‘గుడిలో కనిపించింది గుడ్లగూబ.. గరుడపక్షి కాదు’

గుడ్లగూబ
ఫొటో క్యాప్షన్,

గుడ్లగూబ

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల శ్రీ వెంకటేశ్వర ఆలయంలోకి గరుడ పక్షి వచ్చిందని, అది అక్కడే ఉందని స్థానిక మీడియా చెబుతోంది. గుడ్లగూబలపై రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న ఎరిక్ రామానుజం అనే పరిశోధకుడు బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ- ఈ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

ఆదివారం కోరుట్ల ఆలయంలోకి గరుడ పక్షి వచ్చిందనే ప్రచారంతో పెద్దయెత్తున స్థానికులు అక్కడికి చేరుకుని ఆ పక్షికి పూజలు చేశారు. ఆలయ పూజారులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఫొటో సోర్స్, ఎరిక్ రామానుజం

ఈ పక్షి గరుడ పక్షి (ఈగల్) కాదని, ఇది గుడ్లగూబ అని ఎరిక్ రామానుజం చెప్పారు. ఈ గుడ్లగూబను 'బర్న్ అవుల్' అంటారని చెప్పారు. ఈ పక్షి రాత్రుల్లో తప్ప పగటి సమయంలో సంచరించదని ఆయన వివరించారు.

''బర్న్ అవుల్ రాత్రుల్లో మాత్రమే ఎగురుతుంది. పగటి వేళ ఏ మాత్రం కదలదు. మీరు దాన్ని పట్టుకొచ్చి ఎక్కడ నిలబెడితే అక్కడే ఉంటుంది. దీన్ని గరుడ పక్షి లేదా గద్ద అనడం సరికాదు'' అని రామానుజం వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ పక్షి ఆలయంలోకి ఎందుకు వచ్చింది?

ఈ పక్షి ఆలయంలోకి ఎందుకు వచ్చి ఉంటుందన్న ప్రశ్నకు రామానుజం సమాధానమిస్తూ- అది పెద్ద పక్షి కాదని, ఇప్పుడే ఎగరడం నేర్చుకుంటున్న చిన్న పిల్ల కావొచ్చని తెలిపారు. ఆలయ సమీపంలో ఈ గుడ్లగూబల గూడును ఎవరైనా కదిపితే అది గుడిలో వచ్చి వాలి ఉంటుందని, ఇప్పుడు పగలు కావడంతో ఎక్కడకూ పోవడం లేదని ఆయన ఆదివారం మధ్యాహ్నం చెప్పారు.

ఆ గూటిలో మూడు నుంచి అయిదు పిల్లలు ఉండి ఉండొచ్చని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గద్ద

''బర్న్ అవుల్ ఎత్తు దాదాపు ఒక అడుగు వరకు ఉంటుంది. దాని ముఖం లవ్ గుర్తు లేదా ఆర్టిన్ ఆకారంలో ఉంటుంది. ఇది చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండి.. పెద్దయ్యే కొద్దీ.. రెక్కలు గోధుమ రంగులోకి మారుతాయి. పెద్దయ్యాక ముఖం, శరీరం మాత్రం తెల్లగానే ఉంటుంది'' అని రామానుజం వివరించారు.

ఈ పక్షి ఎలుకలు వంటి చిన్న ప్రాణులను మాత్రమే తింటుందని, దానికి ప్రసాదాలు పెట్టడం సరికాదనీ ఆయన చెప్పారు. దీని శాస్త్రీయ నామం టైబో అల్బా అని చెప్పారు.

ఈ పక్షుల్లో మగ పక్షి కన్నా ఆడ పక్షి ఎత్తు ఎక్కువని రామానుజం తెలిపారు. ఇవి ఐరోపా, ఆసియాల్లో విరివిగా ఉంటాయని వివరించారు.

ఆలయ అర్చకుడు ఏమన్నారు

‘‘జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విచిత్రం చోటు చేసుకుంది.వెంకటేశ్వర స్వామి వారి వాహనమైన గరుడ పక్షి సాక్షాత్తు స్వామి వారి విగ్రహం వద్దకు వచ్చి ఆయన పాదాల చెంత నిలబడి అలానే ఉండి పోయింది. విషయం తెలుసుకున్న భక్తులు ఈ విచిత్రన్ని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేస్తున్నారు.’’

అని ఆలయ అర్చకుడు. తెలిపారు.

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చందమామపై సాయి ముఖం కనిపిస్తున్న ఫొటో వైరల్ అయింది. ఆరా తీస్తే.. అది ఫొటో షాప్డ్ ఇమేజ్ అని తేలింది.

ఆ కథనానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)