చంద్రబాబు నాయుడు: 'ప్రధాని పదవి చేపట్టాల్సిందిగా ఆహ్వానాలు వచ్చినా తిరస్కరించా' - ప్రెస్‌ రివ్యూ

చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, chandrababu/fb

కేంద్రంలో ఇప్పటిదాకా నరేంద్ర మోదీ ప్రభుత్వం అంత చెత్త ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారని ఈనాడు పేర్కొంది.

ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు తెచ్చారని, తానెంతో బలవంతుడినని చెప్పే మోదీ దేశానికి ఏం చేశారని నిలదీశారు.

మోదీ, అమిత్‌ షా ప్రజాస్వామ్య వ్యవస్థల్ని దుర్వినియోగం చేస్తూ, రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కూడిన కూటమితో కలసి పని చేసేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తానని పేర్కొన్నారు.

విశాఖలో జరుగుతున్న 'ఇండియా టుడే కాంక్లేవ్‌ సౌత్‌ 2018'లో భాగంగా శనివారం ఆ మీడియా సంస్థ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

'ప్రధాని పదవి చేపట్టాల్సిందిగా 1996 నుంచి ఆహ్వానాలు వచ్చినా తిరస్కరించా. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడమే నా ముందున్న కర్తవ్యం. ప్రధాని పదవిని నేను కోరుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో నూరుశాతం మేమే గెలుస్తాం' అని చంద్రబాబు చెప్పారు.

ఇన్నాళ్లుగా ప్రధాని మోదీ చెబుతున్నవన్నీ నినాదాలేనని, మోదీకి బదులు ఎవరున్నా బాగా పరిపాలించేవారని పేర్కొన్నారు.

'కేసీఆర్‌ నన్ను కూడా కలవొచ్చు. ఎవరైనా ఆచరణ సాధ్యమైన పరిష్కారం ఆలోచించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో కాంగ్రెస్‌గానీ, భాజపాగానీ ఏర్పాటు చేసే ప్రభుత్వాలకు మద్దతివ్వాల్సిందే. లేదంటే రెండు పార్టీల్లో ఏదో ఒకటి మద్దతిచ్చే ప్రభుత్వమైనా ఏర్పాటవ్వాలి. భాజపా దేశాన్ని సర్వనాశనం చేస్తోంది. అందుకే కాంగ్రెస్‌తో కూడిన కూటమిలో కలసి పని చేసేందుకు కేసీఆర్‌ ముందుకు వస్తే స్వాగతిస్తాం' అని చంద్రబాబు చెప్పారని ఈనాడు వెల్లడిచింది.

ఫొటో సోర్స్, YS Jaganmohan Reddy/Facebook

'చంద్రబాబుకు పవన్‌ పార్టనర్‌’

జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను నమ్మొద్దని వైసీపీ అధినేత జగన్‌ ప్రజలకు పిలుపునిచ్చారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన బహిరంగసభలో జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌, చంద్రబాబులపై విమర్శలు చేశారు.

'చంద్రబాబుకు పవన్‌ పార్టనర్‌ అనే విషయాన్ని గుర్తించుకోవాలి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి మోదీ, చంద్రబాబులతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ... చివరకు ప్రత్యేక హోదాను పవన్‌ హత్య చేశారు. అలాంటి వ్యక్తులను ఈసారి ప్రజలు నమ్మొద్దు' అని అన్నారు.

రాష్ట్రాన్ని విడగొట్టడానికి కారణమైన కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకట్టాడని, మొదటి సినిమా మోదీతో తీసి... ఇప్పుడు రెండో సినిమా రాహుల్‌గాంధీతో తీస్తున్నారని జగన్‌ ఎద్దేవా చేశారు. యాక్టర్లే మారారు తప్ప ప్లే చేస్తే అవే డైలాగులు ఇప్పటికీ వల్లె వేస్తున్నారని అన్నారు.

సీఎం చంద్రబాబు ప్రతి అంశానికీ రియల్‌ టైం గవర్నెన్స్‌ విధానం అంటున్నారని... రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి వ్యవహారాల్లో ఆర్టీజీఎస్‌ ఏమి చేస్తోందని జగన్‌ ప్రశ్నించారు. 'మోడల్‌ స్కూల్‌ టీచర్లకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెబుతుంటే నీ ఆర్టీజీఎస్‌ ఏమైంది? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెరుగుతున్నా, విద్యార్థులకు ఉపకారవేతనాలు అందకపోతున్నా నీ ఆర్టీజీఎస్‌కు కనిపించలేదా? ఎన్టీఆర్‌ వైద్యసేవకు పథకానికి రూ.550కోట్లు బకాయిలు చెల్లించలేదని ఆ సంస్థ నోటీసులు ఇచ్చినప్పుడు నీ ఆర్టీజీఎస్‌కు కనిపించలేదా?' అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌తో పాటు బీజేపీనీ నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే స్థానంలో బీజేపీ ఉన్నా... ఆ పని చేయకపోవడం శోచనీయమని జగన్ చెప్పారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

చిప్ లేకుంటే జనవరి 1 నుంచి మీ కార్డులు పనిచేయవు

డెబిట్‌/క్రెడిట్‌కార్డ్‌ మోసాలు అధికంగా చోటుచేసుకుంటోంది మాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డుల్లోనే. వీటి నుంచి డేటా సేకరించడం సులభం కావడంతో, స్కిమ్మింగ్‌, క్లోనింగ్‌ చేయడం ద్వారా నకిలీ కార్డులు సృష్టించి నగదు అపహరిస్తున్నారంటూ ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

కార్డులు పోగొట్టుకున్నపుడు, వాటి నుపయోగించి ఖాతాల నుంచి నగదు తీసేస్తున్న వారు ఎందరో. ఇలాంటి కేసులు పెరుగుతున్నందున, చిప్‌ ఆధారిత కార్డులు జారీ చేయాలని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆదేశించింది. 2019 జనవరి 1 నుంచి చిప్‌ ఆధారిత డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు మాత్రమే పనిచేస్తాయి.

మాగ్నటిక్‌ స్ట్రిప్‌తో కూడి కార్డులను తప్పనిసరిగా అందరూ మార్చుకోవాల్సిందే.

యూరోపే, మాస్టర్‌కార్డ్‌, వీసా (ఈఎంవీ) చిప్‌, పిన్‌ (పర్సనల్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌) ఆధారిత డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు మాత్రమే 2019 జనవరి 1 నుంచి పనిచేస్తాయని ఆర్‌బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

అందువల్ల మ్యాగ్నటిక్‌ స్ట్రిప్‌తో కూడిన పాత కార్డులను ఈనెల 31లోగా మార్చుకోవాలి. కొత్త కార్డుల జారీకి బ్యాంకులు రుసుము ఏమీ వసూలు చేయవు.

పాత కార్డులను డిసెంబరు 31లోగా మార్చుకోమని బ్యాంకులు ఇప్పటికే తమ ఖాతాదార్లకు సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్‌ల)ను పంపాయి. అంతర్జాతీయంగా వినియోగించే కార్డులు కూడా మార్చుకోవాల్సిందే. ఈఎంవీ చిప్‌ కార్డులు 2016 జనవరి నుంచి అందుబాటులోకి వచ్చాయి. 2016 జనవరి 31 తరవాత నుంచి కొత్తగా బ్యాంక్‌ ఖాతా తెరిచిన వారికి, కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జారీచేస్తున్న కార్డులు చిప్‌తోనే ఉంటున్నాయి.

డేటా ఎన్‌క్రిప్షన్‌ మరింత ఉన్నత ప్రమాణాలతో ఉండటం చిప్‌, పిన్‌ ఆధారిత కార్డులతో సాధ్యమవుతుంది. డేటా నిల్వ సాంకేతికత కూడా మెరుగుపడుతుంది. అయితే కార్డు సంఖ్య, సీవీవీ వంటి వివరాలతో పాటు మొబైల్‌కు వచ్చే ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) వంటివి చెబితే, ఆన్‌లైన్‌ లావాదేవీ పూర్తి చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందని గుర్తించాలి. అందువల్ల ఈ వివరాలు ఎవరికీ తెలియనీయకుండా ఉంచాలి అని ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, Tsec.gov

రోజువారి ప్రచార లెక్కలు చెప్పాల్సిందే

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ రోజువారి ప్రచార ఖర్చు లెక్కలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని సాక్షి వెల్లడించింది.

ఆ ఖర్చుల వివరాలను మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ)కు సమర్పించాలి. దీనికోసం ప్రత్యేకంగా ఏదైన ఒక జాతీయ బ్యాంకులో ఖాతా తెరవాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలను పర్యవేక్షించే బాధ్యతను ఎంపీడీఓలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) అప్పగించింది. ఇటీవల జారీచేసిన నోటిఫికేషన్‌లో ఈ మేరకు ఆయా అంశాలను చేర్చింది.

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలను గ్రామాల్లోని ఓటర్లు లేదా సాధారణ ప్రజలు లేదా మీడియా ప్రతినిధులు ఎవరడిగినా ఉచితంగా ఇవ్వాలని సూచించింది. ఇలా చేయడం వల్ల అభ్యర్థుల ప్రచార ఖర్చు వివరాలు తెలియడంతో పాటు, పెరిగే ఎన్నికల ఖర్చును నియంత్రించేందుకు అవకాశాలుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు చేసే వివరాలు తెలుసుకునేందుకు ఒక్కో మండలంలో ఐదారు బృందాలను ఈసీ ఏర్పాటు చేయనుంది. ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోపు ప్రచార ఖర్చుల పూర్తి వివరాలను సమర్పించని అభ్యర్థులను కొన్నేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించే అవకాశం ఉంది.

గతంలో ఈ వివరాలు సమర్పించని 12 వేల మందిపై మళ్లీ పోటీ చేయకుండా అనర్హత వేటు వేసినట్టు ఎస్‌ఈసీ గణాంకాలను బట్టి తెలుస్తోందని సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)