‘నాన్న అంత్యక్రియలు దిల్లీలో జరగడం ఆమెకు ఇష్టం లేదు’

  • ప్రవీణ్ కాసం
  • బీబీసీ ప్రతినిధి
పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, Getty Images

స్మార్ట్‌ఫోన్ దర్శనంతోనే ఇప్పుడు మనకు తెల్లారుతోంది. అమెరికాలో యాపిల్ ఫోన్ కొత్త వెర్షన్ విడుదలవగానే మన ఇంటి ముందుకు వచ్చేలా చేసుకుంటున్నాం. ఇది నేటి ఇండియా స్థితి.

ల్యాండ్ ఫోన్ కనెక్షన్ కావాలంటే రెండుమూడేళ్లు ఆగాలి. ఫోన్ కాల్ చేసుకోవాలంటే ఎస్టీడీ బూత్‌ల ముందు పడిగాపులు కాయాలి. ఇదీ 90వ దశకంలో భారత్ పరిస్థితి.

ఒక్క టెలికాం రంగంలోనే కాదు ఈ 30 ఏళ్లలో అన్నింటా భారత ముఖచిత్రం మారిపోయింది.

ఈ మార్పు ఎక్కడ మొదలైంది? ఎవరు మొదలు పెట్టారు?

1991లో భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరింది. విదేశీ అప్పులు భారంగా మారాయి. ఎగుమతుల కంటే దిగుమతులు విపరీతంగా పెరిగాయి. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. నిధుల కోసం ప్రపంచబ్యాంకు ముందు 20 టన్నుల బంగారం కుదవ పెట్టే పరిస్థితి వచ్చింది. మరోవైపు దేశ రాజకీయ వ్యవస్థ కూడా అదే పరిస్థితిలో ఉంది. కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం కొలువుదీరి ఉంది. అది ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని స్థితి నెలకొంది.

ఫొటో సోర్స్, AFP

ఆ క్లిష్ట సమయంలో పీవీ నరసింహారావు ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. పదవీలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను తన ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు.

1991 జులై 24న ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌ సాక్షిగా 'మన ఆలోచనను అమలు పరిచే సమయం వస్తే భూమ్మీద ఏ శక్తి మనల్ని అడ్డుకోలేదు' అనే విక్టర్ హ్యూగో వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు.

పీవీ నరసింహారావు.. ఎల్పీజీ నమూనా తో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, లుక్ ఈస్ట్ పాలసీ పేరుతో రూపొందించిన కొత్త విదేశాంగ విధానం భారతను వృద్ధి దిశలోకి తీసుకెళ్లాయని ద బ్రింక్ అండ్ బ్యాక్: ఇండియాస్ 1991 స్టోరీ పుస్తకంలో మాజీ కేంద్రమంత్రి జైరాం రమేశ్ పేర్కొన్నారు.

1991లో భారత్ జీడీపీ రూ.5,86,212 కోట్లుగా ఉంటే, 2015 నాటికి రూ. 1,35,76,086 కోట్లకు చేరింది. అంటే దాదాపు 2216 రెట్లు పెరిగింది. 2015- 16లో భారత్ జీడీపీ 2 ట్రిలియన్ డాలర్లను దాటింది.

1991లో మన దగ్గర విదేశీ మారక నిల్వలు 74 మిలియన్ డాలర్లు మాత్రమే ఉంటే, 2015 నాటికి 63 బిలియన్ డాలర్లకు చేరాయి.

నాడు పీవీ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే ఒకప్పుడు ఆర్థిక లోటుతో ఉన్న భారత్ నేడు ఆసియాలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిచిందని హఫ్ లయన్‌ పుస్తక రచయత, అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ వినయ్ సీతాపతి పేర్కొన్నారు.

అయితే, ఆర్థికలోటుతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని, మైనారిటీలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని నిలబెట్టిన ప్రధాని నరసింహారావుకు ఆ మేరకు ఘనత దక్కిందా?

ఫొటో సోర్స్, Getty Images

‘మరుగున పడేశారు’

ఈ విషయాలకు సంబంధించి పీవీకి తగినంత పేరు లభించకపోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కారణం అని చెబుతారు వినయ్ సీతాపతి. హఫ్‌లయన్ పేరుతో ఈయన పీవీ నరసింహారావుపై ఒక పుస్తకం రాశారు.

'సంస్కరణ ముఖపత్రం వీపీ సింగ్ హయాంలోనే రూపొందినా, దాన్ని పట్టుదలగా తీసుకొచ్చి అమలు చేసింది మాత్రం పీవీ నరసింహారావే. పీవీ ఘనతను సొంత పార్టీనే మరుగున పడేసింది' అంటారు వినయ్ సీతాపతి.

'బాలీవుడ్ దర్శకుడు మహేశ్ భట్ రెండో భార్య పేరు తెలిసిన లా స్టూడెంట్‌ను పీవీ నరసింహారావు గురించి అడిగితే తెలియదని చెప్పాడు. అప్పుడే ఆయనపై పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నా' అని వినయ్ సీతాపతి చెప్పారు.

మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు సంజయ్ బారు కూడా పీవీకి సంస్కరణల ఘనత దక్కకపోవడంపై తన పుసక్తం 1991- హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీలో ప్రస్తావించారు.

'పీవీ హయాంలో మన్మోహన్ సింగ్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, రాకేశ్ మెహన్ లాంటి ఆర్థికవేత్తలు ఉన్నారు. విధాన నిర్ణయాలను తీసుకున్నది మాత్రం పీవీనే. కానీ, ఎప్పుడూ, ఏది తన ఘనతగా ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. పీవీ పదవి నుంచి దిగిపోగానే కాంగ్రెస్ పార్టీ ఆయనను మరుగునపడేసింది' అని తన పుసక్తంలో పేర్కొన్నారు.

మరోవైపు, ఆర్థిక సంస్కరణల ఘనత ఆయనకు దక్కకుండా చేయడం మాత్రమే కాదు ఆయన అంత్యక్రియలు కూడా ప్రభుత్వం సరిగ్గా చేయించలేదనే విమర్శలున్నాయి.

పీవీని కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందని ప్రధాని మోదీ ఓ సందర్భంలో విమర్శించారు.

ఆర్థిక సంస్కరణలతో దేశానికి దిశానిర్దేశం చేసిన పీవీని నిజంగా కాంగ్రెస్ పార్టీ అగౌరవపరిచిందా? ఇందిర, రాజీవ్‌లకు విధేయుడిగా పనిచేసిన పీవీ.. గాంధీ కుటుంబానికి ఎందుకు దూరమయ్యారు?

ఫొటో సోర్స్, Getty Images

'1992లో రెండు కుట్రలు జరిగాయి'

రాజీవ్ గాంధీ హత్య అనంతరం అనుకోని పరిస్థితుల్లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాల్సి వచ్చింది.

'ఆ సందర్భంలో భారత దేశానికి కావాల్సిన సరైన వ్యక్తి సరైన స్థానంలో ఉన్నాడు' అని పీవీ గురించి వినయ్ సీతాపతి అభివర్ణించారు.

'గాంధీ కుటుంబం నుంచి రానివారిని కాంగ్రెస్ పార్టీలో ఎదగనివ్వరు. 1992లో రెండు కూల్చివేతలకు కుట్ర జరిగింది. ఒకటి బాబ్రీ మసీదు, రెండు.. పీవీ నరసింహారావు. సంఘ్ పరివార్ బాబ్రీని కూల్చివేయాలనుకుంటే, పీవీ ప్రత్యర్థులు ఆయనను పదవిలోంచి దించెయ్యడానికి కుట్ర పన్నారు' అని తన పుస్తకంలో వినయ్ సీతాపతి వివరించారు.

పీవీ ఆర్థిక సంస్కరణల ఘనత, బాబ్రీ మసీదు కూల్చివేతతో తుడిచిపెట్టుకపోయిందని ఆయన తన పుస్తకంలో చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images

పీవీని గాంధీ కుటుంబం ఎందుకు దూరం పెట్టింది?

అప్పట్లో సోనియాగాంధీకి, పీవీ నరసింహారావుతో సరైన సంబంధాలు ఉండేవి కావని, ఒకరి పట్ల మరొకరు అనుమానంతోనే ఉండేవారని కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరేట్ అల్వా తన స్వీయ చరిత్రలో ప్రస్తావించారు. పీవీ ప్రభుత్వంలో ఆమె సిబ్బంది వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

'కరేజ్ అండ్ కమిట్‌మెంట్' పేరుతో ఆమె రాసుకున్న ఆత్మకథలో సోనియా, పీవీలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

'1992లో బోఫోర్స్ కేసులో పోలీసు ఫిర్యాదును కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని పీవీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబ్రీ మసీదు ఘటన తర్వాత ఇద్దరి మధ్యా ప్రచ్ఛనయుద్ధం మొదలైంది' అని ఆ పుసక్తంలో మార్గరేట్ అల్వా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

'ఆమెకు సుతరామూ ఇష్టం లేదు'

పీవీ మృతదేహానికి దిల్లీలో అంత్యక్రియలు జరపకపోవడంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.

‘సోనియా గాంధీకి ఇష్టం లేకపోవడం వల్లే పీవీ అంత్యక్రియలను ప్రభుత్వం దిల్లీలో జరపించలేదు అని ఆయన కుటుంబ సభ్యులు చెప్పినట్లు' వినయ్ సీతాపతి తన పుస్తకంలో వెల్లడించారు.

వినయ్ సీతాపతి పుస్తకం తెలుగు అనువాదం నరసింహుడులో పీవీ కుమారుడి ఆవేదనను ఆయన మాటల్లోనే ఇచ్చారు.

'మాకప్పటికే అనుమానం ఉంది. నాన్నగారి అంత్యక్రియలు ఢిల్లీలో జరగడం సోనియాగాంధీకి ఇష్టం లేదు. ఇక స్మృతి చిహ్నం సంగతి చెప్పేదేముంది?... నాన్నగారిని ఒక జాతీయనాయకుడిగా గుర్తించడం ఆమెకు సుతరామూ ఇష్టం లేదు... మా మీద ఆవిడ చాలా ఒత్తిడి తీసుకువచ్చింది. చివరికి మేం ఒప్పుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది'అని పీవీ కుమారుడు ప్రభాకర్ అన్నట్లు నరసింహుడు పుస్తకం పేర్కొంటుంది.

ఫొటో సోర్స్, Getty Images

'సగం కాలిన శవం'

పీవీ అంత్యక్రియలు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరుకాలేదు.

పీవీ అంత్యక్రియలు సరిగ్గా నిర్వహించలేదని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. పీవీ మృతదేహం పూర్తిగా కాలకుండానే ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిందని వార్తలు వచ్చాయి.

అయితే, దీనిపై పీవీ సన్నిహితుడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పివిఆర్‌కె ప్రసాద్‌ స్పందించారని వినయ్ సీతాపతి తన పుస్తకంలో వివరించారు

'ఆయన దేహం సగంకాలిన స్థితిలో వదిలేశారన్నది నిజంకాదు. శరీరం పూర్తిగా కాలింది. కాకపోతే కాలిపోయిన శరీరపు బూడిద అదే ఆకారంగా కనబడింది. ప్రజల మనస్సులో అదే ఉండిపోయింది. ఏమైనా ఆయన మృతదేహాన్ని బలవంతంగా హైదరాబాదుకు పంపించారనీ, ఢిల్లీలో కాంగ్రెస్‌ కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వలేదనీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. పీవీ శరీరం సగమే కాలిందన్న భావన ఆయనకు జరిగిన అన్యాయం పట్ల ప్రజల ఆగ్రహానికి సూచిక మాత్రమే' అని ప్రసాద్‌ పేర్కొన్నారని హఫ్‌లయన్ పుసక్తం చెబుతోంది.

ఆంగ్ల దినపత్రిక గార్డియన్ ఒక వ్యాసంలో పీవీ నరసింహారావు గురించే ప్రస్తావిస్తూ ‘భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చేసిన ఏకైక నేరం. ఆయన గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటమే’ అని పేర్కొంది.

అవినీతి ఆరోపణలు

ప్రధాని పదవి నుంచి దిగిపోయాక అవినీతి ఆరోపణలు పీవీని చుట్టుముట్టాయి. 1993లో అవిశ్వాస పరీక్షలో నెగ్గేందుకు ఎంపీలకు లంచం ఇవ్వజూపారనే ఆరోపణలతో ఆయనపై నమోదైన కేసును విచారించిన ప్రత్యేకన్యాయస్థానం పీవీకి మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. అయితే, తర్వాత కాలంలో దిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టేసింది.

అలాగే, సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు, లఖుబాయి పాఠక్ కేసులలో ఆయన విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)