సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

నీతిఆయోగ్

ఫొటో సోర్స్, NITIAAYOG

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు మెరుగైన పనితీరును కనబర్చాయి. నీతి ఆయోగ్‌ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంతో ముందువరసలో నిలిచాయి.

వివిధ రంగాల్లో 64 పాయింట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలవగా, 61 పాయింట్లతో తెలంగాణ ఐదో స్థానం సాధించింది.

69 పాయింట్లను సాధించిన కేరళలో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు వరసగా రెండు, మూడు ర్యాంకులు సాధించాయి. 42 స్కోరుతో ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో నిలిచింది.

నివేదికలోని ముఖ్యాంశాలు

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 లక్ష్యాలను ప్రామాణికంగా తీసుకొని వివిధ రాష్ట్రాల పనితీరు, అభివృద్ధిని నీతి ఆయోగ్ మదింపు చేసింది. ఈ వివరాలను 'సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి - 2018' పేరిట ఒక నివేదిక రూపంలో వెల్లడించింది.

వివిధ ప్రమాణాలలో సాధించిన మార్కుల ఆధారంగా అఛీవర్‌, ఫ్రంట్‌ రన్నర్‌, పెర్ఫార్మర్‌, యాస్పిరెంట్‌ అని నాలుగు కేటగిరీల్లో రాష్ట్రాలను విభజించింది.

అఛీవర్ కేటగిరీలో ఏ రాష్ట్రం చేరలేదు. ఫ్రంట్ రన్నర్ కేటగిరిలో మూడు రాష్ట్రాలు నిలిచాయి. పెర్ఫార్మర్ కేటగిరిలో 23 రాష్ట్రాలకు స్థానం దక్కింది. యాస్పిరెంట్ కేటగిరిలోకి మూడు రాష్ట్రాలు వచ్చాయి.

నీతిఆయోగ్ వెల్లడించిన ఈ నివేదకలో ఆరోగ్య సంరక్షణ, ఆకలి నిర్మూలన, లింగ సమానత్వం, నాణ్యమైన విద్య లక్ష్యాల సాధనలో మెరుగైన పనితీరు కనబర్చి కేరళ మొదటిస్థానంలో నిలిచింది.

పరిశుభ్ర నీటి సరఫరా, పారిశుధ్యంలలో చక్కటి పనితీరు కనబర్చిన హిమాచల్ ప్రదేశ్ రెండోస్థానానికి దూసుకెళ్లింది.

అసమానతల తగ్గింపు, పర్వతసానుల్లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపేట వేయడంలో హిమాచల్ ప్రదేశ్ ముందువరసలో నిలిచినట్లు నీతిఆయోగ్ పేర్కొంది.

ఫొటో సోర్స్, NITIAAYOG

తెలుగు రాష్ట్రాల ముందంజ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్ని ప్రమాణాల్లో కలిపి పెర్ఫార్మర్ కేటగిరిలో నిలవగా, నిర్దేశించిన కొన్ని లక్ష్యాల సాధనలో మరింత మెరుగైన పనితీరు కనబరిచి ఫ్రంట్ రన్నర్ స్థాయికి వెళ్లాయి.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన ఆకలి నిర్మూలనలో గోవా ముందజలో ఉంది. 53 స్కోర్‌తో తెలంగాణ ఈ సూచీలో 15వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 50 స్కోర్‌తో 18వ స్థానంలో నిలిచింది.

పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో నిలవగా, తెలంగాణ 18వ స్థానంలో నిలిచింది.

ఆరోగ్యం, సంక్షేమంలో తెలంగాణ మూడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచాయి.

లింగసమానత్వ సూచిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఐదు, ఆరు స్థానాలు సాధించాయి.

అసమానతల తొలగింపులో వందకు వంద స్కోరు సాధించి తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. ఈ సూచిలో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది.

శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థాగత సంస్థల నిర్మాణంలో ఏపీ రెండోస్థానంలో నిలవగా, తెలంగాణ 19వ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల్లోని మురికివాడల్లో నివసిస్తున్నవారి సంఖ్య అధికంగా ఉందని నీతిఆయోగ్ తన నివేదికలో ప్రత్యేకంగా పేర్కొంది.

భారత్‌లోని పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 5.41 శాతం మంది మురికివాడల్లో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 12.04 శాతం పట్టణ జనాభా మురికివాడల్లోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది. ఇది దేశంలోనే అత్యధికమని పేర్కొంది.

ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు దేశంలో మొదటగా అసోం రాష్ట్రం 'అసోం విజన్ 2030' పేరుతో ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటే, తర్వాత ఏపీ ఈ ప్రయత్నం చేసిందని నీతిఆయోగ్ పేర్కొంది.

'సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2029' పేరుతో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతోందని తెలిపింది.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పర్యవేక్షణకు రియల్‌ టైమ్‌ అవుట్‌కమ్‌ బేస్డ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను (ఆర్టీజీ) ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్నదని పేర్కొంది.

ట్రాన్స్‌జెండర్ లేబర్ ఫోర్స్ పాటిసిపేషన్‌లో 2030కి నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో దేశంలోని ఐదు రాష్ట్రాలు ముందులో ఉంటే అందులో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్ పేర్కొంది.

సామర్థ్య అభివృద్ధి పెంపుదలలో తొమ్మిది రాష్ట్రాలు ముందు ఉన్నాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చోటు దక్కింది.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన అసమానతల తగ్గుదలో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉంది. దేశంలోని మూడు రాష్ట్రాలు మాత్రమే నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాయి. అందులో తెలంగాణతో పాటు రెండు ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ, మిజోరం చోటు దక్కించుకున్నాయి.

సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి?

పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే ఆర్థికకాభివృద్ధినే సుస్థిరాభివృద్ధి అంటారు. 1980లో సుస్థిరాభివృద్ధి భావన వెలుగులోకి వచ్చింది. బ్రట్‌లాండ్ కమిషన్ తొలిసారిగా ఈ పదాన్ని తన నివేదికలో ఉపయోగించింది.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు 2015 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కేంద్రంగా 193 దేశాలు ఆమోదం తెలిపాయి.

సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో నిర్దేశించుకున్న 17 లక్ష్యాలను 2030 లోపు ప్రతి దేశం సాధించాలి.

భారత్ ప్రభుత్వం నీతిఆయోగ్ పర్యవేక్షణలో ఇవే లక్ష్యాలను ఆధారంగా చేసుకొని వివిధ రాష్ట్రాల పనితీరును మదింపు చేస్తోంది.

ఫొటో సోర్స్, UNDP

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇవే

 • పేదరిక నిర్మూలన
 • ఆకలి నిర్మూలన
 • ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాలు పెంపు
 • నాణ్యమైన విద్య
 • లింగ సమానత్వం
 • తాగునీరు, పారిశుద్ధ్యం
 • అందుబాటు ధరల్లో శక్తివనరులు
 • గౌరవప్రదమైన ఉపాధి, ఆర్థికవృద్ధి
 • పరిశ్రమలు, ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు
 • అసమానతల తొలగింపు
 • సుస్థిర నగరాలు, సమూహాలు
 • బాధ్యాతాయుతమైన వినియోగం, ఉత్పత్తి
 • వాతావరణ పరిరక్షణ
 • సముద్ర, జల చరాల పరిరక్షణ
 • జీవ వైవిధ్యం
 • శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థలు
 • లక్ష్యాల సాధనకు భాగస్వామ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ర్యాంకుల కేటాయింపు ఎలా?

ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన లక్ష్యాలను ప్రతిపాదికగా తీసుకొని నీతిఆయోగ్ రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయిస్తుంది. అయితే, సుస్థిరాభివృద్ధిలోని 17 లక్ష్యాల్లో 13 లక్ష్యాలనే నీతిఆయోగ్ ప్రతిపాదికగా తీసుకుంటుంది. ( లక్ష్యాలు 12,13,14,17లను పరిగణించరు)

భారత్‌తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పురోగతిని ఈ లక్ష్యాల ఆధారంగా 62 జాతీయ సూచికలతో నీతిఆయోగ్ మదింపు చేసి వివరాలు వెల్లడిస్తుంది.

ఈ వివరాల వల్ల వివిధ రాష్ట్రాలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏ దశలో ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)