బాహుబలి ప్రభాస్ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారా? - హైకోర్టు ప్రశ్న : ప్రెస్‌ రివ్యూ

ప్రభాస్

ఫొటో సోర్స్, UVCTheMovieMakers/facebook

తన స్థలం విషయంలో రెవెన్యూ అధికారుల జోక్యాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు ప్రభాస్‌కు ఊరట దక్కలేదని సాక్షి పేర్కొంది.

రెవెన్యూ అధికారులు వేసిన తాళాన్ని తీసి, ఆ స్థలంలో ఉన్న భవనాన్ని వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలన్న అభ్యర్థనపై హైకోర్టు సానుకూలంగా స్పందించలేదు. ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించకుండా ఇప్పటికిప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఇందులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసీల్దార్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్‌ పెన్మక్తలోని సర్వే నం. 5/3లో ఉన్న తన 2,083 చదరపు గజాల స్థలం విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ప్రభాస్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ ఈ స్థలాన్ని చట్టబద్ధంగానే కొనుగోలు చేశారని తెలిపారు. ఈ స్థలం విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, అయినా పిటిషనర్‌ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ స్థలం క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అది అధికారుల పరిశీలనలో ఉందని కోర్టుకు నివేదించారు. రెవెన్యూ అధికారులు ఇటీవల ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా చెబుతూ, గేటుకు తాళం వేశారని చెప్పారు.

ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.శరత్‌కుమార్‌ స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సర్వే నెంబర్‌ 5/3లో ఉన్నది ప్రభుత్వ భూమి అని చెప్పారు. క్రమబద్ధీకరణ పథకం తీసుకొచ్చింది దారిద్య్ర రేఖకు (బీపీఎల్‌) దిగువన ఉన్న వారి కోసమేనని పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్‌ బీపీఎల్‌ పరిధిలోకి వస్తారా అని ప్రశ్నించింది.

అయితే ప్రభాస్‌ బీపీఎల్‌ పరిధిలోకి రారని, ఆయన బాహుబలి అని శరత్‌ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఓ ఇతను ఆ బాహుబలినా.. మరి పిటిషన్‌లో ఉన్న పేరు అతనిదేనా? అంటూ ఆరా తీసింది. పిటిషనర్‌ అతనేనని నిరంజన్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. కాగా, పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని ధర్మాసనానికి శరత్‌ చెప్పారు. ఇప్పటికిప్పుడు ఆ స్థలంలో ఉన్న భవనాన్ని కూల్చివేసే ఉద్దేశం తమకు లేదన్నారు.

ప్రభాస్‌ తన వాదనలు చెప్పుకొనేందుకు తగిన సమయం ఇస్తామని చెప్పారు. అయితే కనీసం గేటు తాళం తీసి, ఆ స్థలంలో ఉన్న భవనాన్ని వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని నిరంజన్‌ అభ్యర్థించారు. అయితే, దీనిపై ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదని సాక్షి వెల్లడించింది.

ఫొటో సోర్స్, KCR/FB

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌ కసరత్తు

ఫెడరల్ ఫ్రంట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు ముమ్మరం చేశారని, వివిధ రాష్ట్రాల్లో పర్యటించి కాంగ్రెస్‌, భాజపాయేతర పార్టీలను కూడగట్టే పనిని ప్రారంభిస్తున్నారని ఈనాడు తెలిపింది.

ఆయన ఈనెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, దేశ రాజధాని దిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు నవీన్‌ పట్నాయక్‌, మమతా బెనర్జీ, ఇతర సమాఖ్య కూటమి నేతలతో సమావేశాలు, విశాఖలో స్వరూపా నందేంద్ర స్వామిని కలవడం వంటివి ప్రస్తుత షెడ్యూలులో ఉన్నాయి.

ఈ పర్యటనల కోసం టీఆర్‌ఎస్ తరఫున ఆయన నెలరోజుల పాటు ప్రత్యేక విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ఈనెల 23న ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖకు బయలుదేరుతారు. అక్కడ శారదా పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటారు.

ఆ ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. తర్వాత విశాఖ నుండి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళతారు సాయంత్రం 6 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అవుతారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు.

24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్‌ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ దేవాలయాలను సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్‌ చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి ఢిల్లీకి వెళ్తారని ఈనాడు వెల్లడించింది.

ఫొటో సోర్స్, CHANDRABABU/FB

'కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే మంచిదే'

అత్యవసర పరిస్థితిగా భావించి పార్టీలోని ప్రతి ఒక్కరూ ఎన్నికలయ్యేంత వరకూ కష్టపడి పనిచేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారని ఈనాడు తెలిపింది.

రాబోయే 6 నెలల్లో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని, తనతో సహా ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రజల్లో ఉండాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన పనులను వివరించి, తెదేపాతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.

శుక్రవారం ఉండవల్లిలోని ప్రజా వేదికలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదులో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ నాయకులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'తెదేపా సభ్యత్వం గౌరవ చిహ్నం. కార్యకర్తల ఆత్మగౌరవ సూచిక. పాతవారు సభ్యత్వం తీసుకోలేదంటే అది అక్కడున్న ప్రస్తుత నాయకత్వ వైఫల్యమే' అని వ్యాఖ్యానించారు.

'కేసీఆర్‌ నాకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తే సంతోషమే. గందరగోళం, అయోమయం సృష్టించేందుకే ఆయన ఇతర రాష్ట్రాల పర్యటన చేపట్టారు. త్వరలో దేశ రాజకీయాల్లో చాలా మార్పులు జరగబోతున్నాయి. వాటన్నింటికీ మానసికంగా సిద్ధంగా ఉండాలి' అని చెప్పారు.

ప్రజల్లో ఈవీఎంలపై నమ్మకం రావడం లేదని, తానేసిన ఓటు ఎవరికి పడిందనే అనుమానాలు ఓటర్లలో రాకూడదని చెప్పారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని చంద్రబాబు పేర్కొన్నట్లు ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో మరో రెండు జిల్లాలకు పచ్చాజెండా

కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

తెలంగాణలో కొత్తగా రెండు జిల్లాలు, ఒక రెవెన్యూ డివిజన్‌, ఆరు మండలాలకు సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ... జిల్లాల వారీగా తాజాగా ప్రతిపాదనలు అందించాలని రెవెన్యూశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే.

సీఎం ఆదేశాలతో జిల్లాల వారీగా కొత్త జిల్లాలు... వాటి భౌగోళిక స్వరూపం, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై జిల్లా కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన యంత్రాంగం... శుక్రవారం ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించింది.

12 మండలాలతో నారాయణపేట జిల్లాను, 9 మండలాలతో ములుగు జిల్లాను..కొత్త రెవెన్యూ డివిజన్లుగా కోరుట్ల, కోల్లాపూర్‌లతో పాటు 8 కొత్త మండలాలను జిల్లా కలెక్టర్లు ప్రతిపాదించారు.

ఆ ప్రతిపాదనలను భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ) కార్యాలయం ప్రభుత్వానికి అందించింది. దీంతో ఈ ఫైలును సీఎం కేసీఆర్‌కు పంపించనున్నారు.ఆయన ఆమోదించగానే ప్రాథమిక నోటిఫికేషన్‌ వెలువడనుంది.

ఆ తర్వాత అభ్యంతరాలు/ అభిప్రాయాలు/ సూచనలు/సలహాలు స్వీకరించిన అనంతరం తుది నోటిఫికేషన్‌ వెలువడనుంది. అయితే రానున్న బడ్జెట్‌ సమావేశాల్లోపు కొత్త జిల్లాలు కొలువుదీరే అవకాశాలున్నాయి. మరోవైపు ఫరూఖనగర్‌ మండలాన్ని పునర్‌వ్యవస్థీకరించి మొగిలిగిద్ద పేరుతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలంటూ షాద్‌నగర్‌ ఎమ్మెల్యే యెగ్గనమోని అంజయ్య సీఎం కేసీఆర్‌ కు వినతిపత్రమిచ్చారు.

హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, మాజీ గవర్నర్‌ సత్యనారాయణరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఈ గ్రామంలో చదువుకున్నారని, అన్ని సంస్థలు ఉన్నందునా మొగిలిగిద్దను మండలంగా చేయాలని విజ్ఙప్తి చేశారు. ఆయన వినతికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)