అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం

  • డి.పాపారావు,
  • విశ్లేషకులు, బీబీసీ కోసం
చంద్రబాబు నాయుడు, కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోదఫా ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లింది. డిసెంబర్ 8, 2018 నాటి స్థితి ప్రకారం ఏపీ ప్రభుత్వం 1,768 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉంది. ఈ గణాంకం కాస్త అటుఇటుగా తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నప్పటికీ, మొత్తంగా 2014 జూన్ నాటి రాష్ట్ర విభజన అనంతరం ఇప్పటి వరకూ సుమారు 20 సార్లు ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడం ఆందోళనకరం.

ఈ విధంగా తన ఆదాయం కంటే ఖర్చులే అధికం అయిపోయి, ఒక రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలో ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లే ముందు, దానికి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ రూపంలో రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) నుంచి తాత్కాలిక రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ వేస్ అండ్ మీన్స్ పరిమితిని 100 శాతం దాటాకే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లే పరిస్థితి వస్తుంది. ఇక్కడ గమనించవలసిన అంశం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుపై వడ్డీ రేటు ఆర్బీఐ తాలూకు రెపో రేటు స్థాయిలోనే ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్‌లపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు.. రెపో రేటు కంటే రెండు శాతం అధికంగా ఉంటుంది. అంటే ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లిన ప్రభుత్వాల ఖజానాలపై వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుకు వెళ్లిన దానికంటే అదనంగా వడ్డీ భారం పడుతుంది. అంతే కాకుండా ఈ రకమైన నిధుల సేకరణలు రాష్ట్ర అప్పుల భారాన్ని మరింత పెంచుతాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే (2017-18) ఆర్థిక సంవత్సరం 2,25,234 కోట్ల రూపాయల రుణ భారం కింద ఉంది. ఈ రుణం అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2016-17)లో 2,01,314 కోట్ల రూపాయలు. అంటే ఒక సంవత్సర కాలంలో ఏపీ రుణ భారం సుమారు 25,000 కోట్ల రూపాయల మేర పెరిగిపోయింది.

ఫొటో సోర్స్, Govt of AP/Telangana

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ రుణ భారం.. రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 28.79 శాతంగా ఉంది. ఏపీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ రుణ మొత్తంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరన ఇంకా వాటాలు వేయని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి పాలనా కాలపు రుణ భారం అయిన 23,483 కోట్ల రూపాయలు కూడా ఉన్నాయి. ఈ అవిభజిత రుణంపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డీలను కూడా చెల్లిస్తోంది. దీంతో పాటు, రాష్ట్ర విభజన అనంతరం పంపిణీ చేయడం పూర్తయిన ఉమ్మడి రుణం తాలూకు 58 శాతం వాటా అయిన 86,340 కోట్లపై వడ్డీలు చెల్లిస్తున్నారు.

కాగా, ఈ రుణాలను తిరిగి చెల్లించగల స్తోమత అనేది ఇక్కడి కీలకాంశం. ఏపీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. పారిశ్రామిక, సేవా రంగాలు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఎదుగుతున్నాయి. కానీ, ఈ రంగాల్లో జరిగే వృద్ధి వలన ప్రభుత్వ ఖజానాలోకి అదనంగా పన్నుల రాబడి ఇప్పుడిప్పుడే వచ్చి చేరే అవకాశం లేదు. పరిశ్రమలు, సేవా రంగాలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం పలు పన్ను రాయితీలను ఇస్తుండటం ఇందుకు కారణం.

దీనంతటికీ అదనంగా, ప్రస్తుతం 2018 ఆగస్టు నెలలో ఏపీ ప్రభుత్వం సేకరించిన 'అమరాతి బాండ్లు' తాలూకు మొత్తం కూడా పరోక్షంగా రాష్ట్ర రుణ భారాన్ని పెంచేసింది. ఈ బాండ్ల ద్వారా సేకరించిన మొత్తాలు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం (రాష్ట్రాల వ్యయాలు వాటి ఆదాయం కంటే అధికంగా ఉండటాన్ని అదుపు చేసే చట్టం) పరిధిలోకి రావు. కాబట్టి, ఈ మొత్తం రాష్ట్ర రుణాల భారం ఖాతాలో కనపడదు. కానీ, ఈ బాండ్లపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీలను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని మర్చిపోకూడదు. రానున్న 5 సంవత్సరాల కాలంలో కేవలం ఈ వడ్డీ భారమే మొత్తం రూ.వెయ్యి కోట్ల రూపాయల పైబడి ఉండగలదన్నది అంచనా.

ఫొటో సోర్స్, APCRDA

విభజన అనంతర కాలంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉందన్నది నిజం. కాబట్టి ఏపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం తాలూకు ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో ఆదాయ లోటు గ్రాంటు ఇవ్వాలన్నది ఆ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో అంతర్భాగం. ఈ ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో చెల్లించాల్సిన ఆదాయలోటు తాలూకు మొత్తాన్ని 22113 కోట్ల రూపాయలుగా ఆర్థిక సంఘం తన నివేదికలో పేర్కొంది. కాగా, ఈ ఆదాయలోటు మొత్తం కిస్తీల చెల్లింపుకు సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయలోటుకు సంబంధించిన మొత్తాలను పూర్తిస్థాయిలో చెల్లించటంలేదనేది రాష్ట్ర ప్రభుత్వ ఆరోపణ. అంతేకాకుండా ఈ ఐదేళ్లపాటు కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన సాధారణ నిధుల మొత్తాలను కూడా ఆర్థిక సంఘం తన నివేదిక సిఫార్సుల్లో పొందుపర్చింది. దాని ప్రకారం ఏపీకి ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి 36,202 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇందులో ప్రణాళికా వ్యయ సాయంగా 28,747 కోట్ల రూపాయలు, ప్రణాళికేతర గ్రాంటుగా 3,100 కోట్ల రూపాయలు మాత్రమే అందాయి.

ఏదేమైనా ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు రాష్ట్రంగాను, ఇతరత్రా మార్గాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌కు అందించవలసినన్ని ఆర్థిక వనరులను సంపూర్ణంగా అందించలేదనేది నిజం. కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దుబారా వ్యయాలు చేసి (అవినీతి ఆరోపణలతో పాటుగా), ఫలితంగా రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేసిందన్నది కూడా అంతే నిజం. కాగా, రాబోయే ఆర్థిక సంవత్సరం (2018-19) కాలంలో ఏపీ రాష్ట్ర రుణ భారం మొత్తంగా 2,49,435 కోట్ల రూపాయలకు పెరుగనుందనేది మరింత ఆందోళన కలిగించే అంశం.

కాగా, విభజన అనంతరం ఏపీలో తలసరి ఆదాయం వార్షిక సగటున 11 శాతం పైబడి వృద్ధి చెందుతుండటం సానుకూల అంశంగా ఉంది. (ఈ ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటు తలసరి ఆదాయ వృద్ధిరేటు 6.6 శాతం మాత్రమే) విభజనకు ముందు 3 సంవత్సరాల సగటు తలసరి ఆదాయ వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్‌లో 6,500 రూపాయలుగా ఉండగా, విభజన అనంతర కాలంలోని 3 సంవత్సరాల్లో ఈ ఆదాయం సాలీన సగటున 12,000 రూపాయలుగా ఉంది. మొత్తంగా 2015-16 కాలంలో 1,07,276 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయ స్థాయి ప్రస్తుతం 1,42,054 రూపాయల స్థాయికి చేరుకుంది. ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజయంగానే చెప్పాలి. కానీ, ఈ ఆదాయ వృద్ధి ఫలాలు అత్యంత క్రింది స్థాయి వర్గాలకు తగిన మేరకు అందడం లేదనేది కూడా ఇక్కడ గమనార్హం.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN

ఫొటో క్యాప్షన్,

రూ.2000 నోటు ముద్రణ ఆగిందా?

పైగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాను తెచ్చిన రుణాల్లో 50 శాతం మేర (76,888 కోట్ల రూపాయలు) చెల్లించవలసిన కాల వ్యవధి 2017 మార్చి 31వ తేదీ నుంచి ఏడు సంవత్సరాలుగా ఉంది. అంటే, రానున్న ఆరేడు ఏళ్ల కాలంలో ప్రభుత్వం చెల్లించాల్సిన రుణం తాలూకు అసలు, వడ్డీలు ప్రభుత్వ ఖజానాకు భారంగా మారనున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ముందుముందు తన వార్షిక బడ్జట్‌లో వివిధ అంశాల క్రింద, ముఖ్యంగా సంక్షేమ వ్యయాలుగా ఖర్చు పెట్టగలిగిన మొత్తం గణనీయంగా తగ్గిపోగలదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ద్రవ్యలోటుకు సంబంధించి కూడా ఆందోళన చెందవలసిన పరిస్థితి ఉంది.

ప్రభుత్వ లక్ష్యాల ప్రకారమే అది తన ద్రవ్యలోటును మూడు శాతానికి పరిమితం చేసుకోవాల్సి ఉంది. (14వ ఆర్థిక సంఘం కొన్ని రాష్ట్రాలకు 3.25 శాతం మేరకు ద్రవ్యలోటును అనుమతించినప్పటికీ) కానీ, ప్రస్తుతం రాష్ట్ర స్థూల ఆర్థిక వృద్ధిలో దాని ద్రవ్యలోటు 4.42 శాతంగా ఉంది. కాబట్టి దీని వల్ల కూడా మున్ముందు కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం బడ్జెట్‌లో చేయగలిగిన వ్యయాలు మరింతగా కుదించుకుపోతాయి. రానున్న కాలంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సమస్య వారిని వెంటాడుతుంది.

అలాగే, 6.31 శాతం వడ్డీలకు అప్పులు తెస్తూ, మరోపక్క పీడీ అకౌంట్‌లో ఖర్చు పెట్టకుండా పెద్ద మొత్తాలను అట్టే పెట్టుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం తాలూకు లోపభూయిష్టమైన ఆర్థిక యాజమాన్యాన్ని వెల్లడిస్తుంది. పైగా, నేడు ప్రభుత్వం పరిస్థితి పాత రుణాలను తీర్చేందుకు గాను కొత్త రుణాలను తెచ్చే స్థితికి వచ్చింది. రాష్ట్రంపై రుణ భారం ఎంతటి స్థాయిలో ఉందో ఈ ఒక్క అంశమే చెప్పగలదు. పైగా 2016-17 ఆర్థిక సంవత్సర కాలంలో పలు కార్పొరేషన్‌లు, కంపెనీల్లో ప్రభుత్వం మదుపు చేసిన మొత్తం 8,975 కోట్ల రూపాయలపై లభించిన రాబడి కేవలం నాలుగు కోట్ల రూపాయలుగానే ఉంది. అంటే తెచ్చిన రుణాలపై చెల్లిస్తున్న వడ్డీ స్థాయి కంటే ఇది చాలా తక్కువ.

కాగ్ (సీఏజీ) ఇప్పటికే 2016-17 నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం తన చెల్లింపుల భారాన్ని తక్కువగా చూపుతోందని, ఫలితంగా రాష్ట్రం తాలూకు ద్రవ్యలోటు కేవలం 28.79 శాతంగా కనిపిస్తోందని, నిజానికి అది 31.87 శాతం మేరకు ఉందని ఆక్షేపించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ఆర్థిక భారం క్రిందకు రావు అని సమర్థించుకుంది. కానీ, ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిబంధనలు ఈ వాదనను అంగీకరించవు.

ఏదేమైనా, అటు రాష్ట్రాభివృద్ధి పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెస్తున్న రుణాలు కానీ, అమరావతి బాండ్ల రూపంలో సేకరించిన మొత్తం కానీ, రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలపై అదనపు పన్నుల భారాన్ని ఒక పక్కన, ప్రజలకు అందాల్సిన సంక్షేమంపై కోతల రూపంలో మరోపక్కన పడగలదు. అమరావతి బాండ్ల రూపంలో సేకరించిన మొత్తాన్ని ఏ విధంగా చెల్లిస్తారని ప్రశ్నించినప్పుడు.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ప్రతినిధి చెప్పిన దాని ప్రకారం.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి సంఘం విధిస్తున్న పన్నులతో పాటు యూజర్ ఛార్జీలు, ల్యాండ్ డెవలప్‌మెంట్, లే అవుట్‌ల అనుమతి ఛార్జీల ఉన్నాయని సమాధానం ఇచ్చారు. అలాగే, మౌలిక సదుపాయాలపై (భూగర్భ మురికినీటి పారుదల శుద్ధి ప్లాంట్లు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ) కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారనేది ఆయన మాటల సారాంశం. అలాగే ప్రభుత్వ భూముల అమ్మకం, వేలం పాటు ఎలాగూ ఉన్నాయి.

అంతిమంగా. ఈ రుణాల చెల్లింపు సమస్యతో పాటుగా రాష్ట్రం ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సమస్య.. బడ్జెట్ అవసరాల కోసం ముందు కాలంలో మరిన్ని నిధులను సేకరించడం ఎలా? అన్నది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం విధించే పరిమితులతో పాటు, ప్రస్తుతం పేరుకుపోయిన రుణాలను చెల్లించలేని స్థితి కూడా ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images

మరోపక్కన విభజన అనంతరం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై రుణ భారం స్థితి కూడా అదుపుతప్పి పోతోంది. ఆంధ్రప్రదేశ్‌కు భిన్నంగా రెవెన్యూ సర్‌ప్లస్ (తన ఖర్చులకంటే ఆదాయం ఎక్కువ ఉన్న) రాష్ట్రంగా ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం నేడు మెల్లమెల్లగా భారీ రుణ భారంలో కూరుకుపోతోంది. వారసత్వంగా సంక్రమించిన 61,710 కోట్ల రూపాయల రుణ భారంతో పాటు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో వచ్చిన చేరిన అదనపు రుణాలతో తెలంగాణ రాష్ట్ర అప్పుల భారం మొత్తం 2,30,000 కోట్లకు చేరింది. అప్పులు తప్పు కాదని, అప్పు చేసి ఆస్తులు పెంచుకుంటే తద్వారా లభించే ఆదాయంతో ఆ అప్పులను తీర్చివేయగలగడం పెద్ద సమస్య కాదనేది తెలంగాణ పాలకుల వాదన. కాగ్ నివేదిక ప్రకారంగానే తెలంగాణ తాలూకు ప్రస్తుత ఆర్థిక స్థితి పెద్ద ఆశాజనకంగా లేదు. ఉదాహరణకు 2017-18లో దాని ద్రవ్యలోటు 5.46 శాతంగా ఉంది. కాగా, రెవెన్యూ సర్‌ప్లస్ రాష్ట్రాలకు అనుమతించిన 3.5 శాతం పరిమితి కంటే ఇది అధికం.

అంటే.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా గతంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు మరిన్ని అప్పులు చేయాల్సిన స్థితికి చేరుతోంది. ఏదేమైనా ప్రస్తుతం ఉన్న ద్రవ్యలోటును ప్రతికూల అంశంగా చూసే ఆర్థిక విధానాలు కావచ్చు లేదా తీసుకున్న రుణాల చెల్లింపుకు గాను తగిన స్థాయిలో వరనుల సేకరణ తాలూకు పరిమితులు కావచ్చు.. అవి రెండు తెలుగు రాష్ట్రాలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టగలవు అన్నది మాత్రం నిజం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)