సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనూహ్య హంతకుడికి ఉరి శిక్ష: ముంబయిలో ఆ రాత్రి ఏం జరిగింది

అనూహ్య

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్,

అనూహ్య

మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎస్తేరు అనూహ్య(23) ముంబయిలో అత్యాచారం, దారుణ హత్యకు గురయి అయిదేళ్లు పూర్తవుతున్న సమయంలో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు చంద్రభాన్ సనప్‌కు మరణ శిక్షను ఖరారు చేసింది.

అర్ధరాత్రి వేళ రైలు దిగిన ఆమెను లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మబలికి దార్లో అత్యాచారానికి పాల్పడడమే కాకుండా తన దురాగతం బయటపడుతుందన్న ఉద్దేశంతో ఆమెను హతమార్చిన చంద్రభాన్‌కు ఉరే సరైనదని కోర్టు అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ముంబయి లోక్‌మాన్య తిలక్ టెర్మినస్

ఆ రోజు ఏం జరిగింది?

ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసుల కేస్ రికార్డ్ ప్రకారం.. మచిలీపట్నానికి చెందినే ఎస్తేరు అనూహ్య ముంబయిలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. 2013 సంవత్సరాంతంలో క్రిస్మస్ సెలవులకు ఇంటికొచ్చిన ఆమె 2014 జనవరి 4 తిరిగి విజయవాడ నుంచి ముంబయి వెళ్లారు.

ముంబయి లోకమాన్య తిలక్ టెర్మినల్‌లో ఆమె రైలు దిగేటప్పటికి అర్ధరాత్రయింది. తానుండే ప్రదేశానికి వెళ్లడానికి సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో రైల్వే స్టేషన్ వద్దే వేచిచూస్తోంది. అప్పుడే ఓ వ్యక్తి టాక్సీవాలాగా పరిచయం చేసుకుని.. ఎక్కడికి వెళ్లాలంటూ ఆమెతో మాట కలిపి అంధేరీలోని ఆమె గది వద్ద దించుతానని చెప్పి ఒప్పించాడు.

అయితే, నమ్మి ఆయనతో వెళ్లడానికి అంగీకరించిన ఆమెను టాక్సీలో కాకుండా బైకుపై ఎక్కించుకుని వెళ్లి దార్లో అత్యాచారానికి ప్రయత్నించాడు. రూ.2 లక్షలు ఇస్తానని, తనని వదిలేయాలని అనూహ్య ప్రాథేయపడినా ఏమాత్రం కనికరించకుండా తీవ్రంగా కొట్టి బలత్కరించాడు.

భయం, బాధతో స్పృహతప్పిన అనూహ్య కోలుకుని మళ్లీ లేస్తే తాను చేసిన పని బయటపడుతుందన్న ఉద్దేశంతో అక్కడే చంపేశాడు. అనంతరం ఆమె ల్యాప్ టాప్, సెల్‌ఫోన్, లగేజీ తీసుకుని.. ఆమె మృతదేహాన్ని ముంబయి శివారుల్లో పడేసి తగలబెట్టేశాడు.

జనవరి 4 అర్ధరాత్రి దాటాక ఈ దారుణం జరగగా 16న కాలిపోయిన ఆమె మృతదేహాన్ని స్థానికులు కొందరు చూశారు.

ఫొటో సోర్స్, Getty Images

రైల్వే పోర్టర్ ఇచ్చిన క్లూతో..

విషయం పోలీసులకు చేరడంతో వారు విచారణ జరిపి మృతురాలిని అనూహ్యగా గుర్తించారు. అయితే, ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారన్న విషయంలో తొలుత కొంత అయోమయం ఏర్పడింది.

అనూహ్య స్నేహితుడిని తొలుత అనుమానించిన పోలీసులు అతణ్ని విచారించారు. అనంతరం సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించాక ఓ వ్యక్తితో కలసి ఆమె వెళ్లినట్లు గుర్తించారు.

సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా రైల్వే స్టేషన్లో అందరినీ విచారించగా ఓ పోర్టర్ అనూహ్యను తీసుకెళ్లిన వ్యక్తి చంద్రభాన్‌గా గుర్తించాడు.

చంద్రభాన్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించగా ఆయన ఘటన జరిగిన మరునాటి నుంచి పరారీలో ఉన్నట్లు తేలింది. దీంతో ఆయనపై అనుమానం మరింత బలపడింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అనూహ్య హత్యకేసులో ఉరిశిక్ష ఖరారైన చంద్రభాన్ సనప్(ముసుగులోని వ్యక్తి)

తల్లిదండ్రులను చూడ్డానికి వచ్చి చిక్కాడు

చివరకు 2014 మార్చి 3న తన తల్లిదండ్రులను కలవడానికి వచ్చిన చంద్రభాన్‌ను పోలీసులు పట్టుకున్నారు.

ఈ కేసు విచారించిన ప్రత్యేక మహిళా కోర్టు 2015లోనే చంద్రభాన్‌కు మరణశిక్ష విధించింది.

అయితే, దానిపై హైకోర్టుకు వెళ్లాడాయన. అప్పటి నుంచి సాగిన విచారణలు ఏ ఏడాది నవంబరు నాటికి పూర్తయ్యాయి.

పోలీసులు సమర్పించి సాక్ష్యాధారాలను పరిశీలించాక చంద్రభాన్‌కు ప్రత్యేక మహిళా కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బాంబే హైకోర్టు

'ఇంకే తల్లిదండ్రులకూ ఇలాంటి కష్టం రాకూడదు'

తీర్పుపై అనూహ్య తండ్రి సింగవరపు సురేంద్ర ప్రసాద్ స్పందిస్తూ ''న్యాయం దక్కింది. మా హృదయాల్లో బాధ ఉంది. నిందితులకు శిక్ష పడిందా లేదా అని తెలిసినవాళ్లంతా అడుగుతుండేవారు. ఈ రోజు కోర్టు తీర్పుతో మాకు న్యాయం దొరికిందని అందరికీ చెప్తాం'' అన్నారని మిడ్ డే పత్రిక పేర్కొంది. సురేంద్ర ప్రసాద్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు.

''ఇలాంటి కష్టం ఇంకే తల్లిదండ్రులకూ రాకూడదు. అయితే, ఇలాంటి దారుణాలు చేసినవారెవ్వరూ చట్టం నుంచి తప్పించుకోలేరని మరోసారి రుజువవడం సంతోషంగా ఉంద''ని అనూహ్య తల్లి అన్నారు.

తీర్పు వెలువరిస్తున్న సమయంలో న్యాయమూర్తి డాంగ్రే ''సమాజంపై నమ్మకం పోయేలా దారుణానికి పాల్పడిన నిందితుడికి మరణ శిక్షే సరైనది'' అన్నారు. న్యాయమూర్తి మాట వినగానే చంద్రభాన్ పెద్ద పెట్టున ఏడ్చాడు. పోలీస్ వ్యాన్ ఎక్కుతూ ఆయన.. ''అంతా కలిసి కుట్రపన్ని అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా మార్చేశారు'' అని అన్నాడు.

మరణ శిక్షపై సుప్రీంలో అప్పీల్ చేస్తామని చంద్రభాన్ తరఫు న్యాయవాది నితిన్ ప్రధాన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)