శక్తి టీమ్స్: పోలీస్ శాఖలో మ‌హిళా శ‌క్తి

  • శంకర్
  • బీబీసీ కోసం
శక్తి టీమ్ సభ్యురాలు

మ‌హిళ‌ల‌పై హింస‌కు సంబంధించి అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉందని నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తెలిపింది.

2015 గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో మ‌హిళ‌లపై జ‌రిగిన దాడుల‌కు సంబంధించి మొత్తం 15,967 కేసులు నమోదయ్యాయి. కాగా 2016 నాటికి నమోదైన కేసుల సంఖ్య 16,362కి పెరిగాయి.

ఇక వాటిలో మ‌హిళ‌ల‌ హ‌త్య కేసులు 1,099 నుంచి 1,123 కి పెరిగాయి. 2017 గణాంకాల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని పోలీసు శాఖ లెక్క‌లు చెబుతున్నాయి.

మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు, అత్యాచారాల‌తోపాటు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ సంఘటనలు కూడా పెరుగుతుండ‌డం ఆందోళ‌న‌ కలిగించే అంశం.

ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్ర‌కారం లైంగిక వేధింపుల కేసులు 18% పెరగ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌ల‌పై జరుగుతున్న దాడులకు అద్దం ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌పై సాగుతున్న హింస‌కు చెక్ పెట్టాల‌నే సంక‌ల్పంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు పలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్,

శక్తి టీమ్స్: పోలీస్ శాఖలో మ‌హిళా శ‌క్తి

అందులో భాగంగా ఇప్ప‌టికే 'షీ టీమ్స్' పేరుతో కొన్ని జిల్లాల్లో నేరాలు అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు.

మ‌హిళ‌లు, విద్యార్థినుల‌కు ర‌క్ష‌ణగా మ‌హిళా పోలీసు బృందాలు మ‌ఫ్టీలో ర‌ద్దీ ప్రాంతాల్లో తిరుగుతూ ఈవ్ టీజ‌ర్లు, ఇత‌ర వేధింపుల‌కు పాల్ప‌డే వారిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అవి మంచి ఫ‌లితాలు ఇచ్చిన‌ట్లు గ‌తంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లా అర్బ‌న్ ఎస్పీగా ప‌నిచేసి, ప్ర‌స్తుతం విజ‌య‌వాడ డీసీపీగా ప‌నిచేస్తున్న రాజ‌కుమారి చెబుతున్నారు.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం అర్బన్‌లో ఏకంగా మ‌హిళ‌ల‌పై హింస‌కు సంబంధించిన కేసుల్లో 34% త‌గ్గుద‌ల కనిపించినట్లు ఆమె వివ‌రించారు.

శిక్ష‌ణ త‌ర్వాత రంగంలో దిగిన‌ 'శ‌క్తి టీమ్స్'

ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌త్యేక మ‌హిళా బృందాల‌ను రంగంలోకి దింపేందుకు ఏపీ పోలీస్ శాఖ సిద్ధ‌మ‌య్యింది. అందులో భాగంగానే ప్ర‌యోగాత్మ‌కంగా విజ‌య‌వాడ న‌గ‌రంలో శ‌క్తి టీమ్ పేరుతో మ‌హిళా పోలీస్ సిబ్బందిని ఎంపిక చేసి శిక్ష‌ణ ఇచ్చారు.

స్వీయ ర‌క్ష‌ణతో పాటు, ఆక‌తాయిల ఆట‌కట్టించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల సామ‌ర్థ్యాలు పెంచేందుకు ప్ర‌య‌త్నించారు. సైబ‌ర్ క్రైమ్ పెర‌గడానికి కార‌ణాలు, నివార‌ణ‌కు సంబంధించిన అంశాల‌లో కూడా శ‌క్తి టీమ్‌లోని 70 మంది మ‌హిళా పోలీసు కానిస్టేబుల్స్‌కి అవ‌గాహ‌న క‌ల్పించారు.

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు సంబంధించిన చ‌ట్టాల మీద వారికి అవ‌గాహ‌న కల్పించడంతోపాటు కారు డ్రైవింగ్, స్విమ్మింగ్, తైక్వండో, క‌రాటే వంటి రక్షణ కళల్లో త‌ర్ఫీదు ఇవ్వ‌డంతో శ‌క్తి టీమ్‌లో ఆత్మ‌విశ్వాసం క‌నిపిస్తోంది.

తాము ఓ పోలీస్ ఆఫీస‌రుతో స‌మానంగా అవ‌గాహ‌నా శిబిరాల్లో మాట్లాడ‌గ‌లుగుతున్నామ‌ని శ్రావ‌ణి అనే మ‌హిళా కానిస్టేబుల్ బీబీసీకి తెలిపారు.

మ‌హిళా కానిస్టేబుళ్లు అయిన‌ప్ప‌టికీ వారిలో అత్య‌ధికులు ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు. ఎంటెక్, ఎంఈడీ, బీఎల్ వంటి వివిధ కోర్సులు పూర్తి చేశారు.

అయిన‌ప్ప‌టికీ కానిస్టేబుల్‌గా ప‌నిచేసేందుకు ముందుకు వ‌చ్చిన వారిని ఎంపిక చేసిన పోలీస్ ఉన్న‌తాధికారులు వారి శ‌క్తి సామ‌ర్ధ్యాలు పెంచేందుకు 4నెల‌లపాటు శిక్ష‌ణ అందించారు.

ముఖ్యంగా ఎస్పీగా ప‌నిచేస్తున్న కాలంలో షీ టీమ్స్ నిర్వ‌హ‌ణ‌లో అనుభ‌వం ఉన్న రాజ‌కుమారి డీసీపీగా ఉండ‌డంతో ఈ శ‌క్తి టీమ్ మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టార‌ని క‌విత అనే కానిస్టేబుల్ అభిప్రాయపడ్డారు.

మ‌హిళ‌లు తమ సమస్యలను మాతో చెప్పుకుంటున్నారు

శిక్ష‌ణ పూర్తిచేసుకుని, ప్ర‌స్తుతం విజ‌య‌వాడ న‌గ‌రంలో 5 క్ల‌స్ట‌ర్స్‌గా ఈ శ‌క్తి టీమ్స్ ప‌ని ప్రారంభించాయి. విద్యార్థినులు, మ‌హిళ‌లు ఎక్కువగా సంచ‌రించే ప్రాంతాల్లో ఈ శ‌క్తి టీమ్స్ గ‌స్తీ తిరుగుతుంటారు. దాని వ‌ల్ల అనేక మంది త‌మ స‌మ‌స్య‌ల‌ను మాతో పంచుకున్నారంటూ శ‌క్తి టీమ్ స‌భ్యురాలు దివ్య‌జ్యోతి తెలిపారు.

త‌మ స‌మ‌స్య‌లు ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న విద్యార్థినులు అనేకమంది త‌మ వ‌ద్ద‌కు వ‌స్తున్నార‌న్నారు.

నేరం జ‌రిగిన త‌ర్వాత కేసు న‌మోదు కాకుండా, నేరాలు జ‌ర‌గ‌కుండా ముంద‌స్తుగా అప్ర‌మ‌త్తం చేయ‌డం, అవ‌గాహ‌న పెంచ‌డం, ఆక‌తాయిల‌ను అడ్డుకోవ‌డం తమ ల‌క్ష్యాలు అని టీమ్ మెంబ‌ర్ వెంక‌ట‌ర‌త్నం పేర్కొన్నారు.

'రాష్ట్ర‌మంతా శ‌క్తి టీమ్స్ ఏర్పాటు..'

శ‌క్తి టీమ్స్‌ ప్రస్తుతం.. వివిధ పోలీసు స్టేష‌న్లకు అనుసంధానంగా ప‌నిచేస్తున్నాయి. ఎవ‌రైనా వేధింపుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు '100, 102' అత్యవసర సేవల ద్వారా త‌మ‌కు సమాచారం అందిస్తే వెంట‌నే అప్ర‌మత్తం అవుతామ‌ని టీమ్ స‌భ్యురాలు పావ‌ని చెబుతున్నారు.

అందుకు త‌గ్గ‌ట్లుగా శ‌క్తి టీమ్ కోసం ప్ర‌త్యేకంగా వాహ‌నాలు సిద్ధం చేశారు. టీమ్ స‌భ్యులే స్వ‌యంగా న‌డుపుకుంటూ వెళ్లేలా డ్రైవింగ్‌లో శిక్ష‌ణ పొంద‌డంతో 3 వాహ‌నాలను వారికోసం కేటాయించారు. మ‌రో 20 ఈ-సైకిళ్లను కూడా సిద్ధం చేశారు.

సైకిళ్ల‌పై, కార్ల‌లో ప్ర‌త్యేక బృందాలు.. నగరంలో గ‌స్తీ తిరుగుతూ ఉండ‌టంవ‌ల్ల నేరాలు చేసేందుకు కూడా కొంద‌రు వెన‌కాడ‌తార‌ని డీసీపీ రాజ‌కుమారి అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఏపీ పోలీసు శాఖ నిర్ణ‌యంలో భాగంగా ప్ర‌యోగాత్మ‌కంగా విజ‌య‌వాడ‌లో ప్రారంభించిన శ‌క్తి టీమ్ ప‌నితీరు సంతృప్తిక‌రంగా ఉంద‌న్నారు. శిక్ష‌ణ పొందిన టీమ్ స‌భ్యులు శ్ర‌ద్ధ‌గా ప‌నిచేస్తే రాష్ట్రంలో నేరాల అదుపుకు తాము చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఏపీలో మ‌హిళ‌ల మీద నేరాల స్థాయి ఎక్కువ‌గా ఉన్న త‌రుణంలో శ‌క్తి టీమ్స్ వంటివి స‌త్ఫ‌లితాల‌నివ్వడం అంద‌రికీ సంతోష‌మే అంటున్నారామె. విజ‌య‌వాడ త‌ర్వాత రాష్ట్ర‌మంతా ఈ శ‌క్తి టీమ్స్‌కు ప్ర‌త్యేక యూనిఫారం అందించి, రంగంలోకి దించుతామని ఆమె అన్నారు.

'ఆస‌క్తిగా మారిన శ‌క్తి బృందాలు'

విజ‌య‌వాడ‌లో వీధుల్లో శక్తి టీమ్స్ సంచరిస్తున్నాయి. ఆర్టీసీ బ‌స్టాండ్‌లు, కాలేజీలు, ఇత‌ర అన్ని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఈ టీమ్ సభ్యులు.. ఓవైపు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ, మ‌రోవైపు ఆక‌తాయిల‌ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఫలితంగా గ‌త‌వారం రోజులుగా త‌మ కాలేజీ వ‌ద్ద ఈవ్ టీజ‌ర్ల తాకిడి త‌గ్గింద‌ని న‌లంద కళాశాల‌కు చెందిన ర‌మ్య అనే విద్యార్థిని తెలిపారు. కొత్త యూనిఫారంతో రోడ్డు మీద‌కు వ‌చ్చిన శక్తి టీమ్స్ పట్ల నగరవాసుల్లో ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)