టాల్కమ్ పౌడర్ రాసుకుంటే క్యాన్సర్ వస్తుందా?

  • భూమికా రాయ్
  • బీబీసీ ప్రతినిధి
టాల్కమ్ పౌడర్

ఫొటో సోర్స్, iStock

‘పౌడర్ రాసుకుంటే తెల్లగా కనిపిస్తారు కానీ క్యాన్సర్ వస్తుందా’ అనే సందేహం రావడం సహజం. కానీ, ఇటీవల కొన్ని పరిణామాలు మాత్రం ఆ విషయంలో కొత్త భయాలను పుట్టిస్తున్నాయి.

జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ కంపెనీ మీద ఒక మహిళ వేసిన కేసుతో ఈ చర్చ మొదలైంది. అమెరికాకు చెందిన ఓ మహిళ తనకు జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ రాసుకోవడం వల్లే గర్భాశయ క్యాన్సర్ వచ్చిందని కోర్టులో కేసు వేసింది. ఆ తరువాత ఇంకొందరు మహిళలూ ఆమెకు జతకలిశారు. వాళ్లు కూడా అదే ఆరోపణ చేస్తూ కోర్టులో కేసు వేశారు.

కాలిఫోర్నియాలోని కోర్టు ఆ కంపెనీకి దాదాపు రూ.32వేల కోట్ల రూపాయలను జరిమానాగా విధించింది. ఆ పౌడర్‌లో ఆస్బెస్టాస్ అనే పదార్థాన్ని వాడారని, దాని వల్ల తలెత్తే ప్రమాదాల గురించి వినియోగదార్ల దగ్గర ఆ సంస్థ దాచిపెట్టిందని తీర్పు చెప్పే సమయంలో న్యాయమూర్తులు అన్నారు.

అది ఆమె ఒక్కరి సమస్యే కాదు. న్యూజెర్సీలోని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ప్రధాన కార్యాలయానికి చేరుకొని చాలామంది మహిళలు తాము కూడా పౌడర్ వాడటం వల్లే క్యాన్సర్ బారిన పడినట్లు ఆరోపించారు.

మొదట కేసు వేసిన మహిళ చెప్పినదాని ప్రకారం తన మర్మాంగాల దగ్గర చెమటను పీల్చుకోవడానికి ఆమె పౌడర్ వాడేవారు. దానివల్లే తనకు సమస్యలు మొదలయ్యాయని చెప్పారు.

కానీ, కంపెనీ మాత్రం ఇవన్నీ అసత్య ఆరోపణలని చెబుతోంది. ఏదేమైనా భారత్‌లో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర మీడియా కథనాల ప్రకారం... కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశానుసారం వంద మందికిపైగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కార్యాలయాలు, హోల్ సేల్ వ్యాపారులు, పంపిణీదారుల నుంచి పౌడర్ శాంపిళ్లను సేకరించి వాటిని పరీక్షిస్తారు.

ఫొటో సోర్స్, AFP

ఈ విషయం గురించి కేంద్ర ఔషద నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)ను సంప్రదిస్తే, టాల్కమ్ పౌడర్ విషయం తమ దృష్టికి వచ్చిందని అక్కడి అధికారులు చెప్పారు. కానీ, దానిపై చర్యల గురించి ఏమీ చెప్పలేదు.

రాయిటర్స్ వార్తా సంస్థ అందించిన ఓ రిపోర్టు తరువాతే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఎన్నో దశాబ్దాల నుంచే తమ బేబీ పౌడర్‌లో అస్బెస్టాస్ ఉందని తెలుసని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.

1970ల నుంచే ఆస్బెస్టాస్‌ లేని బేబీ పౌడర్‌లు వినియోగంలో ఉన్నాయి.

నిజానికి మర్మాంగాల దగ్గర పౌడర్ (ఆస్బెస్టాస్ ఉన్న) రాసుకుంటే గర్భాశయ క్యాన్సర్ తలెత్తే అవకాశం ఉంటుందనే ఆందోళన ఎప్పట్నుంచో వినిపిస్తోంది. కొన్ని అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు చెప్పిన దాని ప్రకారం ఆస్బెస్టాస్ ఉన్న పౌడర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశముంది. కానీ, ఆ విషయం ఇప్పటిదాకా ఆధార సహితంగా రూఢీ అవ్వలేదు.

కానీ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్‌తో పాటు కొన్ని ఇతర సంస్థల అధ్యయనాలను దృష్టిలో పెట్టుకొని జననాంగాల దగ్గర టాల్కమ్ పౌడర్ వినియోగాన్ని క్యాన్సర్ కారకాల జాబితాలో చేర్చారు.

సర్ గంగారామ్ హాస్పిటల్‌‌కు చెందిన చర్మ వ్యాదుల నిపుణుడు, డాక్టర్. రోహిత్ బత్రా చెప్పిన వివరాల ప్రకారం దాదాపు ప్రతి పౌడర్‌లోనూ ఆస్బెస్టాస్ ఉంటుంది. అది ఎక్కువ మొత్తంలో శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ తలెత్తే అవకాశమూ ఉంది.

‘ఏదో ఒక పౌడర్ గురించి చెప్పడం సరికాదు. సాధారణంగా పౌడర్ వినియోగం తక్కువగానే ఉంటుంది. వాళ్లలో కూడా క్యాన్సర్ చాలా కొద్ది మందికే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, పౌడర్ అనే కాదు, మరే కాస్మెటిక్ ప్రొడక్ట్ అయినా ఎక్కువ మోతాదులో వాడటం శ్రేయస్కరం కాదు. స్నానం చేసేప్పుడు ఆ కాస్మెటిక్స్ రాసిన ప్రాంతాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి’ అని రోహిత్ సూచిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images

జాన్సన్ అండ్ జాన్సన్ కేసు

రాయిటర్స్ రిపోర్టుతో పాటు కొందరు మహిళల ఆరోపణల ప్రకారం జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలున్నాయి. కానీ, కంపెనీ ఇవన్నీ అసత్యాలని చెబుతోంది.

ఆ ఆరోపణలు, రాయిటర్స్ రిపోర్టు అవాస్తమని, అది ఏకపక్షంగా ఉందని, తమ పౌడర్ పూర్తిగా సురక్షితమని, అందులో ఆస్బెస్టాస్ లేదని బీబీసీకి పంపిన ఒక మెయిల్‌లో ఆ సంస్థ తెలిపింది.

దాదాపు లక్షమంది స్త్రీ పురుషులపై అధ్యయనం చేశాక తమ పౌడర్ పూర్తి స్థాయిలో సురక్షితమని తేలిందని కంపెనీ చెబుతోంది. ఆ అధ్యయన నివేదికలను రాయిటర్స్‌కు కూడా పంపినట్లు తెలిపింది.

‘మా ఉత్పత్తులను చాలా ఏళ్లుగా వాడుతున్నారు. చాలామంది సామాన్యులు మా ఉత్పత్తులను ఇష్టపడతారు. ఈ పౌడర్ పైన అనేక స్వతంత్ర అధ్యయనాలు కూడా జరిగాయి. దీనివల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడా తేలలేదు’ అని ఆ సంస్థ వివరిస్తోంది.

సాధారణంగా అనేక ఖనిజాలను శుద్ధి చేసి పౌడర్‌ల తయారీలో వినియోగిస్తారు. ఒక్కో పౌడర్ సంస్థ ఒక్కో ఫార్ములా ఉపయోగిస్తుంది. ‘పెద్దలు, పిల్లలకు వేర్వేరుగా చేసే పౌడర్లలో ఎలాంటి తేడా ఉండదు. కోమలం, మృదుత్వం లాంటి పదాలను మార్కెటింగ్‌ కోసమే ఉపయోగిస్తారు. కొన్నేళ్ల క్రితం దాకా పౌడర్ వల్ల తెల్లగా అవుతారని భావించేవారు. కానీ, పౌడర్ అనేక రసాయనాల మిశ్రమం. ఏ రసాయనాలనైనా ఎక్కువగా వాడటం ప్రమాదకరమే’ అని రుషీ పరాశర్ అనే డెర్మటాలజిస్ట్ పేర్కొన్నారు.

టాల్కమ్ పౌడర్‌ను ఎక్కువగా వినియోగించడం వల్ల సమస్యలు తలెత్తుతాయని, కానీ ఏ ఒక్క సంస్థ పౌడర్‌ వల్లో ప్రమాదం ఉందని చెప్పలేమని ఆయన అంటున్నారు. ఒకవేళ ప్రమాదం ఉందని తెలిస్తే దాని వినియోగాన్ని ఆపేయాలని సూచిస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)