‘ఎన్టీఆర్‌ను అవమానించిన కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఆమోదిస్తారు?’ - నరేంద్ర మోదీ : ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిని ఎదుర్కోవడానికి రూపుదిద్దుకుంటున్న మహాకూటమిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారని ఈనాడు పేర్కొంది.
వ్యక్తిగత మనుగడ కోసమే వివిధ రాజకీయ పార్టీలు 'అపవిత్ర సంకీర్ణా'న్ని ఏర్పాటు చేసుకున్నాయని మోదీ దుయ్యబట్టారు. ఇది ధనిక వంశాలతో కూడిన పొందికలేని సంకీర్ణమని చెప్పారు.
ఆదివారం ఆయన తమిళనాడులోని చెన్నై సెంట్రల్, చెన్నై నార్త్, మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూర్ నియోజకవర్గాల్లోని భాజపా బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడారు. ప్రతిపాదిత మహాకూటమిలోని కీలక పార్టీ అయిన తెదేపా నాయకత్వంపై మోదీ విమర్శలు గుప్పించారు.
''నాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అవమానించింది. అందువల్ల ఆ పార్టీ దురహంకారానికి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. అదే పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉండాలనుకుంటోంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఆమోదిస్తారు'' అని ప్రశ్నించారు.
సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా నుంచి ప్రేరణ పొందినట్లు మహాకూటమిలోని కొన్ని పార్టీలు చెప్పుకుంటున్నాయని, నిజానికి లోహియా స్వయంగా కాంగ్రెస్‌ను, దాని సిద్ధాంతాలను వ్యతిరేకించారని మోదీ చెప్పారు.
కాంగ్రెస్‌ను రాజీ పార్టీ (కాంప్రమైజ్ పార్టీ)గా లోహియా అభివర్ణించేవారన్నారు. ఆ పార్టీ అనేక సైద్ధాంతిక అంశాలు, జాతీయ ప్రయోజనాలపై రాజీ పడిందని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ఆ కూటమిలోని అనేక మంది నేతలను అరెస్టు చేసి, చిత్రహింసలపాల్జేశారని పేర్కొన్నారు. ఇలాంటి పార్టీల పాలనలో అవినీతిపరులు, నేరగాళ్లదే పైచేయిగా ఉంటుందన్నారు.
''సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్‌ను కాంగ్రెస్ ఎలా వేధించిందో మనకు తెలుసు. 1980లో తమిళనాడులో ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసింది. కాంగ్రెస్‌కు, డీఎంకేకు మధ్య తీవ్ర వైరం ఉండేది. నేడు ఆ రెండు పార్టీలూ కలసిపోయాయి. అది అవకాశవాదమే'' అని పేర్కొన్నారు.
దిగ్గజాలైన ఎన్టీఆర్, ఎంజీఆర్‌లను కాంగ్రెస్ అవమానించిందని చెప్పారు. దానిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరన్నారు. ప్రాంతీయ పార్టీల అణచివేతకే కాంగ్రెస్ ప్రయత్నించిందని మోదీ అన్నట్లు ఈనాడు తెలిపింది.
ఫొటో సోర్స్, kcr/fb
‘జాతీయస్థాయిలో గుణాత్మక మార్పులకు శ్రీకారం’
దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయని, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పుంజుకుంటోందని, ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల్ని ఒక తాటిపైకి తెచ్చే ఉద్యమం ప్రారంభమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పేర్కొన్నట్లు సాక్షి తెలిపింది.
ప్రాంతీయ పార్టీల్లో అద్భుత శక్తిగా వెలుగొందుతున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో సంప్రదింపులు ప్రారంభించడంతో జాతీయ స్థాయిలో గుణాత్మక రాజకీయ శక్తి ఆవిష్కరణ ప్రక్రియకు బీజం పడిందని వ్యాఖ్యానించారు.
సమాన ఆశ యాలు, కార్యాచరణతో విజయ పంథాలో కొనసాగుతున్న నవీన్.. తనతో ఏకీభవిస్తారని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని.. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తమ ప్రయత్నాలతో దేశానికి ప్రయోజనం కలగనుందని, సమీప భవిష్యత్తులో సత్ఫలిలొస్తాయని స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు ఆదివారం సీఎం కేసీఆర్ 'ఫెడరల్ ఫ్రంట్'సంప్రదింపుల ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు.
తొలిరోజు ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపారు. ప్రధాన రాజకీయ పార్టీల తరహాలో ప్రాంతీయ పార్టీల్లో వర్గ విబేధాలు లేవని ఇరువురు సీఎంలు ప్రకటించారు. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రజాహిత పథకాలు, కార్యాచరణ పట్ల ఇరువురు నాయకులు ఒకర్ని ఒకరు ప్రశంసించుకున్నారు.
నవీన్ పట్నాయక్‌తో జరిపిన చర్చల్లో రహస్యం ఏమీ లేదని కేసీఆర్ స్పష్టంచేశారు. గుణాత్మక మార్పు కోసం చర్చలు జరిపామని, తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడే నిర్దిష్టమైన ఫలితం రాదని, సమీప భవిష్యత్తులో వస్తుందని భావిస్తున్నామన్నారు.
త్వరలో మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేస్తామని వెల్లడించారు. దేశంలోని మరింత మందితో చర్చించాల్సిన అవసరముందన్నారు. బీజేపీకి టీఆర్ఎస్.. బీ టీం అని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కేసీఆర్ తోసిపుచ్చారు. ఈ విషయంలో నవీన్ కూడా ఏకీభవించారని తెలిపారు.
ఒడిశా ప్రజల కోసం, అక్కడి రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్న నవీన్ పట్నాయక్‌కు కేసీఆర్ అభినందనలు తెలిపారు. నవీన్ ఆదర్శనీయుడని, దేశంలో స్వప్రయోజనాలు ఎరగని రాజకీయ నేత అని కొనియాడారని సాక్షి తెలిపింది.
ఫొటో సోర్స్, AndhraPradeshCM/facebook
‘కేంద్రం ద్రోహంపై భారీ నిరసన చేపడదాం’
కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయం, ద్రోహానికి వ్యతిరేకంగా నూతన సంవత్సరం తొలిరోజున రాష్ట్రవ్యాప్తంగా భారీఎత్తున నిరసన చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ప్రజలను జాగృతం చేయడం కోసం ఆ రోజు ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించాలని చంద్రబాబు పిలుపిచ్చారు. 'కొత్త సంవత్సరం తొలిరోజు సంబరాలు చేసుకుంటాం.. అయితే వాటి బదులు మనకు జరిగిన అన్యాయంపై గళమెత్తాలి. మన ఐక్యతను చాటాలి.
రాష్ట్రస్థాయి నుంచి నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి వరకు నిరసన ప్రదర్శనలు జరగాలి. ప్రతి పల్లెలోనూ జనం కదం తొక్కాలి. ఆ రోజు ఎవరికి ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో 2-3 కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీలు చేయాలి' అని సూచించారు.
రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ, దానికి సహకరిస్తున్న పార్టీల గుండెల్లో గుబులు పుట్టేలా ప్రజల్లో చైతన్యం రావాలని స్పష్టం చేశారు. ఆయనే స్వయంగా ఆ రోజు నిరసన ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు.
గుంటూరు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల మీదుగా 15-20 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ జరుపుతారని సమాచారం. పార్టీపరంగా అని కాకుండా.. ప్రజలే ముందుకొచ్చి ర్యాలీలు చేయాలని చంద్రబాబు కోరారు.
'ఒకరు నడుస్తూ వెళ్తుంటే కలిసొచ్చేవాళ్లు కలిసొస్తూ ఉంటారు. అదో ప్రవాహంలా మారుతుంది. జనాలను రాజకీయంగా తీసుకొచ్చి చేసే పనికాదు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా స్వచ్ఛందంగా అంతా కలిసిరావాలి. ఎవరికి వీలున్నచోట్ల వారు చేయాలి.
ఓ 20 మందీ మొదలుపెడితే.. అలా నిరసన ర్యాలీ సాగుతుండగా మధ్యలో అనేకమంది స్వచ్ఛందంగా కలుస్తారు. చివరకు వెళ్లేసరికి భారీ ర్యాలీగా మారుతుంది. అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుంటే మళ్లీ అదే చేస్తారు. మోసం చేసినా మౌనంగా ఉంటే బలహీనత అనుకుంటారు. మళ్లీ అదేపని చేస్తారు. మోసం చేసినవాళ్లను నిలదీయాలి. అప్పుడే భయం ఉంటుంది' అని చంద్రబాబు పార్టీ నేతలు, మీడియాతో వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
ఫొటో సోర్స్, Getty Images
పాయింట్లు.. పనిష్మెంట్లు
ఏపీఎస్ఆర్టీసీలో పాయింట్ల పద్ధతి కార్మికులకు ఆందోళనకు గురి చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.
''ఎవరో చిల్లర మరిచిపోయారు. పది రూపాయలు బ్యాగులో ఎక్కువ ఉంది. రెండు పాయింట్లు పడ్డాయి'' ఒక ఆర్టీసీ కండక్టర్ ఆవేదన. ''నీది పది రూపాయలే. నా పరిస్థితి మరీ అన్యాయం. రోడ్డు బాగలేక టైరు పగిలింది. పన్నెండు వేలు నా జీతం నుంచి రికవరీ చేస్తున్నారు'' మరో డ్రైవర్ గోడు. ''నేను రోజుకు పది లక్షల పైనే క్యాష్ లెక్క పెడుతుంటా. పొరపాటున రూ.500 నోటు తేడా వచ్చింది. పది రెట్లు (5వేలు) ఫైన్ చెల్లించాల్సిందే అంటున్నారు'' బస్ డిపోలో క్యాషియర్ నిట్టూర్పు. ''నా గ్యారేజీలో అందరూ అవుట్ సోర్సింగే. బయట ఎక్కడ బస్సు ఆగిపోయినా నాదే బాధ్యత అంటున్నారు. రోడ్డు లోపమా? స్పేర్ పార్ట్ నాసిరకమా? సిబ్బంది లేకపోవడమా? అనేది చూడకుండా నన్ను బలిపశువు చేస్తున్నారు'' ఇది ఒక మెకానిక్ ఆందోళన.
ఈ నలుగురే కాదు... సెక్యూరిటీ సిబ్బంది నుంచి కార్యాలయంలో క్లర్కుల వరకూ ఆర్టీసీలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తప్పు చిన్నదే.. పాయింట్లు రెండే కదా అనుకుంటే చివరకు అదే కొంప ముంచేలా ఉందని వాపోతున్నారు. ఏ క్షణం ఎవరికి ముప్పు వస్తుందోననే ఆందోళనతో మనశ్శాంతికి దూరమయ్యారు.
తమకు ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకొంటూ డ్యూటీలు చేయలేక, ఉద్యోగం వదులుకోలేక బిక్కు బిక్కు మంటున్నారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కానే కాదని పదే పదే యాజమాన్యం చెబుతోంది. పైగా ఆక్యుపెన్సీ రేషియో 68శాతం నుంచి 82శాతానికి పెంచడంలో కార్మికుల శ్రమ కీలకమని అంటున్నది.
అలాంటప్పుడు తమను ఈ స్థాయిలో ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని వాపోతున్నారు. నష్టాల పేరుతో సిబ్బందిని కుదిస్తూ, అవుట్ సోర్సింగ్‌పై ఆధారపడుతూ ఎలాంటి పొరపాట్లు జరగకూడదంటే ఎలాగని నిలదీస్తున్నారు.
అనారోగ్యంతో డ్యూటీకి రాకపోతే రెడ్ మార్క్ వేస్తున్న యాజమాన్యం, తానే సిఫారసు చేసిన ప్రభుత్వ వైద్యుడి నుంచి సర్టిఫికెట్ తీసుకొస్తే తిరస్కరించడం ఎంత వరకూ సబబని వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ డిస్పెన్సరీలు లేని చోట ప్రభుత్వ డాక్టర్ ఇచ్చే సర్టిఫికెట్ చెల్లదనడమంటే ఉద్దేశపూర్వకంగా కార్మికులను వదిలించుకునేలా యాజమాన్యం తీరు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, 'కార్మికులు తప్పు చేస్తే చార్జి మెమోలు ఇచ్చేవారు. ఇప్పుడు అవన్నీ తీసేశాం. ప్రశాంతంగా పని చేసుకునే వాతావరణం కల్పించాం. పాయింట్ల విధానం కూడా వద్దంటే ఎలా? ఏ తప్పూ చేయకపోతే పాయింట్ల గురించి ఆందోళన ఎందుకు?'' అని యాజమాన్యం ప్రశ్నిస్తోందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)