వడా పావ్: ఇది మెక్ డొనాల్డ్స్‌కే చుక్కలు చూపించిన 'ఇండియన్ బర్గర్'

  • చారుకేసి రామదురై
  • బీబీసీ ట్రావెల్
వడాపావ్ ఇండియన్ బర్గర్

ఫొటో సోర్స్, Charukesi Ramadurai

ప్రతి రోజూ వేకువజామునే సురేష్ ఠాకూర్ ఒక భారీ బాణలిలో సలసల కాగుతున్న నూనెలో బంగాళా దుంప ముద్దలను వేయగానే అవి సుయ్యి మంటాయి.

శనగపిండిలో ముంచి నూనెలో వేసి వేయించే వాటిని 'బటాటా వడ' అంటారు.

ఆ బంగాళాదుంపల ముక్కల్లో మసాలాలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా పిసికి ముద్దల్లా చేస్తారు. దానిని శనగపిండిలో ముంచి నూనెలో వేస్తారు.

శనగపిండి నూనెలో వేగుతున్న ఆ వాసన గాల్లో తేలుతూ నా ముక్కుపుటాలు చేరగానే, ఆకలి మొదలైపోతుంది. వాటిని నూనెలో కాసేపు అటూఇటూ తిప్పగానే వడ తయారైపోతుంది.

తర్వాత చతురస్రంలా ఉన్న పావ్ అనే మెత్తటి రొట్టెను ఠాకూర్ మధ్యకు కోసి తెరిచాడు. దాన్లో కాస్త పచ్చిమిర్చి, కొత్తిమిర చట్నీని రాశాడు.

చేతిలో వెల్లుల్లి పొడి ఉన్న ఒక గిన్నె తీసుకుని నా వైపు చూసి 'లసూన్' అని సైగ చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images

తక్షణం శక్తిని ఇచ్చే 'ఎనర్జీ బూస్టర్'

నేను తల ఊపగానే.. దానిపై వెల్లుల్లి పొడి చల్లి వడను పైనుంచి అదిమి శాండ్‌విచ్‌ లాంటి దానిని ఒక పాత న్యూస్ పేపర్లో పెట్టి చుట్టాడు.

దానితోపాటు కొన్ని వేయించిన పచ్చిమిరపకాయలు( కారం సరిపోకపోతే దానితోపాటు తినడానికి)కూడా వేసి నా చేతికిచ్చాడు. బదులుగా నేను ఆయనకు పన్నెండు రూపాయలు ఇచ్చాను.

మెత్తటి పావ్‌లోనుంచి దిగిన నా పళ్లు కరకరలాడే వడను కొరకగానే ముంబయి అసలు సిసలు ఘాటు నా నషాళానికి అంటింది.

రుచిలో దాన్ని మించింది లేదనిపించింది. చప్పగా ఉన్న పావ్‌ను కొరకగానే రుచిగా కరకరలాడే వడ తగలడం అద్భుతం.

అందుకే, అది ఎన్నో ఏళ్లనుంచీ నా ఆకలి తీరుస్తూనే ఉంది. ఒక్క బైట్‌కే రెండు చట్నీలూ నా నాలుక అంతా పరుచుకున్న ఆ ఫీలింగ్ నాకు తెలుస్తూనే ఉంటుంది.

పిండిపదార్థాలు పుష్కలంగా ఉన్న ఆ వడాపావ్.. శరీరంలో అప్పటికప్పుడే శక్తిని కూడా అందిస్తుంది.

ఫొటో సోర్స్, Charukesi Ramadurai

ముంబయి అంటే 'వడాపావ్'

ఇప్పుడు వడాపావ్ ముంబయి మహా నగరానికి పర్యాయపదంలా మారిపోయింది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల నుంచి, కాలేజీ విద్యార్థులు, బాలీవుడ్ స్టార్స్ వరకూ దాదాపు నగరంలోని ప్రతి ఒక్కరూ దీనిపై తమకున్న ప్రేమను దాచుకోలేరు.

భారత ఆర్థిక రాజధానిలో ప్రతి రోజూ 20 లక్షలకు పైగా కరకరలాడే రుచికరమైన వడా పావ్‌లు ఎంతోమంది కడుపు నింపుతుంటాయి.

ఎప్పుడూ ఉరుకుల-పరుగులతో కనిపించే ముంబయి నగరంలో వడాపావ్ పాకెట్ ఫ్రెండ్లీనే కాదు, చాలా వేగంగా తయారయ్యే, వెళ్తూ వెళ్తూ రుచిచూడగలిగే ఒక స్నాక్.

కేవలం వడాపావ్ పేరుతో ఒక వెబ్ సైట్ రూపొందించిన ట్రావెల్ బ్లాగర్ కౌశల్ కర్ఖానీ నాతో "ముంబైలో ఎవరైనా మొదటిసారి బయటికెళ్లి ఏదైనా తినాలని అనుకుంటే వారు మొదట రుచిచూసేది ఇదే. తక్కువ ధరకు దొరికే వడాపావ్ ముంబైలో పేదాగొప్ప తేడాలను చెరిపేసింది" అన్నారు.

వడాపావ్ అంటే ఉన్న ఇష్టం, ఈ రుచికరమైన స్నాక్‌పై ఉన్న ప్రేమ మనం తరచూ బయట పదార్థాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది.

కానీ వాస్తవానికి మహారాష్ట్ర రాజధానికి వడాపావ్‌తో ఉన్న సాంస్కృతిక బంధం దీని రుచి కంటే ఎంతో ఘనమైనది.

ఫొటో సోర్స్, Charukesi Ramadurai

వడాపావ్ @దాదర్ రైల్వే స్టేషన్

వడాపావ్‌ను 1966లో అశోక్ వైద్య అనే ఒక ముంబైవాసి కనుగొన్నాడని చెబుతారు. ఆయన తన మొదటి వడాపావ్ షాపును దాదర్ రైల్వే స్టేషన్ ఎదురుగా తెరిచాడు.

అప్పట్లో ముంబై శివార్లైన పరేల్, వొర్లీలో ఉండే బట్టల మిల్లుల్లో పనిచేసే కార్మికులందరూ అక్కడి నుంచే పరిశ్రమలకు పరుగులు తీసేవారు.

ఎప్పుడూ పని తొందరలో ఉండే ఆ కార్మికులకు సమయం వృథా కాకుండా, తమ తాహతుకు తగ్గట్టు ఆకలి తీర్చే ఏదైనా పదార్థం కావల్సి వచ్చింది.

సరిగ్గా అదే సమయంలో వారి అవసరాలకు తగ్గట్టు అశోక్ వైద్య తన వడాపావ్ అందించాడు. దాంతో అది అప్పటికప్పుడే అందరికీ నచ్చింది. రోజులు గడిచేకొద్దీ నగరంలోని అందరికీ ఫేవరెట్ అయిపోయింది.

వడాపావ్ సృష్టించిన అశోక్ వైద్య ఒక్కసారిగా ముంబై ఐకాన్ అయిపోయారు. అందుకే ఒక లోకల్ జర్నలిస్టు ఆయనపై 'వడా పావ్' అనే ఒక డాక్యుమెంటరీ కూడా తీశాడు.

ఫొటో సోర్స్, Hindustan Times

వడాపావ్‌పై శివసేన ముద్ర

1970, 80 దశకాలలో వరసగా కొనసాగిన సమ్మెలు బట్టల మిల్లులన్నీ మూతపడేలా చేశాయి. దాంతో మిల్లులో పనిచేసే కార్మికులకు పనిలేకుండా పోయింది.

సరిగ్గా అప్పుడే శివసేన పార్టీ వారికి అండగా నిలిచింది. చాలా మంది కార్మికులు ముంబయి అంతటా సొంతంగా వడాపావ్ దుకాణాలు తెరవడానికి సాయం చేసింది.

"ఆ సమయంలో ముంబై అంతటా ఉడుపి రెస్టారెంట్లు పాపులర్ అవుతున్నాయి. దాంతో వాటికి ప్రత్యామ్నాయంగా మహారాష్ట్ర సంస్కృతిని గుర్తు చేసేలా ముంబయిలో ఏదైనా ఉండాలని శివసేన భావించింది. సరిగ్గా అదే సమయంలో వడాపావ్ వారికి ఆయుధంలా దొరికింది" అని ముంబై ఫుడ్ రైటర్ మెహర్ మీర్జా చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దోశ, ఇడ్లీ, లాంటి అల్పాహారాలకు బదులు స్థానికులు ఏర్పాటు చేసిన వడాపావ్ దుకాణాలను ఆదరించాలని శివసేన ప్రచారం చేసింది.

ముంబైకర్లు బయటి ఆహార పదార్థాలు వదిలి సొంత వంటకానికి అలవాటు పడాలనే వ్యూహంతో వడాపావ్ దుకాణాలు నడిపేవారికి సహకరించింది.

ముంబయి ఆర్థికంగా అల్లకల్లోల స్థితిలో ఉన్నప్పుడు శివసేన వ్యూహం పనిచేసింది.

ఫొటో సోర్స్, Getty Images

మెక్ డొనాల్డ్స్‌కు చుక్కలు

ఇక్కడ విచిత్రం ఏంటంటే, వడాపావ్‌లోని ప్రధానంగా ఉపయోగించే బంగాళా దుంప, బన్ను రెండు ఐరోపా నుంచి దిగుమతి అయినవే.

పోర్చుగీసువారు వాటిని 17వ శతాబ్దంలో భారత్ తీసుకొచ్చారు. ఇక దానిలో ఉపయోగించే మహారాష్ట్రకు చెందిన ఒకే ఒక దినుసు శనగపిండి మాత్రమే.

అందుకే ముంబైకర్లు వడాపావ్‌ను ఇప్పటికీ 'బాంబే వంటకం'గానే భావిస్తారు.

ముంబయిలో వడాపావ్ పరిశ్రమ 1990 వరకూ ప్రశాంతంగా అభివృద్ధి చెందింది.

తర్వాత మెక్ డొనాల్డ్స్ లాంటి ఎన్నో అంతర్జాతీయ చెయిన్ రెస్టారెంట్లు నగరానికి వచ్చాయి.

అవన్నీ వడాపావ్ లాగే కనిపించే శాఖాహార బర్గర్లను, వేయించిన బంగాళాదుంపలా ఆలూ టిక్కీ బర్గర్లను అందించేవి.

కానీ అవేవీ వడాపావ్‌ కంటే భిన్నంగా రుచిని అందించలేకపోయాయి. వడాపావ్ రుచి పూర్తిగా వాటిని తయారుచేసేవారిపై ఆధారపడి ఉండేది.

ఫొటో సోర్స్, Charukesi Ramadurai

అమ్మకాల్లో ఇప్పటికీ 'హాట్ కేక్స్'

వడాపావ్ అమ్మే ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక ప్రత్యేకమైన రహస్య రెసిపీలు సృష్టించేవారు. తాము తయారుచేసే వడాపావ్‌ ప్రత్యేకం అని చెప్పేవారు.

ఎప్పటికప్పుడు మసాలాల తయారీలో మార్పులు, పైన చూరా వేయడం లాంటి కొత్తదనం చూపిస్తూ వడాపావ్ అభిమానులకు కొత్త రుచులు అందించారు.

దాంతో ముంబయికి ఎన్ని అంతర్జాతీయ రెస్టారెంట్లు వచ్చినా వడాపావ్ ఇష్టపడేవారిని తమవైపు ఆకర్షించలేకపోయాయి.

వీధుల్లో ఎన్ని వడాపావ్ దుకాణాలు ఉన్నా బటాటా వడలను నూనెలోంచి తీయడమే ఆలస్యం అవి నిజంగానే హాట్ కేక్స్‌లా అమ్ముడైపోయేవి.

2000 ప్రారంభంలో స్థానిక పారిశ్రామిక వేత్త ధీరజ్ గుప్తా వడాపావ్‌ను తన 'జంబోకింగ్' చైన్‌లో చేర్చారు.

ఫొటో సోర్స్, Getty Images

అందరికీ నచ్చిన 'ఇండియన్ బర్గర్'

వడాపావ్‌ను 'ఇండియన్ బర్గర్' అని వర్ణించడంతో దానికి వెంటనే వారు ఆశించిన స్థాయి ఆదరణ లభించింది. ముంబై నగరం బయట ఉన్న వారికి కూడా రుచిచూసే అవకాశం లభించింది.

జంబోకింగ్ సంప్రదాయ మహారాష్ట్ర వడాపావ్‌కు చైనా రుచులను కలిపి 'షెజ్వాన్ వడా పావ్', టోరిల్లా చిప్స్ చల్లిన 'నాచో వడాపావ్' లాంటి కొత్త రూపాలు కూడా సృష్టించారు.

కొత్త వడాపావ్ ఆవిష్కరణలు వినియోగదారులకు బాగా నచ్చాయని, అమ్మకాలు కూడా 40 శాతం పెరిగేలా చేశాయని గుప్తా చెప్పారు.

ఇప్పుడు ఒక్క ముంబైలోనే జంబోకింగ్‌కు 75 అవుట్‌లెట్లు ఉన్నాయి.

అవి ప్రతి రోజూ 500కు పైగా వడాపావ్‌లు అమ్ముతున్నాయి. ఈ షాపులు ఇప్పుడు పుణె, ఇండోర్‌లో కూడా ఉన్నాయి. మరో ఐదేళ్లలో వీటిని మరింత విస్తరించాలని గుప్తా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

అసలు రుచి దొరికేది అక్కడే

అయినా, చాలా మంది ముంబై ప్రజలు ఇప్పటికీ చత్రపతి శివాజీ టెర్మినస్ ఎదురుగా ఉన్న ఆరామ్ మిల్క్ బార్, దాదర్ శివార్లలో ఉన్న అశోక్ వడాపావ్ లాంటి చిన్న చిన్న షాపుల్లోనే వడాపావ్ రుచిచూడాలని అనుకుంటుంటారు.

ముంబయి ప్రజలు బాంబే లోకల్ రైళ్లపై ఎక్కువ ఆధారపడుతుంటారు.

వారందరికీ అవసరమైనప్పుడు ఆకలి తీర్చగలిగేలా నగరంలోని అన్ని లోకల్ రైల్వే స్టేషన్ల దగ్గర లెక్కలేనన్ని వడాపావ్ సెంటర్లు కనిపిస్తూనే ఉంటాయి.

కొంతమంది వడాపావ్ వ్యాపారులు జనం అలవాటు పడ్డ కొత్త రుచుల్లో కూడా వడాపావ్ అందించడానికి సిద్ధంగా ఉంటారు.

కానీ ఒకప్పుడు ముంబైవాసి అయిన నేను మామూలు వడాపావ్ తినడానికే ఇష్టపడతాను. నా వరకు ముంబై మహానగరానికి సంబంధించిన అసలు సిసలు రుచి దానిలో మాత్రమే ఉంటుంది. ఎప్పటికీ...

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)