క్రిస్మస్ డే: రాజుకు జ్ఞానం దూరమైతే..
- జాన్సన్ చొరగుడి
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Hulton Archive/gettyImages
హేరోద్
కాలాలు మారినా మనిషిలో ఉండే మౌలిక లక్షణాలు కొన్ని మారవు. ప్రేమ, జాలి, ద్వేషం, అసూయ, ఆకర్షణ, సెక్స్ వంటివి మనిషి జీవించి ఉన్నంత వరకు మనిషితో పాటు ఉండే లక్షణాలు. వాటిలో ప్రత్యేకమైనది అధికారం.
క్రిస్మస్ సీజన్లో శిశువు అయిన జీసస్ పేరుతో పాటుగా వినిపించే మరో పేరు హేరోద్ ది గ్రేట్. జీసస్ పురిటి బాలుడు, కానీ, హేరోద్ ఒక రాజ్యాధిపతి, ఏమాత్రం పోలిక లేదు. కానీ, రాజ్యాన్ని ప్రశ్నించే శక్తి- అది ఎంత చిన్నది అయినా, రాజుకు అదంటే భయమే! అనువంశిక పాలనగా అప్పటి వరకు రాజ్యాధికారం రాజకుటుంబాలలోనే బదిలీ అవుతూ ఉన్నది.
అయితే, యూదుల(కు) రాజు పుడతాడు అనే ప్రవక్తల ముందస్తు ప్రకటనలు అప్పటికి చాలా కాలంగా ఉన్నాయి. ఇంతలో మేమే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాం అన్నారు, తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు. ఎప్పటి నుంచో ఈ మాట వింటున్నా, తాను గద్దె మీద ఉండగా, ఈ యూదుల రాజు కొత్తగా పుట్టడం అనేది హేరోద్కు సంకటం అయింది.
తక్షణ సమస్య కాకపోయినా, అది ఐతే మొదలైంది. అందుకే హేరోద్ పురిటి వాసన వచ్చిన ప్రతి ఇంటి మీద నిఘా ఉంచాడు. చివరకు తన ఇంటి మీద కూడా.
ఫొటో సోర్స్, Getty Images
ఎక్కడయినా రాజు, రాజకుటుంబంలో పుడతాడు. కానీ, మొట్టమొదటిసారి సారి అతడు ఎక్కడయినా పుట్టవచ్చు అనే కొత్త ట్రెండ్ రెండు వేల ఏళ్ల క్రితం క్రిస్మస్ సీజన్లో మొదలైంది.
అప్పటివరకు రాజు అంటే ఒక సామ్రాజ్యానికి అధిపతి అనేది స్థిరపడి ఉన్న అభిప్రాయం.కానీ, మొదటిసారి భౌగోళిక హద్దులులేని ఆధ్మాత్మిక ఆత్మీయ సామ్రాజ్యం ఒకటి ఈ భూమి మీద ఏర్పడబోతున్నది అనే ప్రవక్తల సూచనలు, జీసస్ జననంతో నిజమయ్యాయి.
అప్పటికి యూదు సమాజానికి 'పీనల్ కోడ్'గా అమలులో ఉన్న 'మోజెస్ లా' పాలకుల చేతిలో పూర్తిగా దుర్వినియోగం అయింది.
ఫలితంగా జనసామాన్యానికి ఇక్కట్లు ఆర్తనాదాలు మిగిలాయి. పాలకులు, పీఠాధిపతుల దాష్టీకాలు పెచ్చరిల్లిపోయాయి. అందుకే యూదులకు కొత్త రాజు -'మెస్సయ్య' వస్తాడు అనేది ప్రజల్లో ఒక నిరీక్షణగా మెదలై ఆశగా మారింది!
అయితే, బైబిల్లో 'ఓల్డ్ టెస్ట్ మెంట్' ప్రవక్తలు ఇటువంటి ముందస్తు హెచ్చరికలు చేయడానికి వారికున్న ఆధారం ఏమిటి?దీనికి సమాధానం ఆసక్తికరమైనది.
అప్పటికి ఉన్న జాతులు, ప్రజలు, ప్రదేశాలు, భాషలు, దేశాల సరిహద్దులు దాటి మరీ నీటి కోసం నదీ తీరాలకు జరుగుతున్న వలసలు, యుద్ధాలు, ఆక్రమణలు, మారణకాండ వీటన్నింటినీ క్రమబద్దీకరించడానికి దేవుడైన జెహోవా ఎంపిక చేసిన నాయకుడు -మోజెస్.
అప్పటికే( క్రీ.పూ. 1445) ఆయన అతనికి తన 'టెన్ కమాండ్మెంట్స్ ఇచ్చి: ఒక మనిషి తన జీవిత కాలంలో - వ్యక్తిగా, కుటుంబీకుడిగా, సామాజిక జీవిగా పాటించాల్సిన నియమాలు చెప్పేశాడు. పిల్లలు అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలి, అనేది కూడా అప్పటికే అందులోనే ఉంది.
అది జరిగిన తరువాత కొంతకాలానికి మోజెస్ పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మోజెస్ కొందరు న్యాయాధిపతులను నియమించి వారితో రూపొందించినదే మోజెస్ లా. దీన్నే మోషే ధర్మశాస్త్రం అంటారు. ఇది ఆ తరువాత కాలంలో వచ్చిన రాజులకు రాజ్య పరిపాలనకు మార్గదర్శకంగా రూపొందించిన మాన్యువల్ అయింది.
అయితే, దాని అమలు, విజ్ఞులైన రాజుల చేతిలో ప్రజాహితమైంది. కానీ, వారి చేతిలో పిచ్చోడి చేతిలో రాయిగా మారింది. అనువంశక పాలనలో వారసుడు బలహీనుడైనప్పుడు క్రింది స్థాయిలో అది దుర్వినియోగమైన ప్రజలకు కడగండ్లు మిగిల్చేది.
ఫొటో సోర్స్, Getty Images
రాజ్యాలు స్థిరపడి కాలం, నాగరికత దశ దాటి, విభిన్న జాతుల వేర్వేరు సంస్కృతులుగా అది రూపాంతరం చెందుతున్న దశలో, అమల్లో ఉన్న ఈ పీనల్ కోడ్‌కు కాలక్రమంలో సరళీకరణ అవసరమైంది. అప్పటికే సమాజంలో ఆర్థిక అంతరాలు విస్తరించాయి.
జీవిక కోసం పడుపు వృత్తి చేసిన యువతిని నడివీధిలో ప్రజలు రాళ్లతో కొట్టి చంపడం అప్పటి న్యాయం. అయితే, ఈ సంస్కరణ కోసం, జెహోవా మళ్లీ మరొక మోజెస్ కోసం వెతకలేదు. తానే స్వయంగా తన కుమారుడి రూపంగా జీసస్ పేరుతో సాదాసీదా మనిషిగా ఈ భూమి మీదకు రావాలనకున్నాడు. ఆ విషయం పాలకులైన రాజులకు, ప్రజలకు ముందుగా చెప్పి వారిని మానసికంగా సిద్ధం చేయడానికి ఆయన ప్రవక్తలను, జ్ఞానులను ఉపయోగించుకున్నాడు.
ఇదిలా ఉంటే, స్థానిక రాజకీయ పరిస్థితులు తెలియని పరదేశీయులైన జ్ఞానులు, నేరుగా హెరోద్ సంస్థానంలోకి వచ్చి అతన్నే 'యూదుల రాజుగా పుట్టిన ఆ శిశువు ఎక్కడ, మేము అతనికి పూజలు చేయడానికి వచ్చాము' అన్నారు. 'మంచిది, మీరు చూసి రండి, మీరు వచ్చి ఆ బాలుడు ఎక్కడ ఉన్నదీ చెబితే, నేను కూడా ఆయన దర్శనం చేసుకుంటాను' అన్నాడు హెరోద్.
నేను గద్దె మీద ఉండగా ఇదెలా సాధ్యమవుతుంది? అనేది ఇప్పుడు హెరోద్ ఆదుర్దా అంతా. ఇతనికి కొన్ని విపరీతమైన లక్షణాలున్నాయి. ఈర్ష్య, అనుమానం, చాలా ఎక్కువ. ఇతను, తన నీడను కూడా నమ్మని రకం. జ్ఞానులు వచ్చి ఈ మాట చెప్పి వెళ్లాక, బెత్లెహాం పట్టణ పరిసరాల్లో అప్పుడే పుట్టినవారితో సహా రెండేళ్ల లోపు ప్రతి మగబిడ్డను సంహరించమని హెరోద్ ఉత్తర్వులు జారీ చేశాడు.
చివరుకు అతడు తన ఇంట పుట్టిన శిశువులను సైతం అనుమానించాడు. కాబోయే యూదుల రాజు వీరేనేమో అని. తన రెండో భార్య మిరియామున, ఆమె కొడుకులను చంపాడు. హెరోద్ రాజుగా దయాదాక్షిణ్యాలు లేనివాడు. ప్రజల్ని తీవ్రంగా క్షోభ పెట్టినవాడు. ఇతను క్రీ.పూ. 37 నుంచి 4 వరకు 30 ఏళ్లు అధికారంలో ఉన్నాడు.
ఇతనికి విపరీతమైన భవన నిర్మాణ కాంక్ష. అందుకు సామాన్య ప్రజల నివాస ప్రాంతాలను ధ్వంసం చేసేవాడు. పలు నగరాల నిర్మాతగా ప్రసిద్ధి చెందాడు. భారీ భవన నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టి యథేచ్ఛగా ప్రజాధనం ఖర్చు చేసేవాడు.(ఆధారం: Life application study Bible, New International version, Tyndale & Zondervan Publishing house, Michigan )
రోమన్ ప్రభుత్వం ఇతన్ని యూదుల రాజుగా ప్రకటించినప్పటికీ, అతనికి తెలుసు, ఆ దేశ ప్రజలు తమ లోలోపల దాన్ని అంగీకరించరని. ఎందుకంటే, ఇతడు డేవిడ్ వంశావళి నుంచి వచ్చినవాడు కాదు. యూదు ప్రజలు కూడా అతన్ని ఏనాడూ ఓన్ చేసుకున్నది లేదు. ఇతడు జెరూసలెంలోని పలు పాత దేవాలయాలను పడగొట్టి సువిశాలమైన కొత్త దేవాలయాలను నిర్మించాడు.
పలు అన్య దేవతలకు కూడా గుడులు కట్టించాడు. ఎప్పుడు ఎవరు తనను పదవి నుంచి తొలగిస్తారో, తన పదవి ఎక్కడ పోతుందో అని నిరంతరం అభద్రతతో జీవించేవాడు. ఇలాంటి స్వభావంతోనే, తన తరువాత రోమన్ చక్రవర్తి తనకు ఇచ్చినంత అధికార స్వేచ్ఛను వారసులకు ఇవ్వరేమో అని ముందే అనుమానించాడు. అందుకే అతను తన సామ్రాజ్యాన్ని జూడయ, సమరయ, గలలియ అని మూడుగా విభజించి, ముగ్గురు కొడుకులు-ఆర్చేలియస్, అంటిపెటర్, అంటిపాస్ అనేవారికి అధికారం పంచాడు.
ఫొటో సోర్స్, Bildagentur-online/Getty
ఈజిప్టు పయనం
ఆసక్తికరమైన ముగింపు ఏమిటంటే, బాలుడు మెస్సయ్య ఎక్కడ? అంటూ హెరోద్ వద్దకు వచ్చి అతన్ని కలిసి వెళ్లిన జ్ఞానులు రాజు కోరినప్పటికీ మళ్లీ తిరిగి వచ్చి అతన్ని కలవరు. జీసస్‌ను చూశాక, దేవదూత సూచన మేరకు వారు మరో మార్గంలో తిరిగి వెళ్లిపోతారు. రాజ్యము అంటే - రాజు(అధికారం), మంత్రి(ఆలోచన) ఈ రెండూ ఒక్కటిగా కలిసి ఉండాల్సిన వేర్వేరు అంశాలు.
కానీ, కొందరు రాజులు వద్ద ఆలోచనాపరులు ఉండలేరు. వారు దూరమైపోతారు. ఇక్కడ అదే జరిగింది. ఇంతకీ జ్ఞానులు ఎవరు? వీరు తూర్పు దేశపు జ్ఞానులు, అని బైబిల్లో మాథ్యూ అధ్యాయాల్లో ఉంది. బైబిల్ ల్యాండ్‌కు తూర్పున ఉన్న ప్రధానమైన దేశం- హిందూ దేశం. బైబిల్ పండితులు వీరిని మాగీయిజం అనుసరించే పండితవర్గం అంటున్నారు. వీరు భవిష్యత్తును ముందుగా చెప్పగలరు. వీరికి దేవుడు, దైవారాధన లేదు.
విగ్రహ రూపాలు, దేవాలయాలు లేవు. ప్రకృతి ఎంత స్వచ్ఛమైనదో అలాగే మనిషిలో కూడా దేవుడు మంచిని స్వచ్ఛతను ఆవిష్కరించాడు. జ్ఞానం, స్వచ్ఛమైన మూర్తిమత్తం కలిగి ఉండడమే దైవారాధన అనేది వీరి నమ్మకం. వీరు అగ్నిని పూజిస్తారు. వీరి స్థానాలు అనువంశకం. వీరు భవిష్యత్తు, దుష్ట శకునాలు చెబుతారు. స్వప్నాలకు వివరణ ఇస్తారు. వీరికి ఖగోళశాస్త్రం తెలుసు.
చివరకు బాలుడైన జీసస్‌ను తల్లిదండ్రులు మేరీ-జోసెఫ్ దేవదూత సూచన మేరకు బెత్లెహాం నుంచి హెరోద్కు దూరంగా ఈజిప్ట్ తీసుకొనివెళ్లి అక్కడ పెంచుతారు.
జీసస్ పెరిగి పెద్దవాడై 33 ఏళ్లవాడు అయ్యాక ఆయన కార్యరంగంలోకి నేరుగా ప్రవేశించే ముందు హెరోద్ వంటివారి ఆదుర్దా మరింత పెంచడానికా అన్నట్లు జాన్(కీ.శ 86-90) జోర్దాన్ నదీ తీరంలో 'ఆదియందు వాక్యము ఉండెను.. అంటూ' ఓంకార ప్రస్తావనతో మొదలుపెట్టి, 'ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండ పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవి చేయబడును.
కరుకు మార్గములు నున్నవి అగును' అంటూ రాబోయే కాలం గురించి ఒక విజన్ ప్రకటిస్తాడు. ప్రపంచ దేశాల్లో బైబిల్‌ను విశ్వసించేవారు, ఆ గ్రంథంలో- 'రివలేషన్స్' పేరుతో ఉన్న ఆఖరి అధ్యాయం, ఇంకా జరగాల్సి ఉందని ఇప్పటికీ నమ్ముతారు. అయితే, అందుకు ఇప్పటి చర్చి మార్గం కాదనే విమర్శ కూడా ఉంది.
ఇవి కూడా చదవండి
- జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?
- సెక్స్‌పై ఆసక్తి లేదా.. అది వ్యాధి లక్షణమా..
- పౌడర్ రాసుకుంటే క్యాన్సర్ వస్తుందా?
- కోడి పందేలు: వ్యాపారంగా, ఉపాధి మార్గంగా కోడి పుంజుల పెంపకం
- జీరోగా మారినా.. జీవితం అంతమైపోదు: షారుఖ్ ఖాన్
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- యాపిల్, గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్... వీటి భవిష్యత్తు ఏమిటి?
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- డిజిటల్ ఇండియాపై మోదీ మాటల్లో వ్యత్యాసం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)