ఫుడ్ అలర్జీ: ఈ సమస్య ఎందుకు పెరుగుతోంది?

  • 23 డిసెంబర్ 2018
పల్లీలు Image copyright Getty Images

పిల్లల్లో ఆహార పదార్థాల వల్ల వచ్చే అలర్జీలు ప్రపంచవ్యాప్తంగా గతం కంటే ఎక్కువయ్యాయి.

ఇటీవల ఇద్దరు బ్రిటిష్ టీనేజర్లు నువ్వులు, వేరుసెనగ పప్పు తిని మృతిచెందినట్లు తేలింది. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఆగస్టులో ఆరేళ్ల పాప పాల ఉత్పత్తులు తిని అవి అలర్జీకి దారి తీసి ప్రాణాలు కోల్పోయింది.

పాశ్చాత్య దేశాలలో కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి ఎలర్జీలు పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో 7 శాతం మంది పిల్లలు, ఆస్ట్రేలియాలో 9 శాతం మంది పిల్లలు ఆహార అలర్జీకి లోనవుతున్నారు.

యూరప్‌లో పెద్దల్లో 2 % మందికి ఆహార పదార్థాల అలర్జీ ఉంది.

ఒంటికి సరిపడని ఆహారాలు ఏవైనా తింటే ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతోంది. దీంతో ఈ సమస్య ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు నిత్యం ఆందోళనతో గడుపుతున్నారు.

Image copyright family handout/PAWire
చిత్రం శీర్షిక ఫుడ్ అలర్జీ వల్ల చనిపోయిన బ్రిటిష్ టీనేజర్ నటాషా

అలర్జీ దేనివల్ల వస్తుంది?

వాతావరణంలో ఉన్న హాని చేయని అలర్జెన్స్ మీద రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినపుడు అలర్జీ వస్తుంది. దీనివల్ల రోగ లక్షణాలు బయటపడతాయి.

ఇలాంటి లక్షణాలలో చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, వాపు ఉంటాయి. మరీ ప్రమాదకరమైన కేసుల్లో వాంతులవడం, విరేచనాలవడం, ఊపిరాడకపోవడం... శరీరానికి సరిపడని ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు రియాక్షన్స్ కలగవచ్చు.

సాధారణంగా పిల్లలకు లర్జీ కలిగించే ఆహార పదార్థాలు:

•పాలు

•గుడ్లు

•వేరుసెనగ

•గింజలు (ఆక్రోట్, బాదం, పైన్ గింజలు, బ్రెజిల్ నట్స్, పెకాన్సు వంటివి)

•నువ్వులు

•చేపలు

•షెల్ ఫిష్ (రొయ్యలు, పీతలు వంటివి)

Image copyright Getty Images

ఎక్కువగా ఎక్కడ?

వీటి ప్రభావం తీసుకొనే ఆహారం, రోగులు నివసించే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది.

గత 30 ఏళ్ళలో ఆహార అలర్జీలు పెరగడమే కాదు ముఖ్యంగా పారిశ్రామిక సమాజాలలో ఎక్కువగా కనిపిస్తోంది.

లండన్‌లోని కింగ్స్ కాలేజ్ మూడేళ్ళ వయసు పిల్లలు 1300మందిపై చేసిన ''ఈట్ స్టడీ''తో 2.5 శాతం మందికి వేరుసెనగ అలర్జీ ఉందని తేలింది.

ఆస్ట్రేలియాలో ఆహార అలర్జీ అత్యధిక శాతం ఉందని నిర్ధారణైంది. ఆస్ట్రేలియాలో ఏడాది వయసున్న పిల్లల్లో 9 % మందికి గుడ్డు పడదు. 3 % మందికి వేరుసెనగ పడదు.

Image copyright Getty Images

ఇవీ కారణాలు

* పిల్లల్లో పరిశుభ్రత బాగా పెరిగిపోవడం వల్ల చిన్నపాటి తేడాలను కూడా తట్టుకోలేకపోవడం.

అలర్జీలను నివారించే యంత్రాంగమే పారాసైటిక్ ఇన్ఫెక్షన్ల (పరాన్న జీవుల వల్ల కలిగే అంటువ్యాధులు)తో పోరాడుతుంది. పోరాడటానికి పరాన్నజీవులు తక్కువైనపుడు, రోగనిరోధక వ్యవస్థ హాని చేయని వాటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

మరో సిద్ధాంతం ఏమిటంటే విటమిన్ డి అలర్జీలు రాకుండా ఆరోగ్యకరమైన ప్రతిస్పందన అభివృద్ధి చేసుకొనేలా రోగనిరోధక వ్యవస్థకు సహకరిస్తుంది. ప్రపంచ జనాభాలో చాలామందికి తగినంతగా విటమిన్ డి లభించదు. దీనికి పలు కారణాలు. వీటిలో ఒకటి ఎండలో తక్కువ సేపు ఉండడం. ఒక్క దశాబ్దంలో అమెరికాలో విటమిన్ డి లోపం ఉన్నవారి శాతం రెట్టింపైంది.

''డ్యూయల్ అలర్జెన్స్ ఎక్స్‌పోజర్'' సిద్ధాంతం కొత్తది. ఇది సమయం, మోతాదు, ఎక్స్ పోజర్ రకాల మధ్య సంతులనం లేకపోవడం వల్ల ఆహార అలర్జీ అధికమవుతోందని చెబుతుంది.

ఉదాహరణకు ఎలర్జీ ప్రతిరక్షకాలు చర్మం ద్వారా ప్రవేశిస్తాయి.

చనుబాలు మానుతున్నపుడు ట్రిగ్గర్ ఆహారాలు తినిపించడం ద్వారా ఆరోగ్యకరమైన ప్రతిస్పందన వచ్చి, అలర్జీల సమస్య తగ్గుతుంది. ఎందుకంటే పొట్టలోని పేగు బాక్టీరియాను, ఆహారంలాంటి విదేశీ పదార్థాలను సహించడానికి సిద్ధమవుతుంది.

లండన్ లోని కింగ్స్ కాలేజ్ చేసిన లీప్ స్టడీకి ఇదే మూలాధారం. అయిదేళ్ళ వయసున్న పిల్లలు క్రమం తప్పకుండా ఏడాది వయసునుంచి వేరుసెనగ తింటే, వేరుసెనగ అలర్జీ 80% తగ్గింది.

పసిపిల్లలకు వేరుసెనగ పెట్టే మార్గదర్శకాలను ఈ అధ్యయనం ఆధారంగా అమెరికాలో మార్చారు. బ్రిటన్‌లోని తల్లిదండ్రులు ముందు తమ జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించాలని సలహా ఇచ్చారు.

Image copyright Thinkstock

మానవ ప్రభావం

ఇటీవల ఆహార అలర్జీల వల్ల యుకె టీనేజర్లు చనిపోవడం స్పష్టమైన, కచ్చితమైన లేబెలింగ్ ఉండాలని సూచిస్తోంది.

ప్రస్తుతం ఆహార అలర్జీకి చికిత్స లేదు. పంటికి సరిపడని ఆహారాన్ని తినకుండా ఉండడం ద్వారా ప్రమాదం తప్పుతుంది. ఒకవేళ ప్రాణాపాయకరమైన పరిస్థితి ఎదురైతే అత్యవసర చికిత్స ప్రణాళిక ఉండాలి.

ఆరంభంలో రోగనిర్ధారణ కూడ కష్టమైన పనే. ఆహార అలర్జీలు తెలుసుకొనడానికి రోగి వైద్యుల పర్యవేక్షణలో ఆ పదార్థాలను క్రమంగా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.

అయితే పిల్లల విషయంలో ఇది కష్టం. ఇంకా అలర్జీ ప్రతిచర్య జరిగే ప్రమాదం ఉంటుంది.

కింగ్స్ కాలేజీలో ప్రత్యామ్నాయ రక్తపరీక్ష విధానాన్ని రూపొందించారు. ఇది వేరుసెనగ అలర్జీని ఇతర పద్ధతుల కంటే కచ్చితంగా నిర్ధారించగలదు.

కచ్చితంగా రోగనిర్ధారణ జరిగిన తర్వాతకూడ, ట్రిగ్గర్ ఆహారాలు తినకుండా ఉండడం కష్టం, యాదృచ్ఛిక ప్రతిచర్యలు సాధారణమే.

ఎలర్జెన్ ఇమ్యూనో థెరపీ

పడని పదార్థాన్ని చిన్న మోతాదుల్లో ఇవ్వడం - దీనివల్ల ఎలర్జీ ఉన్న రోగుల్లో ఒకవేళ యాదృచ్ఛికంగా ఈ పదార్థం తిన్నా తీవ్రమైన ప్రతిచర్య కలగదు.

ఇటీవల జరిపిన ఇమ్యూనోథెరపీ డ్రగ్ ట్రయల్ వల్ల వేరుశెనగ ఎలర్జీ ఉన్నవారిలో 67% మంది ఏడాది తర్వాత కంట్రోల్ గ్రూప్ లోని 4% మందితో పోలిస్తే రెండు వేరుశెనగ గింజలు తినగలిగారు. అయినా వారికి ఇంకా అలర్జీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు.

ఆహార అలర్జీకి ఇతర చికిత్సల కోసం అన్వేషణ జరుగుతోంది. ఇవి అవసరం కూడా. ఆహార పదార్థాల వల్ల అతిగా ప్రభావితం కావడం అంటే ఎలర్జీలు రావడానికి కారణం బహుశా పర్యావరణం సంబంధితమైన ఇంకా పాశ్చాత్య జీవన శైలులకు అలవాటుపడడం కావచ్చు. వర్థమాన దేశాలలో అలర్జీలు రేటు చాలా తక్కువగా ఉంది. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో కన్న పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపస్తున్నాయి.

దీనికి కారణం కాలుష్యం, తినే ఆహారంలో మార్పులు, మన రోగ నిరోధక వ్యవస్థల ప్రతిస్పందనలో మార్పులు తెచ్చే సూక్ష్మజీవులు తక్కువ ఉండడం. వలస వెళ్ళిన వారికి తమ స్వదేశంలో కన్న ఎక్కువ మందికి తాము నివసించే ప్రదేశంలో ఆస్థమా, ఆహార ఎలర్జీలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది.

(ఈ విశ్లేషణ ఒక సంస్థలో పనిచేసే నిపుణురాలితో బీబీసీ చేయించింది. డా. అలెగ్జాండ్రా శాంతోస్ లండన్లోని కింగ్స్ కాలేజ్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ ఎలర్జీ విభాగంలో సీనియర్ క్లినికల్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)