కాందహార్ హైజాక్: 'హనీమూన్‌కు వెళ్లి బందీగా చిక్కారు'

రుపిన్ దంపతులు
ఫొటో క్యాప్షన్,

హైజాక్ ఘటనకు మూడు వారాల ముందే రుపిన్ కత్యాల్, రచనా సెహగల్‌కు వివాహమైంది.

సరిగ్గా 20 ఏళ్ల కిందట... డిసెంబర్ 24 శుక్రవారం మధ్యాహ్నం గం 4.30లకు దిల్లీ వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది.

సాయంత్రం 5 గంటలకు భారత గగనతంలోకి విమానం ప్రవేశించగానే అందులోని హైజాకర్లు తమ పని మొదలు పెట్టారు.

విమానాన్ని హైజాక్ చేస్తున్నామని చెప్పి అమృత్ సర్, లాహోర్, దుబాయిల మీదుగా అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌కు తరలించారు.

జైల్లో ఉన్న తమ సహచరులు 36 మందిని విడుదల చేయాలని, 200 మిలియన్ డాలర్లు (రూ. 1400 కోట్లు) ఇవ్వాలని భారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎనిమిది రోజుల పాటు ఈ ఉత్కంఠ కొనసాగింది.

చివరకు హైజాకర్లు, తాలిబన్లు, భారత ప్రభుత్వం మధ్య చర్చలు సఫలం కావడంతో బందీలుగా ఉన్నవారినందరినీ వారు విడుదల చేశారు.

హైజాక్ అయిన ఆ విమానంలో అప్పుడు వివిధ దేశాలకు చెందిన దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో వృద్ధులు, మహిళలు, పిల్లలు, రోగులతో పాటు కొత్తగా పెళ్లైన ఓ జంట కూడా ఉంది.

హైజాక్ అయిన వారిని వదిలిపెట్టడంతో ఎనిమిది రోజుల ఉత్కంఠకు తెరపడిందని అందరూ సంతోషించారు. కానీ, అదే సమయంలో దేశమంతా ఓ యువతి మీద సానుభూతి వ్యక్తంచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఫొటో సోర్స్, SAEED KHAN / AFP / GETTY IMAGES

'హనీమూన్‌కు వెళ్లి బందీగా చిక్కారు'

భారత్‌కు చెందిన రుపిన్ కత్యాల్, రచనా సెహగల్‌కు డిసెంబర్ 3న వివాహమైంది. హనీమూన్ కోసం ఈ కొత్త జంట నేపాల్‌ వెళ్లింది.

డిసెంబర్ 24న వారు తిరిగి భారత్‌కు వెళ్లేందుకు కఠ్మాండూలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కారు. హైజాక్‌కు గురైన విమానం అదే. 180 మంది ప్రయాణికులతో పాటు కొత్త జంట ఆ విమానంలో హైజాకర్లకు బందీలుగా చిక్కారు.

వారిలో రుపిన్‌ను హైజాకర్లు చంపేశారు.

రుపిన్‌నే ఎందుకు హత్య చేశారు

విమానాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న హైజాకర్లు మొదట అందులోని ప్రయాణికులకు తమ ఉనికి తెలియకుండా ఉండేందుకు కళ్లకు గంతలు గట్టారు. వాటిని తీసేయొద్దని ఆయుధాలతో బెదిరించారు. తలలు వంచుకుని ఉండాలని ఆదేశించారు.

ఇంధనం నింపుకొనేందుకు దుబాయిలో విమానం దిగినప్పుడు రుపిన్ కత్వాల్ హైజాకర్ల బెదిరింపులను ఖాతరు చేయకుండా తలెత్తాడు.

దీంతో హైజాకర్లు అతడ్ని చుట్టుముట్టి కత్తులతో దాడికి దిగారు. తీవ్ర గాయాలతో రుపిన్ విమానంలోనే మరణించారు.

హైజాకర్లు అతని మృతదేహాన్ని అక్కడే వదిలివేశారు. ఈ హైజాక్ ఘటనలో చనిపోయిన ఏకైక వ్యక్తి రుపిన్.

ఫొటో సోర్స్, SAEED KHAN / AFP / GETTY IMAGES

'అదే విమానంలో ఉన్నా భర్త హత్య తెలియలేదు'

రుపిన్ చనిపోయిన విషయం అదే విమానంలో ఉన్న భార్య రచనకు తెలియలేదు. విమానంలో ఎక్కడో ఒక చోట తన భర్త క్షేమంగా ఉంటారని ఆమె భావించారు.

దుబాయి నుంచి కాందహార్‌లో విమానం దిగిన ఆరు రోజుల తర్వాత హైజాకర్లతో భారత ప్రభుత్వ చర్చలు సఫలం అవడంతో విమానంలోని ప్రయాణికులను వదిలేసేందుకు వారు అంగీకరించారు.

వదిలేసిన ప్రయాణికులతో పాటు రుపిన్ భార్య రచన కూడా ప్రత్యేక విమానంలో భారత్‌కు పయనమయ్యారు. ఆమెకు అప్పటికి కూడా భర్త చనిపోయారనే విషయం తెలియదు.

'ఆమె పరిస్థితి దారుణంగా ఉంది'

విమానం నుంచి విడుదలైన ప్రయాణికులను తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని కాందహార్‌లో ఏర్పాటు చేసింది. మిగిలిన ప్రయాణికులతో పాటు రచన కూడా అదే విమానంలో భారత్‌కు పయనమయ్యారు.

అప్పుడు రచన తీవ్ర నిస్పృహలో ఉందని ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డాక్టర్ ఆర్కే సిన్హా మీడియాకు చెప్పారు. 'ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. జరిగిన ఘటనను చెప్పే స్థితిలో లేదు. భర్త కోసమే ఆమె వెతుకుతోంది' అని తెలిపారు.

'ఇండియాకు వచ్చాక ఆమె అందరినీ ఒకటే ప్రశ్న వేసేది... తన భర్త ఎక్కడని. కానీ మేం కొన్ని రోజుల వరకు ఆమెకు విషయం చెప్పలేదు' అని రచన మామయ్య కన్వాల్ కత్యాల్ చెప్పారు.

రుపిన్ హత్యకు గురైన విషయం చాలా రోజుల తర్వాత బంధువులు ద్వారా రచనకు తెలిసింది.

ఫొటో సోర్స్, SAEED KHAN / AFP / GETTY IMAGES

'వాళ్లు క్రూరంగా ప్రవర్తించారు'

హైజాకర్లు తమ పట్ల క్రూరంగా ప్రవర్తించారని, బందీలుగా ఉన్నన్ని రోజులు గ్లాసు నీళ్లతో కడుపు నింపుకొన్నామని విడుదలైన ప్రయాణికులు మీడియాకు చెప్పారు.

'విమానంలో ఉన్నంతసేపు మా కళ్లకు గంతలు కట్టారు. ఒక్కొకరిగా అందరిని చంపేస్తామని బెదింరించారు' అని ప్రయాణికుడు ఇందర్ తనేజా చెప్పారు.

ఓ మహిళ మాత్రం హైజాకర్లు తనకు స్కార్ఫ్‌ను కానుకగా ఇచ్చారని చెప్పారు. 'డిసెంబర్ 27న నా పుట్టిన రోజు. ఈ విషయం తెలిసి ఒక హైజాకర్ నాకు స్కార్ఫ్‌ను కానుకగా ఇచ్చారు' అని కటారియా బీబీసీకి చెప్పారు.

రోజుకు ఒక్క బత్తాయి తింటూ ఎనిమిది రోజులు గడిపానని ప్రశాంత్ తెలిపారు.

భారత మీడియా విమర్శలు

విమాన హైజాక్‌ ఘటనపై నాటి భారత మీడియా ఘాటుగా స్పందించింది. భారత భద్రతా వైఫల్యంగా ఈ ఘటనను అభివర్ణించింది. కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా స్పందించడంలో విఫలమైందని విమర్శించింది.

హైజాక్ అయిన విమానం అమృత్‌సర్‌లో నిలిచినప్పుడు చర్యలు తీసుకోకుండా మంచి అవకాశాన్ని చేజార్చుకుందని తప్పుపట్టింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)