాంపస్ నిర్మాణం, పోస్టుల భర్తీ వంటివి తమ చేతుల్లో లేవని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. పోస్టుల భర్తీపై మంత్రి నోటి మాటగా హామీ ఇచ్చారనీ, కానీ విద్యార్థులు లిఖిత పూర్వక హామీ కోసం పట్టుబడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

దీనిపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, కొత్త ప్రైవేటు వ్యవసాయ కళాశాలకు అనుమతిచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఐ.సి.ఎ.ఆర్ అక్రిడేటెడ్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఏవో, ఏఈవో పోస్టులకు అవకాశమిస్తామన్నారు. రాష్ట్రంలో పలు వ్యవసాయ కళాశాలల్లో 384 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. విద్యార్థులను కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయనీ, వారి కుట్రలో పావులు కావద్దని విద్యార్థులకు చంద్రమోహన రెడ్డి పిలుపునిచ్చారు.

మరోవైపు విద్యార్థులు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డిని కలిశారు. చర్చలు కొనసాగుతున్నాయి.

కొత్త కళాశాలలకు అనుమతి ఆలోచన లేదు - మంత్రి సోమిరెడ్డి

దీనిపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి.. కొత్త ప్రైవేటు వ్యవసాయ కళాశాలకు అనుమతిచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఐ.సి.ఎ.ఆర్ అక్రెడిటెడ్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఏవో, ఏఈవో పోస్టులకు అవకాశమిస్తామన్నారు. రాష్ట్రంలో పలు వ్యవసాయ కళాశాలల్లో రూ. 384 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. విద్యార్థులను కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయనీ, వారి కుట్రలో పావులు కావొద్దని విద్యార్థులకు చంద్రమోహన రెడ్డి పిలుపునిచ్చారు.

మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డిని కలిశారు. చర్చలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)